మగువ కట్టిన చీర
మగవానికి మధుర భావన.....
నాగరికతా వ్యామోహంలో విదేశీయ అనుకరణలో మన సంస్కృతీ సాంప్రదాయాలు పరిహసింపబడుతున్నాయంటే తల దించుకోవాల్సిన విషయం.
స్త్రీ అంటే నిండైన చీర,
అందమైన అలంకరణ ఒయినము,
ఒందనము,మాటతీరు,
మంచి నడవడిక అవన్నీ
అమ్మగా భార్యగా దేవతగా మంచి గుర్తింపు
నిస్తాయి. అసలు మనిషి గా పుట్టటం ఒక గొప్ప వరం. అందునా స్త్రీగా మరింత
అద్భుతమైన వరం. తల్లిగా, చెల్లిగా, భార్యగా అందరి ఎందరి హృదయాలనో
రంజింపజేయగల సమర్ధత ఒక స్త్రీత్వానికే ఉంది. ఇక ఓర్పు నేర్పు దయ క్షమ
స్త్రీల సొంతం. మీ కోడలు లక్ష్మీ దేవిలా ఉంది, ఆ ఇంటి ఇల్లాలు లక్ష్మీ
దేవిలా కళ కళలాడు తోంది అనడం పరిపాటి.
స్త్రీని అనాదినుంచే దేవతగా ఆరాధిస్తూనే ఉన్నారు, గౌరవిస్తూనే ఉన్నారు. మనమే నేల విడిచిన సాములా, చీర విడిచి చింపిరి గుడ్డల్లో ఒళ్ళు కప్పుకుని చిల్లరగా కనిపించి మిడ్డీలు చెడ్డీలు వేసుకుని ఇచ్చిన గౌరవాన్ని మంట గలిపి రెచ్చగొడుతున్నది.
ఆధునిక యుగంలో ఆరు గజాల చీర నుంచి అరగజం ముక్క చొప్పున తీస్తే, డజను డ్రస్సులు కుట్టించుకోవచ్చును. అప్పుడు బరువైన చీర ఎంత ఉపయోగమో, తేలికైన డ్రస్సు అంత అందం కదూ అనుకునే ఈ అణుయుగంలో అమ్మాయిలు, సులభమైన ఇటువంటి భావాలతో, అసభ్యకరమైన అందచందాలను ప్రదర్శించటానికీ, పరువు ప్రతిష్టలను మంట గలపడానికీ, మగవారిని రెచ్చ గొట్టడానికే అన్నట్టుంది వారి వేషధారణ. "ఛ ఛ! నాన్ సెన్స్! చీర ఎంత మోటుతనం? ఓల్డ్ బగ్స్ కట్టుకునే బి సి తనం" అని హేళన చేసే యువతరం, ఎంతగానో ఎదిగిన నవనాగరికతా వ్యామోహంలో మభ్యపడుతున్నారంటే అతిశయోక్తి కాదు.
నుదుట బొట్టు మానుకుని , జానెడు జుట్టు విర బోసుకుని గృహిణులైతే
పుస్తెలు, నల్ల పూసలు , దాచేసి గజం బట్టతో అవసరమైన చోట్ల కప్పుకుని
వీధుల్లో, కాలేజీల్లో , అఫీసుల్లో , నడుస్తూ , వినువీధుల ఊహల్లో పయనిస్తు
"హాయి హూయి మాం ! డాడ్ ! " అనుకుంటూ తెలుగుదనాన్ని చీడ పట్టించే ఈ అధునిక సమాజంలో చీర పేరు చీర గొప్ప తనం ఎందరికి తెల్సు? ఒకవేళ తెలిసిన వాళ్ళు మాట్లాడినా, అది వినడనికి ఇబ్బంది నటిస్తూ చాదస్తపు కబుర్లు కట్టి
పెట్టమన్నట్టు వ్యంగ్య ధోరణిలో, నిర్లక్ష్యపు చూపులు విసిరి కించపరచి,
గేలి చేయడం , ఈ అణుయుగపు అమ్మాయిలకు ఒక అలవాటు.
శుభకార్యాలలో పట్టు చీరెల రెపరెపలు, వాలుజడల విసుర్లు, మల్లెల
సౌరభాలు, నుదుట కుంకుమ తళతళలు, కాటుక కన్నుల అందమైన మిలమిలలు, ఇవన్నీకవులు వర్ణించే స్త్రీల అందచందాలు. అంతే కానీ నడుంకి క్రింద భాగం, పైభాగంఅరగజం ముక్కలతో అతుకు బెట్టి మిగిలిన శరీరమంతా వెన్నెలలా ఆరబెడితే కవులు వర్ణించ లేరు సరికదా కళ్ళతో బాటు కలాలు కుడా మూసుకోవలసిందే. కుర్ర కారుకి కన్నుల విందే కానీ పెద్దలకి కంఠశోష. మిగిలిన పెద్దముత్తైదువలు, నచ్చని వాళ్ళు సిగ్గుతో కుంచించుకు పోవలసిందే. ఇక అలా చూసి వెర్రెక్కిన కుర్ర కారు నేల మీద ఆనరు సరి కదా?
అసలు కాలి పసుపు దగ్గరనుంచి నుదుట బొట్టు వరకు పాదాల నాదాలవరకు మాంగల్యపు చిరు సవ్వడి వరకు మన కట్టూ బొట్టు సంస్కృతి సాంప్రదాయాల గురించి అనేక రకాలుగా ఒక్కొక్కదానికి ఒక్కొక్క నిర్వచనం చెప్తారు. అవిభర్తకి ఏ విధంగా ఆయుః ప్రమాణాన్ని పెంచుతాయో, వ్యక్తిత్వ వికాశాన్నికలిగిస్తాయో వివరించి చెప్పాయి మన పురాణాలు. అందుకే భర్త లేని వారికి ఆ అలంకరణలు తీసి వేయడం ఒక ఆచారం. అంతే కానీ నేటి ఆధునికపు అవతారాలు స్త్రీని నవ్వుల పాలు చేయటమే గాక గౌరవాభి మానాలు నసింప చేసేవిగా ఉండడం శోచనీయం.
స్త్రీ అంటే చూడగానే అందమైన చీరలో కనువిందు చేసే అలంకరణలో
అందంగా హుందాగా ఉండాలి. ఇతర దేశాలు ఎంతగానో మెచ్చుకునే మన సంస్కృతీ
సాంప్రదాయాలను మనమే విడనాడి విదేశీయ అనుకరణతో హాస్యాస్పదం కావడం విచారించ తగ్గ విషయం. నాగరికత పేరుతో పర భాషా వ్యామోహాన్ని మనకి సరిపడని అసభ్యపు వస్త్ర ధారణని విడనాడితే అందరికి ఆనందం. నేడు పసివారు సైతం [టీవీలు సినిమాలు చూసి] అమ్మ అంటే మిడ్డీలు చెడ్డీలు అనుకునేలా ఉన్నారు. అమ్మ అంటే అర్ధనగ్నం కాదని గ్రహించాలి. అప్పుడే అమ్మదనంలోని కమ్మదనం అనుభూతి కలుగుతాయి. ఆప్యాయత, రాగాలు అన్నిటికీ అతీతమే. నిజంగా జన్మంటూ ఉంటే మళ్ళీ మళ్ళీ స్త్రీ గానే పుట్టాలి అందునా అందమైన అమ్మాయి గా పుట్టాలి, మరింత అందమైన పట్టు చీరలు కట్టుకుని పెద్ద వాలు జడతో మల్లెల సౌరభాలతో అందెల రవళులతో గాజుల గల గలలతో మెట్టల చిరు సవ్వడితో మాంగల్యపు వీనుల విందైన సన్నని ధ్వని తరంగాలతో ఎదుటి వ్యక్తి హృదయాన్ని ఝల్లు మనిపించేలా, "మగువేగా మగవానికి మధుర భావన" అన్నట్టు మృదుమధురమైన స్మృతి గా మిగిలి పోవాలి. అది ఒక్క చీర కే సాధ్యం.www.mohanpublications.com
https://m.facebook.com/Mohan-publications-420023484717992/