MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఒక్కసారి ప్రభుత్వాసుపత్రికి వెళ్ళిరండి ! బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU








ఒక్కసారి ప్రభుత్వాసుపత్రికి వెళ్ళిరండి !బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు
MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు

విద్య - విలువలు

శరీరానికి వ్యాయామం లేకపోవడం వల్ల, సక్రమమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా నూటికి 95 మందిలో మధుమేహ వ్యాధి వస్తుంది. మీరు పిల్లలు. ఈ వయసులో ఆ వ్యాధి ప్రభావమేమిటో మీకంతగా తెలియదు. మధుమేహం, రక్తపోటు - ఈ రెండూ కానీ వచ్చాయా, అసలు జీవితానికి సంతోషం ఉండదు. ఎక్కువ తింటే రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది, తక్కువతింటే ఓ నాలుగు గంటలపాటూ ఓ పనిమీద నిలబడలేడు. చక్కెరశాతం పడిపోతే స్పృహతప్పి పడిపోతాడు. ఎక్కడికి వెళ్ళినా జేబులో చాక్లెట్, లేదా బిస్కెట్ ప్యాకెట్ ఉండాలి. తప్పకుండా తింటూండాలి. తినలేదా తట్టుకోలేడు. కొద్దిగా మోతాదుమించి తిన్నాడా, ఏ కన్ను దెబ్బతింటుందో, మూత్రపిండాలు ఎక్కడ చెడిపోతాయో తెలియదు. త్రాసులో తూచుకుని, గడియారం చూసుకుని తింటుండాలి. తినగలిగి ఉండి కూడా తినడానికి అవకాశం లేకపోవడం ఎంత శాపమో మధుమేహంతో బాధపడేవారికి తెలుస్తుంది. అందుకే మీరటువంటి వ్యాధులకు బలికాకండి. నియమంగా వ్యాయామం చేయండి. వ్యాయామం అలవాటైతే శరీరం తేలిగ్గా ఉంటుంది. ఏ పనయినా సునాయాసంగా చేయగలుగుతారు.
రక్తపోటుకు గురికాకుండా మంచి ఆహారం తీసుకుంటే ఒత్తిళ్ళను తట్టుకోగలుగుతారు. ఆటుపోటు ఓర్చుకోగల శక్తి పొందుతారు. ఎప్పుడూ ఏసీల్లో ఉండడం, కాసేపయినా నడవకపోవడం... ఇవి మంచి అలవాట్లు కావు.
"చిన్నతనంలో మీ బట్టలు మీరు ఉతుక్కోవడం, ఇంటిపట్టున ఉన్నప్పుడు మీ అమ్మగారి శ్రమలో ఓ 15 నిమిషాలు పాలుపంచుకోవడం వంటివి ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోండి. మీరెంత పెద్ద పదవిలో ఉన్నా అమ్మచేతిపని అందుకుని సాయంచేస్తే పొంగిపోతుంది, అమ్మ రుణం జీవితంలో తీర్చుకోలేనిది. "
మన ప్రధానమంత్రి నరేంద్రమోడీగారు ఈ మధ్యకాలంలోనే పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘రోజులో ఒక్కగంటయినా శరీరానికి చెమటపట్టేలా చేయడం అలవాటు చేసుకోండి’’ అన్నారు. ఎంత గంభీరమైన మాటో చూడండి. ఎంతపెద్ద అధికార పదవిలో ఉండనీయండి, శరీరానికి తగిన శ్రమ ఇవ్వకపోతే అది ఆ వ్యక్తి జీవితానికి మంచిదికాదు, అతడు ఎందుకూ పనికిరాని వాడయిపోతాడు. శరీరాన్ని కష్టపెడితే మీరు సుఖపడతారు, దాన్ని సుఖపెడితే మీరు కష్టపడతారు.
సచిన్ తెందూల్కర్‌కు అంత ఐశ్వర్యమున్నా, అతను మైదానంలో దిగితే ఎంత ఎండలోనైనా సరే, రోహిణీ కార్తె అయినా సరే, అన్ని గంటలసేపు నిలబడి ఫీల్డింగ్ చేయగలిగాడు - అంటే వయసు 40 దాటినా కళ్ళజోడు పెట్టుకోకుండా, అంత దేహదారుఢ్యంతో, అంత వ్యాయామంతో తట్టుకోగలిగాడు. అంటే ఇన్ని కీర్తిప్రతిష్ఠలున్నా, అంత ఐశ్వర్యమున్నా, ఎంత వ్యాయామం చేశాడో, ఎంత క్రమశిక్షణ ఉన్నవాడో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తి జీవితంలో వృద్ధిలోకి రావడానికి ఇంత కష్టపడతాడా అని అతని ఆటోబయోగ్రఫీ చదివితే తెలుస్తుంది. చదవండి.
అందుకే వ్యక్తిత్వ వికసనమునందు మొట్టమొదట మనిషి తెలుసుకోదగినది ఏది అంటే భగవంతుడిచ్చిన ఈ శరీరం విలువ. భగవంతుడిచ్చిన అవయవాలు ఎంత గొప్పవో అవి లేనివాళ్ళను చూస్తే అర్థమవుతుంది. ఆయన మనకు ఊపరితిత్తులు లోపలపెట్టాడు. మూత్రపిండాలు లోపలపెట్టాడు. అవి ఉన్నాయనికానీ, వాటి విలువకానీ మనకు తెలియదు. కానీ ఊపిరితిత్తులకు కొద్దిగా వ్యాధి సోకి ఆయాసం వచ్చి మాట్లాడలేక, మంచంమీదపడి లక్షలకు లక్షలు వైద్యశాలలకు కట్టి, ఇంట్లోవాళ్ళు పోషించలేక, మందులు వేసుకోలేక, ఆహారం తినలేక ఆయాసంతో బాధపడేవారిని చూస్తే తెలుస్తుంది, వాటి విలువ ఏపాటిదో.
ఎముకలు దేముడు అమర్చిన ఒక అద్భుతమైన వ్యవస్థ. వెన్నుపాము ఈశ్వరుడిచ్చిన ఒక అపురూపమైన నిర్మాణం. ఏదో అప్పటికి సంతోషంగా ఉంటుంది కదాని అక్కరలేనంత వేగంతో వెళ్ళడం, మెలికలు మెలికలుగా మోటారు సైకిలు నడపడం ఆ నిమిషంలో బాగుంటుంది. ఈమధ్య కాలంలో నా స్నేహితుడి కుమారుడొకడు మోటారు సైకిలు మీది నుంచి పడిపోయాడు. రోడ్డు గరుగ్గా ఉండడంతో చర్మం నడుం నుంచీ ముఖం వరకూ చెక్కేసినట్లయింది. కొన్ని నెలలపాటూ వైద్యశాలలో ఉన్నాడు.
ఇల్లు కూడా తాకట్టు పెట్టుకున్నారు. తొడమీద చర్మం కత్తిరించి ముఖానికంతా అంటించడం, కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ తొడమీద కొత్త చర్మం పట్టడం, దాన్ని మళ్ళీ కత్తిరించి పైన అంటించడం... చాలా కాలం పట్టింది. ఈలోగా అతనితో చదువుకున్నవాళ్ళు కోర్సు పూర్తి చేసుకుని క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు పొంది వెళ్ళిపోయారు. తండ్రి ఐశ్వర్యంపోయి, ఈ పిల్లవాడి చదువుపోయి భ్రష్టుడయి... ఇదంతా దేనివల్ల...? ? ? అక్కడక్కడా బోర్డులు కనిపిస్తుంటాయి. ‘స్పీడ్ థ్రిల్స్, బట్ కిల్స్’ (వేగం ఉత్కంఠభరితమే, కానీ ఊపిరికూడా తీస్తుంది) అని!
ఈవేళ ఒక రోడ్డెక్కితే భద్రత కష్టం. ఒక పక్క కారు డ్రైవ్ చేస్తుంటాడు. మరో చేత్తో సెల్‌ఫోన్ మాట్లాడుతుంటాడు. మోటారు సైకిళ్ళమీదా అంతే... భుజాల దగ్గర నొక్కిపట్టి సెల్‌ఫోన్ మాట్లాడుతూ బండి వేగంగా నడుపుతుంటాడు. వెన్నుపూసలో ఒక్కపూస జారిందా... ఆ వ్యక్తి జీవితాంతం పడే బాధ అలాఇలా ఉండదు, నరకమయమయిపోతుంది జీవితం. మీ మేనమామగా అనుకోండి. మీ మీద ప్రేమతో మీ మేలుకోరి ఒక కఠినమైన సలహా ఇస్తా. మీలో ప్రతి ఒక్కరూ ఎప్పుైడనా మీకు తీరిక ఉన్నప్పుడు
"ఒక్కసారి ప్రభుత్వ ఆస్పత్రికెళ్ళి ఎముకల విభాగం, ఊపిరితిత్తుల విభాగం చూసిరండి. మీకు భగవంతుడిచ్చిన ఐశ్వర్యం ఏమిటో బోధపడుతుంది. మీ జీవితంలో మోటారు సైకిల్ మీద వెడుతూ మళ్ళీ సెల్‌ఫోన్ మాట్లాడరు."
ఈవేళ మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే దాని అర్థం మీరు ఎప్పటికీ ఇలానే ఉంటారని కాదుకదా! ఆరోగ్యంగా ఉన్నాననుకుని తినకూడని పదార్థం ఒకటి తిన్నారనుకోండి. ఒక గంటలోనే మీ ఆరోగ్యంలో తేడా వచ్చేస్తుంది. మీరు ఎప్పుడు చేయవలసిన కార్యక్రమాలను అప్పుడు చేయడం ఎలా సాధ్యపడుతుంది... శరీరం సహకరించినప్పుడేకదా ! మీరు జీవితంలో వృద్ధిలోకి వచ్చి మీ కుటుంబంతో కలిసి సుఖసంతోషాలతో జీవించాలన్నా, సమాజానికి సేవ చేయాలన్నా మీ శరీరం ఆరోగ్యం లేకుండా ఎలా సాధ్యం? ఒకవేళ భగవంతుడు మీకు వరంగా మంచి ఆరోగ్యమిచ్చినా, చక్కటి వ్యాయామంతో, చాలినన్ని పోషకాలతో దాన్ని కాపాడుకోవాలి కదా !
అలాకాక పాడు చేసుకుంటే నష్టపోయేది మీరూ, మీ కుటుంబమే కాదు, ఈ సమాజం కూడా ఒక ప్రతిభావంతుడి, ఒక మంచి పౌరుడి మేధస్సును, సేవలను కోల్పోతుంది అనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తెరిగి బాధ్యతతో మసలుకోండి. మంచి వ్యాయామం చేసుకోండి, తాజా పండ్లకు మనకు కొరత లేదు. ఏ ఋతువులో ప్రకృతి మనకు అనుగ్రహించి ఇచ్చిన పండ్లేవో ఆ కాలంలో తీసుకోండి. చెడుతిళ్ళు తినకండి. దురలవాట్లకు దూరంగా ఉండండి



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list