MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఎల్లమ్మ!_YellammaTemple-MohanPublications

చల్లని తల్లి... బల్కంపేట ఎల్లమ్మ

హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శిస్తే...అష్టాదశ శక్తిపీఠాల్ని దర్శించుకున్నంత ఫలమని చెబుతారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ, సృష్టిలోని ఎల్లజీవులకూ అమ్మ... ఎల్లమ్మ!
ఏడు వందల సంవత్సరాల నాటి సంగతి. అప్పటికసలు, హైదరాబాద్‌ నగరమే పుట్టలేదు. బల్కంపేట ఓ కుగ్రామం. చుట్టూ పొలాలే. ఓ రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా...బండరాయి అడ్డొచ్చినట్టు అనిపించింది. పరీక్షగా చూస్తే... అమ్మవారి ఆకృతి! చేతులెత్తి మొక్కాడా రైతు. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించాడు. కాస్తంతైనా కదల్లేదు. వూళ్లొకెళ్లి జనాన్ని తీసుకొచ్చాడు. తలోచేయీ వేశారు. అయినా, లాభంలేకపోయింది. శివసత్తులను పిలిపించారు. శివసత్తులంటే...పరమశివుడి ఆరాధకులు. శైవ సంప్రదాయంలో వీరికి చాలా ప్రాధాన్యం ఉంది. ‘ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభీష్టం కావచ్చు. దైవనిర్ణయాన్ని కాదనడానికి మనం ఎవరం?’ సలహా ఇచ్చారు శివసత్తులు. అమ్మవారిని రేణుకాంబగా గుర్తించిందీ వీళ్లే. మూలవిరాట్టు బావి లోపల ఉండటంతో ... భక్తజనం ఒడ్డున నిలబడే పూజలు చేసేవారు. కొంతకాలానికే, రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకూ విస్తరించాయి. ఓ చిన్న ఆలయం వెలసింది. రాజా శివరాజ్‌ బహద్దూర్‌ అనే సంస్థానాధీశుడి హయాంలో ఈ ప్రాంతాన్ని ‘బెహలూఖాన్‌ గూడా’ అని పిలిచేవారని చారిత్రక ఆధారాల్ని బట్టి తెలుస్తోంది. బెహలూఖాన్‌.. ఈ ప్రాంతానికి సుబేదారో, రాచప్రతినిధో అయి ఉంటాడు. ఆ పేరు కాస్తా బల్కంపేటగా మారిపోయింది. ఎల్లమ్మతల్లి ‘బల్కంపేట ఎల్లమ్మ’గా సుప్రసిద్ధురాలైంది. ముజ్జగాలకూ మూలపుటమ్మ...సృష్టిలోని ఎల్లజీవులకూ అమ్మ కాబట్టి...ఆ అమ్మ ఎల్లమ్మ అయ్యింది! ‘హేమలాంబ’ (హేమం అంటే బంగారం, బంగారుతల్లి) అన్న సంస్కృత నామమే, గ్రామీణుల వ్యవహారంలో ఎల్లమ్మగా స్థిరపడిందని పండితులు విశ్లేషిస్తారు. ఇక, రేణుక అన్న మాటకు - పుట్ట అనే అర్థం ఉంది. ఆరోజుల్లో అమ్మవారి ఆలయ పరిసరాల్లో పాముల పుట్టలుండేవేమో!
పూజలు.. సేవలు...
దేవాలయ రాజగోపురానికి దక్షిణ భాగంలో, తూర్పుముఖంగా మహాగణపతి దర్శనమిస్తాడు - లోపలికి వచ్చే భక్తుల్ని ‘నిర్విఘ్నమస్తు’ అని ఆశీర్వదిస్తున్నట్టు. పోచమ్మతల్లి కూడా ఇక్కడ పూజలు అందుకుంటోంది. నవ వధూవరులు పెళ్లిబట్టలలో ఆ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీ. దాదాపు రెండు దశాబ్దాల క్రితం .. హంపీ పీఠాధిపతి విరూపాక్షానంద స్వామి ఆలయ ఆవరణలో నాగదేవతనూ ప్రతిష్ఠించారు. నిత్యం నాగదోష, కాలసర్పదోష పూజలు జరుగుతుంటాయి. అంతేకాదు, పద్దెనిమిది అడుగుల రాజరాజేశ్వరీ అమ్మవారి విగ్రహమూ ఉందిక్కడ. ప్రతి శుక్రవారం ఎల్లమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.పేదాధనికా తేడా లేకుండా ఆ భోజనాన్ని మహాప్రసాదంగా స్వీకరిస్తారు. ఆది, మంగళ, గురువారాలు...అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమని ఓ నమ్మకం. ఆ మూడు రోజుల్లో భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది.
ఏటా ఆషాఢమాసం మొదటి మంగళవారం ఎల్లమ్మతల్లి కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మూడురోజుల పాటూ జరిగే ఉత్సవాల్ని చూడ్డానికి ముల్లోకాల నుంచీ దేవతలు దిగొస్తారని ప్రతీతి. దాదాపు ఐదు లక్షలమంది జనం హాజరవుతారు. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చే శివసత్తులైతే బల్కంపేటను కైలాసగిరిగానే భావిస్తారు. రథోత్సవాన్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. జయజయధ్వానాల నడుమ వీధుల్లో వూరేగుతున్న సమయంలో... దుష్టశిక్షణకూ శిష్టరక్షణకూ బయల్దేరుతున్నట్టు ఉంటుందా ఠీవి! కళాకారులు తన్మయంగా నృత్యాలు చేస్తుంటారు. వాద్యకారులు మైమరచిపోయి ఢమరుకాది వాద్యాల్ని మోగిస్తుంటారు. అమ్మవారి సైన్యంలో మేమూ ఉన్నామంటూ .. గుర్రాలూ ఏనుగులూ ఒంటెలూ!
దర్శనభాగ్యం ఇలా...
అమ్మవారి స్వయంభూమూర్తి శిరసు భాగం వెనుక నుంచీ నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పవిత్ర జలాన్నే భక్తజనం మహాతీర్థంగా స్వీకరిస్తారు. ఆ నీటితో ఇళ్లను శుద్ధిచేసుకుంటే భూతప్రేతపిశాచాది దుష్టశక్తులు పారిపోతాయని ఓ నమ్మకం. స్నానమాడే నీటిలో కాస్తంత తీర్థం కలుపుకుంటే గజ్జి, తామర మొదలైన చర్మరుగ్మతలు తొలగిపోతాయని బలమైన విశ్వాసం. నీటిలో కొలువైన దేవత కాబట్టి, ఆ తల్లిని జలదుర్గగా ఆరాధిస్తున్నవారూ ఉన్నారు. బల్కంపేట ఎల్లమ్మ మహిమల్ని భక్తులు కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆమధ్య రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత ముకేష్‌ అంబానీ అర్ధాంగి నీతా అంబానీ ఎల్లమ్మతల్లిని దర్శించుకున్నారు. ఇంటర్నెట్‌లో యాదృచ్ఛికంగా ఆలయం గురించి చదివాననీ, అప్పుడే అమ్మవారిని దర్శించుకోవాలన్న బలమైన సంకల్పం కలిగిందనీ ఆమె చెప్పారు. ఎక్కడెక్కడి ప్రజలకో స్వప్న సాక్షాత్కారాలిచ్చి తన దగ్గరికి పిలిపించుకుని... కష్టాలు తీర్చి, వరాలవర్షం కురిపిస్తుందా తల్లి - అంటూ తన్మయంగా చెబుతారు భక్తులు. అమీర్‌పేట నుంచి ఆలయం మీదుగా ఆటోలు వెళ్తుంటాయి. నేచర్‌క్యూర్‌ ఆసుపత్రి ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేషన్‌లో దిగైనా వెళ్లొచ్చు.
- మజ్జి తాతయ్య, న్యూస్‌టుడే, సంజీవరెడ్డినగర్‌

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list