MohanPublications Print Books Online store clik Here Devullu.com

సత్యనారాయణస్వామి_Annavaram Satyanarayana Swamy




కోరిన కోర్కెలు తీర్చే శ్రీసత్యనారాయణుడు

గృహ ప్రవేశమైనా... వివాహమైనా ముందుగా కొలిచేది శ్రీసత్యనారాయణుడినే. ఎవరి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా దానికి శ్రీకారం చుట్టేదీ సత్యనారాయణస్వామి వ్రతంతోనే. భక్తుల కొంగు బంగారంగా వెలసిన ఆ భక్తవత్సలుడిని స్మరించుకుంటే మనోభీష్టాలెన్నింటినో నెరవేరుస్తాడు.
సత్యదేవుడిగా... మీసాలరాయుడిగా... రత్నగిరివాసుడిగా... భక్తుల కొంగు బంగారంగా... కోరిన కోర్కెలు తీర్చే భక్త వరదుడిగా నిలచిన సత్యనారాయణస్వామిని ‘సత్యనారాయణం దేవం వదేహం కామదం ప్రభుం... లీలయ విపతం విశ్వం ఏనతస్మై నమోనమ:’ అని స్మరిస్తారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో వెలసిన సత్యదేవుడు అనంతలక్ష్మీ సమేత శ్రీవీరవేంకట సత్యనారాయణస్వామిగా విరాజిల్లుతున్నాడు. రెండంతస్తుల్లో ఉండే ఈ ఆలయంలోని దిగువ అంతస్తులో విఘ్నేశ్వరుడు, సూర్యనారాయణస్వామి, అమ్మవారు, పరమేశ్వరుల మధ్యలో మహాయంత్రంలో దర్శనమిస్తారు. ప్రధానాలయం పై అంతస్తులో ఉంది. ఇక్కడ సత్యనారాయణస్వామికి ఎడమవైపు అనంతలక్ష్మీ అమ్మవారూ, కుడివైపు ఈశ్వరుడూ ఒకేపీఠంపై దర్శనమిస్తారు. ఇలా ఒకే పీఠంపై శివకేశవులూ, అమ్మవారూ కనిపించే ఆలయం ఇదొక్కటే కావడం విశేషం.
సత్యదేవుడు కొలువైన ఈ ప్రాంతం రత్నగిరిగా ప్రసిద్ధిచెందింది. పురాణాల ప్రకారం... శ్రీ మహావిష్ణువు రామావతారం దాల్చినప్పుడు రత్నకరుడు అనే భక్తుడి తపస్సుకు మెచ్చి వరం కోరుకోమంటే... ‘నిన్ను నా తలపై మోసే భాగ్యాన్ని ప్రసాదించు స్వామీ’ అని వేడుకున్నాడట. ‘కలియుగంలో భక్తులను సంరక్షించడానికై త్రిమూర్తుల ఏకస్వరూపంగా, త్రిగుణాత్మకుడైన శ్రీవీరవేంకట సత్యనారాయణ అనే పేరుతో ఆవిర్భవిస్తాను. అప్పుడు నువ్వు రత్నగిరి రూపంలో నీ శిరస్సున నన్ను మోస్తావు’ అని రత్నకరుడికి వరమిచ్చాడట. ఇలాంటిదే మరో కథనమూ ప్రచారంలో ఉంది... తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి దగ్గర్లో గోరస గ్రామ ప్రభువు రాజా ఇనుగంటి వేంకట రామనారాయణం ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. ఆ వూళ్లొ ఈరంకి ప్రకాశరావు అనే మహాభక్తుడు ఉండేవాడు. ఒకరోజు శ్రీమహావిష్ణువు ప్రకాశరావు, రాజావారి కలల్లో ఏకకాలంలో కనిపించి ‘రాబోయే శ్రావణశుక్ల విదియ మఖ నక్షత్రంలో గురువారం నాడు రత్నగిరిపై వెలయుచున్నాను. నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించు’ అని మాయమయ్యాడట. మర్నాడు ఇద్దరూ కలిసి తమకు వచ్చిన కలను చెప్పుకుని అన్నవరంలోని రత్నగిరి కొండపైకి చేరుకున్నారు. అక్కడ ఒక పొదలో పాదముద్రలు కనిపించి వాటిపైన సూర్యకిరణాలు పడ్డాయి. వాళ్లు వెంటనే ఆ పొదను తొలగించి స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. రెండంతస్తుల్లో ఆలయం ఉండటం ఇక్కడి ప్రత్యేకత. సత్యదేవుని వ్రతాలకు ఎంతో విశిష్టత ఉంది. పవిత్ర కార్తికమాసంలో అయితే లక్షల్లో వ్రతాలు జరుగుతాయి.
సీతారాములు క్షేత్రపాలకులు...
సత్యదేవుని క్షేత్రపాలకులుగా సీతారాములను కొలుస్తారు. క్షేత్రరక్షకులుగా వనదుర్గ, కనకదుర్గ అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలను కూడా భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకుంటారు. మెట్లమార్గం ప్రారంభంలో తొలిపావంచాల వద్ద కనకదుర్గ అమ్మవారి ఆలయం, కొండపై వనదుర్గ అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో సీతారాముల ఆలయం ఉంటే కొండపైన శ్రీగోకులం ఉంది. సత్యదేవుని ప్రసాదానికీ ఎంతో ప్రత్యేకత ఉంది. సాధారణంగా మిగతా దేవస్థానాల్లో లడ్డూ, పులిహోరా ప్రసాదంగా అందిస్తారు. అన్నవరంలో మాత్రం గోధుమనూక, నెయ్యి, పంచదార, యాలకులతో ప్రత్యేకంగా ప్రసాదాన్ని తయారుచేస్తారు.
ఎన్నెన్నో ఉత్సవాలు...
ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున సత్యదేవుని కల్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు వారం రోజులపాటు ఘనంగా జరుగుతాయి. శ్రావణశుద్ద విదియరోజు శ్రీస్వామివారు ఆవిర్భవించడంతో ఏటా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలూ, ఇతర కార్యక్రమాలూ నిర్వహిస్తారు. ఏటా కార్తికశుద్ధ ద్వాదశి రోజున తెప్ప మహోత్సవం జరుగుతుంది. కార్తికపౌర్ణమి రోజున గిరిప్రదక్షిణ జరుగుతుంది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ రైలూ, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. - పి.వెంకటరాజు, న్యూస్‌టుడే, అన్నవరం

++++++++++++++++++++++++++++++++


త్రిగుణాత్మకుడు.. 
అన్నవరం సత్యదేవుడు

ప్రారంభంలో బ్రహ్మస్వరూపము, మధ్య భాగంలో మహేశ్వరస్వరూపము చివరకు అంటే పైన విష్ణురూపము ఒక స్తంభంలో ఉన్నవన్న ట్టుగా ఇక్కడ వీర వేంకట సత్యనారాయణ స్వామి త్రిగుణాత్మక రూపంలో రత్నాకరుని కోరిక తీర్చడానికిగాను అన్నవరం లోని అంకుడు చెట్టు మొదట్లోని పుట్టలో వెలిశాడు. ఇలా స్వయంభూగా, అర్చామూర్తిగా రావడానికి వెనుక ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది.
స్థలపురాణం:
మేరు పర్వతానికి ఇద్దరు కుమారులు. వారే భద్రుడు, రత్నాకరుడు. భద్రుడు మహావిష్ణువును మెప్పించి భద్రాది రామునికి కొలువైన భద్రాచలంగా మారినప్పటి నుంచి రత్నాకరునిలోను తాను కూడా మహావిష్ణువుపాదం మోయాలన్న బుద్ధి పుట్టింది. అది రామావతారసమయం. రాముని దగ్గరకు వెళ్లి ‘అయ్యా! శ్రీరామచంద్రా నీవు మా అన్న భద్రునికి కోరిక తీర్చడానికి అనుకూలంగా ఉన్నావని తెలుసుకొన్నాను. మరి నాకోరిక తీరే మార్గం నాకు చూపించవా? నాకోరికలను తీర్చే భారం కూడా నీదే సుమా. ఇహం పరం బెరుగ నేను. అన్నింటికి కారణాకారుడవైన నీవే నా కోరిక తీరే తరుణోపాయం చెప్పాలి’అని వేయివిధాలుగా ప్రార్థించాడు.
పరంధాముడైన రాముడు చిరునవ్వుతో ‘నాయనా రత్నాకరా నీకోరిక బాగుంది. కాని నేను ఈ త్రేతాయుగంలో కేవలం దశరథ పుత్రుడిని మాత్రమే.నేనిప్పుడు నీకోరికను తీర్చలేను.’ అన్నాడు. దానికి రత్నాకరుడు ఎంతో నొచ్చుకొని స్వామి మీకెప్పుడు నాకోరిక తీర్చాలని నాపై అనుగ్రహం చూపాలని అనిపిస్తుందో అంతదాకా నేను వేచి ఉంటాను. మీరు సంకల్పించినపుడుమాత్రం ఈ అల్పుని కోరికను కాదనకండి. మీరే నాకు దిక్కు. సర్వావస్థల యందు నేను మీకు శరణువేడే వాడిని. మీరు నాకోరిక తీర్చేదాకా నేను మిమ్మేస్మరిస్తూ ఉండే బుద్ధిని నాకు ప్రసాదించండి’ అని వేడుకున్నాడట. దాంతో రాముడు ‘తథాస్తు! ఆ పరమాత్మ ఏది ఏపుడు ఎందుకు సంకల్పిస్తాడో మానవ మాత్రులమైన మనం తెలుసుకోవడం కష్టం. కనుక నీకోరిక తీరాలని నీవు యథాశక్తి దైవాన్ని ప్రార్థించు ’ అన్నాడట. అలా చెప్పడమే మహద్భాగ్యం అనుకొన్న రత్నాకరుడు మంచి ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ తీవ్రమైన తపస్సులో మునిగిపోయాడు.అట్లా తపస్సు చేసుకొంటున్న రత్నాకరుని దగ్గరకు మహావిష్ణు వచ్చి వచ్చి ‘నాయనా! నీకోరిక తీరు కాలం వచ్చింది. నేను ఈ అంకుడుచెట్టు మొదట్లో ఉన్న ఈ పుట్టలో వెలుస్తాను. ఇక్కడే నాకు ఆలయం నిర్మించమని ఇక్కడి వారినిప్రేరేపిస్తాను. ఇక నీవు కోరుకున్నట్లుగానే నీవు తపస్సు ఆచరించిన ఈ స్థలంలోనే సత్యదేవునిగా నేనుకొలువు అవుతాను ’ అని చెప్పాడట. కొంతకాలానికి స్వామి చెప్పినట్లుగానే ఓ పుట్టలో స్వయంభూగా వెలిశాడు. ఆ సజ్జనులకు నెలవైన ఆ క్షేత్రంలోనే ఈరంకి సూర్య ప్రకాశం అన్న పేరుగల సజ్జనుడు ప్రతిరోజు అన్నదాన సేవ చేస్తుండేవాడు. కిర్లంపూడి సంస్థానాధీశుడైన రాజా ఇనుగంటి రామనారాయణం బహద్దూర్ తన ఏలుబడిలో అన్నవరంలో ప్రజలందరికీ ఏ కష్టాలు రాకుండా చూడాలని నిత్యం ఆ సర్వేశ్వరుడిని ప్రార్థిస్తుండేవాడు.
ఒకనాడు మహావిష్ణువు సూర్యప్రకాశం అనే నిత్యాన్నదాన వేత్త అయిన సూర్య ప్రకాశానికి కలలో కనబడ్డాడు. ‘నాయనా! నీవు చేసే నిత్యాన్నదాన సేవకు నేను సంతృప్తి పడ్డాను. అందుకే నీవు నీతో పాటు ఉన్నవారు నన్ను సేవించుకోవడానికి వీలుగా నేను అంకుడు చెట్టు మొదట్లో ఆర్చామూర్తిగా ఉన్నాను. నన్ను వెలికి తీసి నిత్యాధూపదీపారాధనలు చేయండి అని చెప్పాడు. దిగ్గున లేచిన సూర్య ప్రకాశానికి తాను స్వయంగా భగవంతుడిని చూచానన్న సంతోషం ఇబ్బడి ముబ్బడి అయింది. శరీరమంతా రోమాచితం అయింది. కన్నుల్లో నీరు ఉబికి వస్తున్నాయి. ఇంత మంచి శుభవార్తను వెంటనే రాజుగారి చెవిలో వేయాలని సంస్థానాధీశుని దగ్గరకు వెళ్లాడు. అక్కడ కూడా పులకాంకిత శరీరంతో ఆశ్రువులు కారుతుండగా రాజాఇనుగంటి వేంకట రామనారాయణం తన వద్ద వున్న మిత్రగణంతో తాను స్వయంగా స్వప్నంలో భగవంతుడిని చూచానని, ఆ దైవం అంకుడుచెట్టు మొదట్లో ఉన్నానని తన్ను వెలికి తీసి పూజించమని చెప్పినట్లుగా చెబుతుండడం చూచి మరింత సంతోషంతో తనకు వచ్చిన కలను కూడా సూర్యప్రకాశం వారికి వివరించాడు.
ఆహా ఆ శ్రీమన్నారాయణుని లీల తెలుసుకొనరానిది. త్రిగుణాతీతుడైన స్వామి మనలను ఇలా కరుణించాడు కనుక వెంటనే మనం ఆ పుట్ట దగ్గరకు వెళ్దాం అని అనుకొని ఊరి వారంతా కలసి వెళ్లారు. అక్కడ ఆ చెట్టు మొదట్లో ఉన్న పుట్టను తవ్వారు. దేదీప్యమానంగా వెలుగుతున్న సత్యదేవుని విగ్రహం వారికి కనబడింది. జయఘోషతో స్వామిని వారంతా కీర్తించారు. అందరూ కలసి స్వామిని బయటకు తీసి అభిషేకాదులు నిర్వర్తించారు. ఆ తరువాత చిన్న తాటాకు పందిరి వేసి ఆ స్వామి వారికి నీడ కల్పించారు. అందరూ స్వామిని వీర వేంకట సత్యనారాయణుడుగా అభివర్ణించారు. కొన్నాళ్ల తరువాత ఆ సంస్థానాధీశుడు మహాపండితులను రావించాడు. ఆగమశాస్తవ్రేత్తలు పిలిపించాడు. వారందరి సలహాను తీసుకొని అన్నవరం లో రత్నాచలం మీద సత్యదేవుని కోవెలను రథాకృతిలో ఉండేట్లుగా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీర వేంకట సత్యదేవుని కొలువు తీరడానికి వాస్తు ప్రకారం ఆలయ నిర్మాణంతో ప్రారంభించారు. ఈ దేవాలయం రెండు అంతస్థులతో ఉంటుంది. మొదటి అంతస్థు యంత్రాలయంగాను, రెండవ అంతస్థులో స్వామి దివ్యమంగళ స్వరూపం కనబడుతుంది. మధ్య ప్రదేశం పానవట్టంగా కనబడడం ఇక్కడి విశేషం. ఈ యంత్రనిర్మాణంలో వృత్తాకారంలో ఉన్న శిలాయంత్రంలో మొదటి భాగం బ్రహ్మస్వరూపంగాను, రెండవ భాగం లింగాకార స్తంభం శివస్వరూపంగాను, ఇక ఊర్థ్వమండలిలో కనిపించే విగ్రహం నారాయణ స్వరూపంగా దర్శన మివ్వడం అంటే నిస్సంగుడు, నిర్వికారుడు, నిరామయడు, నిరాకారుడు , గుణాతీతుడు అయిన దైవం ఇక్కడ త్రిగుణాత్మకుడుగా దర్శనం ఇస్తున్నాడని దీని అంతరార్థంగా పండితులు చెప్తారు. తనను కొలిచిన వారిని ఇంద్రియాలను జయించే శక్తినిస్తాడని వారిని సాత్విక గుణ సంపన్నులుగా తీర్చి దిద్దుతాడని ఇక్కడి నివాసితులు చెప్తారు. ఈ అన్నవరానికి దగ్గరలో పంపానది ప్రవహిస్తూ ఉంటుంది.ఈ సత్యదేవుని గుడిలో అమ్మవారు అనంతలక్ష్మీ నామధేయంతో అన్నార్తులను, దీనులను, ఆపన్నులను సంరక్షిస్తూ ఉంది.
ఇక్కడకు వచ్చే భక్తజనంలో సత్యధర్మాచరణ చేసేవారికి శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి అంత ఎల్లవేళలా ఉంటుంది. సత్యధారణ చేసేవారంతా సత్యదేవుని మారురూపాలని సత్యదేవుని దగ్గర అసత్యులు, అధర్మాచరణులైన వారికి నిలువ నీడ ఉండదని అటువంటి వారిని నిముషాల్లోనే స్వామి శిక్షిస్తాడని సత్యదేవుని భక్తుల నమ్మకం. సత్యదేవుని దర్శించడానికి రైల్వే వారు కూడా రత్నాచల్ అనే రైలుసదుపాయాన్ని కల్పించారు. ఈ రత్నాచల్‌లో ఎక్కిన వారు అన్నవరంలోనే దిగే సౌకర్యం ఉంది. ఇక అక్కడ నుంచి తనపై పాదం మోపాలని తనపైనే స్థిర నివాసమేర్పరుచుకోవాలని కోరిన రత్నాచలుడు రత్నగిరి గా మారిన కొండపైకి చేరుకోవాలి. ఈ కొండపైన కోరి కొలువున్న వీర వేంకట సత్యదేవుని దర్శనం చేస్తే ఇహపరాల్లో సుఖసంపదలకు కొదువ ఉండదనే కీర్తిని పొందాడీ వీరవేంకట సత్యనారాయణ స్వామి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలోని శంఖవరం మండల పరిధిలోని అన్నవరం రాజమండ్రికి సుమారు 70 కి.మీ దూరంలోను, కాకినాడకు సుమారు 45 కి.మీల దూరంలోను నెలకొని ఉంది. శివకేశవుల అభిన్నత్వానికి మారుపేరుగా నెలకొన్న ఈ వీర వేంకట సత్యనారాయణ స్వామి క్షేత్రంలో ప్రతి విశేష పర్వదినాల్లో ప్రత్యేక పూజలు అమ్మవారికి, స్వామికి నిర్వహిస్తారు. శ్రావణ శుద్ద విదియ నాడు స్వామి వారి జయంతిని, వైశాఖ శుద్ధ దశమినాడు కల్యాణోత్సవాలను జరుపుతారు. తెప్పోత్సవాలు, జ్వాలా తోరణాలు, కుంకుమార్చనలు, వివిధ పుష్పార్చనలు తులసీ అర్చనలు విశేషవేళలలో కనువిందుగా జరుగుతాయి. ఈ స్వామిని దర్శించడానికి వారి వారి పాపరాశులను దగ్ధం చేసుకోవడానికి ఎక్కడెక్కడనుంచో భక్తులు నిత్యమూ తండోపతండాలుగా ఈ క్షేత్రానికి వస్తుంటారు.       - శ్యామసుందరి శ్రీనివాసులు


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list