MohanPublications Print Books Online store clik Here Devullu.com

యాదగిరిగుట్టలక్ష్మీనరసింహస్వామి_YADAGIRIGUTTA_SriLakshmiNarasimha Swamy_

పంచనారసింహ క్షేత్రం... 
యాదగిరి గుట్ట!
పరమ భక్తుడూ పసివాడూ అయిన ప్రహ్లాదుడ్ని కాపాడటానికి ఉగ్రనారసింహ అవతారమెత్తిన స్వామి, మరో భక్తుడి కోరిక మేరకు ప్రసన్న రూపంతో లక్ష్మీ సమేతంగా కొలువుదీరిన క్షేత్రమే యాదగిరిగుట్ట. తెలంగాణ తిరుపతిగా ప్రాశస్త్యం పొందిన ఈ క్షేత్రానికి ఉన్న విశిష్టత ఎంతో.
యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్టపైన వెలసిన లక్ష్మీ నరసింహస్వామి ప్రశస్తికి సంబంధించి పురాణాల్లో ఎన్నో ఐతిహ్యాలున్నాయి. రామాయణ మహా భారతాల్లోనూ ఆ ప్రస్తావనలున్నాయి. మహాజ్ఞాని విబాంఢకుడి కుమారుడు రుష్యశృంగుడు. అతడి పుత్రుడు యాద రుషి చిన్నతనం నుంచీ విష్ణు భక్తుడు. అందులోనూ నృసింహ అవతారం పట్ల ఎనలేని మక్కువ. ఆ స్వామి సాక్షాత్కారం పొందేందుకు దట్టమైన అడవుల్లో తిరుగుతూ కొండజాతి వారికి చిక్కాడు. వాళ్లు యాదుడిని క్షుద్రదేవతకు బలివ్వబోయారు. అప్పుడు రామబంటుగా హనుమంతుడు ప్రత్యక్షమై యాదర్షిని రక్షించి, కీకారణ్యంలో సింహాకార గుట్టలున్నాయనీ అక్కడికెళ్లి సాధన చేస్తే స్వామి సాక్షాత్కరిస్తాడనీ సూచించాడు. యాదర్షి దీర్ఘకాల తపస్సు ఫలించి... నృసింహ స్వామి ప్రత్యక్షమయ్యాడట. అయితే, ఆ ఉగ్ర నరసింహ రూపాన్ని దర్శించలేకపోయాడు యాదర్షి. అతడి కోరిక మేరకు స్వామి శాంత స్వరూపంలో శ్రీ లక్ష్మీ సమేత నరసింహుడిగా ప్రత్యక్షమయ్యాడు. అనంతరం యాదరుషి స్వామిని వేరు వేరు రూపాల్లో చూడాలనుందని వరం కోరుకున్నాడు. దాంతో జ్వాల, గండభేరుండ, యోగానంద, ఉగ్రసింహ, శ్రీలక్ష్మీనృసింహ స్వామిగా ప్రత్యక్షమయ్యాడు మహా విష్ణువు. అందుకే, ఈ ఆలయాన్ని పంచనారసింహ క్షేత్రంగా పిలుస్తారు. యాదరుషి కోరిక ఫలితంగా వెలసింది కాబట్టి, యాదగిరిగుట్టగానూ ప్రసిద్ధమైంది. యాదర్షి కోరికమీదే ఆంజనేయస్వామి యాదగిరి గుట్టకు క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. ఓ రాక్షసుడు తపోముద్రలో ఉన్న యాద మహర్షిని మింగేయాలని ప్రయత్నించడంతో విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని పంపి ఆ దైత్యుడిని అంతమొందించాడట. ఇప్పటికీ గుట్ట చుట్టూ సుదర్శనం రక్షా కవచంలా నిలిచి ఉంటుందనేది ఓ విశ్వాసం.
మరో అన్నవరంగా...
ఎంతో పురాతనమైన యాదగిరీశుడిని 1148 సంవత్సరంలో పశ్చిమ చాళుక్య రాజు త్రిభువన మల్లుడు, తర్వాత శ్రీకృష్ణదేవరాయలూ దర్శించుకున్నట్లు శాసనాలున్నాయి. అయితే, చాలాకాలం పాటు మరుగున పడిపోయిన క్షేత్ర మహత్యాన్ని స్థానిక గ్రామాధికారి గుర్తించాడు. స్వామి అతడికి కలలో కనిపించి తన అవతార రహస్యాన్ని చెప్పాడట. హైదరాబాద్‌ వాస్తవ్యుడు రాజా మోతీలాల్‌ ఆలయాన్ని నిర్మించి పూజాదికాలు పునరుద్ధరించాడని చరిత్ర చెబుతోంది.
యాదాద్రిలో గుట్ట మీదే కాకుండా కింద కూడా మరో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది. నిజానికి స్వామివారు ముందు ఈ పాత ఆలయంలోనే వెలశాడనీ తరవాత కొత్త నరసింహ స్వామివారి ఆలయానికి గుర్రంమీద వెళ్లేవారనేది మరో కథనం. కింది ఆలయం నుంచి పై ఆలయం వరకూ మెట్లమీద ఇప్పటికీ కనిపించే గుర్రపు పాద ముద్రలు అవేనంటారు. ఇక, మహిమాన్వితమైన యాదాద్రిలో నిత్యం శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు జరగడం వల్ల ఈ క్షేత్రం మరో అన్నవరంగా విలసిల్లుతోంది.
బ్రహ్మోత్సవ వైభవం
యాదాద్రి ఆలయంలో ఏటా ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవ సంప్రదాయాన్ని సాక్షాత్తూ బ్రహ్మదేవుడే స్వహస్తాలతో ప్రారంభించాడని చెబుతారు. అందుకే, వీటికి బ్రహ్మోత్సవాలనే పేరొచ్చింది. ఉత్సవాలు జరిగిన పదకొండు రోజులూ యాదగిరి ముక్కోటి దేవతల విడిదిల్లుగా మారుతుంది. ఆ సందర్భంగా సకల దేవతల్నీ శాస్త్రోక్తంగా ఆహ్వానించి, వేదోక్తంగా పూజలు నిర్వహించడం సంప్రదాయం. దానివల్ల క్షేత్ర మహత్యం రెట్టింపు అవుతుందట. యాదగిరిగుట్టలోని విష్ణు పుష్కరిణి సాక్షాత్తూ బ్రహ్మ కడిగిన పాదాల నుంచే ఉద్భవించిందంటారు. అనారోగ్యం, ఇతర గ్రహ సమస్యలున్నవారు ఈ పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తే బాధల నుంచి విముక్తులవుతారనేది భక్తుల నమ్మకం. గుట్టమీది ఆలయానికి మెట్ల మార్గంలో వెళ్లేటపుడు దార్లో శివాలయం కనిపిస్తుంది. ఇక్కడి శివుడు నరసింహస్వామి కన్నా ముందే స్వయంభూగా వెలిశాడట. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారికి కీళ్ల నొప్పులు తగ్గుతాయనేది మరో విశ్వాసం.
తెలంగాణ తిరుపతిగా...
ఎంతో మహిమాన్వితమైన యాదగిరి గుట్టను తెలంగాణ తిరుపతిగా మహాదివ్య పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు పూనుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రెండువేల ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవనాలూ పార్కులూ కాటేజీలూ కల్యాణమండపాలనూ నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచన. సుమారు రూ.రెండు వేల కోట్లతో నిర్మించే ఈ మొత్తం క్షేత్రానికి ‘యాదాద్రి’ అనే నామకరణం చేశారు. ప్రస్తుతం అర ఎకరంలో ఉన్న ప్రధాన ఆలయం స్థానంలో 2.33 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఆలయాన్ని కడుతున్నారు.
హైదరాబాద్‌ ప్రధాన బస్టాండ్ల నుంచి ప్రతి అరగంటకూ యాదాద్రికి వెళ్లే బస్సులున్నాయి.
- ఆర్‌.అశోక్‌కుమార్‌, న్యూస్‌టుడే, యాదగిరిగుట్ట

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list