అన్నీ నోటి మాటలే!
పూర్వం ఒకానొక పట్టణంలో కాళీదేవి ఆలయం ఉండేది. అమ్మవారి దర్శనార్థం వేలమంది భక్తులు తరలివస్తుండేవారు. అందరూ అమ్మవారి విగ్రహం దగ్గరికి వచ్చి.. ‘అమ్మా! ఈ పాపపు లోకంలో ఉండలేక పోతున్నాను. ఈ మాయాకూపం నుంచి నన్ను బయట పడేలా చూడు తల్లి. నీ భక్తుడికి మోక్షం ప్రసాదించు’ అని వేడుకుంటూ ఉండేవారు. భక్తులు పదే పదే అదే కోరుకోవడంతో ఆలయ పూజారికి విసుగు పుట్టింది. అసలు ఈ భక్తుల మాటల్లో విశ్వసనీయత ఎంతో తెలుసుకోవాలనుకున్నాడు. మార్నాడు భక్తులు వచ్చేసరికి అమ్మవారి విగ్రహం వెనుక ఎవరికీ కనిపించకుండా దాక్కున్నాడు పూజారి. కాసేపటికి భక్తులంతా వచ్చారు. అందరూ తమకు ముక్తి ప్రసాదించాల్సిందిగా కోరుకుంటున్నారు. అమ్మవారి వెనక దాక్కున్న పూజారి సన్నని గొంతుకతో.. ‘భక్తులారా! మీ భక్తికి మెచ్చాను. మీలో మోక్షం కావాలని అనుకుంటున్న వారంతా.. నా విగ్రహం దగ్గరికి రండి. నాలో అంతర్ధానం చేసుకుంటాను’ అన్నాడు. ఆ మాటలు అమ్మవారే పలికిందని భావించిన భక్తులు ఒక్కసారిగా మిన్నకుండిపోయారు. ఒక్కొక్కరుగా అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. కాసేపయ్యాక పూజారి బయటకు వచ్చి చూస్తే.. ఆలయంలో ఒక్క భక్తుడూ లేడు. ఈ భక్తుల మాటలు మనసులో నుంచి వచ్చినవి కావని, కేవలం నోటి మాటలే అని పూజారికి అర్థమైంది. అమ్మవారికి ప్రణమిల్లి.. ‘నీ బిడ్డలను చల్లగా చూడు తల్లి’ ప్రార్థించాడు.
అంతా ‘ఫెయిర్’ ఏనా?
దేశంలో యేటా 3 వేల కోట్ల ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల వ్యాపారం జరుగుతోందంటే వీటికున్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. అయితే తెల్లనివన్నీ పాలు కానట్టే! చర్మాన్ని తెల్లగా మార్చే ఈ క్రీములన్నీ సురక్షితమైనవి కావు. వీటిలో దాదాపు 10 శాతం క్రీమ్‌లలో హానికారక స్టిరాయిడ్లు ఉంటున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
చర్మపు రంగు గురించిన స్పృహ పెరిగిపోతోంది. ఈ తీరుతో కొత్త కొత్త ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల తయారీ పెరిగింది. వైద్యుల ప్రిస్ర్కిప్షన్‌తో పని లేకపోవటం, మార్కెట్లో తేలికగా దొరుకుతుండటంతో వీటి వాడకం కూడా పెరిగిపోతోంది. చర్మాన్ని తెల్లబరుస్తాయని అంటే చాలు! ఎంత డబ్బైనా వెచ్చించి వాటిని కొనుగోలు చేసే యువత శాతం క్రమేపీ పెరుగుతోంది. అయితే...ఇలా దొరికే ఫెయిర్‌నెస్ క్రీములన్నీ సురక్షితం కావు. చర్మం మీద ప్రభావం చూపించి తెల్లగా మార్చటం కోసం వీటిలో స్టెరాయిడ్లు, బ్లీచింగ్‌లు కలుపుతున్నారు. వీటి వల్ల తాత్కాలికంగా చర్మం తెల్లబడినట్టు అనిపించినా దీర్ఘకాలంలో తిరిగి సరిదిద్దలేని చర్మ సమస్యలు తలెత్తుతాయంటున్నారు వైద్యులు.
స్టెరాయిడ్లు, బ్లీచింగ్‌లు దుష్ప్రభావాలు
ఇవి చర్మం పై పొర తొలగిపోయేలా చేస్తాయి. దాంతో చర్మం అడుగునున్న తెల్లని పొర బయటపడి చర్మం తెల్లబడినట్టు అనిపిస్తుంది. కానీ తిరిగి తొలగిపోయిన చర్మపు పొర తయారయ్యే సమయం ఇవ్వకుండానే పదే పదే స్టిరాయిడ్‌లతో తయారైన ఫెయిర్‌నెస్ క్రీమ్స్ వాడటం వల్ల చర్మపు పొరలు తొలగిపోయి పుండ్లు పడతాయి. ఇన్‌ఫెక్షన్లు బాధిస్తాయి. చర్మం పలుచగా తయారై మరింత సున్నితమవుతుంది. ఎండకు గురైతే కమిలిపోవటం, సన్ ట్యాన్ సమస్యలు ఎక్కువవుతాయి. దీర్ఘకాలం వాడటం వల్ల చర్మం నల్లబడిపోతుంది.
సహజసిద్ధంగా తెల్లబడాలంటే?
ఫెయిన్‌నెస్, వైటెనింగ్ క్రీముల దుష్ప్రభావాలను లోనుకాకుండా ఉండాలంటే వీటి వాడకం పూర్తిగా మానేయాలి. మచ్చలు, మొటిమలు, సన్‌ట్యాన్‌తో చర్మం నల్లబడిన వారు చర్మ వైద్యుల్ని సంప్రతించి తమ చర్మ తత్వానికి తగిన చికిత్స తీసుకోవాలి. పోషకాహారం తీసుకుంటూ వైద్యులు సూచించిన స్కిన్ క్రీమ్స్ వాడితే చర్మం సహజసిద్ధమైన మెరుపుదనం సంతరించుకుంటుంది. చర్మపు తత్వానికి తగిన సబ్బు, సన్‌స్ర్కీన్, మాయిశ్చరైజింగ్ లోషన్లను వాడుతూ.. ఈ క్రింది జాగ్రత్తలు కూడా పాటిస్తే ఎలాంటి స్టిరాయిడ్ బేస్‌డ్ క్రీమ్‌లతో పని లేకుండానే ఆరోగ్యకరమైన రీతిలో తెల్లబడొచ్చు.
ఎండలోకి వెళ్లేటప్పుడు చర్మాన్ని కవర్ చేసుకోవాలి.
రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి.
7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి.
తాజా పళ్ల రసాలు, ఆకు కూరలు, కూరగాయలు తీసుకోవాలి.
చక్కెర వాడకం తగ్గించాలి.
16 ఏళ్ల లోపు యువతులు ఎలాంటి ఫేస్ క్రీమ్స్ వాడకూడదు.
ఇంట్లో తయారు చేసుకుని వేసుకునే ప్యాక్స్ వల్ల తాత్కాలిక ఫలితం మాత్రమే ఉంటుంది.
చర్మానికి సంబంధించిన ఎలాంటి సమస్య వచ్చినా సొంత వైద్యం మాని చర్మ వైద్యులను సంప్రతించాలి.
నిగారింపు కోసం...!
చర్మం కాంతిమంతంగా ఉండాలంటే రోజూ పాలు తీసుకోవాలి. పాలు తాగడం ఇష్టం లేకపోతే పాల ఉత్పత్తులను తీసుకున్నా స్కిన్ టోన్ మెరగవుతుంది. రాత్రివేళ చల్లటి పాలు తాగితే చర్మసౌందర్యం మెరుగవుతుంది.
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే హెల్తీ డైట్ తప్పనిసరి. సోయా పాలు, ఎరుపు, పసుపు రంగు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
ఈ రోజుల్లో కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉంటోంది. బయటకు వెళ్లి వచ్చిన తరువాత తప్పనిసరిగా నేచురల్ క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
వారమంతా బిజీగా ఉన్నా వీకెండ్‌లో తప్పనిసరిగా ఫేస్‌ప్యాక్‌ను అప్లై చేసుకోవాలి. ఇంట్లో లభించే పదార్థాలతో చేసుకున్న ఫేస్‌ప్యాక్ అయితే మరీ మంచిది.
స్కిన్ టోన్ పెరగాలంటే తేయాకులను మరిగించి ఆ నీరు చల్లారిన తరువాత ఒక స్పూన్ తేనె కలిపి ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖకాంతి పెరుగుతుంది.
రెండు, మూడు టేబుల్‌స్పూన్ల పచ్చిపాలు, అందులో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి ముఖానికి పట్టించాలి. పది నిమిషాల తరువాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మకాంతి పెరుగుతుంది.
ఫేస్‌ప్యాక్‌లు, ఆహారంతో పాటు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. అప్పుడే చర్మం ఆరోగ్యంగా, నిగారింపుతో ఉంటుంది.
సిసింద్రీల కోసం...
వేసవిలో పిల్లల ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే పిల్లల కోసం ఈ పది వస్తువులు ఇంట్లో కచ్చితంగా ఉండాలి.
సబ్జా గింజలు: వేడికి దూరంగా ఉంచి... శరీరానికి చల్లదనాన్ని అందించాలంటే ఈ గింజలు బెటర్ ఆప్షన్. వీటిని తీసుకోవడం వల్ల పోషకాలతో పాటు పీచుపదార్ధం కూడా అందుతుంది. వేసవిలో పిల్లలు డీ-హైడ్రేషన్, మలబద్ధకం వంటి ఆరోగ్య సమస్యల బారిన పడతారు. ఈ సమస్య రాకుండా నివారిస్తాయి సబ్జా గింజలు. వీటినే తింటే రుచిగా అనిపించవు. అందుకని పళ్ల రసాల్లో, నిమ్మకాయ నీళ్లు, పాలు లేదా ఫలుదా వంటి పానీయాల్లో కలుపుకుని తాగొచ్చు.
పుచ్చకాయ: వేసవి తాపాన్ని తగ్గించడమే కాకుండా పోషకాలను కూడా అందిస్తుంది. ఇందులో 92 శాతం నీళ్లు ఉంటాయి. అందుకని వీటిని తినడం వల్ల డీ-హైడ్రేట్ అయ్యే సమస్యే ఉండదు. చర్మాన్ని తాజాగా ఉంచడమే కాకుండా శరీరంలోని వ్యర్ధాలను బయటికి పంపేస్తుంది. వేసవిలో పిల్లలకు రోజుకి రెండుసార్లు పుచ్చకాయ తినిపిస్తే డీ-హైడ్రేషన్‌కి గురికారు. అలసిపోరు. రోజూ పుచ్చకాయ ముక్కలే తినాలా అనే పిల్లల కోసం పుచ్చకాయ రసం, స్మూతీ వంటివి తయారుచేయొచ్చు.
కొకమ్ షర్బత్: ఈ పానీయం శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. జీర్ణవ్యవస్థ సరిగా పనిచేసేలా చేసి.. ఆకలి పెంచుతుంది. విటమిన్ - సి మెండుగా కలిగి ఉన్న ఈ పండు యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. దీనివల్ల చర్మంపై చెమటపొక్కులు రావు. కొంచెం పుల్లగా, కొంచెం తియ్యగా ఉండే ఈ డ్రింక్‌ను పిల్లలు ఇష్టంగా తాగుతారు కూడా.
పెరుగు: ఇందులో విటమిన్లు, ప్రొటీన్లతో పాటు శరీరానికి కావాల్సినన్ని పోషకాలు ఉంటాయి. పెరుగు తేలికగా జీర్ణం అవ్వడం కూడా ఎంతో తేలిక. వేసవిలో పిల్లలకి పొట్టకి సంబంధించిన ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. అందుకని పెరుగు తినిపిస్తే ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచొచ్చు. పెరుగులో పండ్లు కలిపి తినడం వల్ల పండ్ల నుంచి లభించే పోషకాలు కూడా అందుతాయి వాళ్లకు.
పుదీనా: అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్న పుదీనాలో పోషకాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. జీర్ణక్రియ సరిగా జరిగేలా చేస్తుంది. పుదీనాతో చేసిన తినుబండారాలు, డ్రింక్స్ పిల్లలకు క్రమం తప్పకుండా ఇస్తుంటే అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు. అలసిపోకుండా తాజాగా ఉంటారు.
వసంత నీర్
(మ్యాంగో కోకోనట్ వాటర్ డ్రింక్)
కావలసినవి:
కొబ్బరి బోండాం నీళ్లు - ఒకటింబావు కప్పులు, నిమ్మచెక్క - సగం(రసం), మ్యాంగో నెక్టార్ - పావు కప్పు, తేనె - ఒక టేబుల్ స్పూన్, పుదీనా కట్ట - ఒకటి.
తయారీ:
పుదీనా ఆకుల్ని తరగాలి. గోరు వెచ్చని నీళ్లలో తేనె కలపాలి.
తరువాత ఒక జగ్‌లో పోసి ఫ్రిజ్‌లో అరగంటపాటు పెడితే వసంత నీర్ రెడీ.
టిప్స్:
మ్యాంగో నెక్టార్(సూపర్ మార్కెట్‌లో లభిస్తుంది)కు బదులు మామిడి గుజ్జు లేదా ముక్కలు వాడొచ్చు. మామిడి కలపకపోయినా పర్వాలేదు. కానీ... కలిపితే రుచి బాగుంటుంది.
తేనెను గోరువెచ్చని నీళ్లలో కలిపితే త్వరగా కరిగిపోతుంది. మిగతా పదార్ధాలతో సులభంగా కలిసిపోతుంది.
కాలిన బొబ్బలు మానేందుకు
నిప్పు రవ్వలు పడటం వల్లగానీ, తీవ్రమైన ఎండలో తిరగడం వల్లగానీ, శరీరం మీద బొబ్బలు రావచ్చు. రసాయన పదార్థాలు, రేడియేషన్ వల్ల కూడా ఒంటి మీద బొబ్బలు రావచ్చు. ఒక స్థాయి వరకు వీటిని గృహవైద్యంతోనే నయం చేసుకోవచ్చు. అందుకు
గృహ చిట్కాగా.....
చర్మం కాలినప్పుడు కనీసం 10 నిమిషాల పాటు కాలిన చోట చల్లని నీటిని ధారలా పడేలా ఉంచాలి. ఒకవేళ పొక్కులు వస్తే వాటిని తొలగించే ప్రయత్నం చేయకూడదు. అలా తొలగిస్తే అందులో ఇన్‌ఫెక్షన్లు తలెత్తే ప్రమా దం ఉంది.
కలబంద గుజ్జును తమలపాకు మందంగా, కాలిన గాయాలపై రాయాలి. గుజ్జుకాకపోతే, కలబంధ రసాన్ని ఆ గాయాలపైన రాయవచ్చు. రోజుకు రెండుసార్లు ఈ రసాన్ని రాస్తే ఎంతో ఫలితం కనిపిస్తుంది. కలబంద వెంటనే లభించని పక్షంలో పసుపు పొడిలో శుద్ధమైన తేనె కలిపి కూడా రాయవచ్చు. ఇదే కాకుండా కొబ్బరి టెంకెను బాగా కాల్చి దాని చూర్ణాన్ని కొబ్బరి నూనెతో కలిపి రాస్తే కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది.
గోరింటాకు ముద్దలో వెనిగెర్ గానీ, నిమ్మరసాన్ని గానీ కలిపి గాయాలపై పూస్తే కాలిన గాయాల తాలూకు మంట తగ్గుతుంది.
కోడిగుడ్డులోని తెల్లని సొనలో తుమ్మబంక పొడి , కొబ్బరి నూనె కలిపి పూస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది.
అయితే కాలిన గాయాలు శరీరంలో 10 శాతం కన్నా మించితే వెంటనే ఆసుపత్రిలో చేర్పించి తక్షణమే అవసరమైన చికిత్సలు ఇప్పించాలి.
ఊపిరాడదు.. ఎందుకని?
మా నాన్నగారికి 69 ఏళ్లు. గత కొంత కాలంగా ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్నారు. అయినా ఈ పరిస్థితికి గల కారణాలేమిటి? బ్రాంకైటిస్ అనుకోవడానికి ఆయనకు పొగతాగే అలవాటు కూడా లేదు. రిటైరైనా మొన్నటిదాకా ఏవో పనుల్లో బిజీగా ఉండేవారు. ఇప్పుడు ఏ చిన్న పనిచేసినా ఆయాసం వస్తోంది. ఒక్కోసారి అడుగు తీసి అడుగు వేసినా ఆయాసం వస్తోంది.అందుకే ఇంటివద్దే ఉంటున్నాడు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో చెప్పండి.
- ఎల్. వికాస్, రాజమండ్రి
గుండె సక్రమంగా పనిచేయని వారిలో కనిపించే ఒక సాధారణ లక్షణమిది. ఏదైనా శ్రమ చేస్తున్నప్పుడు గానీ, నడుస్తున్నప్పుడు గానీ, చివరికి విశ్రాంతిగా పడుకున్నప్పుడు కూడా కొందరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఆయాసం ఉంటాయి. ఇది వారి గుండె ఏ స్థాయులో పనిచేస్తోందో తెలియజేసే సంకేతం. గుండె పనితనం తగ్గిపోతున్న కొద్దీ ఊపిరి ఆడని సమస్య మరింత ఎక్కువవుతుంది. సమస్య ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఏదైనా శ్రమ చేస్తున్నప్పుడు మాత్రమే ఊపిరి ఆడని పరిస్థితి ఉంటుంది. సమస్య తీవ్రమయ్యాక చిన్నచిన్న పనులకే ఊపిరి ఆడటంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఒక్కోసారి పడుకుని నిద్రపోతున్నప్పుడు కూడా ఊపిరి ఆడక గబాల్న లేచి కూర్చుంటారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే శ్వాసపరమైన సమస్యలన్నింటికీ గుండె పనితనం లోపమే కారణం కాకపోవచ్చు. కొందరిలో ఇది తీవ్రమమైన రక్తహీనత వల్ల కూడా శ్వాసపరమైన సమస్యలు తలెత్తవచ్చు. ఎంఫిసీమా అనే మరో సమస్య వల్ల కూడా ఈ శ్వాస సమస్యలు రావచ్చు. అందువల్ల డాక్టర్‌ను సంప్రతిస్తే మీ నాన్నగారి సమస్యేమిటో కొన్ని పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు. ఆ తర్వాత అవసరమైన చికిత్సలు తీసుకుంటే ఆ సమస్య నుంచి పూర్తి స్థాయిలో బయటపడవచ్చు.
-డాక్టర్ ఎన్. కార్తీక్, పల్మనాలజిస్ట్
ఆడేద్దాం.. తాడాట
అందంగా కనిపించాలంటే పైపై పూతలే కాదు శరీరానికి చక్కని వ్యాయామం కూడా అవసరం. అప్పుడే చర్మం నిగనిగలాడుతూ కనిపిస్తుంది. ఆరోగ్యమూ మీ సొంతమవుతుంది. అదెలా అంటే.. రోజూ కాసేపు తాడాట ఆడేయడమే.
* రోజూ కనీసం పదిహేను నిమిషాలైనా సరే తాడాట కోసం కేటాయించి చూడండి. ఇది గుండెకు రక్తప్రసరణ, ప్రాణవాయువు సరిగ్గా అందేలా చూసి ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు వూపిరి తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.
* కాళ్లకూ, శరీరం కింది భాగానికి తగిన వ్యాయామం అందాలంటే చక్కనిమార్గం తాడాటే. మొదట్లో కాస్త నొప్పిగా అనిపించినా సరే! కాళ్ల కదలిక చురుగ్గా ఉంటుంది.
కండరాలు దృఢంగా ఉంటాయి.
* బరువు తగ్గాలని చాలా ప్రయత్నాలే చేస్తున్నా.. త్వరగా ప్రయోజనం అందాలంటే ఎంచుకోవలసిన వ్యాయామ సాధనం ఇది. రోజూ అరగంట ఈ వ్యాయామం చేస్తే చాలు.. దాదాపు మూడువందల కెలొరీలు కరుగుతాయి. అదనంగా శరీరంలో పేరుకునే కొవ్వు కూడా తగ్గుతుంది.
* తాడాట మెదడుకీ, శరీరానికి మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తూ, ఏకాగ్రతను పెంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రయాణాల్లో ఇవీ తప్పనిసరి!
విహార యాత్రలకు వెళ్తున్నారా... అలా వెళ్లినప్పుడు చర్మసంరక్షణ అస్సలు మర్చిపోకూడదు. అందుకే ఇవి వెంట ఉంచుకోవడం తప్పనిసరి.
మాయిశ్చరైజర్‌ని ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. ఎలాంటి వాతావరణంలో ఉన్నా చర్మం నిర్జీవంగా మారకుండా తేమ ఉండటానికి ఇది తోడ్పడుతుంది. దాంతోపాటు లిప్‌బామ్, ఓ క్రీం కూడా తెచ్చుకోవాలి.
* ప్రయాణం సమయంలో కళ్లు వూరికే అలసిపోతుంటాయి. అందుకే కళ్లకు కట్టుకునే రిలాక్స్ ప్యాడ్లు అందుబాటులో పెట్టుకోవాలి. వీలుంటే ఆ ప్యాడ్లలో కీరా, బంగాళాదుంపలని సన్నని స్లైసులుగా తరిగి ఉంచుకున్నా కళ్లకు మేలు జరుగుతుంది.
* ఫౌండేషన్లూ, జిడ్డుగా ఉండే క్రీములు తీసుకెళ్లకపోవడం మంచిది. వాటిని రాసుకోవడం వల్ల చర్మంపై ఇంకా దుమ్మూధూళి చేరుకుంటాయి. ఇందుకు సంబంధించి వాడే బ్రష్‌లూ, ఐబ్రో పెన్సిళ్ల వంటివి మితంగా తీసుకెళ్లడం మంచిది.
* వీటిని ప్యాక్ చేసుకోవడం అంత సులువు కాదు. ఏ మాత్రం కారినా దుస్తులకు అంటుకుపోతాయి. అందుకే బయట తక్కువ పరిమాణంలో ఉండే సౌందర్యోత్పత్తుల శాంపిళ్లని వాడితే సరిపోతుంది. ఇవి బరువుగా ఉండవు. ఉపయోగించుకున్నాక పారేయొచ్చు.
* ప్రయాణాల్లో ఎలక్ట్రికల్ ఉత్పత్తులైన స్ట్రయిట్‌నర్లూ, డ్రయ్యరు తీసుకెళ్లడం సరికాదు. వీటిని ఈ సమయంలో వాడితే ఇంకా జుట్టు ఎండు గడ్డిలా మారిపోతుంది. బ్యాగుల్లో కూడా వీటికి ఎక్కువ స్థలం కావల్సి ఉంటుంది. కాబట్టి వదిలేయడం మంచిది.
వెదురులా కాదు.. వేణువులా...
ఆత్మీయం
అడవిలో ఎన్నో వెదురు చెట్లు ఉంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే వేణువులవుతాయి. అన్ని వెదురు చెట్లకూ వేణువు అయ్యే అర్హత ఉంది. కానీ వాటిలో కొన్నే సహకరిస్తాయి వేణువు కావడానికి. ఏది గాయాలు భరించి గాలితో కలిసేందుకు ద్వారాలు తెరచుకుంటుందో అది సత్ఫలితాన్ని ఇస్తుంది. ఏది మూసుకుంటుందో అది ఫలితాన్ని ఇవ్వదు. మనుషులలో కొందరు వెదురు చెట్లలా ఉన్నారు. వారిలో కొందరు వేణువులవుతున్నారు. గాయపడి పాడేందుకు సహకరించే వారు కొందరే. జీవితం గుప్పెట్లో వారు వేణువు అవుతారు. వారి నుంచి మంచి సంగీతం పుడుతుంది. కానీ చాలామంది తమ హృదయ కవాటాలను మూసే ఉంచుతున్నారు.
వారు తమను తెరవని పుస్తకంగానే ఉంచుకుంటారు. అటువంటి వారికి వాకిలి ఉన్నా లేనట్లే. కిటికీలు ఉన్నా లేనట్లే. కనుక వారి నుంచి సంగీతం పుట్టడం అసాధ్యం. జీవన సంగీతం ఓ వరం. అందుకు పెట్టి పుట్టాలి. గాయాలు పడిన వెదురు వేణు గానమవుతుంది. మనుషులూ అంతే. గాయపడి నలిగినా, వారు ఆ బాధలో నుంచి పాటలు కడతారు. ఆలపిస్తారు. మనసుల్ని ఆకట్టుకుంటారు. ఊరట చెందుతారు. రంధ్రాలు వేయించుకోవడానికి గాయాలు భరిస్తూ సహకరించిన వెదురు అందాన్ని కోల్పోవచ్చు. కానీ ఫలితాన్ని ఇస్తుంది.
ఆరోగ్యం నవ్వాలంటే.. నువ్వులు
ఇప్పుడంటే మనం వంటకు రకరకాల నూనెలు ఉపయోగిస్తున్నాం. కానీ ఒకప్పుడు వంట నూనె అంటే నువ్వులనూనే. అంటే... తిలల నుంచి తీసిందే ‘తైలం’ అన్నమాట. మన భారతీయ సంస్కృతిలో నువ్వులు అంతగా ఇమిడిపోయాయి. నువ్వులలో ఉన్న మంచి ఆరోగ్యకరమైన పోషకాల జాబితాకు అంతే లేదంటే అతిశయోక్తి కాదు. గుండెజబ్బుల నిరోధానికి నువ్వులు ఎంతగానో మేలు చేస్తాయి. నువ్వుల్లో ప్రొటీన్లు ఎక్కువ. ఇందులో విటమిన్–ఇ, క్యాల్షియమ్‌లు కూడా ఎక్కువ. కాబట్టి శరీరంలో అయ్యే గాయాల రిపేర్‌కు ఇది బాగా తోడ్పడుతుంది.
నువ్వుల్లో ఐరన్ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే రుతుస్రావం అయ్యే మహిళలు నువ్వులను ఏ రూపంలో తీసుకున్నా వాటివల్ల ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.నువ్వులలో విటమిన్–బి కాంప్లెక్స్‌లోని పోషకాలైన నియాసిస్, రైబోఫ్లేవిన్, థయామిన్ వంటివి మరింత ఎక్కువ. నువ్వుగింజల్లోని బరువులో 50 శాతం మేరకు నూనె పదార్థమే ఉంటుంది. అందులో విటమిన్–ఇ ఎక్కువగా ఉండటం వల్ల ఇది చర్మసౌందర్యానికి, మేని ఛాయ మెరుగుపడటానికి ఉపయోగపడుతుంది.