MohanPublications Print Books Online store clik Here Devullu.com

మణిద్వీపవర్ణన_Manidweepa_varnana



శ్రీదేవీ భాగవతంలో
 మణిద్వీప వర్ణన ఉంది
(12వ స్కందంలో 10 - 12 అధ్యాయములు)

శ్రీమాత నివాసం చింతామణి గృహం
విజయదశమి పర్వదిన శుభవేళ ఆ జగజ్జనని, శివాత్మక మణిద్వీప నివాసినీ అయిన ఆ
తల్లిని స్మరించుకోవటం ఎంతో శుభప్రదం. ఆ అమ్మ మణిద్వీపంలో ఎలా
అలరారుతోంది అనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణించి చెప్పే కథ
దేవీభాగవతంలో వర్ణితమై ఉంది. నూతన గృహప్రవేశ శుభ సందర్భాలలో తరతరాలుగా
మణిద్వీప వర్ణన పారాయణం చేస్తూ ఉండటం ఓ ఆచారంగా వస్తోంది.

పరదేవత అయిన ఆ శ్రీమాత ప్రపంచాన్నంతటనీ పరిరక్షిస్తుంది. ఆమె నిత్యం
నివసించే గృహమే చింతామణి గృహం. అది మణిద్వీపంలో ఉంటుంది.
సర్వలోకోత్తమోత్తమైన ఆ మణిద్వీపాన్ని స్మరిస్తే చాలు సర్వపాపాలూ
నశిస్తాయని దేవీభాగవతం పన్నెండో స్కంధం వివరిస్తోంది. దుష్టశిక్షణ,
శిష్టరక్షణ చేస్తూ జగత్తునంతటినీ పాలించే ఈ భువనేశ్వరీ మాత నివసించే
చింతామణి గృహం వేయిస్తంభాల మండపాలతో విరాజిల్లుతుంటుంది. ఇలాంటి మండపాలు
నాలుగుంటాయి. శృంగార మండపం, ముక్తిమండపం, జ్ఞానమండపం, ఏకాంత మండపం అని
వాటికి పేర్లు. కోటి సూర్యప్రభలతో అవి నిత్యం ప్రకాశిస్తుంటాయి.
వాటిచుట్టూ కాశ్మీరం, మల్లికా, కుందవనాలు అలరారుతుంటాయి. ఆ వనాలలో
కస్తూరి మృగాలు సంచరిస్తూ పరిమళాలను ప్రసరింపజేస్తుంటాయి. అక్కడే
సుధారసపూర్ణంగా ఉండే ఒక పెద్దసరోవరం ఉంటుంది. ఆ సరోవరం అంచులు,
సోపానాలన్నీ అనేకానేక మణులు, రత్నాలతో పొదిగి ఉండి మనోహరంగా ఉంటాయి. ఆ
సరోవరం మధ్యలో ఓ మహాపద్మవనం, హంసల్లాంటి పక్షులు ఎంతో ముచ్చటగొలుపుతూ
ఉంటాయి. చింతామణి గృహంలో పదిమెట్లతో ఉన్న ఓ వేదిక ఉంటుంది. ఆ వేదికకు
ఉన్న పదిమెట్లూ పది శక్తిస్వరూపాలు. దానికి ఉండే నాలుగు కోళ్లపై ఉండే
ఫలకమే సదాశివుడు. ఆ ఫలకం మీద మాత భువనేశ్వరుడి వామాంకంలో కూర్చొని
ఉంటుంది. ఆ మాతకు రత్నాలు పొదిగిన వడ్డాణం, వైఢూర్యాలు తాపడం చేసిన
అంగదాలు అలరారుతుంటాయి. శ్రీచక్రరూపంలో ఉన్న తాటంకాలతో శ్రీమాత ముఖపద్మం
కళకళలాడుతుంటుంది. చంద్రరేఖను మించిన అందంతో ఉండే నొసలు, దొండపండ్లలా
ఉండే పెదవులు, కస్తూరి కుంకమ, తిలకం దిద్ది ఉన్న నుదురు, దివ్యమైన
చూడామణి, ఉదయభాస్కర బింబంలాంటి ముక్కుపుడక ఇలా ఎన్నెన్నో దివ్యాభరణాలు,
మైపూతతో శ్రీమాత అలరారుతుంటుంది. ఆ మాతకు పక్కభాగంలో శంఖ, పద్మ నిధులు
ఉంటాయి. వాటి నుంచి నవరత్న, కాంచన, సప్తధాతు వాహినులు అనే నదులు పరవళ్లు
తొక్కుతూ అమృత సంద్రంలోకి చేరుతుంటాయి. జగజ్జనని భువనేశ్వరుడి పక్కన
ఉన్నది కాబట్టే ఆయనకంతటి మహాభాగ్యం, శక్తియుక్తులు లభించాయని అంటారు. మాత
నివసించే చింతామణి గృహం వెయ్యి యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ గృహానికి
ఉత్తరంగా అనేకానేక శాలలు ఒకదానిని మించి మరొకటి ఉంటాయి. ఇవన్నీ ఆ అమ్మ
శక్తిప్రభావంతో అంతరిక్షంలో ఏ ఆధారమూ లేకుండా వేలాడుతుంటాయి. ప్రతి
బ్రహ్మాండంలోనూ ఉండే దేవ, నాగ, మనుష్య జాతులకు చెందిన దేవీ ఉపాసకులంతా
చేరేది ఈ చింతామణి గృహానికే. కరుణారస దృక్కులతో ఆమె తన బిడ్డల వంక చూస్తూ
ఉంటుంది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమన్వితంగా ఆ మాత కన్పిస్తుంటుంది.
ఆమె చుట్టూ లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ,
స్మృతి, లక్ష్మీ అనే దేవాంగనలు ఉంటారు. జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య,
విలాసిని, అఘోర, మంగళ, దోగ్ద్రి అనే తొమ్మిది పీఠాశక్తులు జగన్మాతను
నిరంతరం సేవిస్తూ ఉండటం కన్పిస్తుంది. కేవలం దేవి ఉపాసకులకేకాక
నిరంతరార్చన తత్పరులకు ఇక్కడే స్థానం దొరుకుతుంది. ఈ ప్రదేశంలో మరో గొప్ప
తనమేమిటంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, ద్రాక్ష, నేరేడు, మామిడి,
చెరకురసాల జీవనదులు ప్రవహిస్తుంటాయి. కోర్కెలను తీర్చే మహత్తర వృక్షాలు
ఇక్కడ ఎన్నెన్నో. ఈ ప్రాంతంలో ఉండేవారికి కామ క్రోధ లోభ మోహ మద
మాత్సర్యాలుండవు. అంతా నిత్యయౌవనంతో ఆనందంతో ప్రకాశిస్తుంటారు. వారంతా
భువనేశ్వరీ మాతను నిరంతరం భజిస్తూ ఉంటారు. దేవతలంతా ఇక్కడికి వచ్చి
అమ్మవారికి నిత్యం సేవలు చేస్తూ ఉంటారు. అమ్మ నివసించే మణిద్వీపమూ
అందులోని చింతామణి గృహమూ ఒక్కోసారి ఒక్కో విధంగా పవిత్రకాంతులను
వెదజల్లుతూ ఉంటాయి. ఐశ్వర్యానికీ, యోగానికీ అన్నిటికి అది పరమావధి.
జగత్తునంతటినీ తానై యుగయుగాలుగా పాలిస్తున్న ఆ జగన్మాత చిద్విలాసం
దేవీభాగవతంలో ఇలా కన్పిస్తుంది. తన భక్తులకు బాధ కలిగిందని
తెలిసినప్పుడల్లా తానే స్వయంగా ముందుకువచ్చి దుష్ట శిక్షణ చేస్తుండే ఆ
పరాంబిక ఎక్కడుంటుంది అని ఎవరికైనా కలిగే సందేహమే. ఆ సందేహానికి
సమాధానమిస్తూ మణిద్వీపంలో ఉండే చింతామణి గృహంలో ఉండే ఆ శ్రీమాత గురించి ఈ
కథా సందర్భం ఇలా వివరించి చెప్పింది. మణిద్వీప వర్ణన, చింతామణి
గృహవర్ణనలు వింటేనే సకల పాపాలూ నశిస్తాయని భక్తకోటి నమ్మకం.
- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు

మణిద్వీప వర్ణన.

1. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయింది

2.సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు
అచంచలంబగు మనో సుఖాలు మణిద్వీపానికి మహానిధులు

3.లక్షల లక్షల లావణ్యాలు అక్షరలక్షల వాక్ సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు

4. పారిజాత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలౌ
గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం

5. పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవున గలవు
మధురమధురమగు చందనసుధలు మణిద్వీపానికి మహానిధులు

6. అరువదినాలుగు కళామతల్లులు వరాలనొసగే పదారుశక్తులు
పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు

7. అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులూ దిక్పాలకులు
సృష్టికర్తలు సురలోకాలౌ మణిద్వీపానికి మహానిధులు

8. కోటి సూర్యులు ప్రపంచకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు
కోటితారకల వెలుగుజిలుగులు మణిద్వీపానికి మహానిధులు

9. కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు
ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు

10. పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు

11. ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు
పుష్యరాగ మణిప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు

12. సప్తకోటి ఘనమంత్రవిద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు
శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు ..భువ...

13. మిలమిలలాడే రత్నపు రాసులు తళతళలాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు

14. కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాలనొసగే అగ్నివాయువులు
భూమిగణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు

15. భక్తిజ్ఞానవైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు
సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు

16. కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహాలు
ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు

17. మంత్రిణి దండిణి శక్తిసేనలు కాళి కరాళి సేనాపతులు
ముప్పదిరెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు

18.సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు
గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు

19. సప్తసముద్రములనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు
నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు

20.మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు
సృష్టిస్థితిలయా కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు

21.కోటి ప్రకృతుల సౌందర్యాలు సకలవేదములు ఉపనిషత్తులు
పదారురేకల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు

22. దివ్యఫలముల దివ్యాస్త్రములు దివ్యపురుషులు ధీరమాతలు
దివ్యజగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు

23. శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంతభవనములు
మణినిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు

24. పంచభూతములు యాజమాన్యాలు వ్యాళసాలం అనేకశక్తులు
సంతాన వృక్షసముదాయాలు మణిద్వీపానికి మహానిధులు

25. చింతామణులు నవరాత్రులు నూరామడల వజ్రరాసులు
వసంత వనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు

26. దుఃఖము తెలియని దేవీసేవలు నటనాట్యాలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్ధాలు మణిద్వీపానికి మహానిధులు

27. పదునాల్గు , లోకాలన్నిటిపైనా సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వత స్థానం

28. చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచముపైన
మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో

29.మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో

30. పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో
అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది....2...

31. నూతనగృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిదిసార్లు
చదివిన చాలు అంతా శుభమే అష్టసంపదల తులతూగేరు ....2...

32. శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోట
తిష్టవేసుకొని కూర్చొనునంటా కోటి శుభాలను సమకూర్చుకొనుటకై
దేవదేవల నివాసము అదియే కైవల్యం...భు.....

మంగళహారతి

శ్రీ త్రిపురసుందరికి మణిద్వీపవాసినికి !
మంగళమ్ జయమంగళమ్ నిత్య శుభమంగళమ్ !!
ఓంకార రూపిణికి హ్రీంకార వాసినికి శ్రీం ,బీజవాహినికి
మంగళమ్ జయమంగళమ్ నిత్య శుభమంగళమ్ !!
ఆపదలు బాపేటి సంపదలనొసగేటి శ్రీనగరవాసినికి !
మంగళమ్ జయమంగళమ్ నిత్య శుభమంగళమ్ !!
వేదాలు నాదాలు శిరసొంచి మొక్కేటి శ్రీ రత్నసింహాసినికి !
మంగళమ్ జయమంగళమ్ నిత్య శుభమంగళమ్ !!
................

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list