MohanPublications Print Books Online store clik Here Devullu.com

గురువాయూర్‌ ఆలయం-Guruvayur temple


మహిమాన్వితం.. మనోహర
గురువాయూర్‌ ఆలయం
ప్రకృతి అందాలకు, ఆయుర్వేద పంచకర్మ చికిత్సకు, అనేకమైన అపురూపమైన ఆలయాలకు నెలవు కేరళ. అటువంటి కేరళలో స్వర్గ మర్త్య పాతాళలోకాలూ కలసిన భూలోక వైకుంఠం గురువాయూర్‌. అసలు ఈ పేరు వినగానే శంఖచక్ర గదా పద్మాలతో కూడి, విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడి దివ్యమంగళ స్వరూపం కనుల ముందు కదలాడుతుంది. దేవతల గురువైన బృహస్పతి అంటే గురువు, వాయుదేవుడు కలిసి పరశురాముడి సాయంతో సముద్రగర్భంలోకి చేరకుండా కాపాడిన శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించిన దివ్యస్థలి ఇది. అంతకుముందు వరకు రుద్రతీర్థం అనే పేరుతో విలసిల్లిన ఈ క్షేత్రానికి వారి పేరు మీదుగానే గురువాయూరు అనే పేరొచ్చింది.
ఆలయంలోకి అడుగుపెట్టగానే ఒక చేత శంఖం మరో చేత చక్రం మరో రెండు చేతులలోనూ గదాపద్మాలను, మెడలో తులసి మాలను ధరించిన స్వామి విగ్రహం చూడటానికి రెండు కన్నులూ చాలవేమో అన్నంత నయన మనోహరంగా ఉంటుంది. మీ మనసులోని భావాలన్నీ నాకు తెలుసు, మీరు కోరకుండానే నేనే తీరుస్తానుగా మీ కోర్కెలను అన్నట్లు చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఆ సుందర స్వరూపాన్ని చూడగానే పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి.
అన్నట్లు ఐదువేల సంవత్సరాల చరిత్ర గల ఈ విగ్రహం తక్కిన అన్ని విగ్రహాలలాగా రాతితో లేదా పంచలోహాలతో తయారైనది కాదు. పాతాళాంజనమనే విశిష్టమైన వనమూలికలతో రూపొందించినది. ఇక్కడ పరిణయమాడితే జీవితమంతా పరిమళభరితమే అనే విశ్వాసంతో భక్తులు ఎంతో వ్యయప్రయాసలకోర్చి మరీ ఈ ఆలయ ప్రాంగణంలో పెళ్లి చేసుకోవడానికి ఉవ్విళ్లూరతారు. నామకరణాలు, అన్నప్రాశనలు, అక్షరాభ్యాసాలు, ఉపనయనాల వంటి శుభకార్యాలన్నీ ఇక్కడ నిత్యం జరుగుతూనే ఉంటాయి.
ఆపదలు, గండాలు, దీర్ఘవ్యాధులు తొలగాలని స్వామికి మొక్కుకుని, ఆయా ఆపదలన్నీ హారతి కర్పూరంలా కరిగిపోగానే తమ బరువుకు సరిపడా బంగారం, వెండి, రూపాయి కాసులు, ఆకుకూరలు, కూరగాయలు, వెన్న, పటికబెల్లం... ఇలా ఒకటేమిటి, తమ స్తోమతకు తగ్గట్టుగా తులాభారం తూగుతూ కనిపిస్తారు. కొందరు భక్తులు స్వామివారికి అమూల్యమైన ఆభరణాలనూ సమర్పిస్తుంటారు. ఆయా ఆభరణాలను భద్రపరచేందుకు ఒక ప్రత్యేకమైన గది ఉంది. ఆ గదిని అనునిత్యం అంటిపెట్టుకుని పంచనాగులనే పేరుగల ఐదుసర్పాలు సంరక్షిస్తుంటాయి.
సంగీత, నృత్య కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆలయానికి చేరువలో రుద్రతీర్థమనే పేరుగల పెద్ద కోనేరు ఉంది. స్వామికి ఈ కోనేటి నీటితోనే నిత్యం అభిషేకం చేస్తారు అర్చకులు. ఏకాదశి, రోహిణీ నక్షత్ర వేడుకలు ఇక్కడ విశేషంగా జరుగుతుంటాయి. ఏనుగులకు ఈ ఆలయంలో ఎంతో ప్రత్యేకత, గౌరవాభిమానాలూ దక్కుతాయి. ఏనుగు పందేలు కూడా జరుగుతాయి. అవి అల్లాటప్పాగా కాదు.. ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉల్లాసోత్సాహాలతో నిర్వహిస్తారు. ఇది చాలా మహిమాన్విత క్షేత్రం కాబట్టి ఆలయంలో మడీ తడీ శుచీ శుభ్రతలకు ప్రాముఖ్యతనిస్తారు.
చుట్టుపక్కల చూడదగ్గ స్థలాలు: మమ్మియూర్‌ మహాదేవ క్షేత్రం, ఎలిఫెంట్‌ క్యాంప్‌ శాంక్చువరీ, పున్నతూర్‌ కొట్ట, పార్థసారథి ఆలయం, వెంకటాచలపతి ఆలయం, చోవళూర్‌ శివాలయం, పళయూర్‌ చర్చ్, గురువాయూర్‌ దేవస్థాన దారుశిల్ప కళాసంస్థ, నవముకుందాలయం, చాముండేశ్వరి ఆలయం, హరికన్యక ఆలయం, నారాయణంకులాంగర ఆలయం మొదలైనవి.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list