MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆర్థిక స్వేచ్ఛకుసూత్రాలివీ!-Ardhika Swechaku Sutralu Siri


ఆర్థిక స్వేచ్ఛకుసూత్రాలివీ!
సవాళ్లను ఎదుర్కొంటూ.. కొత్త బాధ్యతలను తీసుకోవడంలో మహిళలు ఎప్పుడూ ముందే ఉంటారు. పోటీ ప్రపంచంలో అటు వృత్తిపరంగానూ, ఇటు వ్యక్తిగతంగానూ తమదైన ముద్ర వేస్తారు. అయితే, ఆర్థిక స్వేచ్ఛ దిశగా అడుగులు వేసే విషయంలో మాత్రం కొన్ని కనిపించని ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. మరి, దీన్ని అధిగమించడం ఎలా? అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని తట్టుకునేందుకు ఎలా సిద్ధం అవ్వాలి? ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది!
సంపాదించే వ్యక్తికే ఆర్థిక ప్రణాళిక ఉండాలన్నది ఒకప్పటి మాట. ప్రతి వ్యక్తికీ.. ముఖ్యంగా మహిళలు తమకంటూ సొంత ఆర్థిక ప్రణాళిక వేసుకోవాల్సిన అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉంది. ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో గతంలోలాగా సంప్రదాయ పొదుపు పథకాలపైనే ఆధారపడితే కుదరని రోజులివి. అందుకే, ఆధునిక మహిళ.. బీమా పాలసీల నుంచి క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేసే వరకూ కొత్తగా ఆలోచించాలి.
ఆర్థిక ప్రణాళికలు: మహిళలు చాలామంది సరైన ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలనే విషయాన్ని విస్మరిస్తుంటారు. ఆర్జిస్తున్న వారైనా.. ఇంటిని చక్కదిద్దుతున్న గృహిణులైనా.. ముందుగా తమకంటూ ఒక ఆర్థిక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ముఖ్యంగా ఒంటరిగా ఉండే మహిళల విషయంలో ఇది తప్పనిసరి. మీకు ఆర్థికంగా ఏమేమి కావాలో తెలుసుకోవాలి. పిల్లల చదువులు, పదవీ విరమణ ప్రణాళిక.. భవిష్యత్తులో అనుకోని సంఘటనలతో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు.. ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఉమ్మడి ఆర్థిక ప్రణాళిక వేరు, సొంతంగా ప్రణాళిక వేరు అనేది గుర్తు పెట్టుకోండి. ధరల పెరుగుదలకు కారణమయ్యే ద్రవ్యోల్బణాన్ని విస్మరించకండి. పిల్లల చదువుల గురించి మీరు పెట్టుబడి పెట్టాలనుకున్నారనుకోండి.. ఇప్పటి ఖర్చుతోపాటు.. భవిష్యత్తులో అయ్యే ఖర్చును కూడా లెక్కలోకి తీసుకోండి. ఉదాహరణకు ఇప్పుడు రూ.4లక్షలతో పూర్తయ్యే డిగ్రీకి.. పదేళ్ల తర్వాత రూ.20లక్షలు అవసరం కావచ్చు. ఈ లెక్కలన్నీ వేసుకొని, దాన్ని అందుకునేలా పెట్టుబడులు కొనసాగించాలి.
సొంత పరిశోధన: ఏదైనా పెట్టుబడి పథకాన్ని ఎంచుకునేప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదే. అయితే, సొంతంగా పరిశోధన చేయడం మాత్రం తప్పనిసరి. ప్రస్తుతం ఏ పథకం గురించైనా అనంతమైన సమాచారం ఇంటర్నెట్‌, పుస్తకాలు, పత్రికల ద్వారా అందుబాటులో ఉంటోంది. ఈ సమాచారాన్ని ఉపయోగించుకొని, ఒక పథకం మంచి చెడులను సులభంగా విశ్లేషించుకోవచ్చు. ఉదాహరణకు మీరు మీ కుటుంబం కోసం ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్నారనుకోండి.. అంతర్జాలంలో ఉండే ఎన్నో వెబ్‌సైట్లు పాలసీలను పోల్చుకునేందుకు సహాయం చేస్తాయి. వీటి సాయంతో మీరు సొంతంగా ఒక నిర్ణయం తీసుకొని మంచి పాలసీని ఎంపిక చేసుకోవచ్చు. అవసరమైతే మీ నిర్ణయాన్ని సమీక్షించుకునేందుకు వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవచ్చు.
పెట్టుబడి ప్రణాళిక: అందరి ఆర్థిక పరిస్థితి ఒకేలా ఉండదు. కాబట్టి, ఆర్థిక ప్రణాళికల విషయంలోనూ అన్నీ ఒకేలా చూడటం సాధ్యం కాదు. ఒకరికి నప్పేవి.. మరొకరికి సరిపోకపోవచ్చు. కాబట్టి, ఎవరికి వారు సొంతంగా ప్రణాళిక వేసుకోవాలి. నష్టభయం భరించే శక్తి, ఆర్థిక లక్ష్యాలు, అవసరాలు ఇవే పెట్టుబడి పథకాలను నిర్ణయిస్తాయి. అందువల్ల అనుసరించడం కాకుండా.. ఆలోచించి, పరిశోధించి పెట్టుబడి పథకాలను నిర్ణయించుకోవాలి.
వ్యవధి: ఒక పెట్టుబడి పథకాన్ని ఎంచుకోగానే.. దాని నుంచి రాబడులను ఆశించడం సరికాదు. ఏ పథకమైనా రాబడినివ్వాలంటే.. దానికి కొంత వ్యవధినివ్వాలి. దీర్ఘకాలిక పెట్టుబడి పథకం నుంచి స్వల్పకాలంలోనే ఫలితాలు ఆశించడం వల్ల ఫలితం ఉండదు. మార్కెట్లో బీమా పాలసీలు, మ్యూచువల్‌ ఫండ్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పీపీఎఫ్‌లాంటి అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటికీ విభిన్నమైన వ్యవధి ఉంటుంది. ఉదాహరణకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఇష్టం వచ్చినంత కాలానికి మదుపు చేసుకోవచ్చు. అదే.. జీవిత బీమా పాలసీ దీర్ఘకాలిక పథకం. ఒక వ్యక్తి జీవిత బీమా పాలసీ తీసుకుంటే దానినుంచి ఫలితాలు రావాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. కాబట్టి, మీ దగ్గర ఉన్న వ్యవధి ఆధారంగా దేన్ని ఎంపిక చేసుకోవాలన్నది నిర్ణయించుకోవాలి.
వైవిధ్యంగా: తెలివైన పెట్టుబడిదారులు ఎప్పుడూ.. వైవిధ్యమైన పెట్టుబడులను ఎంచుకోవడం ద్వారా సాధ్యమైనంత వరకూ నష్టభయాన్ని పరిమితం చేసుకుంటారు. అధిక నష్టభయం ఉన్న ఈక్విటీల్లో మదుపు చేసినప్పుడు కొంత మొత్తాన్ని తక్కువ నష్టభయం ఉండే బాండ్లలో పెట్టాలి. పెట్టుబడులు ఎప్పుడూ ఈక్విటీలు, డెట్‌, జీవిత బీమా, కమోడిటీలు, స్థిరాస్తి ఇలా వైవిధ్యంగా ఉండేలా చూసుకోవాలి. అదే సమయంలో పెట్టుబడులు మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలన్న నియమాన్ని మర్చిపోకూడదు. నష్టభయం భరించే శక్తీ ఇక్కడ ముఖ్యమే.
అనుకోని సంఘటనలు: ఆర్థిక, పెట్టుబడి ప్రణాళికలు వేసుకునేప్పుడు భవిష్యత్తు గురించి పూర్తిగా సిద్ధం కావాలి. ఇందులో అనుకోని దుర్ఘటనల సందర్భంలో ఏం చేయాలన్నదీ కీలకమే. దురదృష్టవశాత్తూ జీవిత భాగస్వామి దూరం కావచ్చు. విడాకులు తీసుకోవచ్చు. ఇలాంటివి జరిగితే ఆర్థికంగా తమ సొంత కాళ్ల మీద నిలబడాల్సిన సమయంలో.. ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలు, తల్లిదండ్రుల బాధ్యతను తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలంటే.. మీరు ముందునుంచీ ఉన్న మీ నిర్ణయాలు, పెట్టుబడులే మీకు రక్షణగా నిలుస్తాయి.
సమీక్షించుకోవాలి: ఒకసారి పెట్టుబడులు పెట్టిన తర్వాత వాటి నుంచి రాబడులు ఆశించడం సహజం. ప్రతి మదుపరీ .. తాను చేసిన పెట్టుబడులు ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు.. మీరు మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేశారనుకుందాం.. ఆ పథకం పనితీరు ఎలా ఉంది.. ఏయే షేర్లలో అది మదుపు చేస్తోంది? మిగతా పథకాలతో పోలిస్తే ఇది సరైన రాబడి అందిస్తోందా లేదా ఇలాంటివన్నీ సమీక్షించుకుంటూ ఉండాలి.
పత్రాలన్నీ సరిగా ఉన్నాయా?: పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను పోగొట్టడం, లేదా తప్పుగా పూర్తి చేయడంలాంటి వాటి వల్ల ఎంతోమంది తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోకుండా ఉన్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే.. పెట్టుబడులు పెట్టేప్పుడు సంబంధింత పత్రాల్లో సరైన సమాచారం ఇవ్వాలి. మీతోపాటు మరొక వ్యక్తికి కూడా మీ పెట్టుబడులకు సంబంధించిన విషయాలు తెలిసి ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
భవిష్యత్తుకు భరోసాగా: ఆర్జిస్తున్న ప్రతి వ్యక్తీ కుటుంబంలో కీలకమే. ఒక్కరి ఆదాయం ఆగిపోయినా ఆ కుటుంబానికి ఎంతోకొంత ఇబ్బంది తప్పదు. అప్పటి వరకూ ఉన్న జీవన శైలిలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ఆర్థికంగా ఆ కుటుంబానికి ఏ లోటూ రాకుండా చూసుకునేందుకు తగిన మొత్తానికి జీవిత బీమా పాలసీలు తీసుకొని ఉండటం ఎప్పుడూ అవసరం. బీమా సంస్థల వెబ్‌సైట్లలోనూ, ఇతర సైట్లలోనూ మీకు ఎంత బీమా పాలసీ అవసరం అనేది గణించేందుకు వీలుంటుంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోవడం ఎప్పుడూ ఆచరణీయం. పదవీ విరమణ తర్వాత పింఛను వచ్చేలా ఒక పెన్షన్‌ పాలసీని ఎంచుకోవడమూ అవసరమే.
ప్రణాళిక, ఆచరణ: ఉద్యోగంలో చేరిన వెంటనే.. అంటే సంపాదన ప్రారంభం కాగానే ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి. దాన్ని ఆచరించాలి. చిన్న వయసులో ఉన్నప్పుడే, దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు పెట్టాలి. వాయిదా వేయడం వల్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి పెట్టాల్సిన పెట్టుబడి మొత్తం పెరుగుతుంది. అంతిమంగా ఇది భారమే. ఇంకా కొన్నాళ్లు ఆగితే.. పెట్టుబడి పెట్టడం ఇష్టం కాకుండా.. కష్టంగా మారే ఆస్కారం ఉంది.
- అంజలి మల్హోత్రా
చీఫ్‌ కస్టమర్‌, మార్కెటింగ్‌ ఆఫీసర్‌, అవీవీ ఇండియా
నష్టభయం భరిస్తేనే..అధిక రాబడి!
* నేను మూడేళ్ల నుంచి నెలకు రూ.6వేలు రికరింగ్‌ డిపాజిట్‌ చేస్తున్నాను. దీనిలో పెద్దగా వడ్డీ రావడం లేదు. మిగతా చోట మదుపు చేద్దామంటే, నష్టం వస్తుందని భయపడుతున్నాను. కాస్త అధిక రాబడి వస్తూ, తక్కువ నష్టభయం ఉండేలా ప్రత్యామ్నాయ పథకాలేమైనా ఉన్నాయా? - బాలకృష్ణ 
* అధిక రాబడి రావాలంటే.. కాస్త నష్టభయం భరించక తప్పదు. దీనికోసం ఈక్విటీ ఆధారిత పెట్టుబడులను ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు పెట్టుబడి కోసం బ్యాలెన్స్‌డ్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. ఇందులో దీర్ఘకాలంలో 11-12% వరకూ రాబడిని ఆశించవచ్చు. బిర్లా సన్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌డ్‌ 95 ఫండ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బ్యాలెన్స్‌డ్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు.
* నేను 6ఏళ్ల క్రితం రూ.15లక్షల టర్మ్‌ పాలసీ తీసుకున్నాను. దీనికోసం ఏడాదికి రూ.9,600 వరకూ చెల్లిస్తున్నాను. ప్రస్తుతం ఈ ప్రీమియానికే అధిక మొత్తానికి టర్మ్‌ పాలసీలు లభిస్తున్నాయి. పాతదాన్ని రద్దు చేసుకొని, కొత్తది తీసుకోవడం మంచి ఆలోచనేనా? పాతదాన్ని అలాగే కొనసాగించాలా? - సురేశ్‌ 
* గతంతో పోలిస్తే.. ఇప్పుడు టర్మ్‌ పాలసీల ప్రీమియం ధరలు తగ్గాయనే చెప్పాలి. ఇప్పుడు ఆన్‌లైన్‌ టర్మ్‌ పాలసీ తీసుకుంటే.. మీరు చెల్లించే ప్రీమియానికి దాదాపు రూ.40లక్షలు-రూ.50లక్షల వరకూ టర్మ్‌ బీమా వస్తుంది. పాలసీకి దరఖాస్తు చేసేప్పుడు ఆహార, ఆరోగ్య, ఆర్థిక వివరాలన్నీ ఎలాంటి దాపరికం లేకుండా చెప్పండి. అవసరమైతే ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు కూడా సిద్ధంగా ఉండండి. మీ వార్షికాదాయానికి కనీసం 10 రెట్లకు మించి పాలసీ ఉండేలా చూసుకోండి. కొత్త పాలసీని తీసుకున్న తర్వాతే పాత పాలసీని నిలిపి వేయండి.
* మా పాప వయసు 8ఏళ్లు. తన పేరుమీద సుకన్య సమృద్ధిలో నెలకు రూ.3వేలు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాం. దీనికన్నా పీపీఎఫ్‌ మంచిదని అంటున్నారు. ఈ రెండింటిలో ఏ పథకాన్ని ఎంచుకోవాలి? - రవీందర్‌ 
* ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజనలో 8.3శాతం రాబడి లభిస్తోంది. ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)లో 7.8శాతం రాబడి వస్తోంది. ఈ రెండు పథకాలపై వచ్చే వడ్డీకి ఎలాంటి పన్ను ఉండదు. ఇవి రెండూ కూడా దీర్ఘకాలిక పెట్టుబడి పథకాలే. సుకన్య సమృద్ధిలో అధిక వడ్డీ లభిస్తోంది. పైగా ఇది ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారు. కాబట్టి, వడ్డీ రేట్లు అంత తొందరగా తగ్గించకపోవచ్చు. కాబట్టి, మీరు ఈ పథకాన్నే పరిశీలించవచ్చు.
* నా వయసు 54ఏళ్లు. ప్రస్తుతం ఎలాంటి బీమా పాలసీలు లేవు. 10ఏళ్ల వ్యవధితో ఒక యూనిట్‌ ఆధారిత పాలసీ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. ఇటీవల ఒక పాలసీ వ్యవధి తీరడంతో కొంత డబ్బు వచ్చింది. దీనితో ఏక ప్రీమియం పాలసీని తీసుకోవాలని సూచిస్తున్నారు? ఏది మంచిది? - మూర్తి 
* మీపై ఆర్థిక బాధ్యతలు ఎప్పటి వరకు ఉన్నాయో చూసుకోండి. ఆ వ్యవధి వరకూ జీవిత బీమా పాలసీని తీసుకోండి. యూనిట్‌ ఆధారిత బీమా పాలసీ తీసుకోవడం కన్నా.. టర్మ్‌ పాలసీ తీసుకునేందుకు ప్రయత్నించవచ్చు. యులిప్‌ కోసం కేటాయించే మొత్తంతో టర్మ్‌ పాలసీ తీసుకొని, తర్వాత మిగిలిన మొత్తాన్ని పెట్టుబడులకు మళ్లించండి. వ్యవధి పూర్తయిన పాలసీ ద్వారా వచ్చిన మొత్తాన్ని, మీ పదవీ విరమణ తర్వాత ఉపయోగపడేలా మదుపు చేయండి. ఆ డబ్బును క్రమానుగత బదిలీ విధానంలో ఏడాది పాటు బ్యాలెన్స్‌డ్‌ ఫండ్లకు కేటాయించండి. ఏక ప్రీమియం పాలసీని తీసుకోవడం కన్నా.. వార్షిక ప్రీమియం పాలసీలను తీసుకోవడమే ఉత్తమం.
* మేమిద్దరమూ ఉద్యోగులం. ఇద్దరికీ కలిపి ఉమ్మడిగా జీవిత బీమా పాలసీ తీసుకునే వెసులుబాటు ఉందా? లేక విడివిడిగా పాలసీలు తీసుకోవడమే మంచిదా? నా పేరుమీద నెలకు రూ.4వేలు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. ఏ పథకాన్ని ఎంచుకోవాలి? - స్రవంతి 
* మీరిద్దరూ కలిసి ఉమ్మడిగా జీవిత బీమా పాలసీ తీసుకునే వెసులుబాటు ఉంది. అయితే, ఉమ్మడి పాలసీలు తీసుకోవడం కన్నా.. ఎవరికి వారు విడివిడిగా పాలసీ తీసుకోవడమే ఉత్తమం. దీనివల్ల ఎప్పుడైనా.. ఎవరి బీమా పాలసీనైనా ఆపేయాలనుకున్నా.. దానికి ప్రీమియం చెల్లించడం మానేయవచ్చు. మీరు టర్మ్‌ పాలసీలను తీసుకోవడం మంచిది. దీర్ఘకాలిక పెట్టుబడి అంటే, 5ఏళ్ల కన్నా ఎక్కువ సమయం ఉన్నప్పుడు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌ చేయండి. ఇందులో కాస్త నష్టభయం ఉన్నప్పటికీ.. ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి వస్తుంది. ఏడాది దాటిన తర్వాత వచ్చే లాభాలపై ఎలాంటి పన్నూ వర్తించదు. ఫ్రాంక్లిన్‌ ఇండియా బ్లూ చిప్‌, మిరే అసెట్‌ ఇండియా ఆపర్చునిటీస్‌ ఫండ్లను పరిశీలించవచ్చు.

రిటర్నులు దాఖలు చేయండిలా! 
ఫారం 16 లేకున్నా...
ఆదాయపు పన్ను రిటర్నుల హడావుడి మొదలయ్యింది. ఉద్యోగులు ఫారం 16 తీసుకొని, ఆన్‌లైన్‌లో రిటర్నులు దాఖలు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. ఉద్యోగులందరికీ ఫారం 16 ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంటుంది. అరుదుగా కొన్నిసార్లు ఉద్యోగులకు ఈ పత్రం అందకపోవచ్చు. ఎక్కువగా ఉద్యోగాలు మారినప్పుడు ఇలాంటివి ఎదురవుతాయి. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి?
ఆదాయం ఎంత? అందులో నుంచి మీరు క్లెయిం చేసుకున్న మినహాయింపులేమిటి? మూలం వద్ద పన్ను ఎంత పన్ను విధించారు (టీడీఎస్‌)లాంటి వివరాలు ఫారం 16లో ఉంటాయి. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడంలో ఇది కీలకమైనదే. అయితే, ఇది లేనంత మాత్రాన రిటర్నులు సమర్పించడం సాధ్యం కాదా? అవుతుంది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే..
మొత్తం ఆదాయం ఎంత?: మీ నెలవారీ వేతన వివరాలను ఒక చోటకు తీసుకురండి. ఏప్రిల్‌ 2016 నుంచి మార్చి 2017 వరకూ మొత్తం ఆదాయం ఎంతో గణించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఈ మధ్యలో మీరు ఉద్యోగాలు మారితే.. ఆయా ఉద్యోగాలకు సంబంధించిన అన్ని వేతన ఖాతాలనూ పరిగణనలోనికి తీసుకోవాలి.
పన్ను ఎంత చెల్లించారు?: ఈ వివరాలు తెలుసుకోవడం ఎంతో సులువు. ఆదాయపు పన్ను శాఖ ఈ ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి (www.incometaxindiaefiling.gov.in) ఫారం 26ఏఎస్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇప్పటికీ మీరు ఈ వెబ్‌సైటులో నమోదు చేసుకోకపోతే.. వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయండి. మీ యాజమాన్యం ఎంత పన్ను వసూలు చేసి, ఆదాయపు పన్ను శాఖకు జమ చేసిందీ ఇందులో ఉంటుంది. మీ దగ్గర్నుంచి వసూలు చేసిన పన్నుకూ, ఫారం 26ఏఎస్‌లో చూపిన వివరాలకూ ఏమైనా తేడా ఉంటే మీ యాజమాన్యాన్ని సంప్రదించండి. వ్యత్యాసాలను సవరించాల్సిందిగా కోరండి.
అద్దెకు ఉంటున్నారా?: మీరు వాస్తవంగా అద్దె చెల్లించినప్పుడు దానికి మినహాయింపును పొందేందుకు అవకాశం ఉంటుంది. మీకు వాస్తవంగా ఎంత ఇంటి అద్దె భత్యం వస్తుందో, ఆ మేరకు మినహాయింపు పొందే వెసులుబాటు ఉంటుంది. కొన్నిసార్లు దీనికీ నిబంధనలు వర్తిస్తాయి. కాబట్టి, ఆన్‌లైన్‌లో లభించే కాలిక్యులేటర్లను ఉపయోగించుకొని, మీరు ఎంత మేరకు హెచ్‌ఆర్‌ఏను క్లెయిం చేసుకోవచ్చో తెలుసుకోవచ్చు.
మినహాయింపులు చూసుకోండి: పన్ను మినహాయింపు పొందేందుకు ఎన్నో పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్నాయి. మీరు పెట్టిన పెట్టుబడుల వివరాలన్నీ ఒక చోటకు తీసుకురండి. ఇందులో సెక్షన్‌ 80సీ కింద (జీవిత బీమా, ఈపీఎఫ్‌, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌లాంటి పెట్టుబడులు) రూ.1,50,000 వరకూ క్లెయిం చేసుకోవచ్చు. 80 డీ (మెడికల్‌ పాలసీలకు ప్రీమియం), 80ఈ (విద్యారుణంపై వడ్డీ) తదితర సెక్షన్ల కింద ప్రధాన మినహాయింపులు ఉంటాయి. ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌)ని లెక్కించేప్పుడు ఉద్యోగి వాటాను మాత్రమే తీసుకోవాలి. యాజమాన్యం జమ చేసేది పన్ను మినహాయింపు లెక్కలోకి తీసుకోకూడదు.
ఇతర ఆదాయాలు: ఉద్యోగంతోపాటు, ఇతర ఆదాయాలు ఉన్నప్పుడు వాటినీ మొత్తం ఆదాయ గణనలోకి తీసుకోవాలి. ఫిక్సెడ్‌ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ, ఆద్దెల ద్వారా ఆదాయంలాంటివన్నీ ఇందులోకి వస్తాయి.
అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటే: మొత్తం ఆదాయం గణించాక, మినహాయింపులు క్లెయిం చేసుకొన్న తర్వాత మీరు ఎంత పన్ను చెల్లించాలో ఒక అవగాహన వస్తుంది. మీరు పూర్తి పన్ను చెల్లించి ఉంటే, ఎలాంటి ఇబ్బందీ లేదు. ఒకవేళ మీరు అదనంగా కొంత పన్ను చెల్లించాల్సి ఉంటే.. ఈఫైలింగ్‌ వెబ్‌సైటు నుంచే పన్ను చెల్లించే వెసులుబాటు ఉంది. ఆ తర్వాత మీకు ఒక చలానా వస్తుంది.
రిటర్నులు దాఖలు చేయండి: అన్ని వివరాలూ ఒక చోటకు వచ్చాక.. రిటర్నులు దాఖలు చేయడానికి మీకు వర్తించే ఫారాన్ని ఎంచుకొని, వివరాలు పూర్తి చేయండి. అందులో మీరు సొంతంగా చెల్లించిన పన్ను వివరాలూ తెలియజేయండి. రిఫండు ఉన్నా, లేకపోయినా బ్యాంకు ఖాతా వివరాలు తెలియజేయడం తప్పనిసరి. బ్యాంకు ఆన్‌లైన్‌ ఖాతా ద్వారా రిటర్నులు ఈ- వెరిఫై చేయండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. మీ ఆధార్‌ సంఖ్యను పాన్‌తో అనుసంధానం చేయకపోతే రిటర్నులు దాఖలు చేయడం సాధ్యం కాదు.
- అర్చిత్‌ గుప్తా, ఫౌండర్‌, సీఈఓ, Cleartax




No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list