MohanPublications Print Books Online store clik Here Devullu.com

పాటించండి...ఇలా చేయొద్దు-GST Rules & Regulations


పాటించండి...ఇలా చేయొద్దు
నిన్నటి వరకు ఓ లెక్క.. నేటి నుంచి మరో లెక్క. పుంఖానుపుంఖాల పన్నుల యుగానికి చరమగీతం పాడేశాం. జీఎస్‌టీ శకంలోకి అడుగుపెట్టాం.ఇక నుంచి ఒకే దేశం.. ఒకే పన్ను.. ఒకే విపణి నిస్సందేహంగా ఇది వృద్ధి పథాన్ని మలుపు తిప్పే పరిణామమే. అయితే జీఎస్‌టీ విజయవంతమవ్వాలంటే ప్రభుత్వ కృషి ఒక్కటే సరిపోదు. పన్ను చెల్లింపుదార్లుగా వ్యాపారుల సహకారమూ ఉండాలి. ముందుగా ఏమి పాటించాలో ఏమి చేయకూడదో అవగాహన ఉండాలి అందుకే జీఎస్‌టీ తొలి ఉదయాన అవి ఏమిటో తెలుసుకుందాం.
పాటించాల్సినవి 
* వ్యాపార టర్నోవరు నిర్దిష్ట పరిమితైన రూ.20 లక్షలను మించితే జీఎస్‌టీ కింద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. లేకుంటే జరిమానా చెల్లించాల్సి వస్తుంది.
* నమోదు ప్రక్రియను టర్నోవరు రూ.20 లక్షలను మించిన రోజు నుంచి 30 రోజుల్లోపు పూర్తి చేయాలి. అలా చేస్తే ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను కూడా ముందుగా పొందే వీలుంటుంది.
* పన్ను పరిధిలోని వస్తువులు, సేవలు సరఫరా చేసినప్పుడు ‘పన్ను రశీదు’ను (ట్యాక్స్‌ ఇన్‌వాయిస్‌) ఇవ్వాలి. పన్ను మినహాయింపు ఉన్నవాటిని సరఫరా చేసినప్పుడు ‘బిల్లు’ ఇస్తే సరిపోతుంది.
* అధికంగా వసూలు చేసిన పన్నును తిరిగి ఇవ్వాల్సి వచ్చినప్పుడు, వస్తువులను తిరిగి ఇచ్చిన సందర్భంలోనూ ‘క్రెడిట్‌ నోట్‌’ ఇవ్వాల్సి ఉంటుంది.
* ఇన్‌వాయిస్‌లో ఉన్న పన్ను మొత్తం కంటే తక్కువ వసూలు చేసినప్పుడు ‘డెబిట్‌ నోట్‌’ జారీ చేయాలి.
* వస్తువులు లేదా సేవలకు ముందస్తు చెల్లింపు సమయంలో ‘రిసిప్ట్‌ వోచర్‌’ను, రివర్స్‌ ఛార్జీ కింద చేసే చెల్లింపులకు ‘పేమెంట్‌ వోచర్‌’ను ఇవ్వాల్సి ఉంటుంది.
* వస్తువులు లేదా సేవల సరఫరా జరగని పక్షంలో ముందుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేటప్పుడు ‘రీఫండ్‌ ఓచర్‌’ ఇవ్వాలి.
* రివర్స్‌ ఛార్జీ పడకుండా ఉండాలంటే ప్రతి సరఫరాదారు దగ్గర నుంచి తప్పక పన్ను రశీదును తీసుకోవాలి.
* ఎప్పటికప్పుడు పద్దు పుస్తకాలను సక్రమంగా నిర్వహించాలి. ప్రతి సరఫరాదారు, గ్రహీత దగ్గర నుంచి జీఎస్‌టీఐఎన్‌, పేరు, చిరునామాను తప్పక తీసుకోవాలి.
* ఎప్పుడైనా ఏమైనా సందేహాలు వచ్చినప్పుడు పన్ను సలహదార్లను సంప్రదించాలి.
* పన్ను రశీదులో సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ, ఐజీఎస్‌టీని పొందుపరిచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది వర్తిస్తుందో అదే విధించాలి.
* పద్దు పుస్తకాలు, రికార్డులు, దస్త్రాలను వార్షిక రిటర్న్‌ల గడువు తేదీ నుంచి 72 నెలల వరకు భద్రపరచాలి. ఉదాహరణకు 2017-18 పద్దు పుస్తకాలను 31-02-2024 వరకు జాగ్రత్తగా దాచాలి.
* పద్దు పుస్తకాలను సాధ్యమైనంత వరకు ఎలక్ట్రానిక్‌ రూపంలో భద్రపరచడం మంచిది. మధ్యమధ్యలో బ్యాక్‌ఆప్‌ తీసుకుంటూ ఉండాలి.
* వస్తువుల విలువ రూ.50,000 మించినప్పుడు ఇ-వే బిల్లును ఇవ్వాలి.
* నిర్దిష్ట గడువులోగా పన్ను రిటర్న్‌లను దాఖలు చేయాలి. లేకుంటే ఆలస్య రుసుము చెల్లించాల్సి వస్తుంది.
* రిటర్న్‌ల దాఖలు విషయంలో ఏమైనా సందేహాలున్నప్పుడు, ప్రభుత్వం నిర్దేశించిన ముందస్తు నిబంధనల(అడ్వాన్స్‌ రూలింగ్స్‌)కు అనుగుణంగా వెళితే సరిపోతుంది. ఇలా చేస్తే సమయం వృథా తగ్గుతుంది. జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి తప్పుతుంది.
* గడువులోపు రిటర్న్‌ల దాఖలు చేయడం, పన్ను చెల్లింపుల వల్ల జీఎస్‌టీ కాంప్లియన్స్‌ రేటింగ్‌ మెరుగవుతుంది. దీని వల్ల మరింత వ్యాపారాన్ని పొందేందుకు వీలుంటుంది.
ఇలా చేయొద్దు 
* జీఎస్‌టీ కింద నమోదు కాకుండా పన్నులను వసూలు చేయకూడదు. అలా చేస్తే అనధికారిక వసూళ్లుగా పరిగణిస్తారు.
* రశీదు ఇవ్వకుండా వస్తువులు, సేవలను సరఫరా చేయకూడదు.
* వస్తువులు, సేవలు సరఫరా చేయకుండా రశీదులు ఇవ్వకూడదు.
* వసూలు చేసిన పన్ను మొత్తాన్ని మూడు నెలల్లోగా ప్రభుత్వానికి చెల్లించకుండా ఉండకూడదు.
* వస్తువులు, సేవలు సరఫరా చేయకుండా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌కు దరఖాస్తు చేయకూడదు.
* తప్పుడు దస్త్రాలు, రికార్డులను సమర్పించకూడదు. అదే సమయంలో తప్పుడు సమాచారాన్ని కూడా ఇవ్వొద్దు.
* జీఎస్‌టీ నమోదుకు అర్హత ఉండి కూడా నమోదు చేసుకోకుండా ఉండకూడదు.
* పన్ను అధికారుల విధులకు అంతరాయం కలిగించకూడదు.
* జీఎస్‌టీ చట్టంలో నిర్దేశించిన డాక్యుమెంట్‌లు లేకుండా వస్తువుల రవాణా చేయకూడదు.
* పద్దు ప్తుసకాలను, ఇతర దస్త్రాలను సక్రమంగా నిర్వహించకుండా ఉండకూడదు.
* పన్ను అధికారులు అడిగినప్పుడు తప్పుడు దస్త్రాలను చూపకూడదు.
* సాక్ష్యాధారాలుగా ఉండే దస్త్రాలను మార్చడం కాని పాడు చేయడం కాని చేయకూడదు.
* చట్టం కింద జప్తు చేసిన వస్తువులను సరఫరా చేయకూడదు. జప్తు చేయటానికి ఉద్దేశించిన వస్తువుల విషయంలోనూ ఇది వర్తిస్తుంది.
* తప్పుడు పద్ధతిలో రీఫండ్‌లను పొందకూడదు.
* పోగొట్టుకున్న, చౌర్యమయిన, పాడైన, బహుమతులుగా ఇచ్చిన వస్తువుల వివరాలతో కూడిన దస్త్రాలను సక్రమంగా నిర్వహించాలి. లేకుంటే జరిమనా చెల్లించాల్సి వస్తుంది.
* జీఎస్‌టీ కింద నమోదు కాని వ్యాపారుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తే ఈ లావాదేవీలకు రివర్స్‌ ఛార్జీ వర్తిస్తుంది.
* రిటర్న్‌ల దాఖలును ఆలస్యం చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీ వినియోగదారులు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పొందే వీలుండదు.

రంగ రంగ వైభోగమైతే..! 
వస్తువులు సేవల పన్ను (జీఎస్‌టీ) అండతో భారత వృద్ధి రథం దూసుకెళ్లేందుకు సిద్ధమయ్యింది. సర్వ రంగాల పురోగమనమే ధ్యేయంగా ముందుకు సాగనుంది. అయితే ఏదేని కొత్త సంస్కరణ అమల్లోకి వచ్చినప్పుడు కొన్ని రంగాలపై సానుకూల ప్రభావాన్ని చూపించొచ్చు. మరికొన్నింటికి ప్రతికూలంగా నిలవొచ్చు. ఇంకొన్నింటిపై ఏ విధమైన ప్రభావం ఉండకపోవచ్చు. దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రతి సవాలును అధిగమిస్తూ ముందుకెళితేనే విజయం వరించేది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రధానంగా ప్రభావం పడే కొన్ని రంగాలపై విశ్లేషణ ఇలా.. 
ఎఫ్‌ఎమ్‌సీజీ 
జీఎస్‌టీ వల్ల ఎఫ్‌ఎమ్‌సీజీ రంగానికి స్వల్పకాలంలో కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ దీర్ఘకాలంలో ప్రయోజనం కలుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా సరఫరా వ్యవస్థ మెరుగుపడుతుండటం ఇందుకు దోహదం చేయొచ్చని భావిస్తున్నారు. అయితే తక్కువ పన్ను రేట్ల కారణంగా ప్రస్తుత త్రైమాసిక లాభాదాయలపై ప్రతికూల ప్రభావం పడొచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఎఫ్‌ఎమ్‌సీజీ విభాగంలోని 81 శాతం ఉత్పత్తులకు 18 శాతంగా పన్ను రేటును నిర్ణయించారు. మునుపున్న 22-24 శాతంతో పోలిస్తే ఇది తక్కువ. దీంతో పన్ను ప్రయోజనాన్ని వినియోగదారులకు కంపెనీలు తప్పక బదిలీ చేయాల్సి ఉంటుంది. మరోవైపు కంపెనీల వద్ద ప్రస్తుతమున్న నిల్వలపై ఎలాంటి పన్ను ప్రయోజనాలు లేవు. ఈ రెండింటి దృష్ట్యా కంపెనీల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడొచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ధరలు తగ్గడం వల్ల అమ్మకాలు పెరుగుతాయని, ఆదాయవృద్ధికి ఇది తోడ్పడుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. స్వల్పకాలంలో సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో ఆదాయాలు మెరుగవుతాయని కొన్ని కంపెనీల యాజమాన్యాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఎఫ్‌ఎమ్‌సీజీ విభాగంలోని మిగిలిన 19 శాతం ఉత్పత్తులకు (పెయింట్లు, డిటర్జెంట్లు, షాంపూలు, ఇతరత్రా ఖరీదైన వస్తువులు) 28 శాతం జీఎస్‌టీని ఖరారు చేశారు. మునుపటితో పోలిస్తే ఇది ఎక్కువ కనుక.. వీటితో సంబంధమున్న కంపెనీల వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కొన్ని కంపెనీల (హెచ్‌యూఎల్‌, గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌) ఉత్పత్తుల్లో కొన్ని అధిక పన్ను రేటు విభాగంలో ఉండగా.. మరికొన్నింటికి తక్కువ పన్ను రేటు వర్తిస్తుండటం గమనార్హం. ఈ తరహా కంపెనీలపై జీఎస్‌టీ రేట్లు ప్రభావం మిశ్రమంగా ఉండొచ్చని అంచనా. 
సేవలు 
తయారీ రంగంతో పోలిస్తే జీఎస్‌టీ వల్ల సేవా రంగంపై ఎక్కువ ప్రభావం పడనుంది. గతంలో అన్ని రకాల సేవలపై 15 శాతం పన్ను విధించేవారు. జీఎస్‌టీలో సేవలపై 5%, 12%, 18%, 28% చొప్పున పన్ను రేట్లను ఖరారు చేశారు. టెలికాం, ఆర్థిక సేవలపై 18 శాతం చొప్పున పన్ను విధించనున్నారు. గతంతో పోలిస్తే 3 శాతం ఎక్కువ. ఈ ప్రకారంగా చూస్తే జీఎస్‌టీ అమలయ్యాక బ్యాంకింగ్‌, బీమా, టెలికాం సేవలు మరింత ప్రియమయ్యాయి. పన్ను భారం ప్రభావం పై మూడు రంగాలపై ఉంటుంది. మరోవైపు రవాణా సేవలపై జీఎస్‌టీని 5 శాతం విధించనున్నారు. ఇది విమానయాన సంస్థలకు కలిసొచ్చే పరిణామం. అంతక్రితం ఉన్న 15 శాతంతో పోలిస్తే పన్ను భారం గణనీయంగా తగ్గుతుండటమే ఇందుకు కారణం. సినిమా టిక్కెట్లపై జీఎస్‌టీని అత్యధిక స్లాబైన 28 శాతంగా నిర్ణయించారు. గతంలో సినిమా టికెట్లపై సేవా పన్నుతో పాటు వినోదపు పన్ను కింద 28 శాతం నుంచి 100 శాతం వరకు ఉండేది. ఇప్పుడు వీటన్నింటిని జీఎస్‌టీ కిందకు తీసుకొచ్చి 28 శాతం పన్ను వసూలు చేయనున్నారు. పైవ్‌ స్టార్‌ హోటళ్ల సేవలను కూడా 28 శాతం స్లాబ్‌లోకి చేర్చారు. 
పసిడి 
పసిడిపై జీఎస్‌టీ రేటును 3 శాతంగా నిర్ణయించారు. తయారీ ఛార్జీలపై పన్ను అదనం. మునుపు తయారీ ఛార్జీలపై పన్ను ఉండేది కాదు. ఈ రెండింటిని కలిపితే గతం కంటే పసిడి ఆభరణాలపై పన్ను భారం స్వల్పంగా పెరగనుంది. జీఎస్‌టీ అమల్లోకి రాకముందు పసిడి ఆభరణాలపై 1 శాతం ఎక్సైజ్‌, 1.2 శాతం వ్యాట్‌, కస్టమ్స్‌ డ్యూటీ 10 శాతం మొత్తం కలుపుకొని 12.4 శాతం వరకు పన్ను విధించేవారు. జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక మొత్తం పన్ను సుమారు 14 శాతం వరకు ఉండనుంది. ఈ ప్రకారం చూస్తే ఆభరణాల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ ధరల్లో పెరుగుదల స్వల్పమే కనుక అమ్మకాలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 
వాహన 
జీఎస్‌టీతో ప్రభావితమయ్యే ప్రధాన రంగాల్లో వాహన రంగం ఒకటి. మునుపు వాహనాలపై ఎక్సైజ్‌, వ్యాట్‌, విక్రయ పన్ను, రహదారి పన్ను, మోటార్‌ వాహన పన్ను.. ఇలా పలు రకాల పన్నులు విధించేవారు. జీఎస్‌టీ అమల్లోకి రావడంతో ఇక నుంచి ఒక్కటే పన్ను ఉండనుంది. అయితే దీనికి సెస్సు అదనం. వాహన రంగ ఉత్పత్తులకు జీఎస్‌టీ రేటును 28 శాతంగా నిర్ణయించారు. ఇదే కాకుండా మోడల్‌ను బట్టి 1, 3, 15 శాతం అదనంగా సెస్సును విధించనున్నారు. కార్ల విషయానికొస్తే.. చిన్న కార్లు (పెట్రోలు, డీజిలు), మధ్య తరహా కార్లు, విలాసవంత కార్లు, ఎస్‌యూవీలకు ఒక్కో విధంగా పన్ను ఉండనుంది. 1200 సీసీ లోపు చిన్న కార్లపై 1%, 1200సీసీ మించితే 3%, మధ్య, విలాసవంత కార్లపై 15% వరకు సెస్సుగా చెల్లించాల్సిరావచ్చు. ఈ ప్రకారంగా చూస్తే మునుపుతో పోలిస్తే విలాసవంత కార్లపై పన్ను భారం తగ్గే అవకాశం ఉంది. మధ్య తరహా కార్లు ప్రియం కావచ్చు. మోటార్‌ సైకిళ్లపై 28 శాతం జీఎస్‌టీ రేటును ఖరారు చేశారు. గతంతో పోలిస్తే ఇది తక్కువ. అయితే కొన్ని చోట్ల ప్రోత్సాహాకాలు, మినహాయింపులు ఉంటుండటంతో జీఎస్‌టీ అనంతరం ఆయా ప్రాంతాల్లో వివిధ మోడళ్ల ధరలు ఏ స్థాయిలో ఉండొచ్చనే విషయాన్ని ఇప్పటికిప్పుడు విశ్లేషించడం కొంచెం కష్టమే. మరోవైపు ప్రస్తుతమున్న నిల్వలను వదిలించుకునే యత్నాల్లో కంపెనీలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఆఫర్లను, రాయితీలను ప్రకటిస్తున్నాయి. ఈ పరిణామం ప్రస్తుత త్రైమాసికంలో వాహన తయారీదార్ల మార్జిన్లపై ప్రభావం చూపించొచ్చు. మొత్తం మీద ఈ రంగంపై జీఎస్‌టీ ఎంత మేర ప్రభావం చూపుతుందనే విషయంపై స్పష్టత రావాలంటే కనీసం ఒక త్రైమాసికం వరకైనా వేచిచూడాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎలక్ట్రానిక్స్‌ 
ఎలక్ట్రానిక్స్‌ పరికరాలపై 28 శాతం జీఎస్‌టీని ప్రతిపాదించారు. మునుపు అన్ని రకాల పన్నుల కలిపి 23 శాతం పన్ను విధిస్తున్నారు. తాజా జీఎస్‌టీ రేట్లను పరిగణనలోకి తీసుకుంటే టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీల ధరలు 2-5 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రభావం కంపెనీల అమ్మకాలపై ప్రభావం చూపించొచ్చు. మరోవైపు ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే పలు సంస్థలు నిల్వలను వదిలించుకునేందుకు ఆఫర్లను ప్రకటించాయి. దీంతో మార్జిన్లు తగ్గే అవకాశం ఉంది. మొత్తం మీద ఎలక్ట్రానిక్స్‌ పరికరాల రంగంపై జీఎస్‌టీ ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
ఉక్కు, సిమెంటు 
సిమెంటుకు జీఎస్‌టీనీ 28 శాతంగా నిర్ణయించారు. గతంలో సిమెంట్‌పై పరోక్ష పన్నుల కింద 24- 25 శాతం వరకు వసూలు చేసేవారు. అంటే అప్పటితో పోలిస్తే పన్ను భారం పెరగనుందన్న మాట. అయితే సిమెంటు ధరలపై ఈ ప్రభావం స్వల్పంగానే ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. బొగ్గుపై పన్ను రేటు తగ్గడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. బొగ్గుపై జీఎస్‌టీ రేటును 5 శాతానికి తగ్గించారు. గతంలో అన్ని కలుపుకొని 12 శాతం వరకు పన్ను విధించేవారు. పన్ను రేటు తగ్గడం బొగ్గు రంగ కంపెనీలకు సానుకూల పరిణామంగా చెప్పొచ్చు. అదే సమయంలో ముడి లోహంపై పన్ను రేట్లు తగ్గడం ఉక్కు ఉత్పత్తిదారులకు కలిసివస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list