MohanPublications Print Books Online store clik Here Devullu.com

గురు పౌర్ణమి - Guru Paurnami







జ్ఞానామృతం పంచే గురు పౌర్ణమి

వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు అందుకే ఆయన పేరిట వ్యాస పూర్ణిమ రోజున గురు పూర్ణిమగా పండుగను జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశమంతా గురు పూజా మహోత్సవాన్ని జరుపుకుంటారు. అసలు గురువు శబ్దానికి అర్థం; ఆచార్యుడంటే ఎవరు? వ్యాసుని కధ... గురుపూర్ణిమ చేసే విధానం తెలుసుకుందాం!

గురువు అంటే:

గురువు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకటై జన్మించిన రూపం అంటే సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపమే గురువు. గు అంటే అంధకారము లేదా అజ్ఞానాన్ని, రు అంటే నిరోధించుట లేక నశింప చేయుట అని అంటే గురువు అంటే అజ్ఞానాన్ని నశింప చే యువారు అని అర్ధము. గు శబ్దమంధకారస్యరుతన్నిరోధకః అని పెద్దల వచనం!గురువు చేయవలసినది తన శిష్యులను అంధకారంలోంచి వెలుగులోకి తీసుకు రావడం. ఈ భౌతిక జగత్తులో ఏ మానవుడూ సంసారయాతనలు అనుభవించకుండా చూడటం ఆ గురువు కర్తవ్యం.

వేదవ్యాసుని కథ:

వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువని తెలుసుకదా? శ్రీహరి అంశతో సత్యవతీ, పరాశరునికి జన్మించిన కృష్ణ దెై్వపాయనుడే వ్యాసుడు. ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై దృతరాష్టుని, అంబాలికకు పాండు రాజుని, అంబిక దాసికి విదురుని ప్రసాదించినాడు.పాండవాగ్రజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే! దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశసా్తల్రు పొందాడు.కురుపాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా మూడు సంశ్ర…మించి జయం అనే పేరు మీద వారి గాథలు గ్రంథస్థం చేసాడు వ్యాసుడు. ఆ జయమే మహా భారతమైంది. అష్టాదశ పురాణాలు వ్రాసింది వ్యాసుడే! భాగవాతాన్ని రచించాడు.

వేదాలను నాలుగు భాగాలుగా విభజించి దైలుడనే శిష్యునికి ఋగ్వేదాన్ని, వైశాంపాయనునికి యజుర్వే దాన్ని; జైమినికి సామవేదాన్ని; సుమంతునికి అధర్వణ వేదాన్ని తెలియజేసి వ్యాప్తి చేయించాడు. తాను వ్రాసిన పురాణాతిహాసాలు సుతునికి చెప్పి ప్రచారం చేయించాడు. పరమేశ్వరుని దయతో వ్యాసునికి పుత్రుడు జన్మించాడు. ఒక రోజు వ్యాసుడు తన ఆశ్రమంలో అరణి మధిస్తుండగా ఘృతాచి అనే అప్సరస కనబడింది. ఆమె అందానికి చలించిన వ్యాసుని వీర్యస్కలనం కాగా అందుండే శుకుడు జన్మించాడు. ఆ బాలునికి వ్యాసుడు దివ్యబోధలు చేసాడు. సృష్టి్ట క్రమం, యుగధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు తెలియజేసి జ్ఙానిగా మార్చాడు.

ప్రాచీన గాథలు, గత కల్పాలలో జరిగిన చరిత్రలు, సృష్టికి పూర్వం అనేక సృష్టులలో జరిగిన విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం మన పురాణాల్లో నిగూఢంగా నిక్షిప్తమయినాయి. ఎవరు వాటిని అర్ధం చేసుకోవాలన్నా, ఇతరులకి చెప్పాలన్నా అంతరార్ధాలతో బోధించాలన్న వ్యాస మహర్షి అనుగ్రహం అత్యవసరం. వ్యాస మహర్షి అంశ లేనిదే ఎవరూ పురాణ గాథల్ని చెప్పలేదు, చదవలేదు.అందుకే వ్యాసపూర్ణిమ నాడు వ్యాస పూజను తప్పక చేయాలంటారు. ఈ పర్వము యతులకు అతి ముఖ్యం! వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెబుతారు.

పూజా విధానం (వ్యాస పూజ / గురు పూజా విధానం)...

కొత్త అంగవస్త్రం మీద (భూమి మీద పరచి) బియ్యం పోస్తారు. ఆ బియ్యంపైన నిమ్మ కాయలు ఉంచు తారు. శంకరులు, అత ని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని నమ్మకం. పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకెళ్ళి పిడికిడు చొప్పున తమ ఇళ్లల్లో బియ్యంలో కలుపు తారుట. బియ్యం, కొత్త వస్త్రం లక్ష్మీ చిహ్నం. నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచన. బియ్యం, నిమ్మపళ్ళు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. దక్షిణాదిన కుంభ కోణంలో, శృంగేరీలో శంకర మఠాలలో వ్యాసపూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు.

ఎంతో మంది ఋషులున్నా వ్యాసుని పేరిటే ఎందుకు జరుగుతుంది అంటే, ఈ పూజలో ప్రత్యేక పూజలు పొందే ఆది శంకరులు వ్యాసుని అవతారమని అంటారు. సన్యాసులంతా ఆది శంకరుని తమ గురు వుగా ఎంచుకుంటారు. అయితే ఈ రోజున సన్యాసులంతా వ్యాసుని రూపంలో వున్న తమ గురువుని కొలుస్తున్నారన్న మాట!వైష్ణవ పురాణం దానం చేస్తే ఆషాఢ పూర్ణిమనాడు విష్ణులోకం పొందుతారుట. వ్యాసుడు సకల కళా నిధి, సకల శాస్త్రవేత్త, శస్త్ర చికిత్సవేది, మేధానిధి, వైద్యవరుడు, ఆత్మవిద్యానిధి, వైద్య విద్యానిధి.ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసుని తప్పక పూజించాలి.

వ్యాస పూర్ణిమ నాడు ఈ శ్లోకాన్ని పఠించాలి.

శో: శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం
సూత్ర భాష్యవృతా వందే భగవంతౌ పునః పునః
అని పఠిస్తే బ్రహ్మత్వసిద్ధి కలుగును!

ఆషాఢ పూర్ణిమ ప్రత్యేకతలు...

ఈ రోజు గురు పూర్ణిమతో పాటుగా కోకిలా వ్రతం, మహాషాఢి అని, వ్యాస పూజ, శివశయనోత్సవం, జితేంద్రరాయ జాతర. ఆ, కా, మా, వై పూర్ణిమలో మొదటిదైన ఆషాఢ పూర్ణిమ స్నానం... ఎన్నో వున్నాయి. కోకిలా వ్రతం విచిత్రంగా వుంటుంది, ఈనాడు సాయంకాలం నది స్నానం చేసి తెలకపిండితో కోకిల ప్రతిమ చేసి పూజ చేయాలి. నెల రోజులు పాటు అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరు చేసినా అందమైన భాగస్వామి దొరుకుతాడని అంటారు. కోకిల, తెలకపిండి ప్రధానంగా కావాలి. ఆషాఢంలో తెలకపిండి తీసుకోవాలి, కోకిల వలస వెళ్ళిపోతుంది. కోకిలాదేవి ద్రుపదుని భార్య.

కోకిలా వ్రతం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది

సద్గుణ సంపన్నురాలైన యువతి భార్యగా లభించడం కోసం యువకులు, తల్లిదండ్రులను మరిపించే ప్రేమానురాగాలను అందించే యువకుడిని భర్తగా పొందాలని యువతులు ఆశిస్తుంటారు. వాళ్ల కోరిక నెరవేరాలంటే 'కోకిలా వ్రతం' చేయాలని శాస్త్రం చెబుతోంది.

సాధారణంగా ఆడపిల్లలు తల్లిదండ్రుల దగ్గర కాస్త గారాబంగా పెరుగుతుంటారు. అంతటి అపురూపంగా పెంచుకున్న తమ కూతురికి ఎలాంటి భర్త లభిస్తాడోనని వాళ్లు ఆందోళన చెందుతుంటారు. ఆమెకి తగిన జోడీని వెతకడంలో తాము పొరపాటు పడకుండా చూడమని దైవాన్ని కోరుతుంటారు.

ఇక యువకుడి విషయానికి వచ్చేసరికి అతని గురించి కూడా తల్లిదండ్రులు అదే విధంగా ఆలోచిస్తూ వుంటారు. తమ తరువాత ఆ కుటుంబాన్ని చక్కదిద్దవలసిన బాధ్యత కోడలికే వుంటుంది కనుక, ఉత్తమురాలైన అమ్మాయి తమకి కోడలిగా లభించేలా చేయమని దేవుడిని ప్రార్ధిస్తుంటారు. ఎందుకంటే సరైన తోడు దొరక్కపోతే అది ఒక జీవితకాలపు శిక్షగా మిగిలిపోతుందని ఇరు కుటుంబాలవాళ్లు భావిస్తుంటారు.

మరి జీవితాన్ని అనూహ్యమైన మలుపుతిప్పే వివాహం విషయంలో అంతా మంచే జరగాలంటే ' కోకిలా వ్రతం' చేయాలని శాస్త్రం చెబుతోంది. 'ఆషాఢ శుద్ధ పౌర్ణమి' మొదలు తెలక పిండితో ప్రతిరోజు కోకిల ప్రతిమను తయారుచేస్తూ, నెలరోజులపాటు దానిని పూజించాలనేది ఈ వ్రతం చెబుతోంది. ఈ వ్రతానికి సంబంధించి వివరాలు తెలుసుకుని, నియమబద్ధంగా ఆచరించడం వలన ఆశించిన ప్రయోజనం లభిస్తుంది.














వందే గురు పరంపరామ్
గురువులకే గురువైన వ్యాసుడు వేదమయుడైన నారాయణుడని ప్రతీతి. మహాభారత, భాగవత ఇతిహాసాలకు, వైదిక పురాణ సాహిత్యాలకు ప్రాణం పోసిన మహారుషి. సద్గురు పరంపరకు ప్రతినిధి.. ఏ మతావలంబికులైనా హరిహరాది భేదాలకు అతీతంగా ‘అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామ్‌’ అని గురుపరంపరకు నమస్కరిస్తున్నారు. ఆయన జన్మ తిథి ఆషాఢ పౌర్ణమి గురువులు పూజలందుకునే శుభదినం. భారతీయ సంస్కృతిలో గురుస్థానం అనన్యసామాన్యం. తల్లితండ్రుల తరువాతి స్థానం ఆయనదే.

గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్‌ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
అని జ్ఞాన ప్రదాతయైున గురువును త్రిమూర్తి స్వరూపుడిగా, పరబ్రహ్మగా కీర్తించడం మన సంప్రదాయం.

ఎవరు గురువు?
‘గు’ అంటే అంధకారమని, ‘రు’ అంటే తొలగించేవాడని అర్థం. అంతఃకరణాల్లోని అజ్ఞానపు చీకట్లను పారదోలి, విజ్ఞాన దీపాలు వెలిగించి రుజుమార్గం చూపేవాడే గురువు. ఇక్కడ గురువంటే బడిలో పాఠాలు చెప్పేవారో, ఆలయ అర్చకులో, ప్రవచనకర్తలో కాదు. సిద్ధపురుషులనే గురువులు అని సంబోధిస్తారు. ‘గోవిందుడు, గురువుఏకకాలంలో సాక్షాత్కరిస్తే గురువుకే నమస్కరిస్తాను. గురువు ద్వారానే గోవిందుడిని తెలుసుకున్నాను’ అన్న కబీరు మాటలు గురుస్థానం ప్రాభవానికి పరమోదాహరణ.
ఆచార్యుడికీ, గురువుకు పెద్ద తేడా లేదు. అజ్ఞానాన్ని తొలగించేవాడు గురువైతే, శాస్త్రాధ్యయనంతో వాటిని ఆచరిస్తూ శిష్యులకు అందించేవాడు ఆచార్యుడు. మేఘం సముద్రంలోని ఉప్పు నీటిని పీల్చి మంచినీటిని వర్షిస్తుంది. ఆచార్యుడు కూడా వేదాది శాస్త్రాల్లోని క్లిష్ట అంశాలను అవగతం చేసుకుని అందరికీ అర్థమయ్యేలా సరళంగా వివరిస్తారు. అందుకు వ్యాస మహర్షి మహా నిదర్శనం.

వ్యాసాయ విష్ణు రూపాయ
త్రేతాయుగంలో ఇనకుల దీపకులైన రఘువంశీయుల గురువు వశిష్ఠుడు కాగా, ద్వాపరంలో కురువంశాంకురాలను సంరక్షించి ‘మహాభారతాన్ని’ నడిపిన వ్యాసుడు ఆయన మునిమనుమడు. వశిష్ఠుడు నాడు దశరథునితో పుత్రకామేష్ఠి చేయించి రఘువంశాన్ని నిలిపితే, ద్వాపరయుగంలో తన తపశ్శక్తితో కురువంశానికి వారసులు లేని లోటు తీర్చి చంద్రవంశానికి దిశానిర్దేశం చేశాడు వ్యాసుడు. వేదాలను విభజించడం వల్ల వేదవ్యాసుడుగా వినుతికెక్కారు. బదరీవనంలో తపస్సు చేయడంతో ‘బాదరాయణుడు’ అయ్యారు. యమునా నదీ ద్వీపంలో పుట్టడం వల్ల ‘ద్వైపాయనుడు’అనే విశేషణం పేరుకు ముందు చేరింది.

వేదాలను యుగాలకు అనుగుణంగా విభజించి, కలియుగానికి వేద ధర్మాలను అందించేందుకు అష్టాదశ పురాణాలు రచించారు. అపౌరుషేయాలు, అవిభాజ్యాలైన వేదాలను, తన తండ్రి పరాశరుని శాస్త్ర రచనలను సంకలనం చేశారు. నైమిశారణ్యంలో సూతునికి, తన శిష్యులైన శౌనకాది మహర్షులకు చర్చ పెట్టడం ద్వారా అష్టాదశ పురాణాలను ఆవిష్కరించారు.

కళ్ల ముందు జరిగిన సన్నివేశాలను ఇతిహాసంగా, పంచమవేదంగా ‘మహాభారతం’ అందించారు. ‘యదిహాస్తి తదన్యత్ర యన్నే హాస్తి న తత్క్వచిత్‌’- ‘భారతంలో లేనిది ఈ భూమిపై లేదు..భూమిపై ఉందంతా భారతంలో ఉంద’ని ప్రతిన పూని లక్ష పైచిలుకు శ్లోకాలను ఆశువుగా చెప్పారు. వినాయకుడు గంటం పట్టి రాయగా పంచమవేదాన్ని ఆవిష్కరించారు. అయినా వ్యాకులచిత్తులైన వ్యాసమహర్షిని గమనించిన నారదుడు ‘శ్రీ విష్ణుకథలు చెప్పకపోవడమే అందుకు కారణం’గా గ్రహించి, వాటి రచనకు సూచించారు. అదే అమూల్యకానుక ‘శ్రీమద్భాగవతం’. ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాది ఎన్ని మార్గాలు ఏర్పడినా ఆయా మతాచార్యులందరికి వ్యాస వాఙ్మయమే ప్రమాణంగా, ఆయన విరచిత ఇతిహాసాలు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలే ఆధారంగా చెబుతారు.

ఒకరు విష్ణువు.. మరొకరు శంకరుడు!
కలియుగం ప్రవేశించిన తరువాత కూడా వేదవ్యాసుని దర్శనం చేసుకున్న పరమపురుషులు ఎందరో ఉన్నారట. వారిలో ప్రథములు జగద్గురువు ఆది శంకరాచార్యులు. వారిద్దరూ ‘బ్రహ్మసూత్రాలపై శంకర భాష్యం’ గురించి చర్చించుకున్నట్లు ‘శంకర విజయం’ చెబుతోంది. వ్యాసుడు విష్ణువు కాగా, శంకరాచార్యుడు శంకరుడేనని ఆధ్యాత్మికవాదుల విశ్వాసం.

శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం!
సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః!!
ఒకరు సూత్రనిర్మాణానికి, మరొకరు భాష్య రచనకు మళ్లీమళ్లీ జన్మిస్తూ ఉంటారు.

బాసరలో భగవానుడు!
కాశీ క్షేత్రాన్ని అమితంగా ప్రేమించి, అపారమైన అనురాగంతో ‘విశ్వనాథాష్టకాన్ని రచించిన వ్యాసుడు అనుకోని రీతిలో ఆ క్షేత్రాన్ని వీడవలసి వచ్చింది. దరిమిలా తెలుగునాట బాసర, ద్రాక్షారామక్షేత్రాలను దర్శించారు. కాళేశ్వరం, సర్పవరం వంటి అనేక పుణ్యక్షేత్రాలతో ఆయనకు సంబంధం ఉందని అంటారు. బాసర క్షేత్రం వద్ద నిత్యం గోదావరిలో స్నానమాచరించిన తరువాత పిడికెడు ఇసుకను తెచ్చి సరస్వతీ అమ్మవారి విగ్రహం రూపొందించారట. ఆ మూర్తికే పూజాదికాలు నిర్వహించేవారట. నేటికీ పూజలందుకుంటున్న విగ్రహం అదేనని స్థల పురాణం.

అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః
అఫాలలోచనః శంభుః భగవాన్‌ బాదరాయణః
నాలుగు ముఖాలు లేని బ్రహ్మగా, రెండు చేతులున్న విష్ణువుగా, ఫాలనేత్రం లేని శివుడిగా త్రిమూర్త్యాత్మకమైన ప్రకాశంతో భగవత్స్వరూపంగా శిష్యులు ఆయనను కొలుస్తారు.

వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః
పౌత్రమకల్మషం!
పరాశరాత్మజం వందే శుకతాతం
తపోనిధిం!

‘సాధూనాం దర్శనం పుణ్యం-స్పర్శనం పాపనాశనమ్‌ సంభాషణం కోటి ఫలం-వందనం మోక్ష సాధనమ్‌’
అని ఆర్యోక్తి. సాధు దర్శనం పుణ్యప్రదమని. వారి స్పర్శతో పాపాలు నశిస్తాయని, వారితో సంభాషణతో కోటి జన్మల ఫలం సిద్ధిస్తుందని, వారికి నమస్కరిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని పెద్దల మాట. కానీ ప్రతి కాషాయధారీ సన్యాసి, సాధువు కాదని గ్రహించాలి. ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే సిద్ధగురువునే సాధువుగా చెబుతారు. అందుకే ‘గురు వేషభాష, ప్రపవర్తనలను ఆరు నెలల పాటు పరిశీలించిన మీదటనే వారితో సాంగత్యం ప్రారంభించాల’ని రామకృష్ణ పరమహంస సూచించారు. వ్యాసుడు సాక్షాత్‌ త్రిమూర్తి స్వరూపుడిగా పూజలందుకుంటున్నారు.
- డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి




No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list