MohanPublications Print Books Online store clik Here Devullu.com

గురుపౌర్ణమి రోజున వ్యాసుని ఎందుకు తల్చుకోవాలి! -Guru Pournami




గురు పౌర్ణమి

‘జ్ఞానం నడుస్తున్నప్పుడు ఎవరైనా చూశారా’ అని అడిగితే ‘నేను చూశాను’ అని బదులిస్తాడు శిష్యుడు. ‘ఆ రూపానికి పేరు పెట్టగలవా’ అంటే ‘ఆయన నా గురువు’ అని ఆనందంగా చెబుతాడు. గురువు ఎక్కడుంటాడు? ఆకాశానికి, భూమికి మధ్య వ్యాపించి ఉంటాడు. విశ్వానికి కథ, కల్పన, ఇతివృత్తం- అంతా ఆయనే. సర్వ రూపాలు, సకల శక్తులు ఆయనలోనే!

రాత్రి చీకటిగా ఉంటుంది. పౌర్ణమి రాత్రి- చీకటి ఉండదు. అంతటా చంద్రుడి వెలుగుతో నిండిపోతుంది. జ్ఞానానికి సంకేతం వెలుగు. చీకటి- అజ్ఞానానికి చిహ్నం. చంద్రుడు మనసుమీద ప్రభావం చూపుతాడు. ఆ మనసు తెలుసుకొని, దానికి అతీతమైన యోగసిద్ధి కలిగిస్తాడు గురువు. ఆ గురువు చంద్రుడు, ఆ వెన్నెల జ్ఞానం. ఆ గురు సన్నిధిలో శిష్యులకు సదా దివ్య పారవశ్యమే! అటువంటి గురువును పొందినవాడు ధన్యుడు.

‘గురువు లేకుంటే, ఎవరు చూపుతారు మార్గం’ అని ప్రశ్నిస్తాడు కబీర్‌. దేవుణ్ని చూసినవాడు, చూపించేవాడూ గురువే!
మానవ జీవితంలో ఓ దివ్యత్వం ప్రత్యక్షమవుతుంది. ఆ దివ్య స్వరూపం, అతడి సర్వస్వమూ గురువే! జీవితం అంతటా గురుదేవుడి ముద్రలే ఉంటాయి. అంతర్లీనంగా అన్నింటిలోనూ ఆయనే ఉంటాడు. సర్వం నుంచే గురుత్వం సదా సాక్షాత్కరిస్తుంది అంటారు ఓషో.

వ్యాసుడి జన్మ తిథిని ‘ఆషాఢ పౌర్ణమి’గా ప్రకటించింది ‘బ్రహ్మాండ పురాణం’. గురువులందరికీ ఆదిగురువు వేదవ్యాసుడు. వ్యాస పూర్ణిమే గురు పూర్ణిమ. గురుతత్వం, గురుభావం గురు పరంపరగా వ్యాసుడి నుంచే వస్తున్నాయి. ఆయన విష్ణుమూర్తి మానస పుత్రుడు. అంతటి వ్యాస భగవానుడి జన్మదినం ఆధ్యాత్మిక పర్వదినం. గురుభక్తులందరికీ గురుపూర్ణిమ ఓ పెద్ద పండుగ.

దత్తాత్రేయుణ్ని విశ్వానికి గురువుగా భావిస్తారు. విశ్వం మధ్యలో గురువు ఉంటారు. ఆయనలోనే విశ్వం ఉంటుంది. అవతార పురుషులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడంతటివారికే గురువులున్నారు. అందుకే గురు మహిమ వర్ణనకు అతీతం. ఆ శక్తి అత్యంత అద్భుతం.

‘ఎవరైనా సరే- నా గురుదేవుణ్ని (రామకృష్ణ పరమహంస) అర్చిస్తే సర్వోత్కృష్టులుగా మారతారు. ఆయన సాన్నిధ్యంలో వారు పరిపూర్ణత్వాన్ని సంతరించుకుంటారు. నా గురువు నోటి నుంచి ఎన్నడూ ఒక్కటైనా కటువైన మాట వెలువడలేదు. చెడును చూడటం, దాని గురించి కనీసం ఆలోచించడం ఆయనకు తెలియవు. ఆయనకు ఎప్పుడూ మంచే కనిపించేది’ అనేవారు స్వామి వివేకానంద.

‘గురువు కంటే అధికులెవరూ లేరు’ అన్నారు ఆదిశంకరులు. గురువును ఆయన స్తుతించారు. గురువునే ఆరాధించారు. గురువుపై అష్టకం రచించారు. గురుప్రేమ పొందారు. అపర శంకరులుగా కీర్తి గడించారు. లోక విఖ్యాతి చెందారు. ‘కొందరికి వేదాలు, శాస్త్రాలు, ఇతర విద్యలు అన్నీ నోట్లోనే ఉంటాయి. అనర్గళంగా ఉపన్యసిస్తారు. ఆశు కవిత్వం చెబుతారు. ఎన్నో బహుమతులు, బిరుదులు సాధిస్తారు. వారి మనసు ఏనాడూ గురుచరణాల మీద నిలవనప్పుడు, ప్రయోజనం ఏమిటి? అవన్నీ వ్యర్థమే’ అన్నారు ఆదిశంకరులు.

ప్రథమ గురువైన వ్యాసుడి ఆశీస్సును గురుపూర్ణిమ రోజున అందరూ పొందాలి. అందరి హృదయాల్లో జ్ఞాన చంద్రుడు ఉదయించాలి. భువన భవనమంతా జ్ఞానంతో వెలగాలి. ప్రశ్న ఎలా అడగాలో నేర్పిస్తాడు గురువు. జ్ఞానం అనేది ఓ సమాచార శకలం కాదు. అది బయటినుంచి లోపలకు అందదు. మనిషి అంతరంగం నుంచే జ్ఞానాన్ని వెలికి తీయాలి. తవ్వినకొద్దీ నీళ్లు వచ్చినట్లు, జ్ఞానం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. దానికోసం పాత్రను తెరిచి ఉంచడమే మనిషి చేయాల్సిన పని.

జ్ఞానజలం పొందాలంటే, మనిషి చేతి పాత్ర ఖాళీగా ఉండాలి. అప్పుడే పాత్రలో ఆ జలం నిండుతుంది. అతడికి ఉపకరిస్తుంది. అలాంటి ప్రాప్తి కలిగించేవాడే నిజమైన గురువు!
- ఆనందసాయి స్వామి



      గురుపౌర్ణమి రోజున వ్యాసుని ఎందుకు తల్చుకోవాలి! 

వ్యాసమహర్షి ఆషాఢపౌర్ణమి రోజున జన్మించాడు కాబట్టి, ఆ రోజుని వ్యాసపౌర్ణమిగా పేర్కొంటారు. కానీ ఆదే రోజుని గురుపౌర్ణమిగా ఎందుకు భావిస్తాం అంటే చాలా స్పష్టమైన కారణాలే కనిపిస్తాయి. వ్యాసుని అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. నలుపు రంగులో ఉన్నవాడు కాబట్టి కృష్ణ అనీ, ద్వీపం (ద్వైపాయనము) మీద జన్మించినవాడు కాబట్టి ద్వైపాయనుడు అనీ ఆ పేరు వచ్చిందంటారు. అప్పటివరకూ ఉన్న వేదాలన్నింటినీ ఒక చోటకు చేర్చి, వాటిని నాలుగు భాగాలుగా విభజించాడు కాబట్టి ఈ కృష్ణద్వైపాయనుడు ‘వేదవ్యాసుడు’గా మారాడు.
వేదవ్యాసుడు అనగానే మహాభారతం కూడా గుర్తుకు వస్తుంది. వ్యాసుడు మహాభారత రచయితే కాదు, అందులో ఒక ముఖ్య పాత్ర కూడా! ఇంకా చెప్పాలంటే వ్యాసుడు లేనిదే భారతం లేదు. వ్యాసుని కారణంగానే దృతరాష్ట్రుడు, పాండురాజు, విదురులు జన్మించారు. అంటే వ్యాసుడు లేకపోతే కౌరవపాండవులే ఉండేవారు కాదన్నమాట! పైగా వ్యాసుని తల్లి సత్యవతి, భీష్ముని తండ్రి అయిన శంతనుని వివాహం చేసుకుంటుంది. అంటే! భీష్ముని దగ్గర్నుంచీ భీముని వరకూ ప్రతి ఒక్కరూ వ్యాసునికి బంధువులే!
వ్యాసుడు భారతాన్నే కాదు, భాగవతం సహా అష్టాదశ పురాణాలనీ రాశాడనీ... యోగసూత్రాలకు భాష్యాన్ని అందించాడనీ అంటారు. ఇక బ్రహ్మసూత్రాలను రాసింది కూడా వ్యాసుడే అని చెబుతారు. అంటే హిందూ సంస్కృతికి మూలమైన శాస్త్రాలన్నింటికీ వ్యాసుడు మూల పురుషుడన్నమాట. అలాంటి వ్యాసుని గురుపరంపరకు ప్రతినిధిగా భావించి, ఆయన పుట్టినరోజుని గురువులను ఆరాధించే గురుపౌర్ణమిగా జరుపుకోవడంలో ఆశ్చర్యం ఏముంది!



         గురుపౌర్ణమి అన్న పేరు ఎలా వచ్చిందో తెలుసా!

ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమి వ్యాసుడు పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే! వ్యాసుడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడు కాబట్టి ఆ రోజున విష్ణుమూర్తినో, దత్తాత్రేయుడినో పూజించడంలో అర్థం ఉంది. కానీ ఆ రోజు గురువులని పూజించడం ఎందుకు అన్న అనుమానం రాక మానదు. అందుకు పెద్దలు చెప్పే కారణాలు ఏమిటంటే...
వ్యాసుడు వేదాలను విభజించి వేదవ్యాసుడు అయ్యాడు. వాటితో పాటు... భారతం, భాగవతం, బ్రహ్మసూత్రాలను కూడా లిఖించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే హిందూ ధర్మంలో కనిపించే చాలా శాస్త్రాల వెనుక వ్యాసుని కృషి కనిపిస్తుంది. ఇన్ని పనులూ ఒక్కరే చేయడం సాధ్యం కాదు కదా! అందుకే వ్యాసుడు అన్నది ఒక వ్యక్తి పేరు కాదనీ... అది ఓ బిరుదనీ అంటారు. జ్ఞానాన్ని రక్షించే ప్రయత్నం ఎవరు చేసినా, వారిని వ్యాసుడని పిలిచేవారట. బహుశా అందుకేనేమో... వ్యాసుని మరణం లేనివాడుగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. మరి జ్ఞానాన్ని రక్షించే గురువులు, సాక్షాత్తూ ఆ వ్యాసుని రూపాలే కదా! అందుకనే ప్రతి వ్యాసపౌర్ణమి రోజునా, మన కంటి ముందు కనిపించే గురువులను దైవస్వరూపాలుగా భావించి వారిని పూజిస్తూ ఉంటాము.
వ్యాసపౌర్ణమినాడు గురువులను పూజించేందుకు ఓ కథ కూడా పురాణాలలో కనిపిస్తుంది. పూర్వం వారణాసిలో ‘వేదనిధి’ అనే బ్రాహ్మణుడు ఉండేవాడట. అతని భార్య పేరు ‘వేదవతి’. ఆ దంపతలకు సంతానం లేదు. దాంతో వారు వేదవ్యాసుని ప్రసన్నం చేసుకొని, తమకు సంతానభాగ్యాన్ని ప్రసాదించమని కోరుకున్నారు. వేదనిధి భక్తికి మెచ్చిన వ్యాసులవారు, ఆ దంపతులకు త్వరలోనే సంతానం కలుగుతుందని ఆశీర్వదించారు. వ్యాసుల వారిని విడిచివెళ్తూ ‘మేము కోరుకున్నప్పుడ్లలా మిమ్మల్ని దర్శించుకునేది ఎలా?’ అని వ్యాసుని అడిగాడట వేదనిధి. ‘జ్ఞానాన్ని ఉపదేశించే ప్రతి వ్యక్తిలోనూ తాను ఉంటాననీ... అలాంటి గురువులను, తన జన్మదినమైన వ్యాసపౌర్ణమినాడు పూజిస్తే సకల శుభాలూ కలుగుతాయని’ వ్యాసులవారు చెప్పారట. అప్పటి నుంచి వ్యాసపౌర్ణమినాడు గురువులను ఆ వ్యాసభగవానుగా తలచి కొలుచుకునే ఆచారం వస్తోంది.
గురుశిష్య పరంపరకు సంబంధించి కూడా వ్యాసపౌర్ణమి నాడు చాలా ఘటనలు కనిపిస్తాయి. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత తన శిష్యులకు ధర్మాన్ని బోధించింది ఈ రోజునే! శివుడు, దక్షిణామూర్తిగా మారి సప్తర్షులకు ఉపదేశం చేసిందీ ఈ రోజునే! జైన మతాన్ని స్థాపించిన మహావీరుడు, తన ముఖ్యశిష్యుని ఎన్నుకొన్నది కూడా గురుపౌర్ణమి నాడే! చాతుర్మాసవ్రతంలో భాగంగా గురువులంతా తన శిష్యులకు అందుబాటులో ఉండే మొదటి పౌర్ణమి కూడా ఈనాడే! గురువులకు ఇంత ప్రాముఖ్యమైన రోజు కాబట్టే... నేపాల్లో ఈ రోజుని టీచర్స్ డేగా అధికారికంగా జరుపుకొంటారు.
వ్యాసపౌర్ణమిని గురుపౌర్ణమిగా భావించేందుకు ఇన్ని కారణాలు ఉన్నాయన్నమాట!


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list