ఆసన... ప్రక్షాళనం!
చెడును వదిలించుకుంటేనే మంచి ప్రకాశిస్తుంది. మలినాలను తొలగించుకుంటేనే మన ఆరోగ్యం వికసిస్తుంది. ఆయుర్వేదంలో దీనికి ఎన్నో మార్గాలున్నాయి. యోగాసనాలను మేళవిస్తూ చేసే క్రియలున్నాయి. వీటితో అనారోగ్యకారకాలను శరీరం నుంచి తరిమేయవచ్చు.శంఖ ప్రక్షాళన క్రియ ఇదే వారిసార క్రియ అని ఘెరండ సంహితలో ఉంది. పొట్టని, పెద్ద ప్రేగులను కడిగివేయడానికి అందులో ఉన్న మలిన పదార్థాలను, బ్లాకేజెస్‌ని తొలగించడానికి ఉద్దేశించిన క్రియ ఇది. అజీర్ణం, మలబద్ధకం, కడుపు నొప్పి సమస్యలు ఉన్నవాళ్లు, హైపర్ అసిడిటీతో బాధపడేవారికి ఇది చాలా ఉపయోగం. కిడ్నీలో రాళ్లు రాకుండా నివారించటానికి, యూరినరీ బ్లాడర్ సమస్యలను కూడా నివారిస్తుంది. జిఐ(గ్యాస్ట్రో ఇంటెస్టెయినల్) ట్రాక్ట్ శుభ్రపడుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ఈ క్రియను సెలవురోజు చేయాలి ∙ఈ క్రియకు ముందు రెండు రోజులు సలాడ్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే మంచిది ∙ఈ క్రియ తరువాత కనీసం 15 ని.లు యోగనిద్రలో విశ్రాంతి తీసుకోవాలి ∙ఈ క్రియ చేసిన తరువాత బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కేవలం కిచిడీనే తినాలి. (నెయ్యి కొంచెం ఎక్కువగా ఉపయోగించాలి)
చేసేవిధానం : మూడు లీటర్ల గోరువెచ్చటి నీటిలో 3 టీ స్పూన్ల ఎప్సమ్ సాల్ట్ వేసి, ముందుగా 4, 5 గ్లాసుల (ప్రతీ గ్లాస్ 300 ఎం.ఎల్) నీరు నిర్విరామంగా తాగాలి. తరువాత కింద చెప్పిన ఆసనాల సెట్‌ను ఒకటి లేదా రెండు సార్లు చేసి, మళ్ళీ 2,3 గ్లాసుల నీరు తాగి ఇంకొక రెండు రౌండ్లు చేయడం, ఈ మధ్యలో విరేచనానికి వెళ్లడం.. ఇలా ఈ క్రియను రిపీట్ చేస్తూ పోవాలి. చివరకు తాగిన నీరు యథాతథంగా మలద్వారం గుండా బయటకు వచ్చేస్తుంది. అందుకు ఈ ఆసనాలు ఉపకరిస్తాయి.
1.తాడాసన: సమస్థితిలో నిలబడి చేతులు రెండూ పైకి తీసుకెళ్లి ఇంటర్‌లాక్ చేసి శ్వాస తీసుకుంటూ కాళ్లు పైకి లేపుతూ ముందరి కాలి వేళ్ల మీద నిలబడుతూ శరీరాన్ని నడుము భాగం నుంచి పూర్తిగా పైకి సాగదీయాలి. శ్వాస వదులుతూ తిరిగి పాదాలు భూమి మీద పూర్తిగా ఆనించి చేతులు రెండూ ఇంటర్ లాక్ చేసిన స్థితిలోనే తల మీద పెట్టుకుని మళ్లీ శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్లాలి. ఇలా 10 సార్లు చేయాలి.
2. తిర్యక్ తాడాసన: శ్వాస తీసుకుంటూ చేతులను ఫొటోలో చూపినట్లు పైకి లాగుతూ శరీరాన్ని సాగదీస్తూ కుడివైపునకు శ్వాస వదులుతూ మధ్యలోకి మళ్లీ శ్వాస తీసుకుంటూ ఎడమవైపునకు చేయాలి. ఈ విధంగా కుడివైపు 10, ఎడమవైపు 10 సార్లు చేయాలి.
3. కటి చక్రాసన: ఇందులో ఐదారు రకాల ఆసనాలున్నాయి. కాని ఈ క్రియకు సంబంధించినంతవరకూ ఈ ఫొటోల్లో చూపిన కటి చక్రాసనం చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. కాళ్ళ మధ్య వీలైనంత దూరం ఉంచి, ముందుకు వంగి శ్వాసతీసుకుంటూ కుడి చెయ్యి ఎడమ పాదానికి దగ్గరగా ఎడమచెయ్యి పైకి, మళ్ళీ శ్వాస వదులుతూ ఎడమవైపుకు ఎడమ చెయ్యి పైకి మళ్ళీ శ్వాస వదులుతూ ఎడమ వైపుకు ఎడమచెయ్యి కుడి పాదానికి దగ్గరగా కుడి చేయిపైకి తీసుకువెళ్ళాలి. ఈ విధంగా కుడికి ఎడమకు 5సార్లు చొప్పున చేయాలి. అవసరమైతే మోకాళ్ళు ముందుకు కొంచెం వంచవచ్చు. సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్య ఉంటే చేతులు ఎంతవరకు తీసుకువెళ్లగల్గితే అంతవరకే తీసుకువెళ్లండి.
4. తిర్యక్ భుజంగాసన : బోర్లా పడుకొని చేతుల మీద కాలి వేళ్ల మీద ఛాతీని పొట్టను తొడలను మోకాళ్ళను పైకి లేపి శ్వాస తీసుకుంటూ తలను కుడివైపుకి తిప్పి కుడి భుజం మీద నుండి వెనుక ఉన్న పాదాలను చూడాలి. ఇదే విధంగా శ్వాస వదులుతూ తలను ఎడమవైపుకి తిప్పి ఎడమ భుజం మీద నుండి వెనుక ఉన్న పాదాలను చూసే ప్రయత్నం చేయాలి. ఇలా కుడి, ఎడమలకు 5సార్లు చేయాలి. మెకాలి సమస్యలు ఉన్నవాళ్ళు మోకాళ్లు తొడలు నేల మీద ఉంచవచ్చు. మోచేతులు కూడా అవసరమైతే కిందకు పెట్టుకోవచ్చు. కాని పొట్ట మీద ఒత్తిడి పడేటట్లు చూసుకోవాలి.
5. ఉదరాకర్షణాసన: గొంతుకు కూర్చొని శ్వాస తీసుకుంటూ కుడి మోకాలు నేల మీద ఎడమపాదం దగ్గరగా ఆనిస్తూ ఎడమవైపుకు తిరగాలి. శ్వాస వదులుతూ మధ్యలోకి వచ్చి మళ్ళీ శ్వాసతీసుకుంటూ వ్యతిరేక దిశలో చేయాలి. ఇలా 5 సార్లు చేయాలి.
– సమన్వయం: ఎస్. సత్యబాబు,
ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్
యోగా ఫౌండేషన్
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565