ఆలస్యం
అమృతం విషం!
పిల్లలకు చదువు పూర్తయి ఉద్యోగం రాగానే తల్లిదండ్రులు పెళ్లి సంబంధాల వేటలో పడతారు. కానీ వాళ్లు మాత్రం ‘నాపెళ్లికి ఇప్పుడేం తొందర?’, ‘ఇప్పుడే పెళ్లి వద్దు.. కెరీర్‌లో నిలదొక్కుకోవాలి’, ‘నేనింకా దాని గురించి ఆలోచించలేదు.. తరువాత చూద్దాం..’, ‘ఆర్థికంగా స్థిరపడిన తరువాత చేసుకుంటా..’ అంటూ ఏవేవో చెబుతూ దాటేస్తుంటారు. మరి కొంతమంది పెద్దలు చూసిన సంబంధమా? ప్రేమించి పెళ్లిచేసుకోవాలా? అన్న ఆలోచనలోనే పుణ్యకాలం వృథా చేస్తారు. ఇలాంటి అనేక కారణాలతో నేటియువత పెళ్లి చేసుకునే సగటు వయసు పెరిగిపోతోంది. దాదాపుగా అరవై శాతం యువతీ యువకులు కనీసం మూడుపదులు దాటాక ఇంకా చెప్పాలంటే ఆపైన ఇంకొన్నేళ్లకు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు.
దాంపత్య జీవితం ఆనందమయం కావడానికి పెళ్లి చేసుకునే అమ్మాయి, అబ్బాయిల మనసులే కాదు వయసు కూడా ముఖ్యం. శారీరక, మానసిక పరిణితి లేని దశలో పెళ్లిచేసుకోవడం ఎంత అనర్థదాయకమో వయసు మీద పడ్డాక పెళ్లి చేసుకోవడమూ అంతే! రెంటిలోనూ శారీరక, మానసిక సమస్యలు తప్పవు! ఇంతకీ పెళ్లికి సరైన వయసేది? మన కాలమాన పరిస్థితులను, పరిసరాలను అనుసరించి భారతదేశ ప్రభుత్వం మగవారి కనీస వివాహ వయసు 21గా, ఆడవారి కనీస వివాహ వయసు 18గా నిర్ధారించింది. అయితే ఇప్పటి యువత ఈ వయసులో పెళ్లిని ఒప్పుకోవడం లేదని, కెరీర్‌లో స్థిరపడని కారణంగా లేటు వయసులో పెళ్లాడుతున్నారని, ఫలితంగా రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయనీ కొంతమంది భారతదేశ శాస్త్రవేత్తలు, డాక్టర్లు వాపోతున్నారు. దానాదీనా అబ్బాయి వివాహ సగటు వయసు 26గా అమ్మాయి వయసు 22.2గా ఉంటే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. అప్పటికైతే అబ్బాయి చదువు పూర్తి చేసి కెరీర్‌ను మొదలుపెడతాడని, అమ్మాయైతే పెళ్లయిన ఏడాది తరువాత తల్లిగా మారడానికి మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉంటుందని వారు చెబుతున్నారు. ఏదేమైనా ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా పాతికేళ్లకల్లా పెళ్లయ్యేలా చూసుకుంటే మేలనేది అధికసంఖ్యాకుల మనోగతం.
అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ ఉటా పరిశోధకులు అక్కడి జంటల వైవాహిక జీవితంపై పరిశోధనలు జరిపి 28 నుంచి 32 సంవత్సరాల లోపు వివాహం చేసుకుంటే మేలని సూచిస్తున్నారు. ముప్ఫైలోపు పెళ్లిచేసుకున్నవాళ్ల మధ్య విబేధాలు వచ్చే అవకాశాలు తక్కువని, లేటు వయసులో పెళ్లిచేసుకున్నవారిలో విబేధాలు, ఈగో సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని గణాంక సహితంగా అక్కడి అధ్యయనకర్తలు పేర్కొన్నారు.
ఆలస్యపరిణయాలతో సమస్యలు ఎన్నో!
* ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల ఇంటిపనులు, ఆఫీసుపనులు సమతూకంగా చేయాల్సి రావడంతో శరీరం సహకరించక విపరీతమైన ఒత్తిడికి గురవుతారు.
* శృంగారంలో ఆసక్తి తగ్గిపోతుంది. పురుషులకు వయసుతో పాటు టెస్టోస్టీరాన్ స్థాయి తగ్గుతుంది. వీర్య కణాల సంఖ్య, సామర్థ్యం కూడా సన్నగిల్లుతుంది.
* ఆడవారిలో ఆరోగ్యకరమైన శిశువుల్ని కనే సామర్థ్యం తగ్గుతుంది. అండం విడుదల మందగిస్తుంది. రకరకాల గైనిక్ సమస్యలు తలెత్తుతాయి. అందుకే వైద్యులు ముప్ఫైఏళ్ల లోపే పిల్లల్ని కనమని సలహా ఇస్తుంటారు.
* యవ్వనంలో ఉన్న ఉత్సాహం, ఉద్రేకం, ఆసక్తి, ఆకర్షణ లేటువయసులో దెబ్బతింటాయి. నవదంపతుల మధ్య పెరగాల్సిన అవగాహన లోపిస్తుంది. కారణం ఎవరికివారు అహమనే శిఖరాలను అధిరోహించి ఉంటారు.
* వయసుపెరిగే కొద్దీ శారీరక వశ్యత (బాడీ ఫ్లెక్సిబిలిటీ)తగ్గిపోతుంది. అనేక సమస్యలకు దారితీస్తుంది. ఫలితంగా కుంగుబాటు ఎక్కువవుతుంది.
* ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల పిల్లలకోసం తొందర ఎక్కువవుతుంది. ఫలితంగా దంపతుల మీద ఒత్తిడి పెరిగిపోతుంది.
* తమ స్నేహితుల పిల్లలను చూసినప్పుడు తమకింకా పిల్లలు కలగలేదనే ఆత్మన్యూనత పెరిగిపోతుంది.
* లేటు వయస్సులో ఇతర విషయాలకంటే ఆర్థిక విషయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఫలితంగా భాగస్వామికి సమయం కేటాయించలేరు. దాంతో సంసారంలో వాగ్యుద్ధాలు మొదలవుతాయి. - ఉమామహేశ్వరి
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565