ఆచార్య అనిపించుకోవాలంటే?
సనాతన ధర్మంలో ఏదయినా మూడుసార్లు చెబితే సత్యం అని గుర్తు. అందుకే సత్యం సత్యం పునః సత్యం అంటారు. మంగళసూత్రం కడితే మూడుసార్లు, ఆచమనం, ప్రదక్షిణం అలా ఏదయినా మూడు సార్లు చేస్తారు. గౌరీపూజ దగ్గర ప్రవరచెప్పి ’నేను నా పిల్లను ఇస్తున్నాను’ అని మూడుసార్లు చెబుతారు మామగారు. అంతే తప్ప పిల్లవాడు ప్రేమించాడని కాదు, మామగారు ఒప్పుకుని ‘నేను ధర్మప్రజాపత్యం కోసం ఈ పిల్లను కోడలుగా స్వీకరిస్తున్నాను’ అని మూడుమార్లు అంటేనే ఆమె కోడలవుతుందని అంటుంది శాస్త్రం. కాబట్టి మూడు అంకె సత్యం. శివుడంతటివాడు చెప్పాడు–నగురోరధికం అని మూడుమార్లు.
అందరికన్నా అధికుడుయిన గురువు అనేకపేర్లతో పిలవబడతాడని ఆయన పార్వతితో చెప్పాడు. సూచకగురువు, వాచక గురువు, బోధకగురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు.. ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. చిన్నతనంలో పాఠం చెప్పినవాడు సూచకగురువు. మనం ఏదయినా ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడి నియమాలు ఎరుకపరిచేవాడు వాచక గురువు. మంత్రోపదేశం చేసినవాడు బోధక గురువు. ఈ ముగ్గురిలో మంత్రోపదేశం చేసినవాడు సర్వోన్నతుడు. శృంగేరీ పీఠాధిపతిలాంటివారు పరమగురువులు. అటువంటి వారు వచ్చినప్పుడు గురువులు తమ శిష్యులతో సహా లేచి నిలబడి నమస్కారం చేస్తారు. నిషిద్ధగురువులని మరోరకం వారుంటారు. ఆ గురువును ఆశ్రయించకూడదు. అంతమాత్రం చేత ఆయన గురువు కాకుండా పోడు. శాస్త్రం నిషేధించిన కొన్ని ఆరాధనా విధానాలుంటాయి. అటువంటి పూజలు చేయకూడదంటుంది శాస్త్రం. కానీ అటువంటివే నేర్పే గురువు నిషిద్ధ గురువు. తొందరపడి అటువంటి గురువులను ఆశ్రయించి ఆ మార్గాల్లో వెళ్ళకండని పెద్దలు చెప్తారు.
గురువంటే అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. ఆ గురువు ఆచార్యుడిగా ఉంటాడు. ‘‘ఆచార్యః గురూనాం శ్రేష్టః’’ – ఆచార్యుడిని గురువులందరిలోకి శ్రేష్టుడంటారు. అంటే ఎవడు ఆచారాన్ని కలిగున్నాడో ఆయన ఆచార్యుడు. నీవు ఏ విషయాన్నయినా చదువుకుని ఉండవచ్చు. అది విద్యార్థులకు బోధిస్తూ ఉండవచ్చు. ఒకడు నత్యం నేర్చుకుంటాడు, శిష్యులకు చెపుతూ ఉంటాడు. ఒకడు వాద్యపరికరాన్ని మోగించడంలో నిష్ణాతుడు. సంగీతంలో, విలువిద్యలో, లెక్కలు చెప్పడంలో.. అలా వారివారి రంగాల్లో పాండిత్యం సంపాదించి దానిని శిష్యులకు బోధిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఆచార్యులు మాత్రం కారు. కేవలం ‘నీవు ఏం చెబుతున్నావు, ఏ స్థాయిలో చెపుతున్నావన్న దాన్నిబట్టి నీవు ఆచార్యుడివి కాలేవు’ అంటుంది శాస్త్రం.
బోధించే విషయం ఏదయినా ధర్మశాస్త్రం, వేదం బాగా తెలిసున్నవాడై, ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడే ఆయన ఆచార్యుడు అని పిలవబడతాడు. నీకు ధర్మశాస్త్రం తెలిస్తే జీవితంలో ధర్మాన్ని అనుష్ఠానం చేసి చూపిస్తే, పదిమందికి నీవు ఆదర్శవంతుడవయితే, ‘ఆయనలా బతకండి’ అన్న శిష్టాచారానికి నీవు ప్రమాణమైతే అప్పుడు మాత్రమే నీవు ఆచార్యుడివి. విలువిద్య నేర్పిన ద్రోణుడిని ద్రోణాచార్య అన్నారు. అయితే కేవలం ఆయన విలువిద్య నేర్పినందుకు అలా అనలేదు, విద్య నేర్పేటప్పుడు పాత్రత చూసాడు, ధర్మబద్ధంగా నడుచుకున్నాడు కనుక ద్రోణాచార్యుడయ్యాడు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565