MohanPublications Print Books Online store clik Here Devullu.com

Tvs Effect


ఒత్తిడిలో ఉన్నప్పుడు ఓదార్పు మాటలు విన్నా... సంగీతాన్ని ఆస్వాదించినా... ప్రకృతితో మమేకమైనా... మనసు తేలికవుతుంది. దీని కోసం ఎక్కడెక్కడికో వెళ్లనక్కర్లేదు. మీ సిస్టమే మీకు ఒత్తిడి నివారణ చర్యలు చెబుతుంది. పాఠాలు చదువుకునే ట్యాబ్‌తోనే ఒత్తిడిని ఓడించొచ్చు. దీనికి ఉపకరించే కొన్ని వెబ్‌సైట్లు ఇవి!
దిగులు పరార్‌ 
‘జంతర్‌ మంతర్‌ జూ మంతర్‌ కాలీ... అందర్‌ దర్ద్‌ దెబ్బకు ఖాళీ’... అదేదో సినిమాలో చిరంజీవి చెప్పే డైలాగ్‌ ఇది. మనసులో బాధ తగ్గాలంటే ఎదుటివాడిని మనసారా ఆలింగనం చేసుకుంటే సరి అంటూ ఆ మాట అంటాడు. ఆలింగనం ఇవ్వకపోయినా అలాంటి అనుభూతిని అందించే వెబ్‌సైట్‌ ఒకటి ఉంది. http://thenicestplaceontheinter.net వెబ్‌సైట్‌లోకి వెళ్తే కొందరు వ్యక్తులు కంప్యూటర్లను ఆలింగనం చేసుకుంటున్న వీడియోలు వస్తాయి. వాటితోపాటు అందులో వినిపించే సాంత్వన చేకూర్చే మాటలతో దిగులు మాయమవుతుంది.
ఆకాశంలో బొమ్మలు 
వర్షాకాలం... నల్లని ఆకాశంలో మెరుపులు కనిపించినప్పుడల్లా ‘అబ్బ... ఎంత బాగుందో’ అనిపిస్తుంది. అలాంటి మెరుపుల్ని మీరూ సృష్టించొచ్చు. దీనికి మీరు చేయాల్సిందల్లా http://weavesilk.com వెబ్‌సైట్‌లోకి వెళ్లడమే. ఈ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయగానే మీరు మెరుపులు సృష్టించడానికి నల్లని ఆకాశం సిద్ధంగా ఉంటుంది. దానిపై మీకు కావల్సినట్లుగా, నచ్చే రంగులో మెరుపులు సృష్టించొచ్చు. వాటిని సామాజిక అనుసంధాన వేదికల్లో షేర్‌ చేసుకోవచ్చు.
ఇది మీ వర్షం 
‘వర్షం’ సినిమాలో ఈ వాన నా స్నేహితురాలు అని చెబుతుంది త్రిష. ఆమె చెప్పినట్లు వర్షం కురుస్తుందని అంటుంటుంది. అలా మీరు కోరుకున్నప్పుడు వర్షం కావాలా... అయితే http://www.lookingatsomething.com వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసేయండి. ఇందులో మీ కర్సర్‌ కదలికను బట్టి వర్షం కురుస్తుంది. సిస్టమ్‌ స్క్రీన్‌లో పైకి కర్సర్‌ ఉంచితే వాతావరణం ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా కనిపిస్తుంది. కర్సర్‌ను పూర్తి దిగువన ఉంచారనుకోండి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది. కర్సర్‌ ఎటుతిప్పితే అటు వాన చినుకులు కదులుతాయి. ఇయర్‌ఫోన్‌ పెట్టుకుంటే వర్షం పడుతున్న శబ్దం వినిపించి మనసు ప్రశాంతంగా మారుతుంది.
పాలపుంతను చూస్తే!
ఆకాశంలోకి చూస్తేనే మనకు హాయిగా అనిపిస్తుంటే... పాలపుంతను చూస్తే ఇంకెంత హాయిగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మిణుకుమిణుకుమనే నక్షత్రాలు కళ్లకు దగ్గరగా కనిపిస్తే, సూర్యుడు భగభగమని మండుతూ ఎదురుగా ఉంటే... సూపర్‌ కదా. దీని కోసం బిర్లా ప్లానిటోరియం వరకు వెళ్లక్కర్లేదు. http://stars.chromeexperiments. com వెబ్‌సైట్‌ను మీ సిస్టమ్‌లో ఓపెన్‌ చేస్తే సరి. మొత్తం పాలపుంత మీ కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. దాన్ని చూస్తూ మిమ్మల్ని మీరు మరచిపోండి, ఒత్తిడిని కూడా.
90 సెకన్లు చాలు
‘మనసు బాధగా ఉంది రా...’ అని ఎవరైనా స్నేహితుడి దగ్గర అంటే... నాలుగు ఓదార్పు మాటలు చెబుతారు. ఇది జీవితానికి సంబంధించిన విషయమే. అదే ఒత్తిడి పని విషయంలో అయితే http://thequietplaceproject.com/ 90seconds వెబ్‌సైట్‌ ఆ పని చేస్తుంది. ఓ 90 సెకన్లు ఆ వెబ్‌సైట్‌ చెప్పింది చేస్తే మనసులో భారం తగ్గుతుంది. ‘మీ కోసం మెయిల్స్‌ వెయిట్‌ చేస్తాయి’, ‘మీకు ఎలాంటి మెసేజ్‌లు రాలేదు’ అంటూ సిస్టమ్‌ స్క్రీన్‌ మీద కొన్ని సందేశాలు కనిపిస్తాయి. ఆ టైమ్‌ పూర్తయిన తర్వాత మళ్లీ మీ పని మీరు చేసుకోవచ్చు.
కలిపి వినేయండి
మిడతల కీచ్‌ కీచ్‌మనే శబ్దం, పక్షుల కిలకిలారావాలు వింటుంటే... పల్లెటూరులో పొలం పక్కన కూర్చున్న అనుభూతి కలుగుతుంది. ఇలాంటి శబ్దాలను సిస్టమ్‌లో వినాలనుకుంటే http://asoftmurmur.com వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సిందే. ఇందులో ఆ శబ్దాలతోపాటు వర్షం, ఉరుములు, ఈదురు గాలులు, కాఫీ షాపులో జనాల గుసగుసలు, నాటి రోజుల్లో టీవీలో బొమ్మ రాకుండా చుక్కలు కనిపించేటప్పుడు వచ్చే శబ్దం లాంటివి ఉన్నాయి. వీటిని వేర్వేరుగా వినడంతోపాటు అన్నీ కలిపి మిక్స్‌ చేసి వినొచ్చు.
రెండు నిమిషాలు
సముద్రం ఒడ్డున కూర్చుని అలల శబ్దం వింటూ, అస్తమిస్తున్న సూర్యుణ్ని చూస్తే అదిరిపోతుంది కదూ. ఇప్పటికిప్పుడు అలాంటి అనుభూతిని పొందాలనుకుంటున్నారా? దీని కోసం మీరు సముద్ర తీరానికి వెళ్లనక్కర్లేదు. మీ కంప్యూ టర్‌లోని బ్రౌజర్‌ ఓపెన్‌ చేస్తే సరి. www.donothingfor2minutes.com వెబ్‌సైట్‌లోకి వెళ్తే ఓ రెండు నిమిషాలపాటు మౌస్‌ కదపొద్దు, కీబోర్డు మీద బటన్‌లు టచ్‌ చేయొద్దు అని చూపిస్తుంది. ఆ తర్వాత సూర్యుణ్ని చూస్తూ, సముద్రం పరిసర ప్రాంతాల్లో వినిపించే శబ్దాల్ని రెండు నిమిషాలపాటు వినొచ్చు. అలా మీ మనసు ప్రశాంతంగా మారుతుంది.
దారంతో ఆటలు
ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు దారపుపుండ తీసుకొని దాంతో రకరకాల డిజైన్లు చేయడం మీకు అలవాటా? కంప్యూటర్‌లోనూ అలాంటి పని చేయొచ్చు. http:// barcinski.nl వెబ్‌సైట్‌లోకి వెళ్తే దారపుండ నుంచి ఓ పోగు బయటకు వచ్చి గాల్లో ఎగురుతూ సిద్ధంగా ఉంటుంది. మౌస్‌తో ఆ దారపుపోగును తిప్పుతూ రకరకాల ఆకారాలు చేయొచ్చు. మౌస్‌ కదలికను బట్టి దారపుపోగు ఎగిరే వేగం, దిశ మారుతాయి. మీ సృజనాత్మకతను ఉపయోగించి రకరకాల డిజైన్లు చేసేయండి. దీని వల్ల మానసిక ఆందోళన కాస్త తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఓ మంచి స్నేహితుడు
పుస్తకాన్ని మించిన స్నేహితుడు ఉండడు అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఓ పుస్తకాన్ని చదివితే కొత్త విషయాలు తెలియడంతోపాటు, మనసులోని దిగులు పటాపంచలు అయిపోతుంది. అయితే ప్రతిసారి ఒక్కో పుస్తకం చదవాలంటే సమయం చాలదు కదా అంటారా. అయితే http://www.recommendmeabook.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూడండి. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఎన్నో రచనల సారం.. వ్యాసాల రూపంలో ఇందులో ఉంటుంది. ఓ వ్యాసం చదివాక అది నచ్చితే దాని రచయిత తదితర వివరాలు తెలుసుకోవచ్చు లేదంటే మరో వ్యాసం చూసుకోవచ్చు.










No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list