ఏలక్కాయలో ఏముంది?
గుడ్ ఫుడ్
ఏలక్కాయలో పోషకాలు ఏముంటాయి? మంచి వాసన తప్ప... అనుకుంటాం. వంటల్లో సువాసనకోసం వాడే దినుసుగానే పరిగణిస్తాం. కానీ ఇందులో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఇదొక ఔషధం. ఏలక్కాయ కడుపులో ఎసిడిటీని తగ్గిస్తుంది. మంట అనిపించినప్పుడు వేడి నీటిలో చిటికెడు ఏలకుల పొడి చల్లుకుని తాగితే ఉపశమనం ఉంటుంది. కడుపులో ఒడుదొడుకులు కూడా అదుపులోకి వస్తాయి. ఏలక్కాయ అజీర్తి, అరుచి, ఆకలవుతున్నా తినాలనిపించకపోవడం వంటి సమస్యలను తొలగిస్తుంది. నోటి దుర్వాసనను తొలగిస్తుంది.
తల తిరుగుతున్నప్పుడు ఏలక్కాయను నమిలి తింటే సాంత్వన కలుగుతుంది. కొందరికి ప్రయాణాల్లో తల తిరుగుతుంటుంది. అటువంటి వాళ్లు ఏలక్కాయ దగ్గర పెట్టుకోవడం మంచిది. ప్రయాణం మొదలు పెట్టినప్పుడే ఒక ఏలక్కాయ నోట్లో వేసుకుంటే తల తిరిగే సమస్య రానే రాదు. దాహం కూడా అనిపించదు. రోజుకు ఒక ఏలక్కాయ తింటే, జీర్ణశక్తిని మెరుగుపరిచి అపానవాయువు సమస్యను తొలగిస్తుంది. యూరినరీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడేవారు రోజూ ఉదయం, సాయంత్రం ఏలకుల పొడిని నీటిలో కలుపుకొని తాగాలి. అలా వారం రోజులు చేస్తే ఇన్‌ఫెక్షన్ పూర్తిగా తగ్గుతుంది. రెండు ఏలకులు, చక్కెర కలుపుకొని తింటే కడుపునొప్పి తగ్గుతుంది.
అర్థవంతమైన జీవితం అంటే..?
ఆత్మీయం
నేనీ జీవితంతో విసిగిపోయాను అనో, ఈ లైఫంటే బోర్ కొడుతోంది అనో చాలామంది నోట వినిపించే మాటే. నిజానికి ఈ మాట అనడానికి వీలేలేదు. ఎందుకంటే, వినోద సాధనాలు విరివిగా ఉన్నాయి. అయినా, జీవితం విసుగు పుట్టిస్తోంది..! అందుబాటులో ఉన్న ఏ ఆధునిక వినోద సాధనమూ సంతోషాన్ని, తృప్తిని ఇవ్వడం లేదు. అందుకే ఈ జీవితానికి అర్థం ఏముంది అని నిరుత్సాహ పడటం. అసలు అలా ఎలా ఆలోచిస్తాం? జీవితంలో మనం చేసే ప్రతి పనికీ అర్థం ఉన్నప్పుడు... మన జీవితానికి మాత్రం అర్థం లేకుండా ఎలా పోతుంది? మరణం కంటే జీవితం మీదే ఇష్టం ఎక్కువ మనకు. కాకపోతే ప్రశాంతంగా అర్థవంతమైన జీవితాన్ని జీవించాలన్నదే ఆశ. ఇది అర్థం లేని ఆశేమీ కాదు. తీరని ఆశ అంతకన్నా కాదు.
మన జీవితానికి అర్థం తెలుసుకోవడం మన చేతుల్లోనే ఉంది. దేవుణ్ని తెలుసుకుని, ఆయనతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు అర్థవంతమైన జీవితం అంటే ఏంటో బోధపడుతుందని, జీవితానికి ఒక అర్థమంటూ ఏర్పడుతుందని అనేక గ్రంథాలు తెలియ చేస్తున్నాయి. నిజాన్ని తెలుసుకున్ననాడు మనం దేవునికి ఎప్పుడూ దూరం కాము. అలా కానినాడు మన జీవితం అర్థరహితమూ కాదు.
ఒక వస్తువు తాను దేనికోసం తయారు చేయబడిందో దానికి పరిపూర్ణంగా ఉపయోగించబడినప్పుడు దానికి అర్థం ఎలా ఏర్పడుతుందో, మనిషి జీవితమూ అంతే. దైవం కోసం జీవించినప్పుడు, మన జీవితాన్ని పరమాత్ముడి సేవకు అంకితం చేసినప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి. అర్థవంతమవుతాయి. అప్పుడు జీవితంలో విసుగు అనే పదానికి స్థానం లేకుండా పోతుంది. ఇక్కడ దైవం అంటే ఎవరో కాదు... సాటి మానవుడే దైవం. ప్రతి ప్రాణీ దైవమే!
షాపింగ్
ఒక్కొక్కసారి బాగా నచ్చిన డ్రస్ ఒక నంబర్ చిన్న సైజులో ఉంటుంది. కావలసిన సైజ్‌లో ఆ పీస్ ఉండదు. బరువు తగ్గాల్సిన అవసరం ఉన్న వాళ్లకు ఇది మంచి అవకాశం. చిన్న సైజ్‌దే కొని మూడు నెలల టైమ్ పెట్టుకుని ఆ డ్రస్‌కు సరిపోయేటట్లు బరువు తగ్గాలన్న టార్గెట్ పెట్టుకుని వ్యాయామం చేస్తే పని జరుగుతుంది.మనల్ని మనం ఉత్తేజితం చేసుకోవాలంటే ఫ్యాషన్‌ను ఫాలో కావాల్సిందే. కాని దాని వెంట పరుగులు తీయడం కష్టమే. నిన్న మార్కెట్‌లోకి వచ్చిన మోడల్ రేపు ఉండదు. కాబట్టి ట్రెండ్‌కు తగ్గట్టుగా నడుచుకుంటూనే ఎవరికి వారు తమకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకోవాలి. అందులో ఒకింత ఫ్యాషన్, కాస్తంత హుందాతనం, అంతకంటే ఎక్కువ సౌకర్యం ఉండేలా చూసుకోవాలి. షాపింగ్ చేసేటప్పుడు దీన్ని గుర్తుంచుకుంటే మీకంటూ ఒక స్టైల్ స్టేట్‌మెంట్ ఎప్పుడూ ఉంటుంది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565