పదే పదే..అదే అదే..
అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్
ఒకసారి చేసిన పనిని రెండోసారి చేయాలంటేనే ఎక్కడలేని విసుగొస్తుంది. అలాంటిది రెండు కాదు, మూడు కాదు.. పది సార్లు, ఇరవై సార్లు చేయాల్సి వస్తుంటే? అదీ ఎలాంటి ప్రయోజనం లేదని తెలిసినా.. అనివార్యంగా చేయాల్సి వస్తుంటే ఇంకెంత బాధగా ఉండాలి? అడ్డూఆపూ లేని ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి చేసే ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్- ఓసీడీ’ సరిగ్గా ఇలాగే వేధిస్తుంది. ఒకవైపు మనసులోంచి అదేపనిగా పుట్టుకొచ్చే ఇబ్బందికరమైన ఆలోచనలు.. మరోవైపు లోపల్నుంచి ఏదో ఆదేశిస్తున్నట్టు, ఎవరో పురమాయిస్తున్నట్టు అనివార్యంగా చేయాల్సి వచ్చే పనులు.. అన్నీ కలిసి జీవితాన్ని దుర్భరం చేస్తుంటాయి. తన్నుకొచ్చే ఆలోచనల గురించి పైకి చెప్పుకోలేక.. చెబితే నవ్వుతారేమో, చిన్నచూపు చూస్తారేమోననే దిగులుతో.. ఓసీడీ బాధితులు పడే వేదన అంతా ఇంతా కాదు. దైనందిన వ్యవహారాలను సరిగా నిర్వర్తించుకోలేక.. చాదస్తపు మనిషనే హేళనలను భరిస్తూ బిక్కుబిక్కుమంటూనే ఏళ్లకేళ్లుగా రోజులు గడుపుతుంటారు. అయినా కూడా ఇదొక మానసిక సమస్యని గానీ దీన్ని వీలైనంత త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుందని గానీ చాలామందికి తెలియనే తెలియదు. అందుకే ఓసీడీపై సమగ్ర వివరాలను అందిస్తోంది ఈ వారం సుఖీభవ!
సినిమాకో, షికారుకో వెళ్తున్నప్పుడు ఇంటికి తాళం సరిగా వేశామో లేదోనని ఒకటికి రెండుసార్లు లాగి చూసుకోవటం మామూలే. రాత్రిపూట సిలిండర్ కట్టేశామో లేదోనని మరోసారి చూసుకోవటం సహజమే. కానీ అనియంత్రిత ఆలోచనలు, అనివార్య చర్యలతో వేధించే అబ్సెషన్ కంపల్సివ్ డిజార్డర్ బారినపడ్డవారు ఇలాంటి పనులను అదేపనిగా.. మాటిమాటికీ చేస్తుంటారు. వీరిలో ఒకవైపు- మనసులో విపరీతమైన ఆలోచనలు పరంపరగా పుట్టుకొస్తుంటాయి (అబ్సెషన్). ఏదో ఒక ఆలోచన కావొచ్చు, దృశ్యం కావొచ్చు, సంఘటన తాలూకు జ్ఞాపకాలు కావొచ్చు.. అదేపనిగా ఆగకుండా మనసులో కదలాడుతుంటాయి. మాటిమాటికీ స్ఫురణకు వస్తూ.. చుట్టుముడుతుంటాయి. చిత్రమేంటంటే.. ఇలాంటి ఆలోచనలు మంచివి కావని ఒకపక్క వారికి తెలుస్తూనే ఉంటుంది. తమకే ఇలాంటి భావనలు ఎందుకొస్తున్నాయో, రాకుండా ఉంటే ఎంత బాగుంటుందోననీ అనుకుంటుంటారు. అయినా కూడా తన్నుకొచ్చే ఆలోచనలపై ఎలాంటి నియంత్రణా ఉండదు. ఇవి శరపరంపరగా దూసుకొస్తూ మనసును తొలుస్తూనే ఉంటాయి. మరోవైపు- ఇలాంటి ఆలోచనలతో కమ్ముకొచ్చిన భయం, అపరాధభావం వంటివి తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంటాయి. దీన్ని తగ్గించుకోవటానికి అనివార్యంగా చేసిన పనులనే మళ్లీ మళ్లీ చేయటం (కంపల్షన్) మొదలవుతుంది. మాటిమాటికీ స్నానం చేయటం, చేతులు కడుక్కోవటం, ఇంట్లో వస్తువులను ఒక క్రమంలో అమర్చటం, లెక్కబెట్టిన వాటిని తిరిగి లెక్కబెట్టటం వంటివన్నీ ఇలాంటివే. అయితే అందరిలోనూ ఓసీడీ ఇలాంటి అనివార్య పనులకు దారితీయాలనేమీ లేదు. కొందరిలో ఆలోచనల వరకే పరిమితం కావొచ్చు కూడా.
చెడు ఆలోచనలే ఎక్కువ!
అబ్సెసివ్ కంపల్సివ్ సమస్యలో చాలావరకు ఇష్టం లేని, చెడ్డ ఆలోచనలే వస్తుంటాయి. ఉదాహరణకు దేవుడి మీద చాలా భక్తి, విశ్వాసాలు గలవారినే తీసుకుంటే- దేవుడి మీద ఉమ్మేసినట్టు, విగ్రహాన్ని కాలితో తన్నినట్టు, గుడిలో అసభ్యకరమైన పదమేదో పలికినట్టు.. ఇలా విపరీతమైన ఆలోచనలేవేవో పుట్టుకొస్తుంటాయి. అసలే దేవుడిపై చాలా భక్తిప్రపత్తులు గలవారిని ఇలాంటి ఆలోచనలు తీవ్రమైన ఆవేదనకు గురిచేస్తాయి. తామేం పాపం చేశాం? ఏం తప్పు చేశాం? అని తెగ మథనపడిపోతుంటారు. అదే సమయంలో ఇలాంటి చెడు ఆలోచనలను వెనక్కి నెట్టటానికీ ప్రయత్నిస్తుంటారు. నియంత్రించుకోవటానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో తీవ్రమైన ఆందోళన ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దీన్ని తగ్గించుకోవటానికి రకరకాల మార్గాలు వెతుక్కుంటుంటారు కూడా. ‘దేవుడి మీద ఉమ్మేసినట్టు అనిపించింది కదా. ఈ పాపం పోవాలంటే స్నానం చేస్తేనో?’ అని భావించి మరోసారి బాత్రూమ్‌లోకి వెళతారు. అప్పటికీ దేవుడికి తన మీద ఇంకా కోపం తగ్గలేదేమోనని భయపడిపోయి.. మరోసారి, మరోసారి ఇలా చాలాసార్లు స్నానం చేయటానికి ఉపక్రమిస్తుంటారు. పదిహేను, ఇరవై, ముప్పయి.. ఇలా రోజులో చాలా సమయం స్నానం చేయటానికే సరిపోతుంది.
ఇతరులపైనా రుద్దుతారు
ఓసీడీ బాధితుల్లో శుభ్రత గురించిన పట్టింపు ఎక్కువ. శుభ్రంగా లేకపోతే జబ్బులు దాడిచేస్తాయేమోననే ఆలోచన మనసులో భయపెడుతుంటుంది. అందుకే ఏదైనా ముట్టుకుంటే వెంటనే చేతులు కడుక్కోవటానికి ప్రయత్నిస్తారు. కడుకున్నాక పూర్తిగా శుభ్రమైందో లేదోననే అనుమానం వస్తుంది. దీంతో ‘మరోసారి కడుక్కుంటే పోలా’ అని వెనక్కి వచ్చి మళ్లీ కడుక్కుంటారు. ఇది అంతటితోనే ఆగిపోదు. క్రమంగా పెరుగుతూ వస్తుంటుంది. రాన్రానూ సమస్య తీవ్రమై ఇంట్లో వాళ్లకూ ఇబ్బందిగా పరిణమిస్తుంది. ఎందుకంటే ఓసీడీ బాధితులు తమ అలవాట్లను ఇతరుల మీద కూడా రుద్దుతుంటారు. ‘నువ్వు ఫలానా వ్యక్తిని ముట్టుకోవటం చూశాను. వెళ్లి చేతులు కడుక్కోపో’ అని వెంటబడుతుంటారు. పిల్లలు స్కూలు నుంచి రాగానే ‘ముందు బాత్రూమ్‌కు వెళ్లి, దుస్తులు విప్పేసిరా.. బాగా రుద్దుకొని స్నానం చెయ్యి’ అని పోరు పెడుతుంటారు. చెప్పినపని చేసేదాకా విడవరు. మొదట్లో కుటుంబసభ్యులు కూడా ఎందుకొచ్చిన గొడవలే అనుకొని వాళ్లు చెప్పినట్టుగానే చేస్తారు. అయితే ఇది రాన్రాను కుటుంబసభ్యులనూ ఒత్తిడికి గురిచేస్తుంది.
రోజంతా ఇబ్బందులే..
* మాటిమాటికీ అవే పనులు చేయాల్సి రావటం దైనందిన వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సకాలంలో పనులు పూర్తి చేసుకోలేకపోవటం, ఆఫీసులకు ఆలస్యంగా చేరుకోవటం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. శుభ్రత గురించి దిగులు చెందేవారు రోజులో ఎక్కువసేపు బాత్రూమ్‌లోనే గడుపుతుంటారు. సగం రోజు బాత్రూమ్‌లో గడిపేవారూ లేకపోలేదు. ఇంట్లోనే ఉండిపోయేవారు దీన్ని ఎలాగోలా నెట్టుకొస్తుంటారు గానీ ఉద్యోగాలు చేసేవారికిది చాలా ఇబ్బందిగా పరిణమిస్తుంది.
* పిల్లలైతే పాఠం చదువుతున్నప్పుడు ఒక వాక్యం పూర్తికాగానే.. ‘సరిగా చదివానా.. లేదా? అర్థమైందా.. లేదా?’ అనే సందేహం వస్తుంటుంది. కొన్ని వాక్యాలు చదవటం పూర్తయ్యాక మొదటి వాక్యం సరిగా చదివానో లేదోననే సందేహం వస్తుంది. దీంతో వెనక్కివెళ్లి మరోసారి సరి చూసుకుంటుంటారు. ఇలా చదివిందే చదవటం వల్ల పాఠం ముందుకు సాగదు, పూర్తికాదు. అలాగే రాసిన తర్వాత సరిగా రాయలేదేమోనని కొట్టేయటం, మళ్లీ రాయటం.. ఇలా సాగుతుంది ప్రవర్తన.
* కొందరు ఇంట్లోంచి బయటకు అడుగుపెట్టటానికి కూడా భయపడిపోతుంటారు. బయటకు వెళ్తే ఏదో అంటుకుంటుందనో, చూడకూడనిదేదో ఎదురవుతుందనో బెంబేలెత్తిపోతుంటారు. చాలావరకు ఇంటికే పరిమితం కావటానికి ప్రయత్నిస్తుంటారు. విపరీత ప్రవర్తనను చూసి ఇతరులు నవ్వుకోవటం, హేళన చేయటం, చిన్నచూపు చూడటం కూడా వేధిస్తాయి. దీంతో నలుగురిలో కలవలేక ఒంటరితనంతోనూ బాదపడుతుంటారు. ఇలాంటివాళ్లు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యి కుంగుబాటులోకి కూడా జారిపోవచ్చు. ఫలితంగా నిరుత్సాహం, నిస్సత్తువ వంటి లక్షణాలూ పొడసూపుతాయి.
* ఇది కొందరిలో మూఢ నమ్మకాలకూ దారితీయొచ్చు. కొందరు దేవుడి పటం వంటి వాటిని తరచుగా తాకితే అదృష్టం కలిసొస్తుందని నమ్ముతుంటారు. దేవుడి విగ్రహం ముందు నాలుగుసార్లు లెంపలు వాయించుకుంటేనో.. పదిసార్తు గుంజీలు తీస్తేనో పాపాలు తొలగిపోతాయని నమ్ముతుంటారు. మామూలుగా ఉన్నంతవరకు ఇలాంటివి పెద్ద ఇబ్బందేమీ కాదు. కానీ తీవ్రమైతే పదిమందిలోనూ చీటికీమాటికీ లెంపలు వాయించుకోవటం, గుంజీలు తీయటం వంటివి చేయొచ్చు.
చాదస్తం కాదు
పదే పదే అవే పనులను చేయటాన్ని చాలామంది చాదస్తంగా భావిస్తుంటారు. కావాలనే అలా చేస్తున్నారని అనుకుంటుంటారు. ‘ఒకసారి చెబితే అర్థం కాదా? ఆ మాత్రం బుద్ధిలేదా? చేసిన పనే మళ్లీ మళ్లీ ఎందుకు చేస్తున్నావు?’ విసుక్కోవటం, కోప్పడటం చేస్తుంటారు. నిజానికి ఇదేమీ చాదస్తం కాదు. చేసిన పనులు మళ్లీ మళ్లీ చేయటం సరైన పద్ధతి కాదని, అవి చేయకపోతే కొంపలేమీ మునిగిపోవని ఓసీడీ బాధితులకూ తెలుసు. ఇదేమీ వాళ్లు ఇష్టమైన చేస్తున్న పనులు కావు. ఇవేవీ వారికి సంతోషాన్ని గానీ, తృప్తిని గానీ ఇవ్వవు. మాటిమాటికీ స్నానం చేయటం, చేతులు కడుక్కోవటం, సోఫాలు కడగటం అంటే వారికి కూడా చిరాకుగానే, కష్టంగానే ఉంటుంది. లోపల్నుంచి వచ్చే ఆలోచనలను అణచుకోలేక, ఆందోళనను తగ్గించుకునే ప్రయత్నంలోనే ఇవన్నీ చేస్తున్నారనే సంగతిని గుర్తించాలి.
పరిపరి విధాల ఆలోచనలు
ఓసీడీలో వేటి గురించైనా విపరీత ఆలోచనలు రావొచ్చు. అయితే కొన్నిరకాల ఆలోచనలను తరచుగా చూస్తుంటాం. వీటిల్లో ప్రధానమైనవి..
* పరిశుభ్రత, భద్రత సంబంధ ఆలోచనలు
* అసభ్యకరమైన శృంగార భావనలు
* దేవుళ్లపై అసభ్యకరమైన యోచనలు
* బయటికెళ్తే శవం ఎదురవటం వంటి చూడకూడని దృశ్యాలు కనబడతాయేమోననే ఆందోళన
* బయటికెళ్లినవారికి ప్రమాదం జరుగుతుందేమో, ప్రమాదంలో చనిపోతారేమోననే ఆందోళన
* తమకు తీవ్రమైన జబ్బులు వస్తాయేమోననే దిగులు
యుక్తవయసులోనే మొదలు!
పెద్దలు, పిల్లలనే తేడా లేకుండా ఓసీడీ ఎవరికైనా రావొచ్చు. అయితే చాలామందిలో యుక్త వయసులోనే దీనికి బీజం పడుతుంటుంది. అయితే చిన్నతనంలో వచ్చే విపరీత ఆలోచనలు కొంతకాలానికి చాలావరకు వాటంతటవే పోతాయి. ఏవో చిన్న చిన్న అలవాట్లు చేసుకున్నా మెల్లగా కనుమరుగవుతాయి. కానీ కొందరిలో అలాగే కొనసాగుతూ వస్తాయి. సుమారు 2-3% మంది ఓసీడీతో బాధపడుతున్నట్టు అంచనా. అయితే చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. కొందరు ఇలాంటి పనులకు క్రమంగా అలవాటు పడిపోతుంటారు. కుటుంబసభ్యులు కూడా ‘ఏదో తన పని తాను చేసుకుపోతున్నాడులే, మనకేమీ ఇబ్బంది లేదు కదా’ అని సర్దుకుపోతుంటారు. నిజానికి దీన్ని చాలామంది వ్యక్తి లక్షణమనో, వ్యక్తిత్వ లోపమనో అనే అనుకుంటుంటారు. దీంతో ఎంతోమందిలో ఇది ఏళ్లకేళ్లుగా అలాగే ఉండిపోతుంది. సమస్య తీవ్రమై రోజువారీ పనులకు ఆటంకంగా పరిణమించినప్పుడు, ఇంట్లో వాళ్లకు సైతం ఇబ్బందికరంగా మారినప్పుడే ‘ఎందుకిలా?’ అని ప్రశ్నించటం మొదలెడతారు. అప్పుడు గానీ డాక్టర్‌ను సంప్రదించరు. దీన్ని వీలైనంత త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. మళ్లీ మళ్లీ అవే పనులకు అధిక సమయం వెచ్చిస్తున్నా.. రోజువారీ పనులను సరిగా చేయలేకపోతున్నా.. ఒకవేళ చేసినా ఆలస్యమవుతున్నా.. ఇతరులనూ తమలాగే చేయాలని పట్టుబడుతున్నా సమస్య ముదిరిందనే భావించాలి.
ఎందుకొస్తుంది?
ఓసీడీ ఎందుకొస్తుందో కచ్చితంగా తెలియదు. కానీ దీనికి జన్యువులు, పరిసరాలు, ఇతరులను అనుకరించటం వంటి పలు అంశాలు దోహదం చేయొచ్చు. తల్లిదండ్రులు, తోబుట్టువులు.. ఇలా రక్తసంబంధికుల్లో ఎవరైనా ఓసీడీ బాధితులు గలవారికి దీని ముప్పు ఎక్కువ. ముఖ్యంగా చిన్నవయసులోనే రక్తసంబంధికులు ఓసీడీ బారినపడి ఉంటే ముప్పు మరింత పెరుగుతుంది. కొందరు ఇతరులను అనుకరించటం వల్ల కూడా కొన్ని అలవాట్లు చేసుకోవచ్చు. ఉదాహరణకు తల్లిదండ్రులు అతిగా పూజలు చేసేవారైతే- వాళ్లు చేస్తున్నారు కదా మనం చేయకపోతే ఏమవుతుందోనని భావించి కొందరు పిల్లలు వాటికి అలవాటు పడిపోతుంటారు. మెదడులో నాడుల మధ్య సమాచారాన్ని చేరవేసే సెరటోనిన్ స్థాయులు తగ్గటమూ దీనికి దోహదం చేయొచ్చు. మానసికమైన ఒత్తిడితోనూ కొందరు ఓసీడీ బారినపడుతుంటారు.
చికిత్స రెండు రకాలు
ఓసీడీకి మందులు, ఆలోచన తీరుతెన్నులను మార్చే (కాగ్నిటివ్ బిహేవియర్) చికిత్స బాగా ఉపయోగపతాయి. కొందరికి రెండూ ఇవ్వాల్సి రావొచ్చు. వీటితో చాలావరకు మంచి ఫలితం కనబడుతుంది. అయితే చికిత్స దీర్ఘకాలం తీసుకోవాల్సి ఉంటుంది. ఆలోచనా రీతులను మార్చే చికిత్సను విడవకుండా ఇంట్లోనూ సాధన చేయాలి.
* మందులు: వీటిలో ప్రధానంగా సెరటోనిన్ స్థాయులను పెంచే మందులు ఇస్తారు.
*ఆలోచనా రీతులను మార్చటం: ఇందులో ఆలోచనలను మార్చుకోవటం, వాటిని కట్టడి చేసుకునే పద్ధతులను నేర్పిస్తారు. అలాగే భయపెడుతున్న అంశాలకు నేరుగా ప్రభావితం చేసి వాటితో ఎలాంటి ప్రమాదం లేదని గుర్తించేలా చేస్తారు కూడా. ఉదాహరణకు శుభ్రత మీద బాగా పట్టింపు గలవారిని అపరిశుభ్ర వాతావరణంలోకి తీసుకొచ్చి, చేతులు కడుక్కోకుండా కొద్దిసేపు బలవంతంగా ఆపుతారు. కడుక్కోకపోయినా ఏమీ కాలేదు కదా అని భరోసా ఇవ్వటానికి ప్రయత్నిస్తారు. దీంతో నియంత్రణ సామర్థ్యం, ధైర్యం పెరుగుతాయి. ధ్యానం, వ్యాయామం వంటివీ ఆందోళనను తగ్గిస్తూ ఓసీడీ లక్షణాలు తగ్గుముఖం పట్టటానికీదోహదం చేస్తాయి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565