చరితార్థులు సంపాతి, జటాయువు
సకల ప్రాణికోటికీ కర్మ సిద్ధాంతాల ప్రకారం జన్మలు ఆదేశించబడతాయంటారు. ప్రతి పుట్టుకకూ అర్థం, పరమార్థం ఉంటాయంటారు. కానీ అందులో కొన్ని జీవితాలు సహజంగా జనిస్తాయి. మంచికోసం పోరాడి ప్రాణాలు కోల్పోయి మట్టిలో కలిసిపోతాయి. చరిత్ర పుటల్లో మాత్రం చరితార్థత పొంది సుస్థిరంగా
నిలిచిపోతాయి. మానవీయ సాధనలో ఉన్నత శిఖరాన్నే అధిరోహిస్తాయి. లోకకళ్యాణ కార్యంలో తమవంతు బాధ్యతను నిర్వర్తించామనే తృప్తితో జీవితాల్నే త్యాగం చేసిన మహానుభావులెందరో.. వారిలో చరితార్థులు సంపాతీ జటాయువులు.
రామకథలో పక్షిజాతికి చెందిన మహాబలవంతులూ, భారీ శరీరంగల ధీరులు, మంచితనం కలిగిన మానసులు, ధర్మం ఎరిగిన బుద్ధులు సంపాతీ; జటాయువులు. ప్రజాపతి కశ్యపుని వంశంలో జన్మించిన వీరు మహాపక్షిరాజులై శ్వేనీ - అరుణుల సంతానమైనారు. ఉత్తమ వంశంలో జన్మించిన సంపాతీ, జటాయువులు అత్యంత శక్తివంతులు, అంతే ధర్మపరివర్తనులు. ఒకసారి వీరిద్దరి మధ్య ఎవరు బలవంతులమనే స్పర్ధ ఏర్పడి సూర్యునికి దగ్గరగా ఎవరుముందు చేరుకుంటారో చూద్దామని బయలుదేరుతారు. సూర్యుడి ప్రతాపం తెలియక కాదు. స్పర్థలోని ఉత్సాహం వారిని అంతటి సాహసానికి ప్రేరేపింపజేసింది. అలా సంపాతీ, జటాయువులు సూర్యునికి దగ్గరగా చేరుకునేంతలో సూర్యుని వేడి తాళలేక జటాయువు బాధ పడుతుంటే చూడలేక సంపాతి తన రెక్కలను సూర్యునికి అడ్డుగా పెడతాడు. అప్పటికే కళ్ళు మసకబారి జటాయువు తన జన్మస్థానంలోనే పడిపోతాడు. సంపాతి తన రెక్కలు పూర్తిగా కాలిపోగా నిస్సహాయుడై వింధ్యపర్వతంపై పడిపోతాడు. అలా చిన్ననాడే సంపాతీ జటాయువులు అనుకోకుండానే విడిపోతారు. చివరిదాకా కలుసుకోనే కలుసుకోరు. కానీ వారి సంకల్పం, లక్ష్యం మాత్రం వారికి తెలియకుండానే ఒక్కటై వారిద్దరినీ మానసికంగా ఏకం చేసిందనే చెప్పాలి. రామకార్యంలో వీరిద్దరి పాత్ర కీలకమై దిశానిర్దేశమై అమోఘమైన రూపమై అద్భుతమైన త్యాగమై నిలిచిపోతుంది.
సీతను రావణుడు అపహరించుకొనిపోయే సమయంలో రావణునితో జటాయువు పలికిన మాటలు, పోరాడిన తీరు ధర్మనిరతియై అన్యాయాన్ని సహించని ధీరత్వమయ్యాయి. జటాయువు రావణునితో రావణా! రాముడు లేని సమయంలో అతని ధర్మపత్నిని తీసుకెళ్ళడం రాజధర్మం కాదు. రాజులెవరూ శాస్త్ర విరుద్ధమైన ధర్మార్థకామాలని కోరరు. ఎందుకంటే ఆ మూడింటికీ రాజే ఆధారం, ఆదర్శం. సీతమ్మ అగ్నిగా మారి నీ వంశాన్నే కాల్చేయగలదు. రాముడి కోపాగ్నికీ నువ్వు భస్మంకాక తప్పదు. పిరికివాడిలా ఎవరూలేని సమయంలో సీతను తీసుకెళుతున్నావు. వీరులెవరూ ఇలాంటి పనులు చేయరు అని చెప్పి అరవై వేల సంవత్సరాల వృద్ధావస్థలో, ఎటువంటి ఆయుధాలు లేక, తన గోళ్ళూ రెక్కలే ఆధారంగా చేసుకొని రావణునితో భీకరపోరాటం చేస్తాడు జటాయువు. అతని హితబోధ రుచించని రావణుడు కోపంతో జటాయువు రెక్కలు, కాళ్ళు నరికేయగా నేలకొరుగుతాడు. రామునికి సీత జాడ తెలపాలని రాముడొచ్చేదాకా ప్రాణాల్ని నిలుపుకుంటాడు. సీతను వెదుకుతున్న రామునికి సీతను రావణుడెత్తుకెళ్ళాడనీ, రావణుడు వింద ముహూర్తంలో సీతను తీసుకెళ్ళాడనీ, ఆ ముహూర్తంలో పోయిన ధనం, లక్ష్మీ తిరిగి భద్రంగా యజమానికే చేరుతాయనీ ధైర్యం చెప్పి రాముని ఒడిలో ప్రాణాలు వదులుతాడు. తనతండ్రి స్నేహితుడైన జటాయువు తనకూ తండ్రి లాంటివాడేనని అంతిమ సంస్కారం చేస్తాడు రాముడు.
సీతాన్వేషణలో సుగ్రీవాజ్ఞతో అలుపెరుగక శ్రమిస్తున్న వానరులకు నిరాశ ఆవహిస్తుంది. ప్రాయోపవేశానికీ సిద్ధపడ్డ వానరులను చూసి ఆహారం దొరికిందని ఆనందపడతాడు సంపాతి. ఇంతలో వారి మాటల్లో జటాయువు చనిపోయాడనీ, సీతమ్మ జాడకోసమే వారంతా తపిస్తున్నారనీ తెలుసుకొని రెక్కలు లేని తనను వింధ్య పర్వతంపై నుండి కిందకు దింపమని వానరులను కోరుతాడు. సీతాపహరణం, రావణుడి చేతిలో జటాయువు మరణం, రామ సుగ్రీవుల మైత్రి, సీతాన్వేషణ గురించి వివరంగా తెలుసుకున్న సంపాతి తన సోదరున్ని చంపిన రావణున్ని అనేక విధాలుగా దూషించి, నూరు సంవత్సరాలుగా ఈ రామకార్యం కోసమే ఎదురుచూస్తున్నాననీ, నిశాకర మహర్షి చెప్పినట్టుగా రామకార్యంలో భాగమై వానరులకు సీత జాడను తెలియపరిస్తే తన రెక్కలు తిరిగి వస్తాయనీ వానరులతో అంటాడు సంపాతి.సీతను ఎత్తుకెళ్లింది రావణుడే. అతను వీశ్రవసుడి కొడుకు. అతని నగరం లంక. అది విశ్వకర్మ నిర్మించిన మహానగరం. సముద్రం ఆవల సరిగ్గా నూరు యోజనాల దూరంలో ఉందది. సీత అక్కడే ఉంది. దివ్యనేత్రం నా వరం. లంకలో ఉన్న సీత నాకు కనిపిస్తుంది. ఆకాశమార్గంలో వెళ్ళి సీతను చూసి రామునికి చెప్పండి. ఇక రామబాణమే మాట్లాడుతుంది. రాక్షసుల నాశనం ప్రారంభమవుతుందని వానరులతో చెబుతుండగానే సంపాతికి తిరిగి రెక్కలొస్తాయి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565