ఆరోగ్యానికి అండ... నువ్వుండ
గుడ్ ఫుడ్
చిన్నప్పుడు నువ్వుల ఉండలు, నూజీడీలు తినకుండా పెరిగి పెద్దయిన వారు ఉండరు. నువ్వుల్లో ఐరన్, క్యాల్షియమ్, మెగ్నీషియమ్, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, కాపర్, జింక్, ఫైబర్, థయామిన్, విటమిన్ బి6, ఫోలేట్, ట్రిప్టోఫాన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. రక్తహీనత ఉన్నవారికి బెల్లం–నువ్వులతో చేసిన ఉండలు తినమని నిపుణులు ఇప్పటికీ చెబుతుంటారు.
ఆహారంలో నువ్వులు క్రమం తప్పకుండా తినేవారిలో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇందులోని మెగ్నీషియమ్ వ్యాసోడయలేటర్‌గా (రక్తనాళాలను విప్పార్చడం) పనిచేయడం వల్ల ఈ ప్రయోజనం చేకూరుతుంది. అన్ని రకాల ఖనిజాలు (మినరల్స్)తో పాటు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఫైటేట్ పుష్కలంగా ఉండటం వల్ల నువ్వులు శక్తిమంతమైన క్యాన్సర్ నిరోధకాలు. నువ్వుల్లో క్యాల్షియమ్, ఫాస్ఫరస్ చాలా ఎక్కువ. అందుకే అవి ఆస్టియోపోరోసిస్‌ను నివారిస్తాయి. ఎముక ఆరోగ్యాన్ని కాపాడతాయి.
నువ్వుల్లో పీచు చాలా ఎక్కువ కాబట్టి కడుపు ఆరోగ్యాన్ని కాపాడటంలో వాటి పాత్ర ఎంతో ఎక్కువ. మలబద్ధకాన్ని కూడా నివారిస్తాయి. రోజూ గుప్పెడు నువ్వులు తినేవారిలో నోటి ఆరోగ్యం బాగుంటుంది. పళ్లు, చిగుర్ల వ్యాధులు తగ్గుతాయి. నువ్వులు క్రమం తప్పకుండా తినేవారిలో చర్మం మిలమిల మెరుస్తుంది. నువ్వుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం ఉండడం వల్ల అవి వాపు, మంట నొప్పిని తగ్గిస్తాయి.
అవమానం... అసమానం
ఆత్మీయం
మనం ప్రతి వారిచేతా గౌరవింపబడాలి అని ప్రతి మనిషీ కోరుకుంటాడు తన గౌరవానికి. ఏ కాస్త భంగం వాటిల్లినా, తనకు అవమానం జరిగినట్లుగా భావిస్తాడు. వ్యక్తిలో ఉండే సంస్కారాలను బట్టి, అతని విద్యాగంధాన్ని బట్టి అవమానం స్థాయిలో హెచ్చుతగ్గులుంటాయి. అవమానం అనేది ఒక వ్యక్తి తనకు ఎదురైన వివిధ సంఘటనలపై స్పందించే తీరుపైన ఆధారపడి ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు అంతగా స్పందించని వ్యక్తి, ఇతరులతో కలిసి ఉన్నప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు.
వ్యక్తిగతంగా, మానసికంగా, శారీరకంగా, భావోద్వేగపరంగా వ్యక్తి ఎంత బలంగా ఉంటే అవమానం గురించి అంత తక్కువగా ఆలోచిస్తాడు. బలహీనంగా ఉంటే అవమానం ఎక్కువగా జరిగినట్లు భావిస్తాడు. అవమానం వల్ల మనిషి అభద్రతా భావానికి లోనవుతాడు. హింసాత్మకంగా మారతాడు. అవమానాన్ని తట్టుకోవాలంటే మానసికంగా బలంగా ఉండాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలగాలి. ఆధ్యాత్మికంగా ఉన్నతిని కలిగి ఉండాలి. క్షమాగుణం కలిగి ఉండాలి.
తనపై తనకు అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఇతరులను అవమానం చేయాలన్న ఆలోచన ఉండకూడదు. సకల శాస్త్ర సారం ఏమి చెబుతోందంటే ఇతరులు తనకు ఏమి చేస్తే తనకు అవమాన మో, బాధాకరమో, అవి తాను ఇతరులకు చేయకూడదు. అదేవిధంగా ఇతరులు ఏమి చేస్తే తనకు ఆనందం కలుగుతుందో, సంతోషం చేకూరుతుందో అది తాను ఇతరుల పట్ల ఆచరించాలి. అలాంటివారికి మానావమానాల ప్రసక్తి ఉండదు
కలసి ఉంటే కలదు సుఖం
ఫిటిప్స్
హై హీల్స్ నడకకు అందాన్నిస్తాయి. కొంచెం నొప్పిగా కూడా అనిపిస్తాయి. ఈ నొప్పి.. హీల్స్ సరిపడకపోవడం వల్ల కాదు. పాదాల్లోని నరాలపై పడే ఒత్తిడి వల్ల! అయితే, చిన్న టెక్నిక్‌తో ఈ నొప్పిని తప్పించుకుని హై హీల్స్‌తో ఈ భూమిని ఏలేందుకు అమ్మాయిలు సిద్ధం కావచ్చు! ఎలాగంటే... చిన్న టేప్ తీసుకోండి. అడ్హెసివ్ టేప్, స్కాచ్ టేప్, న్యూడ్ కలర్ మెడికల్ టేప్.. ఏదైనా సరే. అవన్నీ లైట్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి. అతికించడానికి, అతికించాక తొలగించడానికీ అవి తేలిగ్గా ఉంటాయి.
ఆ టేప్‌తో బొటన వేళ్ల పక్కన ఉండే రెండు వేళ్లను కలిపి గట్టిగా చుట్టేయండి. తర్వాత మీ పాదాలను హై హైల్స్‌లోకి దూర్చేయండి. ఆ తర్వాత నడవండి. కొద్దిరోజుల్లోనే మీ హై హీల్స్ మీకు మంచి ఫ్రెండ్స్ అవుతాయి. అయితే హై హీల్స్ వల్ల భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉన్న ఆరోగ్య సమస్యలకు మాత్రం ఈ టేపు టిప్పు ఔషధంలా పనిచేయదు. ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే.
ఆ రుణం అలా తీరదు...
ఆత్మీయం
పితృరుణం, మాతృరుణం అని రెండుంటాయి. పితృరుణం తీర్చుకోవాలనుకుంటే... దానికి ఒక నిర్దిష్ట యాగం చేస్తే పితృరుణం తీరిపోతుందంటుంది శాస్త్రం. కానీ మాతృరుణం తీరడానికి ఏ యాగం లేదు, యజ్ఞం లేదు... అమ్మ రుణం తీర్చుకోవడమన్నమాటే లేదంటుంది శాస్త్రం. అయితే, దురదృష్టవశాత్తూ అటువంటి అమ్మను వృద్ధాశ్రమాలకి పంపించే ప్రబుద్ధులు తయారవుతున్నారు. బతికి ఉండగా అన్నం పెట్టి ఆదరించని ఈ ‘పెద్ద మనుషులు’ వారు పోయాక మాత్రం ఎంతో శ్రద్ధాభక్తులతో నిత్యకర్మలు ఘనంగా జరిపిస్తారు. చివరి రోజున రకరకాల దానాలు చేస్తారు.
ఖరీదైన వస్తువులు, పాత్రలు, పుస్తకాలు వంటి వాటి మీద వారి పేరు కొట్టించి మరీ బంధుమిత్రులకు వారి జ్ఞాపకాలుగా పంచుతుంటారు. వారి రుణం తీర్చేసుకున్నట్లు పోజు కొడుతుంటారు. అమ్మానాన్నా జీవించి ఉన్నప్పుడు వేళకు ఇంత అన్నం పెట్టి, ఆదరిస్తే... ప్రేమగా పలకరిస్తే వారు మరికొంతకాలం హాయిగా జీవించి ఉండేవారేమో!
తెల్లసొనతో నల్లమచ్చలు మాయం
బ్యూటిప్స్
ముఖం పేలవంగా, కాంతిహీనంగా, నల్ల మచ్చలు, ముడతలు నిండి ఉంటే కోడిగుడ్డులోని తెల్లసొన బాగా పని చేస్తుంది. రకరకాల కాంబినేషన్‌లతో ప్యాక్ వేసుకోవడం సాధ్యం కాని వాళ్లు కోడిగుడ్డు మాత్రమే ఉపయోగించి మంచి ఫలితాన్ని పొందవచ్చు. మొదటగా ముఖాన్ని రోజూ వాడుతున్న సబ్బుతోనే శుభ్రంగా కడుక్కోవాలి. ఆరిన తర్వాత కోడిగుడ్డు పగలకొట్టి తెల్లసొనను మాత్రమే గిన్నెలోకి వంపుకోవాలి.
ఫోర్కుతో కాని ఎగ్ బీటర్‌తో కాని నురగ వచ్చేటట్లు కలిపి ఆ సొనలో దూదిని ముంచి ముఖానికి పట్టించాలి. గడ్డం నుంచి మొదలు పెట్టి పెదవులు, చెంపలు, ముక్కు, నుదురు అంతటికీ సమంగా పట్టించి ఆరే వరకు ఉండాలి.ఆరిన తర్వాత గోరు వెచ్చటి నీటితో ఏదైనా సబ్బు వాడి ముఖాన్ని శుభ్రంగా కడగాలి.ముఖం మీద నల్ల మచ్చలు ఎక్కువగా ఉంటే వారానికి నాలుగైదు సార్లు ఈ ట్రీట్‌మెంట్ చేస్తే నెల రోజుల్లోనే ఫలితం ఉంటుంది.
కోడిగుడ్డు తెల్లసొన రాస్తే చర్మానికి నునుపుదనం వస్తుంది. తెల్లదనం తీసుకురావడంతోపాటు పొడిబారిన చర్మాన్ని మృదువుగా కూడా మారుస్తుంది. కోడిగుడ్డు తెల్లసొన రాయడం వల్ల ముఖం ముడతలు పడకుండా ఉంటుంది. యంగ్‌గా కనిపిస్తారు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565