MohanPublications Print Books Online store clik Here Devullu.com

ధ్రువపత్రంతో వివాహ జీవితం దృఢం!_marriage certificate




     ధ్రువపత్రంతో వివాహ జీవితం దృఢం!


ధ్రువపత్రం దంపతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే..

* పెళ్లి జరిగిందనడానికి అతి ముఖ్యమైన, బలమైన సాక్ష్యం ఈ ధ్రువపత్రం.

* విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నవారు తమ భాగస్వామికి పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునేటపుడు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ను తప్పక జత చేయాల్సి ఉంటుంది. అంతేకాదు అక్కడ వారు ఉద్యోగం చేసేందుకు ఆ దేశం అనుమతి ఇవ్వాలన్నా ఈ సర్టిఫికెట్‌ చాలా అవసరం!

* ఆర్థికపరమైన పలు అంశాలు వివాహ ధ్రువపత్రంతో ముడిపడి ఉన్నాయి. దురదృష్టవశాత్తు భార్యాభర్తల్లో ఎవరైనా మరణిస్తే మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులూ లేకుండా వారి ఆస్తిలో భాగస్వామికి వాటా సంక్రమిస్తుంది. అంతేకాదు ఆ వ్యక్తి పేరిట బ్యాంకులో డబ్బుండి నామినీ పేరు రాయకున్నా, జీవిత బీమా పథకాల్లో చేరి, నామినీని పెట్టకున్నా ఆయా మొత్తాలు, కుటుంబ భృతి కూడా ఎటువంటి చిక్కులు లేకుండా భాగస్వామికి లభిస్తాయి.

* ఏవైనా సమస్యల వల్ల భార్యాభర్తలు విడిపోవాల్సి వచ్చినపుడు పిల్లలు ఎవరి దగ్గర పెరగాలి, ఆస్తి పంపకాలు, మనోవర్తి విషయంలోనూ పెళ్లి ధ్రువపత్రమే కోర్టులో ప్రధానాధారం!

* నేటికీ సమాజంలో కులాంతర, మతాంతర వివాహాలకు చిక్కులు తప్పడంలేదు. అటువంటి వివాహాలకు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ చాలా రక్షణ. ఈ సర్టిఫికెట్‌ ఉంటే ఏ పంచాయితీ వ్యవస్థలూ, పెద్దలూ పెళ్లిని రద్దు చేసే అవకాశముండదు.

* సంతానం లేని దంపతులు ప్రభుత్వం నిర్వహిస్తున్న శిశు సంక్షేమ సంస్థల నుండి పిల్లలను దత్తత తీసుకోవాలంటే వివాహ ధ్రువ పత్రం తప్పక చూపాలి.

* కొన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడానికీ ఆధార్‌, వయసు ధ్రువపత్రాలతో పాటు వివాహ ధ్రువపత్రం తప్పనిసరి.

* పెళ్లిని రిజిస్టర్‌ చేయించడానికి వయసు ధ్రువపత్రాలు తప్పనిసరి. కాబట్టి అధికారులు బాల్య వివాహాలను అడ్డుకునే వీలుంటుంది. తద్వారా సమాజానికీ మేలు చేకూరుతుంది.

ఈ ధ్రువపత్రం పొందడమెలా? 
* పెళ్లయిన నెలరోజుల్లోగా తమ నివాసానికి దగ్గరలోని సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులో దంపతులిద్దరూ హాజరు కావాలి. ఇద్దరి పాస్‌పోర్టు సైజు ఫొటోలు, వయసు, చిరునామా ధ్రువపత్రాలు, ఇద్దరు సాక్షుల సంతకాలతోపాటు మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ దరఖాస్తు పూర్తి చేసి ఇద్దరూ సంతకం చేసివ్వాలి. ఒక్కరోజులో పెళ్లి రిజిస్టర్‌ అవుతుంది. పెళ్లయిన ఐదు సంవత్సరాల వరకు రిజిస్ట్రేషన్‌ చేయించుకునే అవకాశం ఇపుడు కల్పించారు.

* హిందూ వివాహ చట్టం 1955 లేదా ప్రత్యేక వివాహ చట్టం 1954.. రెంటిలో దేని ద్వారానైనా వివాహాన్ని రిజిస్టర్‌ చేయించుకోవచ్చు.                                        - సంధ్యారాణి


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list