దురలవాట్లను దూరం చేసే అమ్మవారు
ఆ ఆలయంలో అడుగుపెడితే దురలవాట్లు దూరం అవుతాయని, ఆమె సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే... చక్కటి విద్యాబుద్ధులు అలవడతాయని భక్తుల నమ్మకం. ఆ తల్లికి నివేదన చేసిన ప్రసాదం స్వీకరిస్తే చాలు మహాపండితులవుతారనీ, అనారోగ్యాలు తొలగిపోతాయనీ, సకల సౌభాగ్యాలూ సిద్ధిస్తాయనీ అందరూ అనుకుంటారు. జగద్గురువు ఆదిశంకరులవారే స్వయంగా ప్రతిష్ఠించిన ఆ అమ్మవారే మూకాంబికాదేవి. కొల్లూరులో కొలువైన ఆ అమ్మ చల్లటి సన్నిధి సకల సంపదలకూ పెన్నిధి.కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో... దట్టమైన అడవుల మధ్యన నెలకొని ఉంది మూకాంబికాలయం. ఆ రాష్ట్రంలోని ఏడు మోక్షపురాల్లో కొల్లూరు మూకాంబిక గుడి ఒకటి. ఆలయం ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో అయినా, ఆమెను ఎక్కువగా సందర్శించుకునేది కేరళీయులే కావడం విశేషం.
క్షేత్రపురాణం: జగద్గురు ఆదిశంకరులు కుడజాద్రి పర్వతంపై ఉండి అమ్మవారి కోసం తపస్సు చేశారు. ఆయన తపస్సుకు మెచ్చి, అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆమెను తనతోబాటు తన జన్మస్థలమైన కేరళకు రావలసిందిగా శంకరులు చేసిన ప్రార్థనకు అంగీకరించిన దేవి, అందుకు ఒక షరతు విధిస్తుంది. అదేమంటే, తాను వచ్చేటప్పుడు శంకరులు వెనక్కు తిరిగి చూడకూడదని, ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే అక్కడే తాను శిలలా మారిపోతానంటుంది. అందుకు అంగీకరిస్తాడు శంకరులు. ముందుగా శంకరులు, వెనుక అమ్మవారు వెళ్తూ ఉంటారు. కొల్లూరు ప్రాంతానికి రాగానే అమ్మవారి కాలి అందెల రవళి వినిపించకపోవడంతో, వెనక్కు తిరిగి చూస్తాడు శంకరులు. ఇచ్చిన మాట తప్పి వెనక్కు తిరిగి చూడడంతో అమ్మవారు అక్కడే శిలలా మారిపోతుంది.
తన తప్పిదాన్ని మన్నించమని ప్రార్థించిన శంకరులతో తనను అక్కడే ప్రతిష్ఠించమని చెబుతుంది. దీంతో ఆదిశంకరులు శ్రీ చక్రంతోపాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు.
శంకరుల వెంట వచ్చేటప్పుడు అమ్మవారు మాట్లాడనందువల్ల ఆమెకు మూకాంబిక అనే పేరు వచ్చింది. నాటినుంచి అమ్మవారికి ఆదిశంకరులు సూచించిన విధానంలోనే పూజాదికాలు జరుగుతున్నాయి. మూకాంబిక ఆలయాన్ని సందర్శించుకున్నవారు ఒక్కసారైన హార తి సమయంలో అమ్మవారి దివ్యమంగళరూపాన్ని సందర్శించుకోవాలని తహతహలాడుతుంటారు. అమ్మవారికి ప్రదోష కాలంలో ఇచ్చే హారతికి ప్రత్యేకమైనది.
సౌపర్ణికానది: ఆలయానికి సమీపంలో సౌపర్ణికా నది ప్రవహిస్తుంటుంది. ఈ నది లోతు తక్కువ. కుడజాద్రి పర్వతం నుంచి ఉద్భవించే ఈ నదిలో ఇతర నదీపాయలు కూడా కలుస్తాయి. ఈ నది ఒడ్డున సుపర్ణుడు అంటే గరుత్మంతుడు తన తల్లి దుఃఖాన్ని పోగొట్టమని కోరుతూ అమ్మవారిని గురించి ఘోర తపస్సు చేసి వరం పొందాడట. ఆ నాటినుంచి ఈ నదికి సౌపర్ణికానది అని పేరు వచ్చింది. ఈ నదిలో అనేక వనమూలికలు ఉంటాయని, అందువల్ల ఈ నదిలో స్నానం చేస్తే చర్మరోగాలు నయం అవుతాయని చెబుతారు. ఇతర సందర్శనీయ స్థలాలు: ఆలయ బయటి ప్రాకారంలో విఘ్నేశ్వరుడు, కుమారస్వామి తదితర దేవతల సన్నిధులున్నాయి. కొల్లూరు చుట్టుపక్కల మంగుళూరు మంగళాదేవి, ఉడిపి కృష్ణుడు, కుందాపూర్, భత్కల్, షిమోగా, ధర్మస్థల, శృంగేరీ శారదాపీఠాలు సందర్శనీయ స్థలాలు. ఇక్కడ గల కుటచాద్రి పర్వత శ్రేణి అందమైన అటవీ సంపదతో ఆకట్టుకుంటుంది. ఈ పర్వతశ్రేణి ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.
ఎలా వెళ్లాలి?
మంగుళూరు నుంచి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు కొల్లూరుకు వెళుతుంటుంది. ప్రైవేటు వాహనాలు కూడా ఉన్నాయి. మంగుళూరుకు నేరుగా అన్ని ప్రధాన నగరాలనుంచి బస్సులు, రైళ్లు ఉన్నాయి. మంగుళూరులో విమానాశ్రయం కూడా ఉంది. – డి.వి.ఆర్.భాస్కర్
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565