లవకుశలు ఇక్కడే పుట్టారట!
సీతను రాముడు అడవులకు పంపడం, అక్కడ వాల్మీకి ఆశ్రమంలో ఆమె లవకుశులకు జన్మనివ్వడం, తర్వాత అశ్వమేధయాగ సమయంలో రామలక్ష్మణులతో లవకుశులు యుద్ధంచేయడం రామాయణంలో మనకు బాగా తెలిసిన ఘట్టాలే. అయితే ఆ సమయంలో సీతమ్మతల్లి ఉన్న చోటు ఇదేనని కర్ణాటక రాష్ట్రం ఆవని వాసులంటారు. దానికి చాలా ఆనవాళ్లే చూపిస్తారు కూడా!
సీతమ్మతల్లికి గుళ్లు ఉండటం బాగా అరుదనే చెప్పాలి. శివుడు లేకుండా పార్వతినీ, రాముడు లేకుండా సీతనూ దేవాలయాల్లో చూడటం, వీళ్లిద్దరినీ ఒకే గర్భగుడిలో దర్శించడం ఇంకా అరుదు. కర్ణాటక రాష్ట్రం, కోలారు జిల్లా, ముల్‌బాగల్ తాలూకాలోని ఆవని అలాంటి పుణ్యక్షేత్రం. ఇక్కడి కొండమీద పార్వతీ సీతమ్మలను పక్కపక్కన దర్శించొచ్చు. ఇక్కడే రామలక్ష్మణులూ, భరతశత్రుఘ్నులతో పాటు సుగ్రీవాది వానరులూ తమ తమ పేర్లతో శివలింగాలను ప్రతిష్ఠించారు. వాల్మీకి తపస్సు చేసిన గుహనీ ఇక్కడ చూడొచ్చు. మొత్తంగా ఆవనిలోని ప్రతి అణువూ పరమ పవిత్రమే.
రామాయణ కాలంలో...
గర్భవతైన సీతమ్మను రాముడి ఆజ్ఞ మేరకు అడవుల్లో వదులుతాడు లక్ష్మణుడు. తర్వాత ఆమె వాల్మీకి ముని ఆశ్రమానికి చేరుతుంది. సీతమ్మను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటాడు వాల్మీకి మహర్షి. ఆశ్రమంలోనే లవకుశులకు జన్మనిస్తుంది సీత. లవకుశులు అక్కడే పెరుగుతూ సకల విద్యలనూ అభ్యసిస్తారు. అప్పుడు ఆశ్రమం దగ్గరలోనే ఓ చోట సీతమ్మ పార్వతీదేవిని పూజించేదట. తర్వాత రాముడు అశ్వమేధయాగం చేస్తాడు. అప్పుడు వదిలిన గుర్రాన్ని లవకుశులు కట్టేయడంతో రాముడూ ఆయన సోదరులకీ, లవకుశులకూ మధ్య యుద్ధం జరుగుతుంది. తర్వాత విషయం తెలుసుకున్న రామభద్రుడు కన్నబిడ్డల మీద యుద్ధానికి దిగినందుకు ఎంతో వ్యధ చెందుతాడు. ఈ పాపానికి పరిహారంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సహా వానరులూ రామ పరివారమంతా అక్కడే శివలింగాలను ప్రతిష్ఠించి ప్రార్థిస్తారు. ఉత్తర రామాయణంలోని ఈ ఘట్టం జరిగిన చోటు ఇదేనని ఆవని స్థలపురాణంలో తెలుస్తోంది. అప్పుడు రాముడు ప్రతిష్ఠించిన లింగమే రామలింగేశ్వర స్వామిగా ఆవనిలో పూజలందుకుంటోంది. అంతేకాదు లక్ష్మణేశ్వర లింగమూ, భరత శత్రుఘ్నులు ప్రతిష్ఠించిన లింగాలనూ మనం ఇప్పటికీ దర్శించొచ్చు. నిజానికి ఆవనిలో మొత్తం 1100 దాకా శివలింగాలుండేవట. తురుష్కుల దండయాత్ర కారణంగా ఇప్పుడు వీటిలో కొన్నే మిగిలి ఉన్నాయి. ఆవనిలోని శివలింగాలకు చోళరాజులు గుళ్లు కట్టించారు. పల్లవులూ, విజయనగర రాజులూ వీటిని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం దేవాలయం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది.
సీతమ్మ ఆనవాళ్లివే...
సీతాదేవి పూజించినట్టుగా చెబుతున్న పార్వతీదేవి స్వయంభూ విగ్రహాన్ని ఇప్పుడు కూడా ఆవని కొండమీద ఉన్న సీతా పార్వతి ఆలయంలో చూడొచ్చు. తొలుత ఈ గుళ్లొ పార్వతీ దేవి మాత్రమే ఉండేదట. ఒకసారి ఆది శంకరాచార్యులు ఈ ఆలయాన్ని దర్శించినప్పుడు ఆయనకు ఆదిశక్తి కలలో కనిపించి తన విగ్రహం పక్కనే సీతాదేవి విగ్రహాన్నీ ప్రతిష్ఠించమని చెప్పిందట. శంకరులు దాన్ని శిరసావహించారు. ఇక ఇక్కడి కొండ మీద వాల్మీకి తపస్సు చేసుకున్న గుహగా పిలిచే ఓ గుహను మనం చూడొచ్చు. లవకుశుల జన్మప్రదేశం, పవళించిన తొట్టె, ఉగ్గుగిన్నె, పసుపు కుంకుమ గిన్నెలు, నీళ్లు కాచే కాగు తదితరాల శిలామయ చిహ్నాలు ఇక్కడ కనిపిస్తాయి. సీతాదేవి బట్టలుతికిన బావి, స్నానం చేసిన కొలను, రామచంద్రుడితో లవకుశులు యుద్ధం చేస్తున్నారని తెలిసి ఆమె దుఃఖించిన చోటు తదితరాలుగా చెప్పే కొన్ని ప్రదేశాలూ దర్శనమిస్తాయి. కొండమీద లవకుశులు, బృహస్పతి, జాంబవంతుడు, ఆంజనేయుడు ప్రతిష్ఠించిన లింగాలకు చిన్న గుళ్లున్నాయి. అడవిలోకి వెళ్లినప్పుడు సీత దాహం వేస్తోందనడంతో లక్ష్మణుడు ఒక బాణం వేసి కొలనును సృష్టించాడట. దాన్నే ధనుష్కోటిగా పిలుస్తారు. కొండ మీద చాలా కొలనులున్నాయి. కలియుగంలో తీర్థాలు దుష్టసంపర్కం వల్ల కలుషితమవుతాయి అని భూమి మీద తీర్థాల్లో స్నానమాచరిస్తున్న దేవతలతో అన్నాడట బృహస్పతి. అందుకు ఏదైనా నివారణను సూచించమని దేవతలు అడగడంతో ఆవని క్షేత్రానికి కలిదోషం అంటదని చెప్పాడట. అందుకే తీర్థాభిమాన దేవతలంతా ఇక్కడి కోనేరుల్లో ఉంటారని చెబుతారు.
రుషిధామం...
ఈ ఆవని క్షేత్రం ఒకప్పుడు నైమిశారణ్య ప్రాంతంలో ఉండేదట. ఇక్కడ యోగనిష్ఠాగరిష్ఠులైన అగస్త్య, కౌశిక, కణ్వ, మార్కండేయ, కపిల, గౌతమ, భరద్వాజ తదితర 2800 మంది మునులు నివసించారట. ఇక్కడ వీరంతా హావని యజ్ఞాన్ని చేశారట. దాని పేరు మీదుగా ఈ చోటుకి ఆవని అనే పేరు వచ్చిందంటారు. ఆవని క్షేత్రాన్ని ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన భక్తులు దర్శిస్తూ ఉంటారు. ఇక్కడి రామలింగేశ్వరుడికి శివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. రథోత్సవం సహా పుష్పపల్లకీసేవ, అర్చకులు కలశాలను తలపై పెట్టుకుని నిర్వహించే గరిగ ఉత్సవాలకు వేలాది భక్తులు హాజరవుతారు. ఈ సమయంలో గిరి ప్రదక్షిణ ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఇదే సమయంలో 20 రోజుల పాటు జరిగే పశువుల పరసగా పిలిచే పశువుల సంతకు మూడు రాష్ట్రాల నుంచీ జనం వస్తారు.
తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై ముల్‌బాగల్‌లో దిగి అక్కడి నుంచి 12 కి.మీ ప్రయాణించి ఆవని క్షేత్రాన్ని చేరుకోవచ్చు. - ఈరళ్ల శివరామ ప్రసాదు —
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565