గురు అనుగ్రహం
అది అమరావతీ నగరం. దేవేంద్రుడు తన గణాలతో కొలువు దీరి ఉన్నాడు. అప్సరాంగనలు తమ అద్వితీయమైన నృత్యగానాలతో సభికులను రంజింపజేస్తున్నారు. ఇంద్రుడు శచీదేవితో కూడి ఆ నృత్యగానాలను మైమరచిపోయి చూస్తున్నాడు. ఆ సమయంలో దేవగురువైన బృహస్పతి కొలువులో ప్రవేశించాడు. ఇంద్రుడు ఆయనను చూసి కూడా చూడనట్లు ఉన్నాడు. బృహస్పతి మనసు నొచ్చుకుంది.
వెంటనే వెనక్కు తిరిగి తన నివాసానికి వెళ్లిపోయాడు. నాట్యం పూర్తయిన తర్వాత ఇంద్రుడు ఈ లోకానికి వచ్చాడు. తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు. వెంటనే గురువు పాదాల మీద పడి ఆయనను ప్రసన్నం చేసుకుందామన్న ఆలోచనతో బృహస్పతి నివాసానికి బయలుదేరాడు. ఇది తెలుసుకున్న బృహస్పతి అక్కడినుంచి మాయమవడంతో గురు నివాసానికి వెళ్లి ఆయనను దర్శించుకోలేక ఇంద్రుడు సిగ్గుతో తిరిగి వస్తాడు.
ఇంద్రుడు గురువు అనుగ్రహానికి దూరమయ్యాడని గ్రహించిన రాక్షసులు ఇదే తగిన సమయంగా భావించి అమరావతిని ముట్టడించారు. అతి సునాయాసంగా దేవతలను జయించారు. దిక్కుతోచక దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని ఆశ్రయించారు. ఆయన ఇంద్రాది దేవతలకు ఉద్దేశించి ‘‘గురువు అనుగ్రహానికి దూరమైనవారిని ఎవరూ ఏమీ చేయలేరు. రాక్షసులు తమ గురువైన శుక్రాచార్యుని ఆరాధించి, ఆయన అనుగ్రహాన్ని అపారంగా పొంది, బలాన్ని, శక్తిసామర్థ్యాలను పుంజుకుని మిమ్మల్ని జయించగలిగారు.
మీరందరూ కలసి ఎలాగైనా బృహస్పతి అనుగ్రహాన్ని తిరిగి సంపాదించే ప్రయత్నం చేయండి. బృహస్పతి కొంతకాలం పాటు తపస్సమాధిలో నిమగ్నం అయ్యాడు. ఈలోగా మీరు విశ్వరూపుడనే అతన్ని గురువుగా చేసుకుని ఆయన ఆశీస్సులు పొందండి’’అని సలహా ఇచ్చాడు. దేవతలు విశ్వరూపుని గురువుగా చేసుకుని ఆయన సలహా మేరకు నారాయణ కవచాన్ని పొంది, దాని ప్రభావంతో తిరిగి రాక్షసులను జయించారు. నెమ్మదిగా ఇంద్రాది దేవతలందరూ కలసి బృహస్పతిని ఆరాధించి ఆయనను ప్రసన్నం చేసుకుని తిరిగి తమ గురువుగా చేసుకున్నారు.
ఎంతటి వారికైనా గురువు అనుగ్రహం అవసరం అని బోధించే ఈ కథ వ్యాసప్రణీతమైన మహాభారతంలోనిది. వ్యాసుడు శంఖచక్రాలు లేని శ్రీ మహావిష్ణువు, మూడవ కన్నులేని శివుడు, నాలుగు ముఖాలు లేని బ్రహ్మ. అటువంటి వ్యాసభగవానుడు ఉద్భవించిన ఆషాఢపున్నమికే గురుపౌర్ణమి అని పేరు. ఈ పర్వదినాన గురువులను పూజించడం, సేవించడం శుభఫలితాలనిస్తుంది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565