MohanPublications Print Books Online store clik Here Devullu.com

మహాకాళి బోనాలు-Mahakali Bonalu


మహాకాళి బోనాలు
ప్రకృతి అంతా శక్తి సమన్వితం. పరమాత్మను జగన్నాథుడిగా, ప్రకృతిని జగన్మాతగా ఆరాధించే సంప్రదాయం అనాదిగా ఉంది. మానవ జీవన వికాసం ప్రకృతి కరుణ వల్ల క్రమానుగతంగా కొనసాగుతోందని పలువురి ప్రగాఢ విశ్వాసం. అందుకే జగజ్జననిగా, మూల బ్రహ్మాత్మికగా, ఆద్యశక్తిగా ప్రకృతిని దర్శిస్తారు. సృష్టి, స్థితి, లయ కారకమైన ప్రకృతేశ్వరిని వివిధ రీతుల్లో ఆరాధిస్తూ సమాజం తన కృతజ్ఞతా భావం చాటుకుంటుంది.
జ్ఞానం, సంపద, శక్తి- ఈ మూడింటినీ ప్రకృతికి అధినాయకురాలైన అఖిలాండేశ్వరి అనుగ్రహిస్తోందని భక్తుల నమ్మకం. ఆ అమేయశక్తి పట్ల ఆదరాన్ని, ప్రేమాస్పద భక్తితత్పరతను వెల్లడించుకొనేందుకే వారు అమ్మతల్లికి ఉత్సవాలు, జాతరలు, కొలుపులు నిర్వహిస్తారు.
ప్రకృతి ఆకృతులైన విభిన్న కళలే గ్రామదేవతలు. ఈ మాతృశక్తి రూపాల్ని ఆషాఢ మాసంలో శ్రామికులు, కర్షకులు తమదైన సంప్రదాయ సంవిధానంలో సేవించుకుంటారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పచ్చదనం సర్వత్రా వెల్లివిరియాలని, ఆరోగ్య సౌభాగ్యాలు కొనసాగాలని కోరుతూ బోనాల్ని శక్తిరూపాలకు సమర్పిస్తారు. భక్తిచైతన్యం, సామాజిక సమైక్యత ప్రస్ఫుటమవుతాయి. జంటనగరాల్లో ఆషాఢ బోనాల సంబరం అంబరాన్ని తాకుతుంది. సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహాకాళి జాతరతో ఈ వైభవం పతాక స్థాయికి చేరుకుంటుంది.
సురిటి అప్పయ్య అనే భక్తుడు 1815లో ఉజ్జయినీ మహాకాళి విగ్రహాన్ని స్థాపించి, ఆలయం నిర్మింపజేశాడు. ఆ ప్రాంగణంలోని ఓ బావికి 1864లో మరమ్మతు చేస్తున్నప్పుడు, తవ్వకాల్లో మాణిక్యాలదేవి విగ్రహం లభించింది. ఆ విగ్రహంతో పాటు, అప్పటివరకు కొయ్య విగ్రహంగా ఉన్న మహాకాళి స్థానంలో ఒక రాతి విగ్రహాన్నీ ప్రతిష్ఠాపన చేశారు. అప్పటినుంచి మహాకాళి, మాణిక్యాలదేవి ‘జంట దేవతలు’గా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆశ్రిత కల్పవల్లిగా భావించే మహాకాళి భక్తులు ఏటా బోనాలు సమర్పిస్తున్నారు. ‘నీ కృప వల్ల మేం సుభిక్షంగా ఉన్నాం. మమ్మల్ని ఇలాగే సర్వదా అనుగ్రహించు తల్లీ!’ అనే భావాన్ని వ్యక్తీకరించడమే బోనాలు, ఉపహారాల సమర్పణలోని ఆంతర్యం!
సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి ఆషాఢ జాతర- ఘటోత్సవంతో ప్రారంభమవుతుంది. ‘ఎదుర్కోలు’గా వ్యవహరించే ఈ ప్రక్రియలో, ఓ కలశంలోకి అమ్మవార్ని ఆవాహన చేసి, పురవీధుల్లో మేళతాళాలతో వూరేగిస్తారు. ఘటోత్సవం తరవాత బోనాలు(అన్న పదార్థాలు) సిద్ధం చేస్తారు. ప్రత్యేక పాత్రలో బోనాల్ని నింపి, పసుపు కలిపిన జలపాత్రనూ తలపై ధరించి మహిళలు ఆలయానికి తరలి వెళతారు. జగదంబకు ఆ పదార్థాల్ని నివేదించి, ‘సాక బెట్టుట’ అనే వేడుక ద్వారా, తమ లోగిళ్లను చల్లగా చూడాలని తల్లిని వేడుకుంటారు. శాఖ- అంటే ఓ వేప కొమ్మను పసుపు కలిపిన నీటిలో ఉంచి, మహాకాళికి అభిషేకించడమే- ‘సాక బెట్టుట’. ఫలహారపు బండ్లు, గావు పట్టు, సాగనంపు రంగం వంటి ఘట్టాలతో, పోతురాజుల నృత్య విన్యాసాలతో మహాకాళి జాతర మహా భక్తితరంగితమవుతుంది.
‘కాకతి’మాతను ఇలవేల్పుగా పూజించిన కాకతీయులు, అమ్మతల్లికి ఆషాఢ ఉత్సవాలు నిర్వహించేవారు. గోల్కొండ కోటలోని జగదంబిక ఆలయాన్ని కాకతీయులు నిర్మించినట్లు చెబుతారు. బోనాల వేడుకలు ఏటా ఈ ఆలయం నుంచే ప్రారంభమవుతాయి.
ప్రకృతి శక్తి అనుగ్రహించిన అన్నం లేదా భోజనాన్ని తిరిగి భక్తిపూర్వకంగా ఆ అమ్మకు నివేదన చేయడమే ‘బోన సమర్పణం’. భోజనానికి రూపాంతరమే బోనం. భోజనం ద్వారా శక్తిని కలిగించే ఆ ‘దివ్య శక్తి’కి ధన్యవాదాలు తెలియజేసే జానపదుల ఆధ్యాత్మిక కార్యక్రమమే బోనాల సంబరం. దుర్గతి, దుఃఖం, దుస్సాధ్యం, దుష్టత్వం వంటి దుర్వికారాల్ని దూరంచేసే మాతృశక్తిని ఆషాఢ ఉత్సవ నేపథ్యంగా ఆరాధిస్తారు. ఈ జాతరలో జగదీశ్వరి అవతార తత్వం ప్రస్ఫుటమవుతుంది. ఘటోత్సవం- సృష్టి నిర్మాణానికి సంకేతం, వూరేగింపు- స్థితి కారకత్వానికి సూచిక. చివరలో సాగనంపు- లయానికి ప్రతిబింబంగా నిలుస్తుంది.- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌



బోనాలు ఎలా జరుగుతాయి?

ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ... పేరు ఏదైతేనేం! తమను చల్లగా చూడాలంటూ గ్రామస్తులు ఒక శక్తిస్వరూపాన్ని ఆరాధించడం ఆనవాయితీ. తమ గ్రామానికి ఎలాంటి ఆపదా రాకుండా, తమ ఇంటికి ఏ కష్టమూ లేకుండా చూడాలని ఆ అమ్మతల్లిని తల్చుకుంటారు. మరి అలాంటి గ్రామదేవతలను ఘనంగా కొల్చుకునేందుకు ఓ సందర్భం ఉండాలి కదా! ఆ సందర్భమే బోనాలు!! భోజనం అన్న పదానికి వికృతే బోనం! ఇలా అమ్మవారికి భోజనం సమర్పించే ఆచారం ఒక్క తెలుగునాట మాత్రమే కనిపిస్తుంది. ఆషాఢమాసం రాగానే తెలంగాణ, రాయలసీమల్లోని ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఒక అనువైన రోజుని ఎన్నుకొంటారు. ఈ రోజున స్త్రీలు రాగి లేదా మట్టికుండలో అమ్మవారి కోసం వంట వండుతారు. చక్కెర పొంగలి, కట్టె పొంగలి, ఉల్లిపాయలు కలిపిన అన్నం.... ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు అమ్మవారి కోసం బోనం తయారుచేస్తారు.



బోనం ఉన్న కుండని పసుపుకుంకుమలతో అలంకరించి, వేపాకులు చుట్టి... దాని మీద జ్యోతిని వెలిగిస్తారు. ఇలా సిద్ధం చేసుకున్న బోనాన్ని తలమీద పెట్టుకుని ఊరేగింపు మధ్య అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. అమ్మవారి ఆలయానికి బయల్దేరే సమయంలో ఒళ్లంతా పసుపు రాసుకుని, తడిబట్టలతో వెళ్తూ తమ భక్తినీ, పవిత్రతనూ చాటుకుంటారు. ఆలయానికి చేరుకున్న భక్తులను అమ్మవారి ప్రాంగణానికి తీసుకువెళ్లేందుకు పోతురాజు తోడుగా ఉంటాడు. ఒళ్లంతా పసుపు రాసుకుని, కాలిగి గజ్జలు కట్టుకుని, ఎర్రటి వస్త్రం ధరించి, కొరడా చేతపట్టుకుని భీకరంగా కనిపించేవాడే పోతురాజు. ఈ పోతురాజుని అమ్మవారికి సోదరునిగా భావిస్తారు. ఈ పోతురాజు కేవలం భక్తికే కాదు, ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా చూసుకుంటాడు. ఒకపక్క కోలాహలం చేస్తూనే, మరోపక్క ఆకతాయిలకు భయం కలిగిస్తాడు.

బోనాలు ఆషాఢం లేదా శ్రావణమాసంలో చేసుకోవడం వెనుక ఒక ఆరోగ్యపరమైన కారణం కనిపిస్తుంది. ఈ కాలంలో వ్యవసాయిక పనులు ఊపందుకుంటాయి. కాబట్టి చక్కగా వర్షాలు పడి, మంచి పంట పండాలని అమ్మవారిని కోరుకోవడం మానవనైజం. దానికి తోడు చలిగాలులు, వర్షాల వల్ల అంటువ్యాధులు ప్రబలుతాయి. ఆ అనారోగ్యాల నుంచి తమని కాపాడమంటూ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడమూ ఆంతర్యంగా కనిపిస్తుంది. బోనాల సమయంలో విస్తృతంగా పసుపు, వేపాకులని వాడటమే ఇందుకు సాక్ష్యం!



బోనాల జాతర కేవలం అమ్మవారికి నైవేద్యం అందించడంతో ముగిసిపోదు. గ్రామీణసంబరాలకి సంబంధించిన ప్రతి ఘట్టమూ ఇందులో కనిపిస్తుంది. తొట్టెల పేరుతో అమ్మవారికి కర్రలు, కాగితాలతో చేసిన అలంకారాన్ని సమర్పిస్తారు. రంగం పేరుతో ఎవరన్నా అవివాహితులు భవిష్యవాణిని చెప్పే ఆచారమూ ఈ జాతరలో ఉంటుంది. అమ్మవారిని ఘటం రూపంలో స్థాపించడం, ఆఘటాన్ని నిమజ్జనం చేయడమూ చూడవచ్చు.



ఒకప్పుడంటే బోనాల సమయంలో జంతుబలులు ఉండేవి. కానీ కాలం మారుతున్న కొద్దీ ఈ ఆచారం తగ్గినా అక్కడక్కడా కోళ్లనీ, మేకలనీ బలి ఇవ్వడం కనిపిస్తుంది. బోనాల రూపంలో అమ్మవారికి నివేదన చేసిన భోజనంతో పాటుగా మాంసాహారాన్ని వండుకుని తినడమూ సహజమే! కుటుంబం అంతా ఒక్కచోటకి చేరి చేసుకునే ఈ విందుభోజనంతో అటు భక్తితో పాటు ఇటు బంధాలు బలపడతాయి.

సాధారణంగా ఏదన్నా పండుగ వస్తే హైదరాబాద్లో ఉండేవారు తమ సొంత ఊళ్లకు వెళ్లడం సహజం. కానీ బోనాలలో మాత్రం హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేవారు సైతం నగరానికి చేరుకుంటారు. గోల్కొండ ఎల్లమ్మ, సికింద్రాబాదు మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి... ఇలా నగరంలోని ప్రతి కూడలిలోనూ జరిగే బోనాలు హైదరాబాద్కు వన్నె తెస్తాయి.
































No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list