కొలనుపాక వెయ్యేళ్ల చరిత
పుణ్య తీర్థం
హైదరాబాద్‌కు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది కొలనుపాక. యాదాద్రి దివ్యక్షేత్రం నుంచి 20 కిలోమీటర్ల దూరం! వీరశైవ మతాచార్యులు శ్రీశ్రీ రేణుకాచార్యుల జన్మస్థలంగా ఉన్న కొలనుపాక సోమేశ్వరాలయానికి వేయి సంవత్సరాల ఘనచరిత్ర ఉంది. సోమేశ్వర మహాలింగం నుంచి ఉద్భవించిన ఈ ఆచార్యులు వీరశైవమతాన్ని ప్రపంచానికి బోధించి లింగంలోనే ఐక్యం చెందాడని ప్రతీతి. కొలనుపాక శివారుప్రాంతాల్లో వివిధ సమయాల్లో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ శిలాశాసనాలు, దేవతా ప్రతిమల ఆధారంగా ఇక్కడి చరిత్ర మనకు తెలుస్తోంది. దక్షిణ కాశిగా పిలువబడే ఈ గ్రామంలో కాశీలో ఉన్నట్లుగా 18 సామాజిక వర్గాలకు మఠాలు ఉన్నాయి. అలాగే చండీశ్వరీ
ఆలయం, కోటిలింగేశ్వరాలయం, భైరవస్వామి ఆలయం, రుద్రమహేశ్వరాలయం, ఏకాదశరుద్రాలయం, మల్లికార్జున స్వామి ఆలయం, క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి ఆలయాలు ఉన్నాయి.
వీరశైవ మతగురువైన రేణుకాచార్యులు చండికాంబ సహిత సోమేశ్వరాలయంలోని స్వయంభూ లింగం నుంచి ఉద్భవించి చివరకు అదే లింగంలో ఐక్యం అయినట్లు వీరశైవ కవి షడక్షరుడు రాసిన రాజశేఖర విలాసంలో ఉంది. వీరశైవ మతోద్ధరణ కోసం రేణుకాచార్యులు ఎంతోకృషి చేశారని తెలుస్తోంది. ఈ శైవపీఠానికి సంబంధించిన వివరాల ప్రకారం తానుకేశుడనే శైవాచార్యునికి రుద్రమునీశ్వరుడనే కుమారుడున్నాడు. తానుకేశుని అనంతరం రుద్రమునీశ్వరుని లింగాయతు మతానికి అధిపతిని చేశాడు. ఆయన కొలనుపాక కేంద్రంగా వీరశైవ మతాన్ని స్థాపించి ప్రచారం చేశాడని తెలుస్తోంది.
ఘనమైన చరిత్ర
కొలనుపాక చండికాంబ సహిత సోమేశ్వరాలయానికి ఘనమైనచరిత్ర ఉంది. 10, 11వ శతాబ్దానికి చెందిన పశ్చిమ చాళుక్యుల కాలం నాటిది. నాటినుంచి నేటివరకు సోమేశ్వరుడు, చండికాంబ దేవతలు నిత్యపూజలు అందుకుంటున్నారు. చాళుక్యుల కాలంలో కొలనుపాక గ్రామం రాజప్రతినిధి స్థానంగా ఉండేదని సమాచారం. సైనికపరంగా దక్షిణాపథంలో కొలనుపాక ముఖ్యకేంద్రంగా ఉండేదట. రాజులు, రాజప్రతినిధులు వివిధస్థాయుల్లో ఆలయ నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి చేసినట్లు పరిసర ప్రాంతాల్లో దొరికిన శాసనాల్లో నిక్షిప్తమై ఉంది.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో ఉన్న ఈ దేవాలయానికి దేశ, విదేశాల నుంచి భక్తులు రోజు వచ్చి పోతుంటారు. మధ్యయుగానికి ముందు నుంచే ఇక్కడ ఉన్న ఈ ఆలయం ఎంతో విశిçష్టమెనదిగా ఉంది.
లింగాకారంలో స్వామి దర్శనం
ఇక్కడ స్వామి వారు లింగాకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ లింగం నుంచే జగత్‌గురువు రేణుకాచార్యులు ఉద్భవించి వీరశైవ మతాన్ని, సిద్ధాంతాలను విశ్వవ్యాపితం చేశారు. ఈ ఆలయంలో ఉన్న సహస్ర లింగేశ్వరుని కాకతీయ రాజు గణపతిదేవ చక్రవర్తి సోదరి మైలాంబ ప్రతిష్టించినట్లు ప్రతీతి. ప్రధానాలయంలోనే చండికాంబ అమ్మవారు ఉంటారు. కోరిన కోర్కెలు తీర్చమని అమ్మవారికి భక్తులు ముడుపులు కడతారు. కోర్కెలు తీరిన తర్వాత అమ్మవారికి ఒడిబియ్యం పోయడం ఇక్కడ ప్రత్యేకత. పక్కనే కోటొక్కలింగం అత్యంత రమణీయంగా భక్తులకు కనువిందు చేస్తుంది. దేవదేవుని ప్రతిరూపమైన లింగాకారానికి ఖర్జురపు పండ్ల ఆకారంలో చెక్కబడిన చిన్నచిన్న లింగాలన్నిటినీ కలుపుకుంటే కోటొక్కటి ఉంటాయని చెబుతారు. ఈ కోటొక్కలింగాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం.
చరిత్రను తెలిపే మ్యూజియం
ఆలయం ముందు పురావస్తు శాఖ ఏర్పాటు చేసిన మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం ఈ కొలనుపాక ఆలయం, గ్రామ చరిత్రకు సంబంధించిన పలు విశిష్టతలను తెలియజేస్తోంది. కళ్యాణ చాళుక్యులు, కాకతీయ రాజుల ఏలుబడిలో గొప్ప శైవక్షేత్రంగా కొలనుపాక వెలుగొందిన విషయాలను విపులంగా వివరిస్తోంది. వీరశైవ, జైన, వైష్ణవ మతాలకు సంబంధించిన మహోన్నత చరిత్రను మనకు అందిస్తోంది.
నాలుగు రాష్ట్రాల నుంచి భక్తులు
కొలనుపాక సోమేశ్వరాలయానికి తెలంగాణతో పాటు ప్రతి నిత్యం కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి లింగాయత్‌లు వస్తారు. తమ ఆరాధ్యదైవం సోమేశ్వరునితోపాటు జగద్గురువు రేణుకాచార్యులను దర్శనం చేసుకుని వెళ్తారు. శివరాత్రి పర్వదినం రోజు వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. దేశ విదేశాల పర్యాటకులు వచ్చిపోతుంటారు.
ఎలా రావాలంటే..
హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారి పై సరిగ్గా 70 కిలో మీటర్ల వద్ద ఆలేరు ఉంటుంది. ఇక్కడి ఆర్టీసీ బస్‌లు, రైళ్లు ఉంటాయి. భక్తులు ఆలేరులో దిగిన తర్వాత ఆటోలు, ఆర్టీసీ బస్‌లలో ఐదుకిలోమీటర్ల దూరంలో ఉన్న కొలనుపాకకు వెళ్లవచ్చు. ఆలేరు– చేర్యాల మార్గంలో కొలనుపాక ఉంది.
– యంబ నర్సింహులు సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా
nice place for devotees
ReplyDelete