MohanPublications Print Books Online store clik Here Devullu.com
Showing posts with label marriage. Show all posts
Showing posts with label marriage. Show all posts

శుభ ముహూర్తాలకు వేళయ్యింది_marriage



marriage muhurtam pelli mangalyam laggam shubhamuhurtam wedding bhaktipustakalu




ఈ నెల 20 నుంచి మార్చి 4 వరకు వేల వివాహాలు-
మార్చి నాలుగున అనువుగా గ్రహసంచారం
-అదనంగా కలిసొచ్చిన ఆదివారం సెలవు
-ఆ ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 40వేల పెండ్లిళ్లు.. 
-పురోహితులు, ఫంక్షన్‌హాళ్లు, నిర్వాహకులకు భలే గిరాకీ
-బిజీ అయిపోనున్న కెమెరామెన్లు, వంటమాస్టర్లు
-రాష్ట్రమంతటా పక్షం రెండువారాలపాటు కల్యాణకాంతులు
-నగలు, వస్ర్తాల కొనుగోళ్లతో సందడిగా దుకాణాలు

        హైదరాబాద్, శుభముహూర్తాలకు వేళయ్యింది. ఈ నెల 20 నుంచి శుభఘడియలు ప్రారంభం కానున్నాయి. గతేడాది నవంబర్ నుంచి మంచి ముహూర్తాలకోసం ఎదురుచూస్తున్నవారికి కొత్త ఆశలు చిగురులు తొడిగాయి. మార్చి నాలుగువరకు రాష్ట్రమంతటా మంగళవాయిద్యాలు, వేదమూర్తుల శుభాశీస్సుల వేదసూక్తులు మార్మోగనున్నాయి. ఆకుపచ్చని మంగళతోరణాలతో ఊరూ వాడా పల్లె పట్నం సింగారించుకోనున్నాయి. మార్చి 4న గ్రహాల సంచారం అనువుగా ఉండటం, పైగా ఆదివారం సెలవురోజు కావడంతో ఆ ఒక్కరోజే సుమారు 40 వేల పెండ్లిళ్లు ఉన్నాయని అంచనా. ఒక్కసారిగా సుముహూర్తాలు రావడంతో రాష్ట్రంలోని ఫంక్షన్‌హాళ్లన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి. కెమెరామెన్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థల నిర్వాహకులు బిజీ అయిపోతున్నారు. మరోవైపు వివాహ ఏర్పాట్లలో వధూవరుల తల్లిదండ్రులు తలమునకలైపోయారు. పెండ్లి పత్రికలు ముద్రించడం, వాటిని బంధువులకు చేరవేయడం మొదలుకుని, వధూవరులకు నూతన వస్ర్తాలు, నగల కొనుగోళ్లు వంటి పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయా జిల్లాల్లోనివారు కూడా నగలు, వస్ర్తాల కొనుగోళ్లకు వస్తుండటంతో హైదరాబాద్‌లోని దుకాణాలు సందడిగా మారుతున్నాయి.


మార్చి 4న అంత ప్రాధాన్యం ఎందుకంటే..అమృతసిద్ధియోగం వంటి గొప్ప యోగం ఉండటంతో మార్చి 4వ తేదీ ముహూర్తానికి చాలా ప్రాధాన్యం వచ్చిందని సుప్రసిద్ధ వేదపండితులు, అయుత చండీహోమం రూపకర్త ఫణిశశాంకశర్మ పేర్కొన్నారు. ఆ రోజు ఫాల్గుణ బహుళ తదియ ఆదివారం హస్తా నక్షత్రం. ఉదయం 8.09 గంటలనుంచి మధ్యాహ్నంవరకు మీన మేషలగ్నాలలో వేదమూర్తులు లగ్నాలు నిశ్చయించారు. ఆదివారం హస్తానక్షత్రం వచ్చినట్లయితే అటువంటి యోగాన్ని అమృతసిద్ధి యోగమని వ్యవహరిస్తారని ఫణిశశాంకశర్మ పేర్కొన్నారు. సోమవారం మృగశిర, మంగళవారం అశ్విని, బుధవారం అనూరాధ, గురువారం పుష్యమి, శుక్రవారం రేవతి, శనివారం రోహిణి నక్షత్రాలు ఉన్నట్లయితే అటువంటి యోగం అమృతసిద్ధియోగమని సిద్ధాంత గ్రంథాలు తెలియచేస్తున్నాయి. ఈ కారణాలతో మార్చి 4, 8వ తేదీల్లో వేలసంఖ్యలో పెండ్లిళ్లు జరుగనున్నా యి. బుధుడు, శుక్రుడు కలిసి ఉండడం, రవి ఏకాదశ స్థానంలో ఉండడంతో దాంపత్య జీవితం ఆరంభానికి ఇది అనుకూలమైన రోజని పండితులు చెప్తున్నారు. గృహప్రవేశాలు, భూమి పూజలు సైతం భారీసంఖ్యలో ఈ రోజుల్లో జరుగనున్నాయి.


నాలుగు మాసాలుగా ముహూర్తాల్లేవు..మార్గశిర శుద్ధనవమినుంచి ఫాల్గుణ శుక్ల చవితి (ఫిబ్రవరి 19) వరకు శుక్రమౌఢ్యం కారణంగా సుముహూర్తాలు లేవు. అంతకుముందు 25 రోజులపాటు గురుమౌఢ్యం ఏర్పడింది. ఈ రెండు మౌఢ్యాల మధ్యలో కొద్దిరోజులు ముహూర్తాలు ఉన్నప్పటికీ పెద్దగా ఆసక్తి కనబరుచలేదు. అయితే.. 2018 ఫిబ్రవరి 19 నుంచి అక్టోబర్ వరకు మంచి ముహూర్తాలే ఉండటంవల్ల పురోహితులకు, మంగళ వాయిద్యకారులకు, కల్యాణమంటపాలకు, పెండ్లి పందిళ్ల రూపకర్తలకు, కావాల్సినంత గిరాకీ ఏర్పడింది. 


హైదరాబాద్‌లో ఫంక్షన్ హాళ్లు ఫుల్నగరంలోని ఫంక్షన్ హాళ్లన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి. మార్చి 4, 8 తేదీల్లో ముహూర్తాలు పెట్టుకున్న చాలామందికి హాళ్లు దొరుకని పరిస్థితి నెలకొంది. నగరంలోని అబిడ్స్, మెహిదీపట్నం, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, నాగోల్, సరూర్‌నగర్, కర్మన్‌ఘాట్, హైటెక్‌సిటీ, తార్నాక, రామంతాపూర్, కూకట్‌పల్లి, పంజగుట్ట, మాదాపుర్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లలో ఎక్కువగా పెండ్లిళ్లు జరుగనున్నాయి. ఫిబ్రవరిలో ఎంగేజ్‌మెంట్‌లు, సంగీ త్ వంటి కార్యక్రమాలకు సైతం మెజార్టీ హాళ్లు బుక్ అయిపోయాయి. హైదరాబాద్‌లో కొన్ని మండపాల కిరాయిలు ఐదు లక్షల నుంచి మొదలవుతున్నాయి. చూడటానికి పెద్దమొత్తంలో తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నా.. ఏడాదిపాటు ఫంక్షన్‌హాలు నిర్వహణ, ఉద్యోగుల వేతనాలు, పన్నులు కలిపి లక్షల్లో వెచ్చించాల్సి ఉంటుందని, ఆ మొత్తాన్ని ముహూర్తాల సందర్భాల్లో సంపాదించుకోవాల్సి వస్తుందని కల్యాణమంటపాల యజమానులు చెప్తున్నారు. స్వచ్ఛంద సేవాసంస్థల నిర్వహణలో ఉన్న కల్యాణమంటపాలు కిరాయి విషయంలో చాలా అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్ హర్యానాభవన్, మహారాష్ట్రమండల్, గుజరాత్‌భవన్ వంటి మంటపాలు లక్ష రూపాయలలోపునే లభిస్తున్నాయి. మంగళ వాయిద్యాల వాళ్లు ఉరుకులు, పరుగులతో వేల రూపాయలను సంపాదిస్తున్నారు. పాత జిల్లా కేంద్రాలలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణమండపాలు, హైదరాబాద్‌లోని రెండువేల కల్యాణమండపాలు ఇప్పటికే బుక్‌అయ్యాయి. క్యాటరింగ్ చేసేవారు సైతం ఈ సమయంలోనే కాస్త సంపాదించుకుంటారు. చిన్నాచితక పనులు చేసుకునేవారికి సైతం ఈ పెండ్లిళ్లు నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు దోహదం చేయనున్నాయి.

దాదాపు మూడు నెలల విరామం తరువాత పెండ్లిళ్ల సీజన్ ఆరంభమవుతున్నది. ఇప్పటికే నగరంలో చాలా ఫంక్షన్ హాళ్లు బుక్ అయ్యాయి. ఒక్కో ఈవెంట్ మేనేజర్‌కి పదికి పైగా ఆర్డర్లు వస్తున్నాయి. క్యాటరింగ్, డెకరేషన్, డీజే ఆర్టిస్ట్‌లు, ఫొటోగ్రాఫర్లు, బ్యాండ్ ఇలా అన్ని విభాగాల్లో వారికి ఊహించని స్థాయిలో ఆర్డర్లు వస్తున్నాయి.
- నీరజ్ కేఎస్ ఠాకూర్, తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ప్రధాన కార్యదర్శి

నగరంలో దాదాపు వెయ్యి నుంచి రెండు వేల మంది వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్లు ఉంటారు. ఒక్కొక్కరి వద్ద దాదాపు 20 మంది వరకు ఉంటారు. అలా దాదాపు 15 నుంచి 20 వేల మంది మార్చి 4, 8 తేదీల్లో బిజీ ఉంటారన్న మాట. ఫిబ్రవరిలో సైతం ఎంగేజ్‌మెంట్‌లు, సంగీత్ వంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈ సీజన్‌లో వెడ్డింగ్ ఫొటోగ్రఫీకి మంచి డిమాండ్ ఉందనే చెప్పాలి.    - అనిరుధ్, వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్


రూ. కోట్లలో ఖర్చు..పెండ్లిళ్ల సీజన్‌లో హైదరాబాద్ నగరంలో కోట్ల రూపాయాల మార్కెట్ నడవనుంది. వస్ర్తాలు, ఆభరణాలు వంటి కోనుగోళ్లతోపాటు.. వివాహాల నిర్వహణకు సైతం భారీగానే ఖర్చుచేయనున్నారు. ఒక్కో పెండ్లికి సగటున పది లక్షలు అంచనా వేసుకున్నా వంద కోట్లకు పైనే ఈ సీజన్‌లో ఖర్చు అయ్యే అవకాశం ఉందని ఈవెంట్ మేనేజర్లు అంటున్నారు.

మార్చి 4న ఆదివారం అమృతసిద్ధి యోగం ఉన్నది. అందుకే అ రోజు ఎక్కువగా ముహూర్తాలను నిర్ణయించుకున్నారు. దాంపత్యజీవితం సుఖసంతోషాలతో వర్థిల్లుతుందని పెద్దల నిర్ణయం. ముహూర్తమాధవీయంవంటి సద్గ్రంథాలు ఈ విషయాలన్నింటినీ విశదీకరిస్తాయి. 
- ఫణిశశాంకశర్మ, శృంగేరీపీఠం వేదపండితులు

శుక్రమౌఢ్యం ముగిసిన ఫిబ్రవరి 19 నుంచి ముహూర్తాలను నిర్ణయించారు. వివాహముహూర్తాలలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువ సంఖ్యలో ముహూర్తాలు ఉన్నమాట నిజమే. అయినప్పటికీ శాస్ర్తాలు చెప్పినట్లుగా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.        - సాగి కమలాకరశర్మ, వేదపండితులు 

ముహూర్తాలకాలంలో పురోహితులు బాగా సంపాదిస్తున్నారని అంటున్నారు. నాలుగునెలలుగా ముహూర్తాలు లేక చాలా ఇబ్బందులు పడిన రోజులు కూడా ఉన్నాయి.
- భాస్కరభట్ల రామశర్మ, అర్చకులు 

మార్చి 4,8 తేదీలలో గ్రహసంచారంతో పాటు, యోగం, ఫలణం, తిథి, నక్షత్రం, లగ్నం అనుకూలంగా ఉండడంతోపాటు.. హోళీకి ముందు రోజుకావడంతో ఈ రెండు తేదీల్లోనే వేల సంఖ్యల్లో వివాహాలు జరుగనున్నాయి.         ఫణీంద్ర శర్మ, పురోహితులు

కల్యాణమండపాలన్నింటిలో ఏం జరుగుతున్నదో మాకు తెలియదు. అందరికీ అందుబాటులో ఉండేవిధంగా ట్రస్ట్ ద్వారా నిర్ణయాలు తీసుకొన్ని తక్కువ ధరలో కల్యాణమండపాలను కిరాయికి ఇస్తున్నాం      - మిలాప్, హర్యానాభవన్ ట్రస్టీ

బంధం వీడరాదు_బాధ్యత మరువరాదు Do not forget the responsibility




బంధం వీడరాదు.. 
             బాధ్యత మరువరాదు 

సాధారణంగా వివాహం కాగానే అటు అబ్బాయిలుగానీ ఇటు అమ్మాయిలుగానీ ఓ ముఖ్యమైన పని పూర్తయిందని భావిస్తారు. తమ బాధ్యతలన్నీ ఇక భర్తే చూసుకోవాలని అమ్మాయిలూ.. లేదు తమ బాధ్యతలన్నీ ఇక భార్యవే అని అబ్బాయిలూ అనుకుంటారు. ఎవరికి వారు ఇరువురూ విశ్రాంతిగా ఉండాలని ఉవ్విళ్లూరుతుంటారు. నిజానికి ఇది సాధ్యంకాదు.. పైగా సరైన ఆలోచన కూడా కాదు.

గుర్తించాల్సిందేమంటే- తల్లిదండ్రుల చాటుబిడ్డలుగా నిన్నటివరకూ గడిపిన నవదంపతులు పెళ్లయిన క్షణం నుంచీ మరిన్ని సరికొత్త బాధ్యతల్ని తలకెత్తుకోవాల్సి ఉంటుంది. అందుకు భయపడాల్సింది కూడా ఏమీలేదు. ఒకరి కౌగిలిలో ఒకరు, ఒకరి గుండెల్లో ఒకరు ప్రేమగా ఎలా ఉండిపోవాలనుకుంటారో అంతే ప్రేమగా పరస్పరం ఒకరి బాధ్యతలు ఒకరు స్వీకరించాలి. ఎందుకంటే మనకిష్టమైన వ్యక్తికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం ఇష్టపడేవే. తన నడకకీ, నడతకీ, వ్యవహారశైలికీ అన్నింటికీ జవాబుదారీ వహించాలి. వీటితోపాటు కుటుంబ పరువు, ప్రతిష్ఠలకు బాధ్యత తీసుకోవాలి. కుటుంబ నిర్వహణ భారాన్నీ ఇరువురూ వహించాలి. సంసార రథానికి భార్యాభర్తలిద్దరూ రెండు చక్రాలు అని మనవాళ్లు అనేది ఇందుకే.

అంతేనా? సంపాదించడంలోనూ సంసారాన్ని తీర్చిదిద్దుకోవడంలోనూ ఇద్దరు ఒకరికొకరు తోడుగా నిలవాలి.

‘ఆయన మాటిచ్చాడు దాంతో నాకు పూచీ ఏముంది?’ అని ఆమె గానీ,

‘..అలా చేయడం ఆమె స్వయంకృతంగానీ దానికీ నాకూ సంబంధమేముంది?’అని అతనూ అనుకోరాదు.

ఒకవేళ అలా అనుకుంటే ఆ సంసారానికీ ఆ వైవాహిక జీవితానికీ అర్థమేలేదు. భర్త నిర్ణయాలను భార్య- భార్య పనితీరును భర్త విమర్శించవచ్చు.. వాదించవచ్చు.. కానీ అది మృదువుగా సాగాలి. నచ్చచెప్పేలా ఉండాలి. అది కూడా గడప వరకే పరిమితం కావాలి. గడపదాటితే, నలుగురినోటిలో నానితే అది ఆ సంసారానికే తలవంపు.. నగుబాటు! సంసారమంటే అది భార్యాభర్తలలో ఏ ఒక్కరిదో కాదు. భార్య భర్త కలిస్తేనే సంసారం. బయట నలుగురిలో సంసారానికి తలవంపు ఏర్పడింది అంటే తమ ఇద్దరికీ తలవంపు అన్న స్పృహ నవదంపతులకు ఉండాలి. తమ ఇద్దరి మధ్యకు మూడోవ్యక్తిని చొరబడనిస్తే అది మొదటికే ముప్పు అన్న అవగాహన ఉండాలి. ఈ స్పృహే ఆ కాపురానికి రక్షణ కవచమవుతుంది. చిన్న చిన్న పొరపొచ్చాలు ఏర్ప డ్డా ‘నా కుటుంబం కోసం లేదా నా సంసారం కోసం ఓ మెట్టుదిగితే ఏమిటి?’ అన్న వివేచన ఇద్దరిలో ఉన్నప్పుడు ఆ సంసారానికి ఢోకాలేనట్టే. కనీసం ఇద్దరిలో ఏ ఒక్కరికి ఈ ఆలోచన ఉన్నా కొంతలో కొంత నయమే. ఎక్కడకి వెళ్లినా, ఏం చేసినా భార్యాభర్తలు ఇద్దరిదీ ఒక జట్టు. అవిభాజ్యమైన జట్టు. ఇద్దరిలో ఎవరు తప్పుచేసినా దాని ప్రభావం రెండోవారిపైనా ఉంటుంది. ఇద్దరిలో ఏ ఒక్కరికి మంచి జరిగినా దాని ఫలితం రెండోవారికీ లభిస్తుంది. భార్యాభర్తలిద్దరూ ఈ దృష్టితో అవగాహన పెంచుకుంటే వారిది కచ్చితంగా విజయ పథంలో నడిచే జట్టే అవుతుంది.

ఒకవేళ దంపతులలో ఏ ఒక్కరికైనా ఏదేనీ సమస్య ఉన్నప్పుడు రెండోవారి బాధ్యత మరింత పెరుగుతుంది. ‘నా భర్త ధృతరాష్ట్రుడు అంధుడు కనుక లోకాన్ని చూడలేడు కనుక నాకూ కళ్లు అక్కరలేదు’ అనుకున్న గాంధారీదేవి కాలం కాదిది. అలాంటి సందర్భాలలో రెండు కళ్లతోకాదు వెయ్యికళ్లతో సంసారాన్ని కనిపెట్టుకుని ఉండాలి. దాన్ని పురోగమన దిశలో నడిపించాలి. ఆ పయనం ఆదర్శమార్గంలో సాగాలి. ఇది మాటలు చెప్పినంత సులభంకాదు. అలాగని అసాధ్యమూ కాదు. కావాల్సిందల్లా సంకల్పబలం మాత్రమే. పెళ్లయాక పిల్లలు సహజం. వారి విద్యాబుద్ధుల విషయంలో వెనుకడుగు వేయరాదు. మరోవైపు కనిపెంచిన కన్నవాళ్లనూ చూసుకోవాలి. అందరినీ నిభాయించుకురావాలి. ఇదంతా చేయాలంటే దంపతులిద్దరూ కచ్చితంగా బాధ్యతగా ఉండాలి. కానీ దాన్ని బరువుగా మాత్రం భావించరాదు.

వివాహప్రయత్నాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు_Precautions to be taken in marriage proposals


వివాహ ప్రయత్నాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు.


      వివాహ ప్రయత్నాలలో వున్న వారికి ఒక సూచన. జాతకాలు చూపించి వివాహం చేద్దాం అనుకున్నా! లేక జాతకాలు చూపించకుండా వివాహం చేద్దాం అనుకున్నా! భగవంతుడు రాసిన వధూవరులను జ్యోతిశ్శాస్తవ్రేత్తలు మార్చలేరు. ఇది తథ్యం. మరి జ్యోతిషం చూపించడం ద్వారా దోష పరిహారాలు చేసుకోవడం, అనవసర సంబంధాల కోసం వెంటపడకుండా మనకు తగిన స్థాయి అన్వేషణ కోసం మాత్రమే ఈ సిద్ధాంతం ఏర్పరిచారు అని గ్రహించండి. జాతకాలు చూపించకుండా వివాహం చేశాము కావున పిచ్చి సంబంధం వచ్చింది. జాతకం చూపించి చేశాము కావున మంచి సంబంధం వచ్చింది అనేది ఒక తప్పు మాట.


మరొక సూచన. మా అబ్బాయి నక్షత్రానికి కుదిరే నక్షత్రాల లిస్ట్ ఇవ్వండి అని కొత్తగా అడుగుతున్నారు ఈ మధ్యన. ఈ విధమైన అధ్యయనం చాలా తప్పు. మీరు జాతకాలు చూపించ దలచుకుంటే మంచి సిద్ధాంతిని అనుసరించండి. కేవలం జన్మ నక్షత్రాలతోనూ, పాయింట్ల పట్టికతోనూ ఏమీ ఉపయోగం లేదు. పూర్తి జాతకం శోధింపచేయండి. లేదా పూర్తిగా త్యజించండి. మధ్యస్థంగా నక్షత్రాలు మీరు చూడడం, జాతకాలు సిద్ధాంతి చూడడం వంటివి చేసి శాస్త్రాన్ని అపహాస్యం చేయకండి.


సాధారణంగా వివాహ ప్రయత్నాలు, పిల్లలకు యుక్త వయసు రాగానే ప్రారంభిస్తాం . అప్పుడు ఒక మంచి రోజు చూసుకొని వినాయకుడికి పూజ చేయించి ప్రారంభించడం శ్రేయస్కరం. మంచి రోజు అంటే మంగళవారం కాకుండా... పౌర్ణిమ, బహుళ పాడ్యమి, రెండు పక్షాలలోనూ విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి మరియు శుక్ల పక్షంలో ఏకాదశి, త్రయోదశి, రోజులలో మరియు అశ్విని, రోహిణీ, మృగశిర, మఘ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రములు వున్న సమయంలో తారాబలం కుదిరిన రోజున వర్జ్య దుర్ముహూర్తము లేని సమయంలో మరియు మూఢమి, అధిక మాసం, గ్రహణం వంటి దోషములు లేని రోజులలో పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాలి. పైన చెప్పిన తిథి, వార నక్షత్ర వివరములు పెళ్లిచూపులకు కూడా వర్తిస్తాయి.


సోమవారం సపత్ని దోష కారణంగా పెళ్లి పనుల విషయమై నిషేధము అనే ఆచారము ఉన్నది.కాని కొన్ని గ్రంథంలోనూ శుభ గ్రహ వారములు వివాహానికి విశేషం అని చెప్పారు. అంటే సోమవారం చంద్రాధిపత్యం వున్న వారం కావున సోమవారం శాస్తత్రః గ్రాహ్యమే. క్షీణ చంద్ర వారంగా చెప్పబడే అమావాస్య ముందు వచ్చే సోమవారం మాత్రమే నిషేధం. పూర్ణ చంద్రుడు వున్న సోమవారం వివాహం శాస్తత్రః నిషేధం లేదు.


పెళ్లిచూపులు.. సదా మూఢమి, అధిక మాసాలలో పెళ్లిచూపులు పనికిరాదు. వధూవరులు మూఢమిలో ప్రథమతః కలుసుకున్న దోషం ఇక జీవితాంతం ఉంటుంది. అందువలన తప్పనిసరిగా ప్రతి పెళ్లిచూపులు కూడా మంచి రోజులలోనే చేయడం మంచిది. అలా కాని యెడల ఏదేని దేవాలయంలో ప్రథమతః పెళ్లిచూపులు కార్యక్రమం పూర్తి చేసుకోండి. అన్నింటికీ దైవ సన్నిధి చాలా గొప్పది కదా. శాస్త్ర విషయంగా వచ్చే ప్రత్యవాయువులను దైవ సన్నిధి దూరం చేయగలదు.


నిశ్చయ తాంబూలాలు.. ఇది పెద్దల మధ్యన జరిగే వేడుక ‘అగ్రిమెంట్’ అనవచ్చు. ‘వాచాదత్తా మయా కన్యా వరార్థం స్వీకృతాత్వయం’ విషయమై వధూవరులను కూర్చుండబెట్టి గణపతి పూజ చేయిస్తాం కావున పగలు 12లోపు నిశ్చితార్థం శాస్తస్రమ్మతం. ఆ తరువాత చేయు నిశ్చితార్థం శ్రేష్ఠం కాదు. పనులు ప్రారంభానికి, నిశ్చితార్థానికి కూడా గణపతిపూజ చేయడం చాలా అవసరం. పెళ్లికి, నిశ్చితార్థానికి, పెళ్లిచూపులకు, పసుపు కొట్టుటకు వచ్చే ముత్తైదువులు తప్పనిసరిగా శుభ లక్షణాలు సూచించే పసుపు, కుంకుమ, పూలు, అంచు వున్న చీర ధరించిన వారయి ఉండాలి. పెళ్లికి సంబంధించిన ప్రతి అంశంలోనూ ఇంటికి వచ్చిన ముత్తైదువు కాళ్లకు పసుపు రాసి ముఖాన బొట్టు పెట్టడం సంప్రదాయం.


నిశ్చితార్థం తరువాత శుభలేఖలు పంపిణీ మొదలు దేవుడికి ఇచ్చి తరువాత చేయాలి. మరియు మంగళ సూత్రం కొనుగోలు, మధుపర్కముల కొనుగోలు, పెళ్లికి బయల్దేరుట, మగ పెళ్లివారిని పెళ్లికి ఆహ్వానించుట అనేవి ముఖ్యాంశాలు. వీటికి కూడా పైన చెప్పిన తిథి వార నక్షత్రములు గ్రాహ్యము. పెళ్లికుమారుని చేయుట, పెళ్లికుమార్తెను చేయుట, పెళ్లిపందిరి వేయుట అనే అంశాలకు కూడా పైన చెప్పిన తిథి వార నక్షత్రములు గ్రాహ్యం. శనివారంనాడు ఉప్పు, నూనె, చెప్పులు, వస్త్రం కొనరాదు. కావున పెళ్లికి ఈ నియమం వర్తిస్తుంది.


కన్యాదాతల వివరం.. తండ్రి కన్యాదానానికి అర్హుడు. తండ్రి లేని ఎడల పితామహుడు, తండ్రి సోదరులు, వధువు యొక్క అన్నగారు, పితృ వంశస్థులు, మాతామహుడు, మేనమామ, సగ్రోతీకులు అనువారు వరుసగా అధికారులు అగుదురు. కన్యాదానం యోగమే.


ఏకోదర వివాహం.. పుత్రీ పాణీని పీడనాచ్చ పరతస్సూనోర్వివాహ శ్శుభో నాస్యత్పుత్ర కరగ్రహత్తునకమప్యు ద్వాహ ఏవ వ్రతాత్’ అనే కాలామృత శ్లోకాధారంగా ఏకకాలమందు పుత్ర పుత్రికా వివాహముల విషయమై పుత్రికా వివాహానంతరం పుత్ర వివాహం విశేషం. పుత్ర వివాహానంతరం పుత్రికా వివాహం మరొక పుత్రుని ఉపనయనం చేయరాదు. అలాగే పుత్ర ఉపనయనానంతరం పుత్రికా వివాహం చేయవచ్చు. పుత్ర వివాహం చేసిన సంవత్సరమందు ఆరు నెలలు పర్యంతము ఏకోదరులకు ఉపనయనాదులు నిషేధము. చిన్నవాడికి ఉపనయనం చేసి వెంటనే పెద్దవాడికి వివాహం చేయవచ్చు. ఫాల్గుణ చైత్ర మాసేతు పుత్రో ద్వాహోపనాయనే అబ్ద భేదాత్ప్రకుర్వీత ఋతుత్రయ విడంబన - అనగా ఫాల్గుణ మాసం ముందు ఒకరికి చైత్రమాసం తరువాత మరొకరికి వివాహం ఉపనయనం వంటివి చేయు విషయంలో సంవత్సర భేదం వున్నది కావున దోషం వుండదు.

ఆగ్రహాన్ని నిగ్రహిస్తే ఆనందకర దాంపత్యం! Happy shy of anger!

Happy anger marrege



నరసింహం ఎప్పుడూ రుద్రతాండవం చేస్తుంటాడు. ‘పెన్‌ ఎక్కడ పెట్టి చచ్చావురా?’ అని కొడుకును, ‘లంచ్‌బాక్స్‌ ఎక్కడ పెట్టి తగలబడ్డావు?’ అని భార్యని, ‘బండి తుడవడం ఇలాగేనా?’ అని నౌకరుని కసురుకుంటుంటాడు. అనుక్షణం ఇలా ఎవరో ఒకరిమీద మండిపడుతుంటాడు. కొన్నిసార్లు అతను పనిచేసే చోట కూడా దురుసుగా మాట్లాడి ఇబ్బందుల్లో పడుతుంటాడు.

దంపతుల మధ్య కోపతాపాలు సహజం. కానీ మితిమీరిన కోపం సంసారాన్ని నరకం చేస్తుంది. అది విడాకుల వరకూ తీసుకెళ్లకపోయినా దంపతుల మధ్య దూరం పెంచుతుంది. పైగా కోపిష్ఠులకే దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. కోపం వల్ల గుండెజబ్బులు వస్తాయి. తరచూ విపరీతమైన కోపతాపాలకు గురవుతుంటే శరీరతత్వం మారిపోతుందని హార్వర్డ్‌ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. ఆగ్రహానికి గురయ్యేవారిలో గుండె వేగం, రక్తపోటు పెరుగుతాయట. రక్తం గడ్డలు కట్టే ముప్పు కూడా ఎక్కువవుతుంది. కాబట్టి మితిమీరిన ఆగ్రహావేశాలకు గురవ్వకుండా దంపతులు జాగ్రత్తగా ఉండాలి. సుమతీ శతకకారుడు ‘తన కోపమే తనకు శత్రువు/ తన శాంతమే తనకు రక్ష ’ అని ఏనాడో చెప్పాడు.

భార్యాభర్తలిరువురూ అన్నివిషయాల్లోనూ ఒకేలా ఉండరు. ఎందుకంటే ప్రతిమనిషి ప్రవర్తన, పనిచేసే రీతులు, మాట్లాడేతత్వం అన్నీ భిన్నంగానే ఉంటాయి. దంపతుల అభిరుచులు కొన్నింట్లో కలుస్తున్నా, ఇరువురి మధ్య అనేక వైరుధ్యాలుంటాయి. భాగస్వామి తన మాదిరే ఎందుకు చేయలేకపోతున్నారనే భావన వల్ల సహజంగా కోపం వస్తుంది. అలాగే ‘నాది.. నాకే చెందాలి’ అనే భావన వల్ల కూడా ఆగ్రహం వస్తుంది. ఇతరులతో భాగస్వామి చనువుగా ప్రవర్తిస్తే కోపం ముంచుకొస్తుంది. ఆ విషయాన్ని నేరుగా చెప్పలేక ‘ఈ కూర ఎందుకిలా మాడిపోయింది?’ అనో, ‘దానికెందుకంత ఖర్చు పెట్టావు?’ అనో ఏదో వంకతో కోప్పడుతుంటారు. పైగా కోపం అంటువ్యాధిలాంటింది. దీని ప్రభావం మొత్తం కుటుంబంపై ఉంటుంది. పిల్లలు కూడా పెద్దల హావభావాల్ని, మాటల్ని అనుకరిస్తుంటారు.
ఇలా చేయొచ్చు..
యోగ, ధ్యానం, ప్రాణాయామం ద్వారా కోపాన్ని అరికట్టవచ్చు.

ప్రతిరోజూ కనీసం ఓ అరగంటసేపైనా నిశ్శబ్దాన్ని పాటించాలి. వీలైనప్పుడల్లా మంచి సంగీతాన్ని ఆస్వాదించాలి.

చిన్నారులతో ఆడుకోవడం, ఇంటిల్లిపాదితో పచ్చటి ప్రకృతి మధ్య గడపటం వల్ల ఆగ్రహావేశాల నుంచి బయటపడవచ్చు.

మనసంతా ఆగ్రహం, అసహనంతో చీకాగ్గా ఉన్నప్పుడు చన్నీటితో తలస్నానం చేయడం వల్ల ఉపశమనం లభిస్తుందంటారు.

కోపానికి కారణమైన విషయాల గురించి పదేపదే ఆలోచించక ఇతర పనుల్లో నిమగ్నమవ్వాలి.

ఆహ్లాదకరమైన దృశ్యాల్ని మనసులో ­హించుకోవాలి. గంభీరమైన పరిస్థితిని తేలిక చేసేందుకు జోక్స్‌ పేల్చడం, చతుర సంభాషణలు సాయం చేస్తాయి.

గుప్పిటను బలంగా మూసి, నెమ్మదిగా తెరవాలి. ఇలా ఓ యాభైసార్లు చేయాలి.

క్రీడలు, వ్యాయామం, పుస్తకపఠనం, సైక్లింగ్‌, లాంగ్‌డ్రైవ్‌ లాంటివాటిలో నిమగ్నమవ్వాలి.

సానుకూలంగా మాట్లాడటం అలవర్చుకోవాలి.

కోపానికి కారణమైన అంశాలు, ప్రవర్తన గురించి భాగస్వామితో చర్చించాలి. తద్వారా అలాంటి పరిస్థితులు ముందు ముందు తలెత్తకుండా ముందస్తుగానే జాగ్రత్త పడటానికి అవకాశం కలుగుతుంది.


కోపిష్ఠులతో కుటుంబసభ్యులు మనస్సు విప్పి మాట్లాడలేరు. దూర దూరంగా మసలుకుంటారు. వారెప్పుడూ తమ కోణంలోనే ఆలోచిస్తుండటం వల్ల భాగస్వామి చేసేదంతా తప్పుల తడకగా కనిపిస్తుంటుంది. తమ అసౌకర్యాల గురించే ఎక్కువ రచ్చ చేస్తూ, కుటుంబ సభ్యుల బాధలను, ఇబ్బందులను గ్రహించలేకపోతారు. ఒకరిలో తప్పులెంచడం చాలా సులువు. కానీ క్షమించి దగ్గరకు తీసుకోవడంలోనే సుఖం, శాంతం, ఆరోగ్యం, అనందమూ లభిస్తాయి.
- కె. రఘు






పెళ్ళిళ్లకూ రుణాలిస్తారు..!_marriage

marriage, Lend the marriage,  cridit, appu,

పెళ్ళిళ్లకూ రుణాలిస్తారు..!

‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అనే నానుడి అక్షర సత్యం. ఈ రెండూ కూడా ఎన్నో సమస్యలతో కూడుకున్నవి. అందులో ప్రధానమైనది ఆర్థిక సమస్య. సంప్రదాయం ప్రకారం సకల మర్యాదలు, ఆచారాలతో పెళ్లి జరపడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. జీవితంలో ఒకే ఒక్కసారి జరుపుకునే వేడుక పెళ్లి. బంధుమిత్రుల మధ్య ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. ఉత్సాహభరితమైన కార్యక్రమాలతో, తీరైన విందులతో వివాహ క్రతువును వైభవోపేతంగా నిర్వహిస్తారు. అందుకు ఎంత ఖర్చయినా వెనకాడరు. అంత డబ్బు చేతిలో లేకపోతే అప్పోసొప్పో తేవడానికైనా సిద్ధపడతారు. ఆ అవసరాలకు తగ్గట్టుగా వివాహ ఖర్చుల నిమిత్తం బ్యాంకులు సైతం ప్రత్యేకంగా పెళ్లి రుణాలిస్తున్నాయి.

వివాహ పనుల్లో మ్యారేజి హాలు బుకింగ్‌ దగ్గరి నుంచి మండపం అలంకరణ, భోజనాలు, వీడియోలు.. ఇలా ఏది తీసుకున్నా ఖర్చుతో కూడుకున్నవే. పనిలోకి దిగాక ఒక్కోసారి తెలియకుండా ఖర్చు అంచనా మించుతుంది. అటువంటి సమయాల్లో ఈ రుణాలు బాగా ఉపయోగపడతాయి. పెళ్లి ఖర్చుల నిమిత్తం అవసరాన్ని బట్టి ప్రస్తుతం ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, కార్పొరేషన్‌ బ్యాంకులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు కొన్ని వ్యక్తిగత రుణంలో భాగంగా పెళ్లి ఖర్చులకు ప్రత్యేకంగా రుణాలు ఇస్తున్నాయి. వాయిదాల వారీగా సులభంగా తీర్చుకునే వెసులుబాటునూ కల్పిస్తున్నాయి.

కావలసిన పత్రాలు
* ఆదాయ వివరాలు, సంబంధిత ధ్రువపత్రం, 
* మూడు నెలల వేతన పత్రాలు, రెండేళ్ల ఫారం 16 
* మూడు లేదా ఆరు నెలల బ్యాంకు లావాదేవీలు 
* స్వయం ఉపాధి పొందేవారైతే పెట్టుబడికి సంబంధించిన ఆధారాలు 
* వ్యాపార, పన్ను సంబంధ పత్రాలు 
* ఓటర్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఆధార్‌ లాంటి వ్యక్తిగత గుర్తింపు పత్రం 
* చిరునామా గుర్తింపు కోసం రేషన్‌ కార్డు, కరెంట్‌/ఫోన్‌ బిల్లు/ఆధార్‌ 
* పెళ్లికార్డు లేదా పెళ్లి నిర్వహణకు సంబంధించిన వ్యయపత్రాలు (మ్యారేజ్‌ హాల్‌ బుకింగ్‌, క్యాటరింగ్‌ వంటివి)
* వధువు/వరుడుతో రుణం తీసుకునేవారి బంధుత్వానికి సంబంధించిన పత్రం

వృత్తి, జీతం, వయసు, అనుభవం, గతంలో రుణాలు తీర్చిన పద్ధతి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయా బ్యాంకులు రుణం ఎంత ఇవ్వాలి? దానిపై వడ్డీ ఎంత? అనే వాటిని నిర్ణయిస్తాయి. ఆయా బ్యాంకుల నిబంధనల ప్రకారం ఈ రుణాన్ని నాలుగు నుంచి ఏడు సంవత్సరాల లోపు తీర్చాల్సి ఉంటుంది. రుణం పొందేవారు ఉండే ప్రాంతాన్ని బట్టి కూడా రుణమొత్తాన్ని నిర్ణయిస్తారు. బ్యాంకేతర ఆర్థిక సంస్థలు గరిష్ఠంగా ఇరవై ఐదు లక్షల వరకూ, కార్పొరేషన్‌ బ్యాంకు పది లక్షల వరకూ రుణం అందిస్తున్నాయి.

వడ్డీరేట్లు, ఇతర ఛార్జీలు, వ్యక్తిగత రుణాల మాదిరిగానే ఉంటా యి. ప్రాసెసింగ్‌ ఫీ మాత్రం ఆయా బ్యాంకును బట్టి రుణ మొత్తంలో ఒకటి నుంచి ఐదు శాతం వరకు ఉంది.

పెళ్లి చేసుకునే వ్యక్తి, లేదా ఆ వ్యక్తి తల్లి/తండ్రి వివాహ రుణం తీసుకునే సౌలభ్యం ఉంది. ఉద్యోగులు లేదా స్వయం ఉపాధి పొందుతూ ఇరవై ఒకటి నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య వయసువారై ఉండాలి. ఎక్కువ మొత్తం రుణం పొందడానికి, త్వరగా రుణ వాయిదాలను పూర్తి చేయడానికి ఇద్దరూ కలిసి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తోంది కార్పొరేషన్‌ బ్యాంకు. అంటే వధూవరులిద్దరూ లేదా వధువు/వరుడు, తల్లి/తండ్రి దరఖాస్తు చేసుకోవచ్చు.

పొందిన రుణాన్ని దేనికి వాడుకోవాలి? అనే విషయంలో కొన్ని నిబంధనలున్నాయి. బంగారు ఆభరణాలు కొనేందుకు ఉపయోగించకూడదు. పెళ్లిమండపం, వివాహ వేదిక, దుస్తుల కొనుగోలు, వివాహ విందు, హనీమూన్‌, ఇతర ప్రాంతాలకు మారడం వంటి ఖర్చులకు ఈ రుణ మొత్తాలను వాడుకోవచ్చు.
                                                             - సంధ్యారాణి

























mohan publications price list