వివాహ ప్రయత్నాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు.
వివాహ ప్రయత్నాలలో వున్న వారికి ఒక సూచన. జాతకాలు చూపించి వివాహం చేద్దాం అనుకున్నా! లేక జాతకాలు చూపించకుండా వివాహం చేద్దాం అనుకున్నా! భగవంతుడు రాసిన వధూవరులను జ్యోతిశ్శాస్తవ్రేత్తలు మార్చలేరు. ఇది తథ్యం. మరి జ్యోతిషం చూపించడం ద్వారా దోష పరిహారాలు చేసుకోవడం, అనవసర సంబంధాల కోసం వెంటపడకుండా మనకు తగిన స్థాయి అన్వేషణ కోసం మాత్రమే ఈ సిద్ధాంతం ఏర్పరిచారు అని గ్రహించండి. జాతకాలు చూపించకుండా వివాహం చేశాము కావున పిచ్చి సంబంధం వచ్చింది. జాతకం చూపించి చేశాము కావున మంచి సంబంధం వచ్చింది అనేది ఒక తప్పు మాట.
మరొక సూచన. మా అబ్బాయి నక్షత్రానికి కుదిరే నక్షత్రాల లిస్ట్ ఇవ్వండి అని కొత్తగా అడుగుతున్నారు ఈ మధ్యన. ఈ విధమైన అధ్యయనం చాలా తప్పు. మీరు జాతకాలు చూపించ దలచుకుంటే మంచి సిద్ధాంతిని అనుసరించండి. కేవలం జన్మ నక్షత్రాలతోనూ, పాయింట్ల పట్టికతోనూ ఏమీ ఉపయోగం లేదు. పూర్తి జాతకం శోధింపచేయండి. లేదా పూర్తిగా త్యజించండి. మధ్యస్థంగా నక్షత్రాలు మీరు చూడడం, జాతకాలు సిద్ధాంతి చూడడం వంటివి చేసి శాస్త్రాన్ని అపహాస్యం చేయకండి.
సాధారణంగా వివాహ ప్రయత్నాలు, పిల్లలకు యుక్త వయసు రాగానే ప్రారంభిస్తాం . అప్పుడు ఒక మంచి రోజు చూసుకొని వినాయకుడికి పూజ చేయించి ప్రారంభించడం శ్రేయస్కరం. మంచి రోజు అంటే మంగళవారం కాకుండా... పౌర్ణిమ, బహుళ పాడ్యమి, రెండు పక్షాలలోనూ విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి మరియు శుక్ల పక్షంలో ఏకాదశి, త్రయోదశి, రోజులలో మరియు అశ్విని, రోహిణీ, మృగశిర, మఘ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రములు వున్న సమయంలో తారాబలం కుదిరిన రోజున వర్జ్య దుర్ముహూర్తము లేని సమయంలో మరియు మూఢమి, అధిక మాసం, గ్రహణం వంటి దోషములు లేని రోజులలో పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాలి. పైన చెప్పిన తిథి, వార నక్షత్ర వివరములు పెళ్లిచూపులకు కూడా వర్తిస్తాయి.
సోమవారం సపత్ని దోష కారణంగా పెళ్లి పనుల విషయమై నిషేధము అనే ఆచారము ఉన్నది.కాని కొన్ని గ్రంథంలోనూ శుభ గ్రహ వారములు వివాహానికి విశేషం అని చెప్పారు. అంటే సోమవారం చంద్రాధిపత్యం వున్న వారం కావున సోమవారం శాస్తత్రః గ్రాహ్యమే. క్షీణ చంద్ర వారంగా చెప్పబడే అమావాస్య ముందు వచ్చే సోమవారం మాత్రమే నిషేధం. పూర్ణ చంద్రుడు వున్న సోమవారం వివాహం శాస్తత్రః నిషేధం లేదు.
పెళ్లిచూపులు.. సదా మూఢమి, అధిక మాసాలలో పెళ్లిచూపులు పనికిరాదు. వధూవరులు మూఢమిలో ప్రథమతః కలుసుకున్న దోషం ఇక జీవితాంతం ఉంటుంది. అందువలన తప్పనిసరిగా ప్రతి పెళ్లిచూపులు కూడా మంచి రోజులలోనే చేయడం మంచిది. అలా కాని యెడల ఏదేని దేవాలయంలో ప్రథమతః పెళ్లిచూపులు కార్యక్రమం పూర్తి చేసుకోండి. అన్నింటికీ దైవ సన్నిధి చాలా గొప్పది కదా. శాస్త్ర విషయంగా వచ్చే ప్రత్యవాయువులను దైవ సన్నిధి దూరం చేయగలదు.
నిశ్చయ తాంబూలాలు.. ఇది పెద్దల మధ్యన జరిగే వేడుక ‘అగ్రిమెంట్’ అనవచ్చు. ‘వాచాదత్తా మయా కన్యా వరార్థం స్వీకృతాత్వయం’ విషయమై వధూవరులను కూర్చుండబెట్టి గణపతి పూజ చేయిస్తాం కావున పగలు 12లోపు నిశ్చితార్థం శాస్తస్రమ్మతం. ఆ తరువాత చేయు నిశ్చితార్థం శ్రేష్ఠం కాదు. పనులు ప్రారంభానికి, నిశ్చితార్థానికి కూడా గణపతిపూజ చేయడం చాలా అవసరం. పెళ్లికి, నిశ్చితార్థానికి, పెళ్లిచూపులకు, పసుపు కొట్టుటకు వచ్చే ముత్తైదువులు తప్పనిసరిగా శుభ లక్షణాలు సూచించే పసుపు, కుంకుమ, పూలు, అంచు వున్న చీర ధరించిన వారయి ఉండాలి. పెళ్లికి సంబంధించిన ప్రతి అంశంలోనూ ఇంటికి వచ్చిన ముత్తైదువు కాళ్లకు పసుపు రాసి ముఖాన బొట్టు పెట్టడం సంప్రదాయం.
నిశ్చితార్థం తరువాత శుభలేఖలు పంపిణీ మొదలు దేవుడికి ఇచ్చి తరువాత చేయాలి. మరియు మంగళ సూత్రం కొనుగోలు, మధుపర్కముల కొనుగోలు, పెళ్లికి బయల్దేరుట, మగ పెళ్లివారిని పెళ్లికి ఆహ్వానించుట అనేవి ముఖ్యాంశాలు. వీటికి కూడా పైన చెప్పిన తిథి వార నక్షత్రములు గ్రాహ్యము. పెళ్లికుమారుని చేయుట, పెళ్లికుమార్తెను చేయుట, పెళ్లిపందిరి వేయుట అనే అంశాలకు కూడా పైన చెప్పిన తిథి వార నక్షత్రములు గ్రాహ్యం. శనివారంనాడు ఉప్పు, నూనె, చెప్పులు, వస్త్రం కొనరాదు. కావున పెళ్లికి ఈ నియమం వర్తిస్తుంది.
కన్యాదాతల వివరం.. తండ్రి కన్యాదానానికి అర్హుడు. తండ్రి లేని ఎడల పితామహుడు, తండ్రి సోదరులు, వధువు యొక్క అన్నగారు, పితృ వంశస్థులు, మాతామహుడు, మేనమామ, సగ్రోతీకులు అనువారు వరుసగా అధికారులు అగుదురు. కన్యాదానం యోగమే.
ఏకోదర వివాహం.. పుత్రీ పాణీని పీడనాచ్చ పరతస్సూనోర్వివాహ శ్శుభో నాస్యత్పుత్ర కరగ్రహత్తునకమప్యు ద్వాహ ఏవ వ్రతాత్’ అనే కాలామృత శ్లోకాధారంగా ఏకకాలమందు పుత్ర పుత్రికా వివాహముల విషయమై పుత్రికా వివాహానంతరం పుత్ర వివాహం విశేషం. పుత్ర వివాహానంతరం పుత్రికా వివాహం మరొక పుత్రుని ఉపనయనం చేయరాదు. అలాగే పుత్ర ఉపనయనానంతరం పుత్రికా వివాహం చేయవచ్చు. పుత్ర వివాహం చేసిన సంవత్సరమందు ఆరు నెలలు పర్యంతము ఏకోదరులకు ఉపనయనాదులు నిషేధము. చిన్నవాడికి ఉపనయనం చేసి వెంటనే పెద్దవాడికి వివాహం చేయవచ్చు. ఫాల్గుణ చైత్ర మాసేతు పుత్రో ద్వాహోపనాయనే అబ్ద భేదాత్ప్రకుర్వీత ఋతుత్రయ విడంబన - అనగా ఫాల్గుణ మాసం ముందు ఒకరికి చైత్రమాసం తరువాత మరొకరికి వివాహం ఉపనయనం వంటివి చేయు విషయంలో సంవత్సర భేదం వున్నది కావున దోషం వుండదు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565