నరసింహం ఎప్పుడూ రుద్రతాండవం చేస్తుంటాడు. ‘పెన్ ఎక్కడ పెట్టి చచ్చావురా?’ అని కొడుకును, ‘లంచ్‌బాక్స్ ఎక్కడ పెట్టి తగలబడ్డావు?’ అని భార్యని, ‘బండి తుడవడం ఇలాగేనా?’ అని నౌకరుని కసురుకుంటుంటాడు. అనుక్షణం ఇలా ఎవరో ఒకరిమీద మండిపడుతుంటాడు. కొన్నిసార్లు అతను పనిచేసే చోట కూడా దురుసుగా మాట్లాడి ఇబ్బందుల్లో పడుతుంటాడు.
దంపతుల మధ్య కోపతాపాలు సహజం. కానీ మితిమీరిన కోపం సంసారాన్ని నరకం చేస్తుంది. అది విడాకుల వరకూ తీసుకెళ్లకపోయినా దంపతుల మధ్య దూరం పెంచుతుంది. పైగా కోపిష్ఠులకే దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. కోపం వల్ల గుండెజబ్బులు వస్తాయి. తరచూ విపరీతమైన కోపతాపాలకు గురవుతుంటే శరీరతత్వం మారిపోతుందని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. ఆగ్రహానికి గురయ్యేవారిలో గుండె వేగం, రక్తపోటు పెరుగుతాయట. రక్తం గడ్డలు కట్టే ముప్పు కూడా ఎక్కువవుతుంది. కాబట్టి మితిమీరిన ఆగ్రహావేశాలకు గురవ్వకుండా దంపతులు జాగ్రత్తగా ఉండాలి. సుమతీ శతకకారుడు ‘తన కోపమే తనకు శత్రువు/ తన శాంతమే తనకు రక్ష ’ అని ఏనాడో చెప్పాడు.
భార్యాభర్తలిరువురూ అన్నివిషయాల్లోనూ ఒకేలా ఉండరు. ఎందుకంటే ప్రతిమనిషి ప్రవర్తన, పనిచేసే రీతులు, మాట్లాడేతత్వం అన్నీ భిన్నంగానే ఉంటాయి. దంపతుల అభిరుచులు కొన్నింట్లో కలుస్తున్నా, ఇరువురి మధ్య అనేక వైరుధ్యాలుంటాయి. భాగస్వామి తన మాదిరే ఎందుకు చేయలేకపోతున్నారనే భావన వల్ల సహజంగా కోపం వస్తుంది. అలాగే ‘నాది.. నాకే చెందాలి’ అనే భావన వల్ల కూడా ఆగ్రహం వస్తుంది. ఇతరులతో భాగస్వామి చనువుగా ప్రవర్తిస్తే కోపం ముంచుకొస్తుంది. ఆ విషయాన్ని నేరుగా చెప్పలేక ‘ఈ కూర ఎందుకిలా మాడిపోయింది?’ అనో, ‘దానికెందుకంత ఖర్చు పెట్టావు?’ అనో ఏదో వంకతో కోప్పడుతుంటారు. పైగా కోపం అంటువ్యాధిలాంటింది. దీని ప్రభావం మొత్తం కుటుంబంపై ఉంటుంది. పిల్లలు కూడా పెద్దల హావభావాల్ని, మాటల్ని అనుకరిస్తుంటారు.
* ప్రతిరోజూ కనీసం ఓ అరగంటసేపైనా నిశ్శబ్దాన్ని పాటించాలి. వీలైనప్పుడల్లా మంచి సంగీతాన్ని ఆస్వాదించాలి. * చిన్నారులతో ఆడుకోవడం, ఇంటిల్లిపాదితో పచ్చటి ప్రకృతి మధ్య గడపటం వల్ల ఆగ్రహావేశాల నుంచి బయటపడవచ్చు. * మనసంతా ఆగ్రహం, అసహనంతో చీకాగ్గా ఉన్నప్పుడు చన్నీటితో తలస్నానం చేయడం వల్ల ఉపశమనం లభిస్తుందంటారు. * కోపానికి కారణమైన విషయాల గురించి పదేపదే ఆలోచించక ఇతర పనుల్లో నిమగ్నమవ్వాలి. * ఆహ్లాదకరమైన దృశ్యాల్ని మనసులో హించుకోవాలి. గంభీరమైన పరిస్థితిని తేలిక చేసేందుకు జోక్స్ పేల్చడం, చతుర సంభాషణలు సాయం చేస్తాయి. * గుప్పిటను బలంగా మూసి, నెమ్మదిగా తెరవాలి. ఇలా ఓ యాభైసార్లు చేయాలి. * క్రీడలు, వ్యాయామం, పుస్తకపఠనం, సైక్లింగ్, లాంగ్‌డ్రైవ్ లాంటివాటిలో నిమగ్నమవ్వాలి. * సానుకూలంగా మాట్లాడటం అలవర్చుకోవాలి. * కోపానికి కారణమైన అంశాలు, ప్రవర్తన గురించి భాగస్వామితో చర్చించాలి. తద్వారా అలాంటి పరిస్థితులు ముందు ముందు తలెత్తకుండా ముందస్తుగానే జాగ్రత్త పడటానికి అవకాశం కలుగుతుంది. |
కోపిష్ఠులతో కుటుంబసభ్యులు మనస్సు విప్పి మాట్లాడలేరు. దూర దూరంగా మసలుకుంటారు. వారెప్పుడూ తమ కోణంలోనే ఆలోచిస్తుండటం వల్ల భాగస్వామి చేసేదంతా తప్పుల తడకగా కనిపిస్తుంటుంది. తమ అసౌకర్యాల గురించే ఎక్కువ రచ్చ చేస్తూ, కుటుంబ సభ్యుల బాధలను, ఇబ్బందులను గ్రహించలేకపోతారు. ఒకరిలో తప్పులెంచడం చాలా సులువు. కానీ క్షమించి దగ్గరకు తీసుకోవడంలోనే సుఖం, శాంతం, ఆరోగ్యం, అనందమూ లభిస్తాయి.
- కె. రఘు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565