బంధం వీడరాదు..
బాధ్యత మరువరాదు
సాధారణంగా వివాహం కాగానే అటు అబ్బాయిలుగానీ ఇటు అమ్మాయిలుగానీ ఓ ముఖ్యమైన పని పూర్తయిందని భావిస్తారు. తమ బాధ్యతలన్నీ ఇక భర్తే చూసుకోవాలని అమ్మాయిలూ.. లేదు తమ బాధ్యతలన్నీ ఇక భార్యవే అని అబ్బాయిలూ అనుకుంటారు. ఎవరికి వారు ఇరువురూ విశ్రాంతిగా ఉండాలని ఉవ్విళ్లూరుతుంటారు. నిజానికి ఇది సాధ్యంకాదు.. పైగా సరైన ఆలోచన కూడా కాదు.
గుర్తించాల్సిందేమంటే- తల్లిదండ్రుల చాటుబిడ్డలుగా నిన్నటివరకూ గడిపిన నవదంపతులు పెళ్లయిన క్షణం నుంచీ మరిన్ని సరికొత్త బాధ్యతల్ని తలకెత్తుకోవాల్సి ఉంటుంది. అందుకు భయపడాల్సింది కూడా ఏమీలేదు. ఒకరి కౌగిలిలో ఒకరు, ఒకరి గుండెల్లో ఒకరు ప్రేమగా ఎలా ఉండిపోవాలనుకుంటారో అంతే ప్రేమగా పరస్పరం ఒకరి బాధ్యతలు ఒకరు స్వీకరించాలి. ఎందుకంటే మనకిష్టమైన వ్యక్తికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం ఇష్టపడేవే. తన నడకకీ, నడతకీ, వ్యవహారశైలికీ అన్నింటికీ జవాబుదారీ వహించాలి. వీటితోపాటు కుటుంబ పరువు, ప్రతిష్ఠలకు బాధ్యత తీసుకోవాలి. కుటుంబ నిర్వహణ భారాన్నీ ఇరువురూ వహించాలి. సంసార రథానికి భార్యాభర్తలిద్దరూ రెండు చక్రాలు అని మనవాళ్లు అనేది ఇందుకే.
అంతేనా? సంపాదించడంలోనూ సంసారాన్ని తీర్చిదిద్దుకోవడంలోనూ ఇద్దరు ఒకరికొకరు తోడుగా నిలవాలి.
‘ఆయన మాటిచ్చాడు దాంతో నాకు పూచీ ఏముంది?’ అని ఆమె గానీ,
‘..అలా చేయడం ఆమె స్వయంకృతంగానీ దానికీ నాకూ సంబంధమేముంది?’అని అతనూ అనుకోరాదు.
ఒకవేళ అలా అనుకుంటే ఆ సంసారానికీ ఆ వైవాహిక జీవితానికీ అర్థమేలేదు. భర్త నిర్ణయాలను భార్య- భార్య పనితీరును భర్త విమర్శించవచ్చు.. వాదించవచ్చు.. కానీ అది మృదువుగా సాగాలి. నచ్చచెప్పేలా ఉండాలి. అది కూడా గడప వరకే పరిమితం కావాలి. గడపదాటితే, నలుగురినోటిలో నానితే అది ఆ సంసారానికే తలవంపు.. నగుబాటు! సంసారమంటే అది భార్యాభర్తలలో ఏ ఒక్కరిదో కాదు. భార్య భర్త కలిస్తేనే సంసారం. బయట నలుగురిలో సంసారానికి తలవంపు ఏర్పడింది అంటే తమ ఇద్దరికీ తలవంపు అన్న స్పృహ నవదంపతులకు ఉండాలి. తమ ఇద్దరి మధ్యకు మూడోవ్యక్తిని చొరబడనిస్తే అది మొదటికే ముప్పు అన్న అవగాహన ఉండాలి. ఈ స్పృహే ఆ కాపురానికి రక్షణ కవచమవుతుంది. చిన్న చిన్న పొరపొచ్చాలు ఏర్ప డ్డా ‘నా కుటుంబం కోసం లేదా నా సంసారం కోసం ఓ మెట్టుదిగితే ఏమిటి?’ అన్న వివేచన ఇద్దరిలో ఉన్నప్పుడు ఆ సంసారానికి ఢోకాలేనట్టే. కనీసం ఇద్దరిలో ఏ ఒక్కరికి ఈ ఆలోచన ఉన్నా కొంతలో కొంత నయమే. ఎక్కడకి వెళ్లినా, ఏం చేసినా భార్యాభర్తలు ఇద్దరిదీ ఒక జట్టు. అవిభాజ్యమైన జట్టు. ఇద్దరిలో ఎవరు తప్పుచేసినా దాని ప్రభావం రెండోవారిపైనా ఉంటుంది. ఇద్దరిలో ఏ ఒక్కరికి మంచి జరిగినా దాని ఫలితం రెండోవారికీ లభిస్తుంది. భార్యాభర్తలిద్దరూ ఈ దృష్టితో అవగాహన పెంచుకుంటే వారిది కచ్చితంగా విజయ పథంలో నడిచే జట్టే అవుతుంది.
ఒకవేళ దంపతులలో ఏ ఒక్కరికైనా ఏదేనీ సమస్య ఉన్నప్పుడు రెండోవారి బాధ్యత మరింత పెరుగుతుంది. ‘నా భర్త ధృతరాష్ట్రుడు అంధుడు కనుక లోకాన్ని చూడలేడు కనుక నాకూ కళ్లు అక్కరలేదు’ అనుకున్న గాంధారీదేవి కాలం కాదిది. అలాంటి సందర్భాలలో రెండు కళ్లతోకాదు వెయ్యికళ్లతో సంసారాన్ని కనిపెట్టుకుని ఉండాలి. దాన్ని పురోగమన దిశలో నడిపించాలి. ఆ పయనం ఆదర్శమార్గంలో సాగాలి. ఇది మాటలు చెప్పినంత సులభంకాదు. అలాగని అసాధ్యమూ కాదు. కావాల్సిందల్లా సంకల్పబలం మాత్రమే. పెళ్లయాక పిల్లలు సహజం. వారి విద్యాబుద్ధుల విషయంలో వెనుకడుగు వేయరాదు. మరోవైపు కనిపెంచిన కన్నవాళ్లనూ చూసుకోవాలి. అందరినీ నిభాయించుకురావాలి. ఇదంతా చేయాలంటే దంపతులిద్దరూ కచ్చితంగా బాధ్యతగా ఉండాలి. కానీ దాన్ని బరువుగా మాత్రం భావించరాదు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565