MohanPublications Print Books Online store clik Here Devullu.com

దేవుడికి ఫార్ములా, Devudiki Formula

దేవుడికి ఫార్ములా
Devudiki Formula


++++++++++ దేవుడికి ఫార్ములా ++++++++
విజ్ఞానశాస్త్రంలోని సూత్రాలు, ఫార్ములాలతో మనకు పరిచయం ఉండదు. ఒక వస్తువు నీటిలో మునిగితే ఎంత బరువు కోల్పోతుంది అన్నదానికి ఒక సూత్రం. ఒక వస్తువు ఎత్తు నుంచి నేలపై ఏ వేగంతో పడుతుంది అన్నదానికి మరొక సూత్రం. ఇలాంటివి బయటి ప్రపంచంలోని విషయాల్ని పరిశీలించడం ద్వారా తెలుసుకున్న నిజాలు. ఐదు ఇంద్రియాల ద్వారా శబ్దం, స్పర్శ, రూపం, రుచి, వాసన అనే విషయాల్ని తెలుసుకుని మనసు ద్వారా వాటిని విశ్లేషించి ఒక అభిప్రాయానికి వస్తున్నాం. ఇంద్రియాల శక్తిని పెంచడానికి కొన్ని ఉపకరణాల్ని తయారు చేసుకున్నాం. కంటి శక్తికి మరింత బలాన్నిచ్చేవి టెలిస్కోప్‌, మైక్రోస్కోప్‌. యంత్రాలన్నీ శరీరం, ఇంద్రియాల శక్తిని ఎక్కువ చేసేవే. వేగంగా ఆలోచించడంలో మనసుకు తోడ్పడే యంత్రం కంప్యూటర్‌. మనిషి ఆజ్ఞల్ని పాటించి త్వరత్వరగా మనం చెప్పిన రీతిలో ఆలోచించి సమాచారాన్ని అందిస్తుంది.
ఇంద్రియాలు, మనసు ద్వారా తెలియనిది ఒకటుంది. దాన్నే మనం దేవుడు అంటుంటాం. ఈ ప్రశ్నకు రెండు వర్గాలు సమాధానం చెబుతాయి. మొదటిది మతం. ఇది ఒక ప్రత్యక్ష సాక్షిలాగ చెబుతుంది. దేవుడు ఫలానా విధంగా ఉంటాడు, ఈ విధంగా సృష్టి చేశాడు, ఇలా నిర్దేశించాడు అని చెబుతుంది. రెండోది తత్వశాస్త్రం. ఇది శాస్త్రీయంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఆలోచనకు కూడా సాధనం మనస్సే. అందుకే అతి ప్రాచీనకాలం నాడు వేసుకున్న ప్రశ్ననే ఇప్పటికీ సైన్స్‌ అధ్యయనం చేస్తోంది.
ఈ ప్రశ్నను సుమారు ఐదువేల సంవత్సరాలుగా మన రుషులు ఆలోచిస్తూనే వచ్చారు. దేవుడి గురించి అనేక ప్రశ్నలు. ‘ఆయన’ అంటూ ఒక వ్యక్తి ఎక్కడో ఉన్నాడా? ‘ఆయన’ పురుషుడా, స్త్రీయా? అతనికి ప్రపంచాన్ని సృష్టించడం, పోలీసింగ్‌ చేయడమే పనా? దేవుడు అనే తత్వానికి రూపముందా? అసలు మనకున్న మనసు, ఇంద్రియాలు అనే సాధనాల పరిమితులేమిటి? మొదలైన ఎన్నో ప్రశ్నలు. వీటిని గూర్చి ఉపనిషత్తుల్లో చర్చించారు. కాని చాలామంది రుషులు అనేక ఉపనిషత్తుల్లో వీటిని చెప్పడం వల్ల అక్కడక్కడ భాషాభేదాలు, సందర్భాన్ని బట్టి అన్వయించుకోవాల్సిన విషయాలు ఉంటాయి. కాని ఇవన్నీ ఒకే విషయాన్ని చెబుతున్నాయి అని వాటిలో ఏకవాక్యతను (unity of thought ) నిరూపించిన వ్యక్తి వేదవ్యాసుడు. భగవంతుడు, జీవుడు, సృష్టి మొదలైన విషయాల్ని శాస్త్రీయంగా విచారించడానికి ఒక పద్ధతిని వ్యాసుడు వ్యవస్థీకరించాడు. పరిశీలించాల్సిన ప్రశ్నలన్నింటినీ గుర్తించడం, వాటి గురించి అనేక ఉపనిషత్తుల్లో రుషులు ఎలా చెప్పారు అని చర్చించడం, వాటిలో ఉన్న భేదాల్ని ఎలా సమన్వయం చేయడం అనే విషయాలపై 555 సూత్రాల రూపంలో ఒక గ్రంథాన్ని రాశాడు. దానిపేరే బ్రహ్మసూత్రాలు.
న్యాయస్థానంలో ఎలాగైతే వాది, ప్రతివాదులు చెప్పే విషయాల్ని విచారించి నిర్ధారణ జరుగుతుందో, అదే పద్ధతిలో ఒక్కో విషయంపై చర్చ ఇందులో చూడగలం. ఒక్కొక్క విషయంపై జరిగిన చర్చను అధికరణం అంటారు. సంస్కృతంలో అధికరణం అనే పదానికి న్యాయస్థానం అని అర్థం. న్యాయాధికారికి అధికరణికుడు అని పేరు. అధికరణంలోని చర్చలో ఐదు భాగాలుంటాయి. మొదటగా విషయమేమిటి, తర్వాత ఆ విషయంపై వచ్చిన సందేహాలు, ఆపై రెండువైపులా వాదనల్ని వినడం, చివరగా ఆ అంశంపై నిర్ధారణ. ఈ విధంగా 191 చర్చల్ని ఇందులో చూడగలం.
ఈ చర్చలన్నీ తత్వశాస్త్రం పరిధిలోకి వస్తాయి. ఈ చర్చలు భారతీయ సమాజాన్ని, అందులోని వివిధ సంప్రదాయాల్నీ సమన్వయధోరణిలో నడిపాయి. ఇది మనం సరిగా గుర్తించని సత్యం. ఉదాహరణకు పరమాత్మకు రూపముందా లేదా అనే విషయంపై ఉపనిషత్తులు రెండింటినీ సమర్థిస్తూ చెబుతాయి. మరి నిర్ధారణ ఏమిటి? రెండు స్థాయిల్లో జవాబు చెప్పారు. ఈ విశ్వానికంతటికీ కారణమైన తత్వానికి ఒక రూపాన్ని గానీ, లేదా మనిషిలాగ అవయవాలు ఉండడం, మనుషులతో మాట్లాడటం, వారిని రక్షించడం, శిక్షించడంలాంటి పనులు చెప్పడం కుదరదు. అదొక శుద్ధ చైతన్య స్వరూపం మాత్రమే. అయినా అలాంటి చైతన్యంలో ఏ రూపాన్నైనా భావన చేసి ఆరాధించవచ్చు. దీన్నే భవగద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు. ఇలా చెప్పడం వల్ల అనేక సంప్రదాయాల మధ్య శత్రుత్వం లేకుండా మంచి అవగాహనకు తోడ్పడింది. ఇదేదో అందర్నీ సంతృప్తి పరచడానికి చేసిన నిర్ధారణ కాదు. శాస్త్రీయంగా వచ్చిన అవగాహన. ఆరాధనలు, ఉపాసనలు ఒక స్థాయిలో సత్యమే. కానీ, వాటిని దాటి అసలైన తత్వాన్ని గుర్తించడం రెండవ స్థాయి.
మరొక ప్రశ్న ఇంద్రియాలు, మనసుల సృష్టిని గూర్చి. బహుశా ఏ మతగ్రంథంలోనూ వీటిపై చర్చ ఉండదు. కానీ బ్రహ్మసూత్రాల్లో వీటి గురించి చర్చ ఉంది. ఒక్కొక్క ఇంద్రియం శబ్దం, స్పర్శ, రూపం లాంటి ఒక్కొక్క విషయాన్నే గుర్తిస్తుంది. ఇంద్రియాలకూ, అవి గ్రహించే విషయాలకూ సంబంధమేమిటి అనే విషయంపై చర్చ. విజ్ఞానశాస్త్రం కూడా వీటి గురించి ఆలోచించలేదు. 19వ శతాబ్ది వరకు బాహ్య ప్రపంచం గురించిన విజ్ఞానమే. 20వ శతాబ్దిలో మనసును గురించి మనస్తత్వశాస్త్రం విశ్లేషిస్తోంది.
సృష్టిలో ఉన్న వైచిత్రి గురించి మరొక అధికరణం. ఒకడు ధనవంతుడు, మరొకడు పేదగా ఉండడాన్ని ఎలా సమర్థిస్తాం. దేవుడికి ఏ వ్యక్తి పట్ల, మతం పట్ల, జాతి పట్ల, కులం పట్ల ప్రేమగానీ, ద్వేషం గానీ ఉండవు అన్న విషయంపై ఇందులో చర్చ. దీన్ని వివరించడానికి కర్మ సిద్ధాంతం ప్రతిపాదించారు. దేవుడు సృష్టిని అకస్మాత్తుగా చేశాడా లేక సృష్టి ఒక పరిణామక్రమంలో ఏర్పడిందా అన్నది మరొక చర్చాంశం. ఒక పరిణామక్రమంలో ఏర్పడిందని సిద్ధాంతం. అందుకే డార్విన్‌ పరిణామవాదాన్ని పాశ్చాత్యమతాలు అంగీకరించకున్నా మన సిద్ధాంతంలో ఎలాంటి అభ్యంతరమూ లేదు.
జీవుడికీ, భగవంతుడికీ ఉన్న సంబంధం మరొక చర్చా విషయం. జీవుడు కేవలం దేవుని దాసుడా అన్న విషయంపై పూర్వాపరాలు చర్చించి.. జీవుడు భగవంతుడి అంశయే అని ఈ అధికరణం నిర్ధారిస్తుంది. సముద్రంలోని అల ఎలాగైతే సముద్రమో అట్లాగే జీవుడు కూడా.
అనేక దేవుళ్లని పూజించే విషయంపై మరొక చర్చ. ఉపాసనలన్నింటికీ ఫలం ఒక్కటే. కాబట్టి దేనినైనా అనుష్ఠానం చేయవచ్చు అని ఈ అంశం తీర్పు. అలాగే దేవతాధికరణం అనే అంశంలో 33 కోట్ల దేవతలున్నారా అని మనకు సాధారణంగా వచ్చే ప్రశ్నకు జవాబు చూడగలం. కోటి అంటే ఒక తరగతి అని అర్థం. 33 కోట్లు అంటే 33 విధాలు లేక 33 తరగతులుగా చూడదగిన దేవతా తత్వాలు. ఒకే పరమాత్మతత్వం అనేక రూపాల్లో కనిపిస్తుందని చివరగా సమాధానం.
ఇంత శాస్త్రీయంగా విషయాల్ని విశ్లేషించిన గ్రంథాన్ని స్థూలంగానైనా తెలుసుకుంటే ప్రాచీన రుషులు ఎంత నిష్పాక్షికంగా, నిశితంగా విషయాలను పరిశీలించారో చూడగలం. --డాక్టర్‌ కె. అరవిందరావు రిటైర్డు డీజీపీ


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---





No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list