MohanPublications Print Books Online store clik Here Devullu.com

జీవితం ఓ మంచి పుస్తకం , Life is Like a Good Book

జీవితం ఓ మంచి పుస్తకం 
Life is Like a Good Book


++ +++ జీవితం ఓ మంచి పుస్తకం ++++++
‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ, ఓ మంచి పుస్తకం కొని చదువుకో’ అన్నారో కవి. పుస్తకం- మంచి నేస్తం, తండ్రి, గురువు, ఉపదేశకుడితో సమానం. అది మనకు జ్ఞానం, విజ్ఞానం, వినోదం, పరిష్కారం, కర్తవ్యం, మార్గనిర్దేశనం... అన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి విశిష్టత, ప్రయోజనం కలిగిన పుస్తకంతో సమానమైంది మన జీవితం!
జీవితం అద్భుతమనుకుంటే, జీవన విధానం అంతకంటే అద్భుతమైంది. అందువల్ల జీవితం మీద ఎన్నడూ విరక్తి కలగకూడదు. మధ్యలోనే జీవితాన్ని అంతం చేసుకొనే హక్కు మనకు లేదు.
‘శతాయుష్మాన్‌ భవ’ అని పెద్దలు మనల్ని దీవిస్తారు. నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో జీవించాలన్న కోరిక కలిగి ఉండాలని ‘ఈశావాస్యోపనిషత్తు’ చెబుతుంది. ప్రయత్నంలో అప్పుడప్పుడూ అపజయం ఎదురైనా, తల పైకెత్తి దృష్టి సారిస్తూ ముందుకు సాగిపోవాలని అధర్వణ వేదం మనకు ఆత్మస్థైర్యం కలిగిస్తుంది.
‘స్వార్థరహిత మనస్కుడివై నిన్ను నువ్వు ఉద్ధరించుకో’ అని రుగ్వేదం బోధిస్తుంది. ముళ్ల మధ్య ఉన్నా- పుష్పాలు వికసిస్తూ, పరిమళాన్ని పరివ్యాప్తం చేస్తూ ఆనందాన్ని కలిగిస్తాయి. అదే రీతిలో మానవులూ ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవాలని, ప్రసన్నచిత్తంతో ఉంటూ ఇతరులకు ఆనందం పంచిపెట్టాలనివేదాలు చెబుతాయి.
Www.MOHANPUBLICATIONS.com
లంకలో సీతమ్మ కోసం వెతికి నిరాశా నిస్పృహలకు లోనైన హనుమంతుడు, తిరిగి వెళ్లడంకంటే ఆత్మత్యాగమే శరణ్యమనుకుంటాడు. అదే సందర్భంలో ఒక్క క్షణం ఆయనలోని విచక్షణ జ్ఞానం మేలుకొంటుంది. ఆ శక్తి జాగృతమై, ఆయనలోని బలహీనతను దూరం చేస్తుంది. జీవితం అమూల్యం, శుభప్రదం అని అంతరాత్మ ప్రబోధిస్తుంది. ఆ తరవాత, సీతమ్మ జాడ తెలుసుకోవడంలో ఆయన కృతకృత్యుడయ్యాడు.
మనిషి ఆశావాదిగా ఉండాలి. జీవితం అనేది ఎంత మంచి పుస్తకమైనా, కొన్ని అచ్చుతప్పులు ఉండవచ్చు. ఒక్కోసారి పుటలూ తారుమారు కావచ్చు. ఎక్కడైనా భాష క్లిష్టంగానూ అనిపించవచ్చు. అంతమాత్రాన ఆ పుస్తకాన్నే వద్దనుకుంటామా? జీవితమూ అంతే!
జీవనకాలాన్ని పెంచే సాధనమే ఆనందం. అది సంతృప్తి వల్లనే సాధ్యపడుతుంది. ‘పత్రం, పుష్పం, ఫలం, తోయం (నీరు)- ఏదైనా భక్తితో సమర్పిస్తే సంతుష్టుడి నవుతాను’ అంటాడు గీతాచార్యుడు. అందులోని సారాంశాన్ని మన జీవితంతో సమన్వయపరచుకుంటే దుఃఖమే ఉండదు. కష్టాలన్నీ కోరికల వల్ల కలుగుతాయి. వాటిని తగ్గించుకోవడమే మనిషి చేయాల్సిన పని. కామ క్రోధాది అంతశ్శత్రువుల్ని మనసు నుంచి పారదోలినప్పుడు, అది విశాల గగనంలా మారుతుంది. సత్సంకల్పం కలిగినవాడు, సాధన అనే ధన మహిమ గ్రహించినవాడు- జీవితంలో ఎన్నటికీ ఓడిపోడు.
జీవన సాఫల్యానికి ప్రతి వ్యక్తీ మూడు ‘ద’కారాలు అనుసరించాలని మనుస్మృతి చెబుతుంది. ఒకటి దేహభక్తి అయితే- దేశభక్తి రెండోది, దైవభక్తి మూడోది. ఈ మూడు సూత్రాలూ ధర్మబద్ధమైనవే. జాతి జీవన గమనానికి, పురోగతికి ధర్మమే మూలం. సకల జీవకోటిని, ప్రకృతిని ప్రేమించాలని, సేవించాలని ప్రబోధించేది ఆ ధర్మమే!
ధర్మం అనేది మనిషి సుఖ జీవనానికి ఓ కరదీపిక. అతడు జ్ఞానాన్ని ఆర్జించినకొద్దీ, ధర్మం విలువ తెలుస్తుంది. జ్ఞాని అయినవాడు సమదృష్టి, సమవర్తిత్వం అలవరచుకోగలడు అనేవారు స్వామి వివేకానంద. ‘జ్ఞానం తాలూకు మొదటి భాగం శ్రవణం, రెండోభాగం మౌనం’ అని ఆయన ప్రబోధించారు.
జీవనశైలికి పరిపూర్ణత కలిగించేది, సౌందర్య ఆనందాల్ని ప్రసాదించేది - ఆధ్యాత్మికత. మనిషి అనుసరించాల్సిన మార్గం అదే. ఆధ్యాత్మికతే మానవజన్మకు చరితార్థత చేకూరుస్తుంది. ఆధ్యాత్మికత అంటే, భక్తి ఒక్కటే కాదు. భగవంతుడికి ఇష్టమైన పనినే చేయడం, అటువంటి పని కోసమే నిరంతరం అన్వేషిస్తూ ఉండటం- జీవితం. మంచి పుస్తకం సారాంశాన్ని మనిషి తన మస్తకంలో దాచుకోవాలి. సంసారానికి అన్వయించుకోవాలి. అదే అతడి జీవితానికి పరమావధి!
- చిమ్మపూడి శ్రీరామమూర్తి


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---






No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list