MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఇంటర్ తర్వాత, After Inter

ఇంటర్ తర్వాత
 After Inter
++++++++++++ఇంటర్ తర్వాత+++++++++++
ఇంటర్మీడియెట్ ఎంపీసీ తర్వాత ఉన్నతవిద్య పరంగా ఎలాంటి అవకాశాలుంటాయి?
 అత్యున్నత విద్యావకాశాలు అందించే గ్రూప్.. మ్యాథ్‌‌స, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ). ఇంటర్మీడియెట్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ (ఇంజనీరింగ్) రాసి.. వివిధ బ్రాంచ్‌ల్లో బీటెక్, బీఫార్మసీ, బీటెక్(అగ్రి ఇంజనీరింగ్), బీటెక్(బయోటెక్నాలజీ), బీటెక్(డెయిరీ టెక్నాలజీ), బీటెక్(ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ), ఫార్మ్‌డి వంటి కోర్సులు అభ్యసించొచ్చు. ఫార్మ్‌డి మినహాయించి మిగిలిన కోర్సుల వ్యవధి నాలుగేళ్లు. ఫార్మ్‌డి వ్యవధి ఆరేళ్లు.
 జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ విద్యకు మేటి సంస్థలుగా పేరొందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీలు), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీలు)లలో నాలుగేళ్ల బీటెక్, ఐదేళ్ల డ్యుయెల్ డిగ్రీ (ఇంజనీరింగ్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ వంటి కోర్సులు చదవొచ్చు. దీనికోసం జాతీయస్థాయిలో ప్రతి ఏటా ఏప్రిల్/మేలలో జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ నిర్వహిస్తారు.
 సైన్స్ సంబంధిత కోర్సులను అందించడంలో దేశంలోనే పేరుగాంచిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)లో నాలుగేళ్ల బీఎస్ (రీసెర్చ్), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్)లలో ఐదేళ్ల బీఎస్-ఎంఎస్ డ్యుయెల్ డిగ్రీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (నైసర్)-భువనేశ్వర్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ వంటి కోర్సులు చదివే వీలుంది. ఇన్‌స్టిట్యూట్‌ను బట్టి జాతీయస్థాయిలో జరిగే ప్రవేశపరీక్ష/జేఈఈ అడ్వాన్స్‌డ్ తదితర మార్గాల ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
 దేశంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ వంటివాటితోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ వంటివి ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణతతో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు అందిస్తున్నాయి. ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
 ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణతతో బీఏ(మ్యాథ్స్), బీఎస్సీ(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ), బీఎస్సీ(బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ), బీఎస్సీ(మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్), బీఎస్సీ(మ్యాథ్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్), బీఎస్సీ(మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్) వంటి కాంబినేషన్లతోపాటు బీఏ/బీకాం వంటి కోర్సులు చదివే వీలుంది. బీఏలో ఎకనామిక్స్ చదవడం కుదరదు. ఇంటర్‌లో ఎకనామిక్స్ చదివినవాళ్లే అర్హులు. బీఏ/బీఎస్సీ/బీకాం కోర్సుల వ్యవధి: మూడేళ్లు.
 బీటెక్ /బీఏ /బీఎస్సీ/బీకాం కోర్సులు పూర్తిచేస్తే సంబంధిత సబ్జెక్టులు/స్పెషలైజేషన్‌తో ఎంటెక్/ఎంఏ/ఎంఎస్సీ/ఎంకాం/ఎంబీఏ వంటి కోర్సులు అభ్యసించొచ్చు. దేశంలో దాదాపు అన్ని యూనివర్సిటీలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఎంటెక్/ఎంబీఏ మినహాయించి మిగిలిన కోర్సులకు ఆయా వర్సిటీల ప్రవేశపరీక్షలు రాయాలి. ఎంటెక్‌కు గేట్/పీజీఈసెట్, ఎంబీఏకు క్యాట్/మ్యాట్/గ్జాట్/సీమ్యాట్/ఆత్మా వంటి పరీక్షల్లో ర్యాంకు సాధించాలి.
ఇంటర్మీడియెట్ ఎంపీసీ తర్వాత చదువుకుంటూ ఉద్యోగం చేసే వీలుందా?
ఇంటర్మీడియెట్ ఎంపీసీ తర్వాత చదువుకుంటూ ఉద్యోగం చేసే వీలుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏటా రెండుసార్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ ఎగ్జామ్ (ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ) నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా త్రివిధ దళాలైన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ల్లో కమిషన్డ్ అధికారిగా అడుగుపెట్టే వీలుంది. అవాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. నోటిఫికేషన్‌లో ప్రకటించిన తేదీనాటికి నిర్దేశిత వయసును కలిగి ఉండాలి.
ప్రవేశపరీక్ష, సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి మూడేళ్లపాటు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)లో శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో నెలకు రూ.21,000 స్టైఫండ్ లభిస్తుంది. తర్వాత బీఎస్సీ/బీఎస్సీ (కంప్యూటర్స్)/బీఏ సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు. 10+2 కేడెట్ ఎంట్రీ స్కీమ్ అభ్యర్థులకు ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్‌ఏ)- ఎజిమలలో నాలుగేళ్లు శిక్షణ ఇచ్చి బీటెక్ ప్రదానం చేస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని అభ్యర్థి ఎంచుకున్న విభాగాన్ని బట్టి త్రివిధ దళాల్లో కమిషన్డ్ ఆఫీసర్‌గా నియమిస్తారు. నెలకు రూ.35 వేల వేతనంతో కెరీర్ ఆరంభమవుతుంది. ఇంకా గ్రేడ్ పే, హెచ్‌ఆర్‌ఏ, ఇన్సూరెన్స్, పెన్షన్ తదితర సదుపాయాలుంటాయి.
 దూరవిద్యతో అవకాశం: ఇంటర్మీడియెట్ తర్వాత ఉన్నత చదువులకు ఆటంకాలు ఏర్పడితే ఏదైనా ఉద్యోగం చేస్తూ దూరవిద్య విధానం ద్వారా బీఏ/బీకాం/బీఎస్సీ వంటి కోర్సులు చదువుకునే వీలుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం-తిరుపతి, ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) దూరవిద్య విధానంలో కోర్సులు అందిస్తున్నాయి. ఏటా జనవరి నుంచి జూలై మధ్యలో ఆయా నోటిఫికేషన్లు వెలువడతాయి.
ఇంటర్మీడియెట్ ఎంఈసీ పూర్తిచేస్తే ఉన్నతవిద్య పరంగా ఎలాంటి అవకాశాలుంటాయి?
 ఇంటర్‌లో ఎంఈసీ పూర్తి చేయడం ద్వారా.. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ) మ్యాథ్స్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్(బీకాం) (జనరల్ /ఈ-కామర్స్ /కంప్యూటర్స్ /ఫైనాన్షియల్ మార్కెట్స్); బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బీబీఏ); బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్(బీబీఎం), బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(బీసీఏ), ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంఏ(ఎకనామిక్స్), ఇంటిగ్రేటెడ్ ఎంకాం(వ్యవధి:ఐదేళ్లు)లలో చేరొచ్చు.
 బీఏ/బీకాం తర్వాత మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ), పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం) చదివి సంస్థల నిర్వహణలో కీలకపాత్ర పోషించొచ్చు. తద్వారా మేనేజ్‌మెంట్ నిపుణులుగా ఎదగొచ్చు. మరోవైపు భారీ వేతనాలను అందిస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ), కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్) వంటి జాబ్ గ్యారెంటీ కోర్సులు చదవొచ్చు. ఏ కంపెనీకైనా వీరి అవసరం ఉంటుంది.
ఇంటర్మీడియెట్ హెచ్‌ఈసీ పూర్తి చేశాను. బ్యాచిలర్ డిగ్రీలో బీఏ చదవాలనుకుంటున్నాను. బీఏలో ఏయే కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి?
 ఇంటర్మీడియెట్‌లో ఏ గ్రూపు ఉత్తీర్ణులైనా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ)లో చేరొచ్చు. ఇందులో భాగంగా వివిధ కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి. అవి.. ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్; హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్; హిస్టరీ, సోషియాలజీ, జాగ్రఫీ; సైకాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ; సైకాలజీ, సోషియాలజీ, మార్కెటింగ్; సైకాలజీ, ఇంగ్లిష్ లిటరేచర్, ఫిలాసఫీ; సోషియాలజీ, ఉర్దూ, పర్షియన్; హిస్టరీ, హిందీ, సంస్కృతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రభుత్వ కళాశాలలు, కొన్ని ప్రైవేటు కళాశాలల్లో ఈ కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలను లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులు వీటిని ఎంచుకుంటున్నారు. ఆయా పరీక్షల్లో కూడా ఈ నేపథ్యం ఉపకరిస్తోంది. దీంతో బీఏ కోర్సుకు ఆదరణ పెరుగుతోంది.
 ఇంటర్మీడియెట్ సీఈసీ పూర్తయింది. బీకాం చేయాలనుకుంటున్నాను. ఇందులో ఏయే స్పెషలైజేషన్లు ఉన్నాయి?
ఆర్థిక, వాణి జ్య రంగాల విస్తరణ, కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో బీకాం కోర్సుల అభ్యర్థులకు చక్కటి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. మార్కెట్/కంపెనీ అవసరాలకనుగుణంగా బీకాంలో వివిధ స్పెషలైజేషన్లను ఆయా విద్యా సంస్థలు ప్రవేశపెట్టాయి. రెగ్యులర్ బీకాంతోపాటు బీకాం ఈ-కామర్స్ /హానర్స్ /ఫైనాన్షియల్ మార్కెట్స్ /కంప్యూటర్స్ /బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ /ట్యాక్సేషన్ /మార్కెటింగ్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటికి జాబ్ మార్కెట్‌లో మంచి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. బీకాం పూర్తయిన తర్వాత సంబంధిత అంశంలో ఎంకాం కూడా పూర్తిచేసే వీలుంది.
ఇంటర్మీడియెట్ బైపీసీ కోర్సు పూర్తయిన తర్వాత ఉన్నత విద్య అవకాశాలు ఎలా ఉంటాయి?
 ఇంటర్మీడియెట్ బైపీసీ పూర్తిచేసినవారు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ రాసి బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (ఎంబీబీఎస్), బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్), బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (బీఏఎంఎస్), బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ అండ్ మెడిసిన్ సర్జరీ (బీహెచ్‌ఎంఎస్), బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సెన్సైస్ (బీఎన్‌వైఎస్), బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (హార్టికల్చర్), బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ(బీవీఎస్సీ అండ్ ఏహెచ్), బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సెన్సైస్ (బీఎఫ్‌ఎస్సీ), బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ), బీఫార్మసీ, బీటెక్ (బయోటెక్నాలజీ), ఫార్మ్‌డి వంటి కోర్సులు అభ్యసించొచ్చు.
 ఇవే కాకుండా ఇంటర్మీడియెట్ బైపీసీ మార్కుల ఆధారంగా పారామెడికల్ కోర్సుల్లో చేరొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పారామెడికల్ బోర్డులు ఈ కోర్సులు నిర్వహిస్తున్నాయి. రెండేళ్ల వ్యవధి గల ఈ కోర్సుల్లో డిప్లొమా ఇన్.. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ/మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ/ఆఫ్తల్మాలిక్ అసిస్టెంట్/డయాలసిస్ టెక్నాలజీ /రెస్పిరేటరీ థెరపీ/మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ/పర్‌ఫ్యూషన్ టెక్నాలజీ/రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్/డార్క్‌రూమ్ అసిస్టెంట్/కార్డియాలజీ టెక్నీషియన్/క్యాత్ ల్యాబ్ టెక్నాలజీ/ఈసీజీ టెక్నీషియన్/అనస్థీషియా టెక్నీషియన్/ఆడియోమెట్రీ టెక్నీషియన్/ఆప్టోమెట్రీ టెక్నీషియన్/రేడియోథెరపీ టెక్నాలజీ/మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తిచేయడం ద్వారా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అవకాశాలు దక్కించుకోవచ్చు.
 పారామెడికల్ కోర్సులే కాకుండా బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ(బీపీటీ), బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ(బీఎంఎల్‌టీ), బీఎస్సీ(నర్సింగ్) వంటి కోర్సుల్లోనూ ఇంటర్ బైపీసీ మార్కుల ఆధారంగా చేరొచ్చు.
 బ్యాచిలర్ ఆఫ్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ (బీయూఎంఎస్) కోర్సులో ప్రవేశానికి ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
 బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఈ కోర్సులు అభ్యసించిన విద్యార్థులు పీజీ స్థాయిలో సంబంధిత విభాగాల్లో ఎంఎస్/ఎండీ/సూపర్ స్పెషాలిటీ/డిప్లొమా/ఎంఎస్సీ వంటి కోర్సులు చదవచ్చు.
ఇంటర్మీడియెట్ ఎంపీసీతో ఇండియన్ ఆర్మీలో ఏయే ఉద్యోగాలు ఉంటాయి?
ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణతతో ఇండియన్ ఆర్మీలో వివిధ ఉద్యోగాలు ఉన్నాయి..
 సోల్జర్స్ (టెక్నికల్) (టెక్నికల్ ఆర్మ్స్, ఆర్టిలరీ, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్): 50 శాతం మార్కులతో 10+2/ఇంటర్మీడియెట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లిష్) ఉత్తీర్ణత. ప్రతి సబ్జెక్టులో 40 శాతం మార్కులు తప్పనిసరి. 171/2-231/2 వయసు ఉన్నవారు అర్హులు. నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి.
 సోల్జర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్ (అన్ని ఆర్మ్స్): 50 శాతం మార్కులతో 10+2/ ఇంటర్మీడియెట్ (ప్రతి సబ్జెక్టులో 40 శాతం మార్కులు పొందాలి) ఉత్తీర్ణత. 17 1/2-23 1/2 వయసు ఉన్నవారు అర్హులు. నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి.
 పర్మినెంట్ కమిషన్ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్: అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. నిర్దేశిత తేదీనాటికి 16 1/2 నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి. 70 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణులు అర్హులు. నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి. సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్‌ఎస్‌బీ) ద్వారా ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారు ఐదేళ్లు శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపడతారు. నెలకు అన్ని కలుపుకొని రూ.65 వేల వేతనం చెల్లిస్తారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది జూన్ 30.
ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో జాతీయస్థాయిలో ఉన్న ఉద్యోగావకాశాలేమిటి?
 కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో లోయర్ డివిజన్ క్లర్క్స్(ఎల్‌డీసీ), డేటా ఎంట్రీ ఆపరేటర్స్(డీటీపీలు), పోస్టల్ అసిస్టెంట్స్, సార్టింగ్ అసిస్టెంట్స్ భర్తీకి జాతీయస్థాయిలో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నిర్వహించే పరీక్ష.. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ (10+2). ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై, నిర్దేశిత తేదీ నాటికి 18-27 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. ప్రవేశ పరీక్ష, టైపింగ్ టెస్ట్/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి రూ.5200-రూ.20200 వేతన శ్రేణితో కెరీర్ ప్రారంభమవుతుంది.
 స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామినేషన్: వివిధ కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర విభాగాల్లో స్టెనోగ్రాఫర్స్ పోస్టుల భర్తీకి ఏటా ఎస్‌ఎస్‌సీ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ ఏడాదికి ప్రకటన వెలువడింది. ఇంటర్మీడియెట్ పూర్తిచేసి ఆగస్టు 1, 2016 నాటికి 18-27 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. రాత పరీక్ష, స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. జూలై 31న పరీక్ష నిర్వహిస్తారు.
ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణతతో ఇండియన్ నేవీలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి?
 ఆర్టిఫిషర్ అప్రెంటీస్ సెయిలర్: నిర్దేశిత తేదీ నాటికి 17-20 ఏళ్ల మధ్యలో ఉండాలి. అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి. రాతపరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
 సీనియర్ సెకండరీ రిక్రూట్స్: 17-21 ఏళ్ల మధ్య వయసు ఉన్న అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి.రాతపరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది. గంట వ్యవధిలో జరిగే రాత పరీక్ష ఇంగ్లిష్/హిందీల్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే ఈ పరీక్షలో ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్‌లపై ప్రశ్నలు ఉంటాయి. రాతపరీక్షలో ఉత్తీర్ణులను శారీరక సామర్థ్య పరీక్షకు ఎంపిక చేస్తారు.
 నోటిఫికేషన్లు: ఏటా డిసెంబర్/జనవరి; జూన్/జూలైల్లో ఎంప్లాయ్‌మెంట్ న్యూస్, జాతీయ, ప్రాంతీయ దినపత్రికల్లో ప్రకటనలు వెలువడుతుంటాయి.
ఇంటర్మీడియెట్ లో సీఈసీ/హెచ్‌ఈసీ పూర్తిచేసిన తర్వాత ఉన్నత విద్యపరంగా ఎలాంటి అవకాశాలు ఉంటాయి?
ఇంటర్మీడియెట్‌లో సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ (సీఈసీ), హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ (హెచ్‌ఈసీ) గ్రూప్‌ను ఎంచుకున్నవారికి తర్వాత ఉన్నతవిద్య పరంగా మంచి అవకాశాలుంటాయి.
 రెండేళ్ల ఇంటర్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదేళ్ల బీఏఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (లాసెట్) రాయొచ్చు. జాతీయస్థాయిలో లా కోర్సుల్లో ప్రవేశానికి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) రాయాలి.
 ఉపాధ్యాయ వృత్తి అంటే ఇష్టమున్నవారు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈడీ) కోర్సుల్లో చేరొచ్చు. దీనికోసం డీఈఈసెట్ రాయాలి. ఏటా మే/జూన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ర్యాంకు ద్వారా డీఈడీ కోర్సు పూర్తిచేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక ఉపాధ్యాయులుగా అడుగుపెట్టడానికి అర్హత లభిస్తుంది.
 హోటల్ మేనేజ్‌మెంట్‌పై ఆసక్తి ఉన్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎంసీటీ) నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(జేఈఈ) ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (ఐహెచ్‌ఎం)లలో మూడేళ్ల బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో చేరొచ్చు.
 సంప్రదాయ డిగ్రీలో చేరాలనుకుంటే.. మూడేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ)/బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బీకాం)ల్లో చేరొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని యూనివర్సిటీల పరిధిలోని కళాశాలలు ఈ కోర్సులు అందిస్తున్నాయి. కొన్ని కళాశాలలు బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (బీబీఎం), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) వంటి కోర్సులు కూడా అందిస్తున్నాయి. బీఏ/బీకాం/బీబీఎం/బీబీఏ పూర్తిచేస్తే తర్వాత రెండేళ్ల ఎంఏ/ఎంకాం/ఎంబీఏ చదవొచ్చు.
 సీఈసీ విద్యార్థులు చార్టర్ట్ అకౌంటెన్సీ(సీఏ), కంపెనీ సెక్రటరీ(సీఎస్), కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ) వంటి కోర్సులు అభ్యసిస్తే అద్భుత అవకాశాలు అందుకోవచ్చు. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోనే ఈ కోర్సుల్లో ప్రవేశించే వీలుంది. లేదంటే బీకాం చేసిన తర్వాత అకౌంటింగ్, ట్యాలీ వంటి కోర్సులు పూర్తిచేస్తే వివిధ సంస్థల్లో అకౌంటెంట్‌గా పనిచేయొచ్చు.
 ఇంటర్ సీఈసీ/హెచ్‌ఈసీ విద్యార్థులకు ఉన్న మరో అద్భుత అవకాశం.. ఇంటిగ్రేటెడ్ పీజీలు. వీటి ద్వారా బ్రేక్ లేకుండా మూడేళ్ల డిగ్రీ, రెండేళ్ల పీజీ పూర్తిచేయొచ్చు. మూడేళ్ల తర్వాత పీజీ వద్దనుకుంటే గ్రాడ్యుయేట్ పట్టా కూడా ఇవ్వడం ఈ కోర్సుల ప్రత్యేకత.
ఇంటర్మీడియెట్ సీఈసీ పూర్తయింది. ఫైన్‌ఆర్‌‌ట్స చేయాలనుకుంటున్నాను. ఇందులో ఏయే స్పెషలైజేషన్లు ఉన్నాయి?
ఇంటర్ సీఈసీ/హెచ్‌ఈసీ ఉత్తీర్ణతతో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్‌ఆర్ట్స్‌లో భాగంగా స్కల్‌ప్చర్/ఫొటోగ్రఫీ/అప్లైడ్ ఆర్ట్స్/యానిమేషన్/ పెయింటింగ్/ఇంటీరియర్ డిజైన్ వంటి కోర్సుల్లో చేరొచ్చు. హైదరాబాద్‌లో ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) ఈ కోర్సులను అందిస్తోంది. ప్రవేశపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఈ ఏడాది కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. రూ. 3 వేలు ఆలస్య రుసుముతో ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూలైలో ప్రవేశపరీక్ష ఉంటుంది.
సీఈసీ పూర్తిచేశాను.. బీసీఏ/బీబీఎం/బీబీఏ వంటి కోర్సుల్లో చేరొచ్చా? వీటితో ఎలాంటి అవకాశాలు ఉంటాయి?
బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) చదవాలంటే.. ఇంటర్‌లో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. సాఫ్ట్‌వేర్ బూమ్ ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన కోర్సుల్లో బీసీఏ ఒకటి. కొన్ని కళాశాలల్లో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంది. గ్రాడ్యుయేషన్ స్థాయిలోనే విద్యార్థులకు నిర్వహణ నైపుణ్యాలను అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కోర్సులు.. బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (బీబీఎం), బ్యాచిలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ). ఈ కోర్సులకు కూడా ఆదరణ అంతంత మాత్రమే. కొన్ని యూనివర్సిటీలు/విద్యా సంస్థలు బీబీఏ+ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సు అందిస్తున్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు అర్హులు. కోర్సు వ్యవధి ఐదేళ్లు. ప్రత్యేకంగా ఆయా అంశాల్లో కోర్ నైపుణ్యాలు కోరుకునేవారికి మాత్రమే ఈ కోర్సులు ఉపకరిస్తాయి.
బీఎస్సీలో ఏయే కాంబినేషన్లు ఉన్నాయి? దేనికి ఎక్కువ ఉద్యోగావకాశాలున్నాయి?
ఇంటర్ ఎంపీసీ/బైపీసీ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్సీ)లో వివిధ కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి.
 ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న కాంబినేషన్లు:
బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ; మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్; మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్; మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్; మ్యాథమెటిక్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్, కంప్యూటర్ సైన్స్; బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ.
 బైపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న కాంబినేషన్లు:
బీఎస్సీలో భాగంగా బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ; మైక్రోబయాలజీ, జెనెటిక్స్, కెమిస్ట్రీ; బయోటెక్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ; బయోటెక్నాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ; బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ వంటి కాంబినేషన్లు ఉన్నాయి. వీటిలో అన్ని సబ్జెక్టులకు ఉన్నతవిద్య అవకాశాలున్నాయి. ముఖ్యంగా లైఫ్ సెన్సైస్ సబ్జెక్టులు (జెనెటిక్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ) చదివే విద్యార్థులు పీజీ, పీహెచ్‌డీ చేయాలనుకుంటేనే ఆ సబ్జెక్టులు చదవడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు.
బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఆ కోర్సులతో అంతగా ఉద్యోగావకాశాలు లేకపోవడమే ఇందుకు కారణం. ఫిజికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్) కు ఉన్నతవిద్య పరంగా, ఉద్యోగాల పరంగా మంచి అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. లైఫ్ సెన్సైస్ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ చేస్తేనే మంచిదని పేర్కొంటున్నారు.
ఆసక్తి, కెరీర్ పరంగా భవిష్యత్తు లక్ష్యాలు, జాబ్ మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా గ్రాడ్యుయేషన్ స్థాయిలో కాంబినేషన్ సబ్జెక్టులను ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు ప్రస్తుతం బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ కోర్సులు పూర్తిచేసిన వారికి ఫార్మా ఇండస్ట్రీ, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్‌లో ఉన్నత అవకాశాలుంటున్నాయి. ఫైనలియర్‌లో చూద్దాంలే అనుకోకుండా.. కాలేజీలో చేరిన మొదటి నుంచి ఉన్నత విద్య, ఉద్యోగ సాధనకు సంబంధించి స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, దానికి అనుగుణంగా సీరియస్‌గా సిద్ధమవాలి.
కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంచుకోవాలి. మన సామర్థ్యాలను కచ్చితంగా వ్యక్తపరిచేందుకు ఇవి కీలకం. కాలేజీ లైబ్రరీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. దినపత్రికలను కూడా చదవాలి. కేవలం మార్కులు, పర్సంటేజీలే కాకుండా అన్ని అంశాల్లోనూ ముందున్నప్పుడే ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజయం సొంతమవుతుంది.
- డా. కె.ప్రమీల, ప్రిన్సిపల్, ఎల్‌హెచ్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైలవరం.
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ 10+2 (బీటెక్)
అర్హత: 70 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణత. ఇంటర్మీడియెట్ ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరి. నిర్దేశిత తేదీ నాటికి 17 - 19 1/2 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు.
వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in/
బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (బీబీఎం), బ్యాచిలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ). ఈ కోర్సులకు ఆదరణ అంతంత మాత్రమే. కొన్ని యూనివర్సిటీలు/విద్యా సంస్థలు బీబీఏ+ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సు అందిస్తున్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు అర్హులు. కోర్సు వ్యవధి ఐదేళ్లు. ప్రత్యేకంగా ఆయా అంశాల్లో కోర్ నైపుణ్యాలు కోరుకునేవారికి మాత్రమే ఈ కోర్సులు ఉపకరిస్తాయి.
టాగ్లు: ఇంటర్మీడియెట్, ఉన్నతవిద్య, ఉద్యోగం, భవిత, Intermediate, Higher education, Job, Bhavita

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list