MohanPublications Print Books Online store clik Here Devullu.com

దర్భ యొక్క ప్రాముఖ్యం

దర్భ యొక్క ప్రాముఖ్యం


+++++++++దర్భ యొక్క ప్రాముఖ్యం :+++++++
మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన "దర్భ" ముఖ్యమయినది. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో దర్భ జాతి దర్భను అపరకర్మలకు, కుశ జాతి దర్భను శుకర్మలకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, శరము (రెల్లు, ఈ పేరు వినగానే నాకు రెల్లుపూల పానుపు గుర్తుకొస్తుంది) జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.
దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి. కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు. కూర్మ పురాణం ప్రకారం, విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని (క్షీరసాగర మధనం సందర్భములో) మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మము వంటిమీద ఉండే కేశములు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశముగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అనీ చెప్పబడింది. వరాహ పురాణం ప్రకారం, ఈ దర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువు శరీర కేశములని చెప్పబడింది. అందువలననే దర్భ గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపములని జనులు భావించి భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వీటికి దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉందని నమ్మిక. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు, రక్తస్రావం, మూత్రపిండాలలో రాళ్ళు, మూత్రవిసర్జనలో లోపాలు మొదలయిన వానికి మందుగా వాడుతున్నారు. అలానే ముంజ పర్వతం మీద ఉండే దర్భ అతిసారాది రోగాలకు ఔషధమని అథర్వణ వేదంలో చెప్పబడింది.
అసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణ కాలం. ఆ సమయంలో అన్నిటి మీదా దర్భను ఉంచడం మనకు అలవాటు. కానీ అలా చేయటం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే: సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమయిన విష కిరణాలు భూమి మీదకు ప్రసారమవుతాయని ఈనాటి విజ్ఞానశాస్త్రం నిరూపిస్తోంది. ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో కూడా తేలింది. అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు తమ గృహాలను పూర్తిగా దర్భగడ్డితోనే నిర్మించుకుంటున్నారు. ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు గూడా గుర్తించి, గ్రహణ సమయంలో, ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ళ కప్పులను దర్భగడ్డితో కప్పుకొమ్మని శాసనం చేశారు (బహుశా అందుకనే గడ్డితో ఇంటి పైకప్పుని ఎక్కువగా కప్పుకునేవారు). కాలక్రమంలో ఆ శాసనం మార్పులు చెంది, ఇంటి మధ్యలో రెండు దర్భ పరకలు పరచుకొని తూ తూ మంత్రంలా కానిచ్చేస్తున్నారు. ఇలాకాక, కనీసం పిడికెడు దర్భలైనా ప్రతివ్యక్తీ గ్రహణ సమయాలలో శిరస్సుమీద కప్పుకొంటే, చెడు కిరణాల ప్రభావం వుండదని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. సదాశివరావు అనే ఒక వైద్యులు ఈ దర్భ గురించిన ఎన్నో విషయాలను తెలుసుకుని, నమ్మకం కుదరక, కొన్ని దర్భలను తీసుకుని అరచేతిలో ఉంచుకుని మరీ X-Ray తీయించుకోగా, ఆయన నమ్మలేని విధంగా అరవై శాతం రేడియేషన్ ఈ దర్భ గడ్డి చేత శోషించబడిందిట. దీనికి కారణం దర్భల కొనలు తేజమును కలిగి ఉండుట. ఇటువంటి దర్భ గురించి మరెన్నో ఆసక్తికరమయిన విషయాలున్నాయి.
శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః
నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజినకుశోత్తరం
అని భగవద్గీతలో చెప్పబడింది. అంటే ఒక మంచి, స్థిరమయిన ప్రదేశంలో, మనసుని లగ్నం చేసేందుకు సరయిన ఆసనం ఎత్తుగా కాకుండా, మరీ క్రిందకి కాకుండా, చక్కని కుశ గడ్డిని పరచి, దాని మీద జింక చర్మం వేసి ఆ పైన ఒక చక్కని వస్త్రము ఉండేటటువంటి దర్భాసనమే ధ్యానానికి ఉత్తమం అని శ్రీకృష్ణుడు చెప్తారు. అలానే తైత్తరీయోపనిషత్తులో బర్హిషావై ప్రజాపతి: అని ఉంది. అనగా బర్హిష అనే గడ్డిని పరిచి దాని పైన ప్రజలను ఉత్పన్నం చేయటం, వృద్ధి పరచటం చేసేవారని చెప్పబడింది. ఋగ్వేదంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఈ రకమయిన గడ్డి ఎక్కువగా ఉండే ద్వీపాన్ని కుశ ద్వీపం అని కూడా అంటారు. వీటిని గూర్చి మన వేమన గారు ఏమన్నారో చూడండి:
దాతగానివాని తఱచుగా వేఁడిన
వాడుఁ దాతయగునె వసుధలోన
అవురు దర్భ యౌనె యబ్ధిలో ముంచిన
విశ్వదాభిరామ వినర వేమ!
అనగా దానము అంటే ఎరుగని వాడిని ఎన్నిసార్లు అడిగినా వాడు దానము ఇస్తాడా? దాత అవుతాడా? అదే విధముగా ఇంటిపై కప్పు గడ్డిని పవిత్రమైన సముద్రములో ముంచినంత మాత్రాన దాని రూపు మారి దర్భ అవుతుందా? అని. కానీ ఇక్కడ ఇంటిపైకప్పు గడ్డి అన్నది రెల్లు గడ్డి కాదని గుర్తుంచుకోమని మనవి. ఈ విధముగా దర్భలు ఆధ్యాత్మికతతో పాటూ సాహిత్యంలో కూడా చోటు సంపాదించుకున్నాయి.
వేద పాఠం మననం చేసుకునేటప్పుడూ, నేర్చుకునేటప్పుడూ, పఠించేటప్పుడూ దర్భ ఉంగరం కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి అని మన శాస్త్రాల్లో చెప్పబడింది. చావు సంబంధిత కర్మలకి ఏక ఆకు దర్భని, శుభప్రదమయిన వాటికి రెండు ఆకుల దర్భని, అశుభకార్యాలకి (పితృ పూజ, తర్పణాలు, మొ) మూడు ఆకుల దర్భని, పూజా తదితర కార్యక్రమాలకు నాలుగు ఆకుల దర్భని ఉంగరముగా వాడవలెననీ ఉంది. అలానే శ్రాద్ధ కర్మలకు బ్రాహ్మణులు దొరకని పక్షంలో దర్భ ఉంగరాన్ని ఆ స్థానంలో ఉంచి కర్మ చేయవలెనని శ్రీ పద్మ పురాణములో చెప్పబడింది.
దర్భల కొనలు విడుదల చేసే తేజము - దేవతలనూ, పితృ దేవతలను సైతం ఆకర్షించి మనం ఏ పనయితే చేస్తున్నామో ఆ పనికి తగ్గట్టు వారిని ఆహ్వానించి మన ముందు ఉంచుతుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. సమూలస్తు భవేత్ దర్భః పితృణాం శ్రాద్ధ కర్మణిం అన్నట్టుగా దర్భను వేరుతో (మూలము నుండి) సహా భూమి నుండి పెకిలించి దానిని వాడాలి. ఎందుకంటే ఈ వేరులు మాత్రమే పితృ లోకంలోని పితృ దేవతలకు విజయాన్ని చేకూరుస్తాయని అంటారు. అందుకే యజ్ఞ యాగాదులలో అగ్ని గుండానికి నలువైపులా దర్భలను పరుస్తారు.
వీటికి ఉండే సహజసిద్ధమయిన గుణములను ఆరు నెలల తరువాత కోల్పోతాయిట. ఇవి స్వ, పర జనాల కోపాలను పోగొట్టి, సముద్రాన్ని సైతం అణచిపెడుతుంది అని అథర్వణ వేదంలో చెప్పబడింది. దర్భలను ఎక్కువగా వాడుట వలన మనలో సత్వ గుణం పెరుగుతుంది. ఒకవేళ మనం వాటిని నేలకేసి కొట్టినా, గోటితో చీలినా, వాటికి ఎటువంటి హాని కలుగ చేసినా మనలో రజ-తమో గుణాల తీవ్రత పెరిగి మనలో ఉండే సత్వ గుణాన్ని కూడా నాశనం చేస్తుందిట. వీటిని పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి నాడు మాత్రమే ఈ క్రింది శ్లోకం చదువుతూ కొయ్యాలి:
విరించినా సహోత్పన్న పరమేష్ఠి నిసర్గజ
నుద సర్వాణి పాపాని దర్భ స్వస్తికరో భవ
ఈ విధముగా దర్భలు ఎన్నో కార్యక్రమాలలో, ఎన్నో విషయాలలో మనకు చేరువయ్యాయి. దర్భల కొన కోసుగా ఉండుట వలననే అమృతం నాకడానికి వచ్చిన పాముల నాలుకలు రెండు క్రింద చీలాయని నిందలు భరించినా అవి మాత్రం మనకు ఎన్నో విధాలుగా మంచి చేస్తూ, సహకరిస్తూనే ఉన్నాయి. వీటి విలువ తెలిసింది కనుక ఎప్పుడూ ఒక గుప్పెడన్నా ఇంట్లో ఉండేలా చూసుకోవడం మరువకండి.


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---




No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list