MohanPublications Print Books Online store clik Here Devullu.com

రివార్డుల వలలో పడొద్దు Don't go for Rewards

రివార్డుల వలలో పడొద్దు
Don't go for Rewards

రివార్డుల వలలో పడొద్దు!
చేతిలో డబ్బు లేకున్నా.. ఏదైనా కొనే వెసులుబాటు కల్పిస్తుంది.. క్రెడిట్‌ కార్డు. పరిమితితో వాడితే దీనితో ప్రయోజనాలు ఎన్నో.. అందులో రివార్డు పాయింట్లూ ఒకటి. అయితే, వీటిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని కార్డులు వాడితే మాత్రం అప్పుల వలలో చిక్కడం ఖాయం.
భారతీయులు స్వతహాగా పొదుపరులు.. వారు ఆర్జించే మొత్తంలో సగటున 30శాతం వరకూ పొదుపు చేస్తారు. అమెరికాలో ఇది దాదాపు 17శాతమే ఉంది. ఒకప్పుడు నగదు ఆధారిత ఖర్చులే ఉండేవి. మారుతున్న కాలంతోపాటు.. ఖర్చు పెట్టే తీరూ మారింది. ఇప్పుడు చాలామంది తమ చేతిలో డబ్బు లేకున్నా సులభంగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఆదాయానికీ ఖర్చులకూ పొంతన లేకుండా పోతోంది. చివరకు ఆర్థికంగా చిక్కుల్లో చిక్కుకునే స్థాయికి చేరుకుంటున్నారు. కొంతమేరకు ఇందుకు క్రెడిట్‌ కార్డులూ కారణమే అయినప్పటికీ.. వాటిని సరిగా వాడితే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. సకాలంలో బిల్లులు చెల్లించకపోతే గరిష్ఠంగా 48శాతం వరకూ వడ్డీని చెల్లించాల్సి రావచ్చు. సేవా రుసుములు, పన్నులు కలిపితే ఇవి కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఏదో ఒక రోజు అప్పును ముగించకపోతే.. అది మీ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుందనడంలో సందేహం లేదు. కేవలం క్రెడిట్‌ కార్డు ఇచ్చే రివార్డు పాయింట్ల కోసమే కొంతమంది కార్డును పూర్తి స్థాయిలో వాడేస్తుంటారు. తీరా చివరి తేదీనాడు పూర్తి బిల్లు చెల్లించలేక ఇబ్బందులు పడుతుంటారు.
అవగాహన ఉంటే..
ప్రతి విషయంలోనూ మంచీ చెడులు ఉంటాయి. క్రెడిట్‌ కార్డు వాడకంలోనూ ఇది వర్తిస్తుంది. ప్రతి ఖర్చునూ పర్యవేక్షించుకుంటూ.. ఎప్పటికప్పుడు బిల్లులను చెల్లించే వారికి క్రెడిట్‌ కార్డు రివార్డు పాయింట్లు మంచి ప్రయోజనమే కల్పిస్తాయి. అయితే, వాస్తవంగా ఆలోచిస్తే.. కేవలం రివార్డు పాయింట్ల కోసమే ఖర్చు చేయడం అంత మంచిది కాదు. సరైన ఆర్థిక ప్రణాళిక అంటే.. మన దగ్గర ఉన్న మొత్తాన్ని పొదుపు చేస్తూ.. ఖర్చు చేయడమే. కానీ, వూహాజనిత ఆదాయాన్ని గణిస్తూ ఖర్చు చేయడం కాదు.
కొత్తగా కార్డు తీసుకున్న వారికి రివార్డు పాయింట్లు వూరిస్తుంటాయి. ఖర్చు పెట్టేలా ప్రోత్సహిస్తుంటాయి. అధికంగా ఖర్చు చేయండి.. అధిక పాయింట్లు పొందండి అనే ధోరణి వీటిది. ఉచిత విమాన ప్రయాణం, ఉచిత హోటల్‌ సదుపాయం, వోచర్లు, సినిమా టిక్కెట్లు, ఇంధనం ఇలా ఎన్నో సదుపాయాలను ఈ రివార్డు పాయింట్ల ద్వారా పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ మంచివేగా? అనే సందేహం రావచ్చు. నిపుణులైన కార్డు వినియోగదారులు మాత్రమే ఈ ప్రయోజనాలన్నీ పొందుతారు. కార్డు నియమ నిబంధనలను అర్థం చేసుకోని వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు.
పాయింట్ల కోసమే కొనుగోలు: నిజంగా ఇలా చేస్తారా ఎవరైనా? అని వినడానికే ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ, కొంతమంది కేవలం రివార్డు పాయింట్ల కోసమే తమ కొనుగోళ్లన్నీ క్రెడిట్‌ కార్డుల ద్వారానే నిర్వహిస్తుంటారు. ఇలాంటప్పుడు సరిగ్గా చెల్లింపులు చేయకపోతే.. ప్రతి నెలా కనీస చెల్లింపులతోనే కాలం వెళ్లదీస్తుంటే ఆర్థిక పరిస్థితి గాడి తప్పినట్లే.
పరిమితి దాటితేనే: చాలా వరకు క్రెడిట్‌ కార్డులు ముందుగా మీరు కొంత పరిమితిని మించి ఖర్చు చేసిన తర్వాతే.. పాయింట్లు రావడం ఆరంభం అవుతాయి. నిజానికి ఇవి అధికంగా ఖర్చు చేసే ఖాతాదారులకు లాభం. కానీ, తక్కువ మొత్తాల్లో ఖర్చు చేసే వారు ఈ పరిమితి దాటడం కోసమే ఖర్చు చేయడం శ్రేయస్కరం కాదు.
వ్యవధి లోపే: రివార్డు పాయింట్లు రావడమే ముఖ్యం కాదు. వాటిని కార్డు సంస్థ నిర్ణయించిన వ్యవధి లోపు వాడుకోవడం కూడా ముఖ్యమే. లేకపోతే పాత పాయింట్లు మురిగిపోతూ ఉంటాయి. కార్డు తీసుకునేప్పుడు ఈ నిబంధనలు తెలుసుకోకుంటే వచ్చే ఇబ్బందే ఇది. కార్డు తీసుకున్న కొత్తలో కాస్త అధికంగా రివార్డు పాయింట్లు ఇచ్చినా.. తర్వాత ఇవి తగ్గిపోతాయి.
అనవసరం అయినప్పటికీ: కార్డును మీకు అంటగట్టేందుకు కార్డు ప్రతినిధులు రకరకాల వాగ్దానాలు చేసేస్తుంటారు. అందులో కొన్ని మీకు అక్కరకే రావు. ఉదాహరణకు మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయరు అనుకుందాం. ఇలాంటప్పుడు విమాన టిక్కెట్లు కొంటే అధిక పాయింట్లు వస్తాయని చెప్పి మీరు కార్డు తీసుకోవడం వల్ల లాభమేమిటి? కాబట్టి, ఇలాంటి వాటికి కార్డు ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వకూడదు.
పాయింట్ల వినియోగం: ఒక పాయింటు అంటే ఒక రూపాయితో సమానం అని భావిస్తారు చాలామంది. ఇది అన్నిసార్లూ నిజం కాకపోవచ్చు. కొన్ని వస్తువులను కొనుగోలు చేసేందుకు, లేదా పాయింట్లను వెనక్కి ఇచ్చేప్పుడు ఇది ఒక పాయింటు 10పైసలతోనూ సమానం కావచ్చు.
మొత్తం వినియోగించుకోకుండా: కొన్ని కార్డు సంస్థలు మీ దగ్గర ఉన్న మొత్తం రివార్డు పాయింట్లను ఒకేసారి వినియోగించుకోకుండా ఆంక్షలు విధిస్తాయి. ఇన్ని పాయింట్లను మాత్రమే వాడి కొనుగోలు చేయాలని సూచిస్తుంటాయి. ఒక నిర్ణీత వ్యవధిలో కొన్ని పాయింట్లను వాడటానికి మాత్రమే అనుమతిస్తుంటాయి. ఇలాంటి నిబంధనల గురించి ముందే తెలుసుకొని ఉండటం వల్ల తర్వాత ఇబ్బందులు ఎదురవ్వవు.
++++++++++++++
-------: మీ మొబైలే మీ బ్యాంకు! :-------
నగదు బదిలీ చేయాలంటే.. ఆన్‌లైన్‌ ఖాతా ఉండాలి. బిల్లులు చెల్లించాలంటే.. డెబిట్‌ కార్డు/క్రెడిట్‌ కార్డు ఉండాలి. ఇదంతా గతం కాబోతోంది. ఇప్పటికే స్మార్ట్‌ ఫోన్లలో అందుబాటులోకి వచ్చిన బ్యాకింగ్‌ ఆప్‌లతో చెల్లింపులు సులభతరం అయ్యాయి. గత దశాబ్దకాలంగా మొబైల్‌ ద్వారా జరిపే చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. వీటితో పోలిస్తే అతి త్వరలో అందుబాటులోకి రానున్న యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) విధానం అత్యంత ఆధునికమైన, సులభతరమైన, ఖాతాదారులకు అనుకూలమైన వినూత్న చెల్లింపు విధానంగా చెప్పవచ్చు.
భారతీయ రిజర్వు బ్యాంకు, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ల నిర్దేశకత్వంలో పనిచేస్తున్న నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ద్వారా ఈ యూపీఐ సౌకర్యం అందుబాటులోకి రానుంది. యూపీఐ అంటే.. మొబైల్‌ ఫోన్‌ ద్వారా తక్షణ చెల్లింపుల సౌకర్యాన్ని అందించే వినూత్న విధానం. ఇంతవరకూ మొబైల్‌ ద్వారా నగదు బదిలీ కోసం అమలులో ఉన్న ఐఎంపీఎస్‌ (ఇమ్మీడియట్‌ పేమెంట్‌ సర్వీసెస్‌) ద్వారా నగదు బదిలీ చేయాలంటే, నగదు పొందేవారి బ్యాంకు ఖాతా వివరాలు, ఎంఎంఐడీ (మొబైల్‌ మనీ ఐడెంటిఫయర్‌), ఐఎఫ్‌ఎస్‌సీ వంటి వివరాలు కావాల్సి ఉంది. యూపీఐ ద్వారా లావాదేవీలు నిర్వహించడానికి, కేవలం నగదు జమ చేయాల్సిన ఖాతాదారుడి వర్చువల్‌ ఐడీ తెలిస్తే చాలు. తక్షణమే వ్యక్తుల నుంచి వ్యక్తులకు, వ్యక్తుల నుంచి సంస్థలు లేదా వ్యాపారులకు నగదు బదిలీ చేయవచ్చు. అలాగే నగదు పొందవచ్చు. లావాదేవీలు నిర్వహించేటప్పుడు బ్యాంకు ఖాతా, కార్డు నెంబరులాంటి ఎలాంటి వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి, భద్రత గురించిన బెంగ లేదు.
చెల్లింపులు సులభంగా!
యూపీఐ విధానం ద్వారా షాపింగ్‌ మాల్స్‌లో బిల్లులు, విద్యా సంస్థల ఫీజులు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ బిల్లులు, ట్యాక్సీ చెల్లింపులు, క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపులు, నెట్‌ ద్వారా చేసిన కొనుగోళ్లను ఇంటి దగ్గర స్వీకరించిన తర్వాత చేసే చెల్లింపులు, మొబైల్‌ రీఛార్జీలు, రైలు, సినిమా టిక్కెట్ల కొనుగోలు.. ఇలా అన్ని రకాల చెల్లింపులనూ డెబిట్‌/క్రెడిట్‌ కార్డు అవసరం లేకుండానే క్షణాల్లో చేయవచ్చు.
ఉదాహరణకు మీరు షాపింగ్‌ మాల్‌లో బిల్లు చెల్లింపు చేసే సమయంలో మీ బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసిన మీ వర్చువల్‌ ఐడీని చెబితే చాలు. దుకాణదారుడు మీ వర్చువల్‌ ఐడీని నమోదు చేయగానే మీ మొబైల్‌కు వచ్చే సందేశంలోని పాస్‌వర్డ్‌ను నమోదు చేస్తే, క్షణాల్లో సొమ్ము మీ ఖాతా నుంచి దుకాణదారుడికి ఖాతాకు బదిలీ అవుతుంది. ఆన్‌లైన్‌ షాపింగ్‌ సమయంలో కూడా యూపీఐ ద్వారా చెల్లింపును ఎంపిక చేసుకొని, మీ మొబైల్‌కు వచ్చే సందేశంలో ఎంపిన్‌ (పాస్‌వర్డ్‌) నమోదు చేయడం ద్వారా తక్షణ చెల్లింపు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి, క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఎంపిక చేసుకున్న సందర్భంలోనూ వస్తువు డెలివరీ తీసుకుంటున్న సమయంలో, నగుదుకు బదులుగా యూపీఐ ఆప్‌లో, ఆ సంస్థ వర్చువల్‌ ఐడీ ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించవచ్చు.
* ఎవరి ఖాతాకైనా నగదు బదిలీ చేయాలంటే, వారి వర్చువల్‌ ఐడీ తెలిస్తే చాలు. వెంటనే నగదును వారి ఖాతాలోకి బదిలీ చేయవచ్చు. ఒక వ్యక్తికి వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలున్నా.. అన్ని బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలనూ ఈ ఒకే యూపీఐ ఆప్‌ ద్వారా నిర్వహించవచ్చు. ఒక్కొక్క బ్యాంకు ఖాతాకు ఒక్కొక్క వర్చువల్‌ ఐడీని తీసుకోవాలి.
* 24 గంటలూ అందుబాటులో ఉండే ఈ యూపీఐ ఆప్‌ ద్వారా చేసే చెల్లింపులు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా మార్గదర్శకాల ప్రకారం రెండెంచల అథంటికేషన్‌కు లోబడి పూర్తి భద్రతను కలిగి ఉంటాయి.
తేడా ఉందా?
యూపీఐకీ మొబైల్‌ వాలెట్లకూ తేడా ఏమిటన్న సందేహం ఇక్కడ రావచ్చు. మొబైల్‌ వాలెట్ల ద్వారా జరిగే లావాదేవీలన్నీ డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులు, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా జరుగుతాయి. వాలెట్లలో ముందుగా మనం కొంత నగదు జమ చేస్తేనే చెల్లింపులు చేయగలం. ఒక సంస్థకు చెందిన వాలెట్‌ నుంచి మరొక సంస్థ వాలెట్‌కు నగదు బదిలీ సౌకర్యం అందుబాటులో లేదు. ఇంతవరకూ వాలెట్ల ద్వారా నిర్వహిస్తున్న లావాదేవీలన్నీ కొత్తగా అందుబాటులోకి రానున్న యూపీఐ ద్వారా నిర్వహించుకోగలం. ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాత్రమే మన ఖాతాలో నగదు ఖర్చు అయ్యే విధానం ఖాతాదారులకు మరింత ఆకర్షణీయమని చెప్పొచ్చు.
తొలిదశలో 21 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ద్వారా యూపీఐ సేవ ఈ జూన్‌ మాసాంతానికి అందుబాటులోకి రానుంది. అనుసంధానమైన అన్ని బ్యాంకుల ఖాతాల నుంచీ ఒకే ఆప్‌ ద్వారా నగదు చెల్లింపులకు, నగదు పొందడానికీ కూడా వీలు కల్పించే యూపీఐ సేవ భారతీయ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టనుంది.
- ఉమాజీ
మనం చేయాల్సిందల్లా..
స్మార్ట్‌ఫోన్‌లో మన ఖాతా ఉన్న బ్యాంకు యూపీఐ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, వర్చువల్‌ ఐడీని ఎంపిక చేసుకోవాలి. లావాదేవీల నిమిత్తం ఎంపిన్‌ (మొబైల్‌ పిన్‌)ను జనరేట్‌ చేసుకోవాలి.
* మీ పేరునుగానీ, మారుపేరును గానీ, ఈమెయిల్‌ ఐడీనిగానీ, ఫోన్‌ నెంబరును గాని మీ వర్చువల్‌ ఐడీగా ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు మీకు మూడు బ్యాంకుల్లో ఖాతాలున్నాయనుకుందాం. మీ మొబైల్‌ నెంబరు 999***7777 అనుకుంటే, మీ ఆంధ్రాబ్యాంకులో ఖాతాకు 999***7777@andhrabank అనీ, వేరే xyz బ్యాంకు ఖాతాకు 999***7777@xyzbank అనీ వర్చువల్‌ ఐడీని ఎంపిక చేసుకోవచ్చు. ఒక వర్చువల్‌ ఐడీని ఒకరికంటే ఎక్కువ మంది వినియోగించే అవకాశం లేదు.
* లావాదేవీ నిర్వహించేప్పుడు, మీ మొబైల్‌లో డౌన్లోడ్‌ చేసుకున్న యూపీఐ ఆప్‌ ద్వారా ఏ బ్యాంకు ఖాతా ద్వారా లావాదేవీ నిర్వహించాలనుకుంటున్నారో ఆ వర్చువల్‌ ఐడీని వినియోగించి, తక్షణమే లావాదేవీ పూర్తి చేయవచ్చు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list