MohanPublications Print Books Online store clik Here Devullu.com

దైవత్వం, God

దైవత్వం



దైవత్వం
అంతా దైవమే అని తత్వజ్ఞులు చెబుతారు. చాలామంది నమ్మారు. నమ్మనివాళ్లూ ఉన్నారు. దైవం ఎక్కడ ఉంటే అక్కడ వెతకాలని క్రాంతదర్శులు అన్నారు. అలా నమ్మి దైవాన్ని సిద్ధింపజేసుకున్నవారున్నారు. అది కూడా నమ్మకుండా కాలక్షేపం చేసి జన్మ వృథా చేసుకున్నవారూ ఉన్నారు.
భగవంతుణ్ని సత్య శివ సౌందర్యాలుగా భావించినవారున్నారు. సృష్టి అంతటా సౌందర్యం నిండి ఉన్నప్పుడు, దానినే దైవంగా భావించి పూజించినవారు ఉన్నారు. సృష్టిని సత్యంగా, దైవంగా ఆరాధించినవారూ ఉన్నారు. భూమి అంతటా దైవత్వం శోభిల్లుతున్నదని మహాకవులు కీర్తించారు. అందుకే ‘భూదేవి’ అంటాం. భగవంతుడి పక్కనే ఆమెకు శ్రీదేవితో పాటు స్థానం కల్పించాం.
నీటిలో దైవం ఉంది. దానినే మనం భిన్న నదీమ తల్లులుగా, నదులను దేవతలుగా పూజిస్తున్నాం.
వాయురూపంలో దైవం సంచరిస్తుంటుంది. అందుకే వాయువును కనిపించని దైవంగా భావిస్తున్నాం. భక్తితో వాయుదేవుడంటాం. వాయువు లేకపోతే ప్రాణికోటి క్షణకాలమైనా జీవించలేదు.
అగ్ని జ్వలించే దైవం. యజ్ఞయాగాదుల్లో అగ్నిదేవుడు మన కోరికలను దేవతల లోకానికి మోసుకుని వెళ్తాడంటారు. వేద రుషులు అగ్నిని దైవంతో సమానంగా కీర్తించారు. అవన్నీ అగ్నిసూక్తాలుగా, వేదమంత్రాల రూపంలోనూ ఇప్పటికీ రవళిస్తున్నాయి. అగ్ని వలయంగా ప్రకాశించే సూర్యుడు ‘ప్రత్యక్ష నారాయణుడు’.
పంచభూతాలూ దైవస్వరూపాలే. అవి లేకపోతే ప్రపంచమే లేదు. దైవత్వం పర్వత రూపంలో ఉంటుంది. ప్రతి పుణ్యక్షేత్రంలోనూ వెలసిన కొండలు సైతం ఆరాధ్యదేవతలుగా కొలువై ఉన్నాయి. అవి ఎంతో పవిత్రం. సప్తగిరుల్లో దైవత్వం చూసి మనం పులకిస్తాం. చెట్లలో దైవత్వం ఉంది. తులసి, రావి, మందారాలు మనకు అతి పవిత్రమైనవి. ప్రాణులన్నీ దైవమయమే. సర్పం, నెమలి, హంస, సింహం, నంది- ఇవన్నీ దేవతల వాహనాలు. వాటిని పవిత్రంగా భావించి నమస్కరిస్తాం.
గురువు దైవం. తల్లిదండ్రుల్ని దైవాలుగా భావించి పూజిస్తాం. అతిథిని సైతం దైవంగా భావించి పాదాభివందనం చేసే జాతి మనది.
దైవానికి రూపం లేదు. ధర్మస్థాపన కోసం రూపం ధరించి, అవతారంగా వస్తాడంటారు. అవతారానికి, అవతారానికి మధ్య ఎన్నో రూపాలుగా దైవం కనిపిస్తుంటాడు. పసిపిల్లవాడిగా మన కళ్లెదుటే ఆడుకొంటాడు. ఆకాశంలో నక్షత్రంగా రోజూ మెరుస్తుంటాడు. వెన్నెలగా మనపై కురిపిస్తుంటాడు. పచ్చని ఆకుల మధ్య కోయిలగా ఆమని గీతం ఆలపిస్తాడు. అంతులేని సముద్రంగా తనదైన ధ్యానముద్రలో కనిపిస్తాడు. వర్షాధిపతి వరుణుడిగా మన దాహం తీరుస్తాడు. నుదుట తలరాతలు రాస్తాడు. విధి(బ్రహ్మ)గా మనకు వరాలు ఇస్తాడు.
కనిపించని దైవం, మనలో కనిపించని ఆత్మగా ఎప్పుడూ ఉంటాడు. నిశ్శబ్దంగా పలకరిస్తూనే ఉంటాడు. దయ నిండిన ఆయన గుండె మనలోనే స్పందిస్తోంది మన గుండెగా! సృష్టి మొదట ప్రణవంగా, మధ్య అవతారాలుగా, చివరికి ప్రళయమూర్తిగా, కాళిగా వస్తూనే ఉన్నాడు. ఇక రానిదెప్పుడు? భగవంతుడే సృష్టిలోని సకల రూపాలుగా మారాడని; కర్ర పట్టుకుని నడిచే వృద్ధుడు ఆయనే, బాలుడు, బాలిక ఆయనేనని; నీలం రెక్కలు ధరించిన పక్షి, ఎర్రని నేత్రాలు కలిగిన పిట్ట ఆయనే అని ఉపనిషత్‌ ద్రష్టలు మంత్రగానం చేశారు. ఆ దివ్యదర్శనం శ్వేతాశ్వతరోపనిషత్తు లోనిది.
దైవం ఈ సృష్టిని ఒక పరిపూర్ణమైన అద్భుతంగా మలచడానికి యుగయుగాలుగా శ్రమిస్తున్నాడు. అలాగే మనిషి తనను తాను పరిపూర్ణుడిగా మార్చుకోవడానికి యుగాలుగా పరిశ్రమిస్తున్నాడు. మనిషికి పూర్ణత్వం సిద్ధించినప్పుడు, అతడిలోని దైవత్వం సజీవ సంపూర్ణరూపాన్ని సంతరించుకుంటుంది! - కె.యజ్ఞన్న

LIKE US TO FOLLOW:---



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list