MohanPublications Print Books Online store clik Here Devullu.com

సంతోషమే స్వర్గం(Heaven) MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU



సంతోషమే స్వర్గం(Heaven)




సంతోషమే స్వర్గం
సృష్టిలో మానవులకు తప్ప మరి ఏ ఇతర జీవజాతికీ లేని అవకాశం- సంతోషంగా గడపగలగటం! ఏడవడానికైతే ఏదో ఒక కారణం కావాలి. నవ్వడానికి ఏ కారణమూ అక్కర్లేదు. అందాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించే అద్భుతమైన ఔషధం- నవ్వు. ఎంత అలంకరించుకున్నా రాని అందం- ఆనందంగా నవ్వుతూ ఉన్నప్పుడు వస్తుంది. ఆనందమే అందం. అందమే ఆనందం. ఆనందమే జీవిత మకరందం.
సంతోషం మానసికమైనా, దాని ప్రభావం శారీరకపరంగానూ ఉంటుంది. మనసు ఉత్సాహంగా ఉన్నప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయంటారు. సంతోషమే ఆరోగ్యప్రదాయిని. సంతోషమే సగం బలం, సహజ బలం. అందువల్ల ఆనందమే ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం.
అన్ని కళల్లోనూ, జీవించడమే గొప్ప కళ. జీవితంలో సంతోషాన్ని ఆస్వాదించేవారే కళావేత్తలవుతారు. ‘నా జీవితంలోనూ అనేక సమస్యలున్నాయి. కానీ ఆ సంగతి నా పెదవులకు తెలియకపోవటం వల్ల అవి నవ్వుతూనే ఉంటాయి. నవ్విస్తూనే ఉంటాయి’ అని చమత్కరించేవారు ప్రపంచ ప్రఖ్యాత హాస్యనటుడు చార్లీ చాప్లిన్‌.
‘సంతోషమే స్వర్గం, దుఃఖమే నరకం’ అని సుమతీ శతకకారుడు ఏనాడో బోధించాడు. స్వర్గంలాంటి సంతోషాన్ని సొంతం చేసుకోవాలంటే, ఎక్కడికో వెళ్ళనక్కరలేదు, ఏదో చేయనక్కరలేదు. ‘ఉన్న స్థితిలో సంతోషంగా ఉండలేకపోతే- నువ్వెక్కడికి వెళ్ళినా, ఎలా మారినా సంతోషంగా ఉండలేవు’ అనేవారు స్వామి రామతీర్థ. అలాంటి సంతోషాన్ని మనిషి పొందడం ఎలా? అతడి మనసే ఒక మహా మంత్రదండం. దానితో జీవితాన్ని ఆనంద బృందావనంగా మార్చుకోవడం అతడి చేతుల్లో, చేతల్లోనే ఉంది.
సంతోషానికి చిరునామా ఎక్కడో లేదు. ‘నిన్ను నీవు ప్రేమిస్తున్నట్లే, పొరుగువారినీ ప్రేమించు’ అని చాటిన క్రీస్తు బోధనను పాటించినప్పుడు, ప్రపంచం ఆనందమయమవుతుంది. దుఃఖం కలిగినప్పుడు ఇతరులతో పంచుకుంటే, అది సగమవుతుంది. ఆనందం కలిగినప్పుడు నలుగురికీ పంచిపెడితే, రెట్టింపు అవుతుంది.
విష్ణుసహస్ర నామాల్లో ఒక నామం ‘ఆనందః’. జగదానంద కారకుడు తానే ఆనంద స్వరూపుడు. అమృత తుల్యమైన, అనంతమైన ఆనందం ఆ భగవానుడి వద్దనే ఉంది. ఆయన మరొక నామం ‘ఆనందీ’. ఆశ్రయించినవారికి పరిపూర్ణ ఆనందాన్ని పంచిపెట్టేవాడు కాబట్టే ఆయన ‘ఆనంద నిలయుడు’ అని పురాణాలు చాటుతున్నాయి.
జగతికి వివేకాన్ని, ఆనందాన్ని సమంగా పంచిన స్వామి వివేకానంద- మానవుడు సర్వకాల సర్వావస్థల్లోనూ ఆనందంగా ఉండటమెలాగో ఓ కథ ద్వారా వివరించారు. ఒకచోట చిత్రకళా ప్రదర్శన జరుగుతోంది. అక్కడ తమ చిత్రాలను అమ్ముకోవాలని వచ్చిన చిత్రకారులు ‘వచ్చినవారికి మా చిత్రాలు నచ్చుతాయో లేదో... వాళ్ళు మా చిత్రాలను విరివిగా కొనుక్కుంటారో లేదో’ అని ఆందోళన చెందుతున్నారు. చిత్రాలను కొనుక్కోవాలని వచ్చినవాళ్లు ‘ఇది ఇంత ధర చేస్తుందో లేదో?’ అని లోలోపల సతమతమవుతున్నారు. కేవలం చూడటానికి వచ్చిన కళాభిమానులు మాత్రం- అందులోని కళను ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ కనిపించారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఏదీ వాళ్ల సొంతం కాదు, సొంతం చేసుకోవాలన్న కోరికా వాళ్లకు లేదు!
మనిషి జీవితంలో స్థితప్రజ్ఞత కలిగి ఉన్నప్పుడు, కంటికి కనిపించిన ప్రతి ఒక్కటీ సొంతం కావాలనే స్వార్థపూరిత కోరికను విడిచిపెట్టినప్పుడు, ఇతరులకు నిస్వార్థంగా సహాయం చేసే మనసు కలిగినప్పుడు- సర్వ ప్రపంచమూ తనదే అనిపిస్తుంది. అప్పుడు అతడు ప్రేమను అంతటా పంచే విశ్వమానవుడిగా మారతాడు. అదే అతడికి ఆనందమిస్తుంది. సంతోషమే స్వర్గమన్నది అతడి అనుభవానికి వస్తుంది!
జీవితం అత్యంత అమూల్యమైనది. అపురూపమైనది. ఏదో విధంగా బతకడానికి కాదు, ఆనందంగా జీవించడానికే ఈ జీవితం ఉంది. సమయాన్ని కేవలం వినియోగించడం కాదు, మనిషి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆనందానుభూతి సాధించడమే అతడి లక్ష్యం కావాలి. అప్పుడే జీవితం సార్థకమవుతుంది!
- గుజ్జుల వీర నాగిరెడ్డి



--------------------------LIKE US TO FOLLOW:---------------------

www.mohanpublications.com


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list