హిందూ వివాహ తంతులో మాంగల్యధారణ మరియు నల్లపూసలు, పగడం, ముత్యం ప్రాముఖ్యత
Hindu Marriage
హిందూ వివాహ తంతులో మాంగల్యధారణ మరియు నల్లపూసలు, పగడం, ముత్యం ప్రాముఖ్యత..
హిందూ వివాహ తంతులో మాంగల్యధారణే అతి ప్రధానమైనది. మాంగల్యానికే మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతోబాటూ వివిధ రూపాలు కూడా ఉన్నాయి. మానవులకు మనువాడటం ఎంత ముఖ్యమో, మనువాడటానికి మంగళసూత్రం అంతే ముఖ్యం.
మంగళసూత్రం లేదా మాంగళ్యం హిందూ సాంప్రదాయంలో పెళ్ళి జరిగిన స్త్రీలు మెడలో ధరించే గొలుసు లాంటి వస్తువు. దీనిలో తాళి లేదా తాళిబొట్టు, కొన్ని నల్ల పూసలు మొదలైనవి గుచ్చుకుంటారు.
వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్ధంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు కలవు. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు కలవు. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రమును పఠిస్తారు.
“ మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!! ”
మంగళ సూత్రము భార్యా భర్తల శాశ్వతనుభంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడుల నుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం.శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రము ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువులు నమ్ముతారు. అందుకే హిందూ స్తీ మంగళ సూత్రము ధరించును. వివాహిత మెడలో మంగళ సూత్రము లేదంటే భర్త చనిపోయినట్లుగా భావించవచ్చును.
మంగళసూత్రంలో పగడం, ముత్యం, నల్లపూసలు ప్రాముఖ్యత
మంగళసూత్రంలో ముత్యం,పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది, ఎందుకు?
ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక, దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు,అన్యోన్యదాంపత్యములకు కారకుడు, శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంధులు, సిరలు, ధమనులు, స్తనములు,స్త్రీల గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భదారణ, ప్రసవములకు కారకుడు.
కుజగ్రహ కారకత్వము: అతికోపం,కలహాలు,మూర్ఖత్వం,సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని,విద్యుత్భయములు, పరదూషణ, కామవాంఛలు, ధీర్ఘసౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు మరియు శారీకంగా ఉదరము,రక్తస్రావము, గర్భస్రావము,ఋతుదోషములు మొ!!
ఇహ స్త్రీ జీవితంలో వీరిద్దరు ఎంత పాత్రపోషిస్తారో పరిశీలిద్దాము.
ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27, ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారంగావించి 28వ రోజునకుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతుసమయం, అర్ధం ఆరోగ్యమైన స్త్రీకి 28వ రోజులకు ఋతుదర్శనమవాలి.
భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యం మించిన విలువైనది లేనేలేదు, దానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది, అదేమిటంటే
ముత్యం పగడం ధరించిన పాతతరరం స్త్రీలలో ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం, కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్ లేనిదే జరగటం సర్వసాధారణమైపోయినది.
ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలోనుండే ఎరుపు(కుజుడు)తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీకేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగా, భౌతికంగా ఆ జంటగ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను,దోషాలను తొలగిస్తాయనటం ఎటువంటి సందేహం వలదు.
కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం,పగడం రెండూకూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభపలితాలు సమకూర్చగలవు.
మరొక విషయమేమిటంటే శుక్రుడు వివాహకారకుడు మాత్రమే, కాని సంసారిక జీవితాన్ని నడిపేవాడు కుజుడేనన్న మాట మరువకూడదు, అందుకే తొలుతగా కుజదోషం ఉన్నదా లేదా అని చూస్తారు.
స్త్రీలు నల్లపూసలతాడుకి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడమనేది ప్రాచీనకాలం నుంచి వస్తోంది.
నల్లపూసలు ఎంతో విశిష్టమైనవిగా ... పవిత్రమైనవిగా భావించడమనేది మన ఆచార వ్యవహారాలలో ఒక భాగమై పోయింది. ఇటీవల కాలంలో నల్లపూసలతాడును ప్రత్యేకంగా చేయించుకుని ధరించడం జరుగుతుందిగానీ, పూర్వం మంగళ సూత్రానికే నల్లపూసలను అమర్చేవారు. వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ 'నలుపు రంగు' ను పక్కన పెడుతూ వచ్చిన వారు, సరాసరి నల్లపూసలను మంగళ సూత్రానికి అమర్చడం పట్ల కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు.
అయితే నల్లపూసల ధారణ అనే మన ఆచారం వెనుక శాస్త్ర సంబంధమైన కారణం లేకపోలేదు. వివాహ సమయంలోనే వధువు అత్తింటివారు, ఓ కన్యతో మంగళ సూత్రానికి నల్లపూసలు చుట్టిస్తారు. ఆ మంగళ సూత్రానికి వధూ వరులచే 'నీలలోహిత గౌరి' కి పూజలు చేయిస్తారు. ఈ విధంగా చేయడం వలన నీలలోహిత గౌరీ అనుగ్రహంతో, వధువు యొక్క సౌభాగ్యం జీవితకాలంపాటు స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది.
నీలలోహిత గౌరిని పూజించడం వలన ... ఆమె సన్నిధిలో ఉంచిన నల్లపూసలను ధరించడం వలన వధూవరులకి సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రం అంటోంది. అందువలన నల్లపూసలను ఓ ప్రత్యేక ఆభరణంగా భావించి ధరించకుండా, అవి మంగళ సూత్రంతో కూడి ఉండాలని స్పష్టం చేస్తోంది.
LIKE US TO FOLLOW: ---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565