MohanPublications Print Books Online store clik Here Devullu.com

వానొచ్చె గొడుగొచ్చె, Rain

వానొచ్చె గొడుగొచ్చె
Rain
వానొచ్చె గొడుగొచ్చె!
చినుకు పడింది... గొడుగు తెరుచుకుంది... పూల వెల్లువలా, హరివిల్లులా, పురివిప్పిన నెమలిలా, ఆత్మీయుల జ్ఞాపకంలా... ఎంతో అందంగా, మరెంతో సౌకర్యంగా, ఇంకెంతో హైటెక్‌గా. అవును, ఇప్పుడు గొడుగంటే గొడుగు మాత్రమే కాదు, ఇంకెన్నో...వర్షాకాలం వచ్చేసింది. మేఘాల గొడుగులు ముత్యాల చినుకుల్ని జల్లుతుంటే, అందాల గొడుగులతో వేడుక చేసుకునే సమయాన్ని తెచ్చేసింది. వర్షమంటేనే అందం, ఆనందం. ఎంత తడవకుండా గొడుగు పట్టుకుంటే మాత్రం ఆ అందాన్ని ఆకాశానికి వదిలేస్తామా... ఆనందాన్ని నేలపాలు చేసేస్తామా... గొడుగుల తయారీదారులు కూడా మనలాంటివారే కదా... అందుకే, చిరు జల్లులకు స్వాగతం చెప్పేందుకు ఎన్నో వినూత్నమైన ఛత్రాల్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. పువ్వే గొడుగై విచ్చుకున్నట్లూ సీతాకోక చిలుకలు మీద వాలినట్లూ పచ్చని ఆకుల తోరణాలు గొడుగు పట్టినట్లూ మనసు దోచే చిత్రలేఖనాలు ఛత్రాలుగా మారినట్లూ... ఎంతో అందంగా వస్తున్న ఈ గొడుగులు అలాంటివే. వీటిలో మూసి ఉన్నప్పుడు బొమ్మల్లా కనిపించేవీ, వేరు వేరు పక్షులూ జంతువుల ఆకారంలో హ్యాండిల్‌ భాగాన్ని ఆకర్షణీయంగా తయారు చేసినవీ వస్తున్నాయి. పొడుగు గొడుగులు కొన్నింటిలో ఈ హ్యాండిళ్లను వయసు పైబడిన వారికి చేతికర్రగా పనికొచ్చేలానూ తయారు చేస్తున్నారు. కొన్ని ఆన్‌లైన్‌ షాపులైతే మనకు నచ్చినవారి ఫొటోలనూ, పెయింటింగుల చిత్రాలనూ ఇస్తే గొడుగుల మీద ప్రింట్‌ చేసి కూడా ఇస్తున్నాయి.బైక్‌కీ గొడుగు
సౌకర్యానికి పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్న గొడుగులైతే నిత్యం వస్తూనే ఉన్నాయి.
బైక్‌ మీద ప్రయాణించేటపుడు గాలికి గొడుగు ఆగదు. దీనికి పరిష్కారంగా దిల్లీకి చెందిన సాసానా కంపెనీ బైక్‌ కోసమే ఓ గొడుగును రూపొందించింది. ప్రత్యేకమైన ఆకారంలో తయారుచెయ్యడం వల్ల ఈ ‘బైక్‌ అంబ్రెల్లా’ గాలికి ఎగరదు. కాబట్టి, దీని హ్యాండిల్‌ రాడ్డును ముందుభాగంలో అమర్చి తడవకుండా వెళ్లొచ్చు. ఇదేకాదు, ఇద్దరు మనుషుల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ‘టూ పీపుల్‌ అంబ్రెల్లా’లూ వస్తున్నాయి. బ్రిటన్‌కి చెందిన ‘రెయిన్‌ షేడర్‌’ కంపెనీ గొడుగులైతే గిన్నెలా ఉండి గాలికి తిరగబడవు, జల్లు కొట్టినా తల తడవదు. చిన్నగా ఉండే వీటివల్ల జనం ఎక్కువున్న చోటకూడా సులభంగా వెళ్లిపోవచ్చు. ‘ఫోన్‌బ్రెల్లా’ గొడుగైతే అన్నింటిలోకీ ప్రత్యేకం. గుండ్రంగా చెయ్యి దూర్చేలా ఉన్న దీని హ్యాండిల్‌ను చేతికి తగిలించేయొచ్చు. ఇంకేముందీ ఫోన్‌ చూసుకోవడానికీ పిల్లల్ని ఎత్తుకోవడానిక్కూడా ఇబ్బంది ఉండదు.
అదండీసంగతి... ఎంతో వినూత్నంగా మార్కెట్లోకి వస్తున్న ఈ ఛత్రాలు వానాకాలాన్ని ఏక ఛత్రాధిపత్యంగా ఏలేస్తున్నాయని ఒప్పుకుంటారా మరి..?
హరివిల్లు వచ్చె
ప్రత్యేకమైన రంగు వెయ్యడం వల్ల ఈ ‘కలర్‌ ఛేంజింగ్‌ అంబ్రెల్లా’ పైభాగం మామూలుగా ఉన్నప్పుడు తెలుపు రంగులో ఉంటుంది. తడవగానే దాని మీద హరివిల్లు కనిపిస్తుంది. వీటిలో వేరే డిజైన్లు కనిపించేవీ ఉంటాయి.
ఫోనూ సంగీతం...
ఈ బ్లూటూత్‌ స్మార్ట్‌ అంబ్రెల్లా ఉంటే ఫోన్‌ హ్యాండ్‌బ్యాగులో ఉన్నా గొడుగుతోనే ఫోన్‌ మాట్లాడొచ్చు. ఈ గొడుగులో ఉన్న స్పీకర్‌ సహాయంతో వర్షంలో నచ్చిన పాటలూ వినొచ్చు. దీని హ్యాండిల్లో బ్లూటూత్‌తో పాటు సౌండ్‌ని పెంచి తగ్గించే బటన్‌లూ ఫోన్‌ వస్తే లిఫ్ట్‌చేసే బటన్‌లు కూడా ఉంటాయి మరి.
ఇంటర్నెట్‌ గొడుగు
ఈ ‘పైలస్‌’ గొడుగులో కెమేరా, వీడియో ప్రొజెక్టర్‌, వైఫై ఉంటాయి. కాబట్టి, ఈ గొడుగుతో ఫొటోలూ వీడియో తియ్యొచ్చు. ఒక్క క్లిక్‌తో ఫ్లికర్‌, యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చెయ్యొచ్చు. అంతేకాదు, దీన్లోని ప్రొజెక్టర్‌ ద్వారా వర్షంవల్ల ఎక్కడైనా ఎక్కువసేపు ఆగిపోతే గొడుగు తెరమీద ఫొటోలూ సినిమాలూ చూడొచ్చు. దీన్లో త్రీడీ మ్యాప్‌, జీపీఎస్‌ కూడా ఉంటాయి.
చినుకుతో వెలుగు
రాత్రిపూట వర్షంలో బయటికెళ్లేటపుడు చేతిలో ఈ ‘రెయిన్‌డ్రాప్‌’ అంబ్రెల్లా ఉంటే తలమీద పెద్ద లైటున్నట్లే. ఈ గొడుగు వర్షపు చినుకుల్ని విద్యుచ్ఛక్తిగా మార్చి లోపలున్న ఎల్‌ఈడీ లైట్లు వెలిగేలా చేస్తుంది.
గాలే గొడుగు
దీన్ని చూసి ‘కాడ మాత్రమే కనిపిస్తుంది గొడుగేమైందీ’ అనుకోకండి. ఎందుకంటే ఇది ‘ఎయిర్‌ అంబ్రెల్లా’. బ్యాటరీతో పనిచేసే దీని హ్యాండిల్‌ పైభాగం నుంచి గాలి చాలా వేగంగా గొడుగు ఆకారంలో వస్తూ వర్షపు చినుకుల్ని మీద పడకుండా చేస్తుంది.
మర్చిపోనివ్వదు
ఇంటినుంచి గొడుగు తీసుకెళ్లడం మర్చిపోతాం. తీసుకెళ్లినా ఎక్కడైనా పెట్టి అక్కడ మర్చిపోతాం. దీనికి పరిష్కారంగా వచ్చిందే ‘డవెక్‌ అలర్ట్‌ అంబ్రెల్లా’. ఫోన్లోని ఆప్‌తో పనిచేసే దీని హ్యాండిల్‌ బటన్‌ని ఆన్‌ చేసి ఉంచితే చాలు, ‘డోంట్‌ ఫర్‌గెట్‌’ అని లైట్‌ వెలుగుతుంది, దాన్నొదిలేసి మనం కొంత దూరం వెళ్లగానే రిమైండర్‌ మోగుతుంది. కాబట్టి, ఈ గొడుగును మర్చిపోయే సమస్యే ఉండదు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list