+++++++++స్ఫూర్తి++++++++
spurthi(Antharyami)
ఏ పని చేయాలన్నా మనలో ఉత్సుకత, కోరిక ఉండాలి. కొన్ని సందర్భాల్లో అవి ఎంత బలంగా ఉన్నా, తగినంత శక్తి లేదేమోనని ఆ పనినే చేపట్టం. కనీస ప్రయత్నమైనా చేయం. అంటే, పని చేయడానికి అవసరమైన ఉత్సాహం కొరవడిందని అర్థం. సరిగ్గా ఇక్కడే మనకు ‘స్ఫూర్తి’ కావాలి. స్ఫూర్తి అంటే ఉత్సాహం. ఏదన్నా పని చేయడానికి అదే ప్రేరణనిస్తుంది. ఉత్తేజితుల్ని చేస్తుంది.
స్ఫూర్తి ఎలా వస్తుంది, ఎవరిస్తారు అన్నదే ప్రశ్న. ఆ స్ఫూర్తి ఓ మంచి పుస్తకం కావచ్చు. మిత్రుడు కావచ్చు. ఒక్కోసారి ఒక చిన్న సంఘటనా స్ఫూర్తి కలిగించవచ్చు. అది మోడు మీద చిగురింత దృశ్యమైనా కావచ్చు. ఉపాధ్యాయుడైనా కావచ్చు. అతి చిన్న ప్రాణి చీమ సైతం మానవాళికి స్ఫూర్తిదాయకమే!
మహానుభావుల వల్ల పొందే స్ఫూర్తి చెప్పనలవి కాదు. వారి సమక్షంలో ఉండటం ఒక్కటే కాదు, వారి గురించిన ఆలోచనా అత్యంత స్ఫూర్తిదాయకంగా మారుతుంది.
స్ఫూర్తి కలిగించలేని వ్యక్తి, ఎంత ప్రతిభావంతుడైనా ప్రయోజనం ఉండదు. ఆలోచన బయటపెట్టకపోతే, అతడి ప్రతిభ లోకానికి తెలియదు. చైతన్యశీలురు ప్రతిక్షణం ఈ సృష్టి నుంచి స్ఫూర్తి పొందుతుంటారు. వారే లోకానికి ప్రాతఃస్మరణీయులు, పూజనీయులు.
నది తన ప్రవాహ వేగాన్ని మార్చుకుంటూ ముందుకు సాగుతుంటుంది. అంతులేని ఉత్సాహం నింపుకొని జీవితంలో ముందుకు వెళ్ళడమే ముఖ్యమని చాటుతుంది. సుగంధాన్ని నలువైపులా వ్యాపింపజేసే పూలు- మనిషి తన మంచితనాన్ని, మానవత్వాన్ని నలుగురికీ పంచాలని సూచిస్తుంటాయి. ఆకాశంలో ఎగిరే పక్షులు- మానవులందరూ సమైక్యంగా ఉండాలనేందుకు సూచికలు. అప్పుడే గమ్యానికి సులువుగా, త్వరగా చేరుకోగలమన్న స్ఫూర్తిని అవి కలిగిస్తుంటాయి.
తన వైకల్యాన్ని లెక్కచేయక, అద్భుతమైన సంగీతాన్ని మానవాళికి అందించిన జర్మన్ సంగీతజ్ఞుడు బెథొవెన్. ఆయన ఇరవై సంవత్సరాలకే బధిరుడయ్యాడు. ఆయనకు పేరుప్రఖ్యాతులు తెచ్చినవన్నీ, పూర్తిగా వినికిడిశక్తి పోయిన తరవాత స్వరపరచినవే! వాటి ద్వారానే సంగీత రస ప్రవాహంలో శ్రోతల్ని ఓలలాడించాడాయన. అంధుల కళ్లలో ఆత్మవిశ్వాసమనే జ్యోతిని వెలిగించిన స్ఫూర్తిదాత హెలెన్ కెల్లర్. వారు ప్రతిభకు ఏదీ అడ్డుకాదని నిరూపించారు. అంగవైకల్యం ఉన్నవారికి, లేనివారికీ స్ఫూర్తినందించిన మహానుభావులు వారు.
అల్పంగా తోచే గడ్డిపరక ఎంతగానో ప్రేరణ కలిగిస్తుంది. తుపానువల్ల ఎటు పడితే అటు ఒరిగిపోయే అది, భూమికి దాదాపు సాష్టాంగ నమస్కారం చేస్తుంది. తుపాను తీవ్రత తగ్గి మామూలు వాతావరణం ఏర్పడగానే, తిరిగి నిట్టనిలువుగా నిలబడుతుంది. కష్టాలు వచ్చినప్పుడు, ఆ తరవాత మనుషులు ఎలా ఉండాలో అది తెలియజేస్తుంది. కష్టాలు ఎదురైనప్పుడు సంయమనం, సహనం ఉండాలని సూచిస్తుంది. ఆ కష్టాలు తీరిన వెంటనే వచ్చే ఉపశమనం వల్ల కలిగే ఆనందాన్నీ లోకానికి చూపుతుంది. గడ్డిపరకే అయినా, దానిలోని మనోనిబ్బరం ఎంతో స్ఫూర్తిదాయకం.
స్వాతంత్య్రం కోసం పోరు సాగుతున్న రోజుల్లో, ఎంతోమంది నాయకులు ప్రసంగాల ద్వారా ప్రజల్ని ఉత్తేజపరచారు. దేశమంతటా స్వాతంత్య్ర కాంక్ష రగిలించారు. రచనలతో కవులు, గళాలతో గాయకులు పోరాట స్ఫూర్తికి కారకులయ్యారు. చిన్న కొవ్వొత్తి సైతం ఎంతో స్ఫూర్తినిస్తుంది. అజ్ఞానమనే మైనాన్ని కరిగిస్తుంది. జ్ఞానజ్యోతి వెలిగిస్తుంది.
మనిషి ఒళ్లంతా కళ్లు చేసుకోవాలి. అన్నింటినీ పరిశీలించాలి. అదే అతణ్ని ఆలోచింపజేస్తుంది. నిత్య ఉత్సాహాన్ని, నిరంతర ఉత్తేజాన్ని అతడిలో నింపుతుంది. మంచి పనులకు మూలంగా మారుతుంది. స్ఫూర్తి పొందడమంటే అదే!
చూడగలిగే మనసు, అందుకోవాలన్న తపన ఉండాలే కానీ- ఈ సృష్టి అంతా స్ఫూర్తిమయమే!
- బొడ్డపాటి చంద్రశేఖర్
----------------------------LIKE US TO FOLLOW:-----------------------
https://www.facebook.com/Mohan-publications-420023484717992/
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565