సిద్ధాంతాలకతీతంగా శ్రీ శ్రీ
Sree Sree
+++++++++++సిద్ధాంతాలకతీతంగా శ్రీ శ్రీ +++++++++
నేడు శ్రీశ్రీ వర్ధంతి
నేడు శ్రీశ్రీ వర్ధంతి
శ్రీశ్రీ ఏ సిద్ధాంతానికీ, ఏ దృక్పథానికీ చెందిన కవి కాదు. శ్రీశ్రీ ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక విరాట్ స్వరూపం. తెలుగు జాతి శిరస్సున ధరించాల్సిన కిరీటం. శ్రీశ్రీ ఒక దారిన నడవలేదు. తానే ఒక దారిని నిర్మించాడు. అది ప్రజల దారి. చరిత్రను ప్రజా దృక్పథంతో చూడాలని చెప్పాడు.. చరిత్ర పునరావృతమవుతుందా? గురజాడను, శ్రీశ్రీని తలెత్తుకోలేని ఆంధ్రప్రదేశ్ ఒక తెలుగు నాడు అవుతుందా? తెలుగుభాషకు గౌరవం లేని చోట సాహిత్యం వర్ధిల్లుతుందా? అలా వర్ధిల్లిన నాడే శ్రీశ్రీ ఆత్మకు శాంతి చేకూరినట్లవుతుంది..
మనసు నిస్పృహగా ఉన్న వేళ, అంతా జడత్వం పరీవ్యాప్తమైన వేళ, చెట్టుపై ఆకులు కూడా కదలని దిగ్బంధ వాతావరణంలో మనను మనం జాగృతం చేసుకోవడానికి ఒక్క వ్యక్తి కవిత్వం చదివితే చాలు. తెలుగు సాహిత్యంలో స్తబ్థతను ఒక్కసారిగా భగ్నం చేసి కొత్త లోకాలకు తీసుకువెళ్లిన మహా కవి ఆయన. ఆయనను మనం మరిచిపోదామన్నా మరిచిపోలేం. మన భావాల్లో, భాషలో, కదలికలో, మనం చదివే అక్షరాల్లో, మన అంతర్గత, బహిర్గత ప్రాణంలో తచ్చాడే కవి ఆయన. ఆయన ఎవరో కాదు శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీ.
మంత్రులు కనీసం ప్రమాణ స్వీకారాన్ని కూడా సరిగ్గా ఉచ్ఛరించని నాడు, తెలుగు భాషకు పుట్టినిల్లని చెప్పుకునే రాజధాని శంఖుస్థాపన ఫలకం కూడా తెలుగులో రాయించలేని దుస్థితిలో కనపడిన నాడు, తెలుగు విశ్వవిద్యాలయం అధ్యాపకులు జీతాలు లేకుండా తమ భవిష్యత్తు ఏమిటో తెలియకుండా ఆక్రందిస్తున్న నాడు, శతాబ్దం తొలి రోజుల్లో భాషకు ఆధునికతను భావాలకు పురోగతిని ప్రసాదించిన అడుగుజాడ గురజాడ వారసులు రోడ్డున పడిపోయిన నాడు, తెలుగువారు దేశ రాజధానిలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మన పరువును బజారుకు ఈడ్చిన నాడు మనలో నిరాశా నిస్పృహల చీకట్లని తొలగించి మనను చైతన్యవంతం చేసే కవి శ్రీశ్రీ. మనదీ ఒక బతుకేనా, కుక్కల వలె, నక్కల వలె... మనదీ ఒక బతుకేనా సందులలో పందుల వలె... అని ఆత్మశోధన చేసేందుకు అవకాశం కల్పించాడు శ్రీశ్రీ.
అందుకే శ్రీశ్రీ కవిత్వాన్ని తూచే రాళ్లు తన దగ్గర లేవన్నాడు చలం. తూచవద్దు, అనుభవించి పలవరించమన్నాడు శ్రీశ్రీ. ఒక కుళ్లు సమాజాన్ని చూసి, అస్తవ్యస్త వ్యవస్థల్ని చూసి, దుర్మార్గాల్ని, దౌర్భాగ్యాల్నీ చూసి మనలో ఒక ప్రతిఘటనా స్వరం ఉప్పొంగుతుంది. అప్పుడు ప్రశ్నించాలనే తత్వాన్ని మనలో పురికొల్పుతుంది శ్రీశ్రీ కవిత్వం. ప్రశ్నించకుండా ఉండలేని వారు దిక్కుమాలిన చావు చావమని కూడా శ్రీశ్రీ కవిత్వం అవహేళన చేస్తుంది. ఎముకలు కుళ్లి, వయస్సు మళ్లిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి.. అని శ్రీశ్రీ రాసిన మహాప్రస్థాన గేయం ఒక్కటి చదివితే చాలు మనకు అడుగు ముందుకు వేయాలనే అనిపిస్తుంది కాని వెనక్కు వేయాలనిపించదు.
మహాప్రస్థాన గేయం రాసింది 1934లో. అంటే ఇప్పటికి 82 ఏళ్ల క్రితం రాసిన కవిత్వం అన్నమాట. ఎనిమిది దశకాలే కాదు, శతాబ్దం గడిచినా, ఎన్నో శతాబ్దాలు గడిచినా మనలో ఒక నూతనోత్తేజం తెప్పించే కవిత్వం మహాప్రస్థానం. ఆ పుటలు విప్పి చదివితే మనం ఎన్ని పునర్జన్మలెత్తినా మనకు చలం చెప్పినట్లు రాబందుల రెక్కల చప్పుడు, పయోధర ప్రపంచ ఘోషం, ఝంఝానిల షడ్జధ్వానం మనలో ప్రకంపనలు రేకెత్తిస్తుంది. విని తట్టుకోగల చావ ఉంటే ఈ పుస్తకం తెరవాలని అన్నాడు చలం. అవును. నేటితరంలో, ముఖ్యంగా మన నేతల్లో ఎంతమందికి శ్రీశ్రీ కవిత్వం విని తట్టుకోగల చావ ఉంది? అవును. వారిలో చాలా మందికి శ్రీశ్రీ అన్నట్లు.. నేడు ప్రపంచం ఎట్లాపోతేనేం? మీకెందుకు లెండి.. అదృష్టవంతులు మీరు.. వడ్డించిన విస్తరి మీ జీవితం.. అందుకే వారిని శ్రీశ్రీ రోడ్డుమీద నిలబెట్టి ప్రశ్నించాడు. వారిని నగ్నస్వరూపులు చేసి వారి కవిత్వ వికృత రూపాన్ని జనానికి తెలియజేశాడు. కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు, పేర్లకీ, పకీర్లకీ, పుకార్లకీ నిబద్ధులూ... అని స్పష్టం చేశాడు. అదే సమయంలో కొంతమంది యువకులు, రాబోవు యుగపు దూతలు.. పావన నవజీవన బృందావన నిర్మాతలు.. అని కొత్త తరంపై ఆశను వెలిబుచ్చారు.
శ్రీశ్రీ ఏ సిద్ధాంతానికీ, ఏ దృక్పథానికీ చెందిన కవి కాదు. శ్రీశ్రీ ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక విరాట్ స్వరూపం. తెలుగు జాతి శిరస్సున ధరించాల్సిన కిరీటం. నేనొక దుర్గం.. నాదొక స్వర్గం, అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం.. అని శ్రీశ్రీయే స్వయంగా ప్రకటించారు. ఆయనదే కవిత్వం? కవితామతల్లిపై ఆయనదే అభిప్రాయం? ఆయనే నిర్వచించాడు? కవితా.. ఓ కవితాలో ఆయన ఎన్ని దృశ్యాలు చూపించాడో? శిశువు నెడద నిడుకుని రుచిర స్వప్నాలను కాంచే జవరాలి మనఃప్రపంచపు టావర్తాలు, శిశువు చిత్రనిద్రలో ప్రాచీన స్మృతులూచే చప్పుడు, కన్నుమూసిన రోగార్తుని రక్తనాళ సంస్పందన, త్రాగుబోతు వ్యక్తావ్యక్తాలాపన, కడుపు దహించుకుపోయే పడుపుకత్తె రాక్షస రతిలో అర్థనిమీలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవి, ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం, సమ్మెకట్టిన కూలీల ఆకలి చీకటి చిచ్చుల హాహాకారం, నక్షత్రాల మాటలు, జలపాతాల పాటలు, సముద్ర తరంగాల మ్రోతలు, భూకంపాలు, ప్రభుత్వ పతనాలు, విప్లవం, యుద్ధం వీటన్నిటి వెలుగులో కవితామతల్లి విశ్వరూప సాక్షాత్కారం చేయించాడు శ్రీశ్రీ. ఆమెను ఆయన ఏ శ్మసానాల వంటి నిఘంటువుల్లోనూ, వ్యాకరణాల సంకెళ్లలోనూ, ఛందస్సుల సర్పపరిష్యంగంలోనూ బంధించదలుచుకోలేదు. అమోఘం, అగాధం, అచింత్యం, అమేయం, ఏకాంతం, ఏకైకం, క్షణికమూ, శాశ్వతమైన దివ్యానుభవం, బ్రహ్మానుభవం కలిగించే విశ్వరూపాన్ని ఎలా బంధించగలం? నిజంగా శ్రీశ్రీకి ఆ విశ్వరూప సాక్షాత్కారం అయిందేమోననిపించేట్లుగా తన కవిత్వాన్ని కొండచరియల్ని చేధించుకుని వచ్చే ఉధృతమైన జల ప్రవాహంలా, ఆకాశం బ్రద్దలై నేలతో ఏకమైన రీతిగా ఆయన కవిత్వాన్ని పరవళ్లు తొక్కించాడు. ఫిరంగిలో జ్వరం ధ్వనించే మృదంగా నాదం వినిపించాడు. అందుకే ఆయననెలా నిర్వచించాలో తెలీక కెవి రమణారెడ్డి గారు స్వేచ్ఛా విహంగం అన్నారేమో. తెలుగు జాతికి భాషను ఇచ్చిన శ్రీశ్రీని నిర్వచించడానికి మన దగ్గర ఏ భాషా లేదు.
గురజాడ అసలు సిసలైన వారసుడు శ్రీశ్రీ. సాహిత్య శిల్పాన్ని, సామాజిక చైతన్యాన్ని ఒకే స్థాయిలో అవపోశన పట్టిన వారిలో ఇద్దరికన్నా మించిన వారు లేరు. అడుగుజాడ గురజాడ అది భావికి బాట.. అని అందుకే శ్రీశ్రీ ఆయనను గుర్తించారు. కనిపించని వంద కల్ప వృక్షాల కన్నా గురజాడ రాసిన దేశభక్తి గీతం మిన్న.. అని వ్యాఖ్యానించారు. ఆధునికాంధ్ర కవిత్వానికి గురుపాదులు గురజాడ.. అని అభివర్ణించిన శ్రీశ్రీ గురజాడనే మహాకవిగా తీర్మానించారు. గురజాడ ముత్యాల సరాలను తెలుగు కవిత్వంలో ఒక గొప్ప మలుపుగా తీర్మానించారు. ఇద్దరూ సాంప్రదాయంలో బలమైన వ్రేళ్లున్నవారే. కాని ఆధునికతను సమాజం కోసం ఆహ్వానించారు. ఇద్దరూ ప్రజల కోసం తపించారు. అందుకే గురజాడ కాంగ్రె్‌సపై ఆంగ్లంలో రాసిన కవితను శ్రీశ్రీ పాడకోయ్ కవీ కాంగ్రెస్ భజన సమాజం మాత్రమేనని తెనిగించాడు. శ్రీశ్రీ కూడా అదే దారిలో కష్టపడి ఆర్జించిన స్వాతంత్య్రం గద్దలు తన్నుకుపోతాయ్. కంచిమేక పాపం ఎప్పుడూ కసాయినే నమ్ముకుంటుంది.. అని రాశారు.
శ్రీశ్రీ ఒక దారిన నడవలేదు. తానే ఒక దారిని నిర్మించాడు. అది ప్రజల దారి. చరిత్రను ప్రజా దృక్పథంతో చూడాలని చెప్పాడు. సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్.. అది మోసిన బోయిలెవ్వరు? అని ఆయన ప్రశ్నించాడు. మనిషిని ఎన్ని రూపాల్లో చూడాలో ఆయన మానవుడా.. అన్న కవిత అర్థమవుతుంది. పతితులార, బ్రష్టులార, దగాపడిన తమ్ములార.. ఏడవకండేడవకండి అని ఆయన సామాన్యుల పక్షం నిలిచారు. అదే సమయంలో మానవాళికి నిజంగానే మంచికాలం దహిస్తుందా? అని సందేహమూ వెలిబుచ్చాడు. స్వాతంత్య్రం వచ్చిన నాడు హర్షించిన ఆయన కలమే ఆ తర్వాత జరుగుతున్న దారుణాల్ని ప్రశ్నించింది. భారతదేశంలో స్వాతంత్య్రం లేదు. నేను స్వేచ్ఛగా ఉన్నాననే భావం ఒక్కడిలోనూ లేదు.. అని లిమరుక్కుల్లో రాశాడు. జ్ఞాపకం వస్తున్నావు గాంధీజీ ఈనాడు నీవు. ఎక్కడుంది నీవాశించిన సంక్రందన ధామం? అని ప్రశ్నించాడు.
శ్రీశ్రీలో అణువణువునా తెలుగుతనం నిండి ఉంది. ఆయనకు సంస్కృతం, ఆంగ్ల భాషల్లో అమితమైన పట్టు ఉంది. తెలుగు సాహితీవేత్తల్లో ఎవరికీ లేనంతగా ఆయనకు జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై సమగ్ర అవగాహన ఉండేది. అందుకు ఆయన కవితలు, అనువాదాలే నిదర్శనం. ఏ భాషలోనైనా క్రీడించగల శక్తి ఆయనకున్నది. అయినప్పటికీ ఆయన తెలుగుకోసమే తపించారు. తెలుగు సాహితీ వేత్తలకు, పత్రికలకు భాషను అందించారు. శ్రీశ్రీ కవిత్వం చదవని వాడు మంచి శీర్షిక పెట్టలేడు, మంచి భాషలో రాయలేడన్న అభిప్రాయాన్ని కలిగించాడు.
మన కష్టసుఖాలు చెప్పుకోవడానికి ఇంతకంటే మంచి భాష ఎక్కడుంది అని ప్రశ్నించాడు. కందుకూరి వీరేశలింగం గొప్పతనం గురించి రాస్తూ అతడు తెలుగు వాడు కావడమే మన దురదృష్టం అన్నాడు. తెలుగువారి ధీశక్తి, తెలుగువారి క్రియాశక్తి, నలుదెసలా రసించాలి. తెలుగుతనం జయించాలి.. అని ఆయన కోరుకున్నాడు. అదేదో తెలుగుతల్లి.. అందాల నిండు జాబిల్లి.. ఆనందాల కల్పవల్లి అని రాస్తూ సంకెళ్లు లేని తెలుగునేల కావాలని వాంఛించాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు శ్రీశ్రీ అంత ఆనందించిన కవి లేడు. ఇది ఆంధ్రజాతికంతటికీ విజయం, ఆంధ్ర సంస్కృతికి అఖండ విజయం అని రాశాడు. కానీ అదే సమయంలో రానూరానూ జరుగుతున్న పరిణామాల గురించి ఆయన దహించుకుపోయాడు. కాలే గుడిసెలు కాలుతు ఉంటే లేచే మేడలు లేస్తూ ఉన్నాయ్ అన్నారు. ఆంధ్రదేశం మీద గీతం రాయలేదని చాలా మంది నన్ను అడుగుతున్నారు. అసలు సంగతేమిటంటే నేనూ ఆంధ్రదేశంలాగే ఉన్నాను.. అల్లకల్లోలంగా తుఫాను బీభత్సం చెలరేగుతోంది నా మనస్సులో.. అన్నారాయన. ఒక వ్యాసంలో ఆయన గురజాడను నరకంలో కలుసుకున్నాను.. అని రాశారు.
ఇక్కడికొచ్చి చాలా దారుణప్పని చేశావు.. అంటారు గురజాడ. ఆంధ్రదేశంలో కంటే ఇక్కడే బాగుంటుందని వచ్చేశాను.. అంటాడు శ్రీశ్రీ. చరిత్ర పునరావృతమవుతుందా? గురజాడను, శ్రీశ్రీని తలెత్తుకోలేని ఆంధ్రప్రదేశ ఒక తెలుగు నాడు అవుతుందా? తెలుగుభాషకు గౌరవం లేని చోట సాహిత్యం వర్ధిల్లుతుందా? అలా వర్ధిల్లిన నాడే శ్రీశ్రీ ఆత్మకు శాంతి చేకూరినట్లవుతుంది..
--ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
--ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
ఈ క్రింది లింక్ క్లిక్ చేసి PDF ఫైల్ పొందవచ్చును
---LIKE US TO FOLLOW: ---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565