శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి, Sri SitaRamula Kalyanam
శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము.
వైదిక వివాహం ఇలా జరుగుతుంది అని లోకానికి చాటింది సీతారాముల కల్యాణమే. అప్పటివాళ్లు ఆ కల్యాణాన్ని చూసి ముగ్ధులైపోయారని పురాణాలు చెబుతున్నాయి. ఆ వైభవాన్ని చూసే అవకాశం లేని ఈ తరాల వారికి అ అదృష్టాన్ని తన పాట ద్వారా కలిగించిన సముద్రాల గారికి వందనం!
శ్రీ సీతారాముల కల్యాణం, చూతము రారండి
చూచు వారలకు చూడముచ్చటట- పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట…
భక్తి యుక్తులకు ముక్తిప్రదమట
ఆ…ఆ…ఆ…ఆ…[ఈ ఆలాపన అద్భుతం అంతే…]
భక్తి యుక్తులకు ముక్తిప్రదమట – సురలను మునులను చూడవచ్చునట…
కల్యాణం, చూతము రారండి
దుర్జన కోటిని దర్పమడంచగ – సజ్జన కోటిని సంరక్షింపగ…
ధారుణి శాంతిని స్థాపన చేయగ
ఆ…ఆ…ఆ…ఆ…
ధారుణి శాంతిని స్థాపన చేయగ – నరుడై వెలసిన పురుషోత్తముని…
కల్యాణం, చూతము రారండి
దశరథ రాజు సుతుడై వెలసీ, కౌశికు యాగము రక్షణ చేసీ,
జనకుని సభలో హరువిల్లు విరచీ
ఆ…ఆ…ఆ…ఆ…
జనకుని సభలో హరువిల్లు విరచీ – జానకి మనసు గెలిచిన రాముని
కల్యాణం, చూతము రారండి
సిరి కళ్యాణపు బొట్టును పెట్టీ…- మణి బాసికమును నుదుటను కట్టీ
పారాణిని పాదాలకు పెట్టీ…
ఆ…ఆ…ఆ…ఆ…
పారాణిని పాదాలకు పెట్టీ… – పెండ్లి కూతురై వెలసిన సీతా
కల్యాణం, చూతము రారండి
సంపగి నూనెను కురులను దువ్వీ – సొంపుగ కస్తూరి నామము దీర్చీ
చెంప జవ్వాది చుక్కను పెట్టి
ఆ…ఆ…ఆ…ఆ…
చెంప జవ్వాది చుక్కను పెట్టి – పెండ్లీ కొడుకై వెలసిన రాముని
కల్యాణం, చూతము రారండి…
రాముని దోసిట కెంపుల ప్రోవై, – జానకి దోసిట నీలపు రాశై…
ఆణిముత్యములు తలంబ్రాలుగా…
ఆ…ఆ…ఆ…ఆ…
ఆణిముత్యములు తలంబ్రాలుగా…శిరముల మెరిసిన సీతారాముల
కల్యాణం, చూతము రారండి… శ్రీ సీతా రాముల కల్యాణం, చూతము రారండి
సిరి కళ్యాణపు బొట్టును బెట్టి/మణిబాసికమును నుదుటను గట్టి/పారాణిని పాదాలకు బెట్టి అంటూ వధువు సీతాదేవి అలంకరణను అద్భుతంగా వర్ణించడం... సంపంగినూనెను కురులను దువ్వి/సొంపున కస్తూరి నామము దీర్చి/చెంప జవ్వాజి చుక్కను బెట్టి అంటూ వరుడు శ్రీరామచంద్రుడి రూపాన్ని కళ్లముందు నిలపడం . జానకి దోసిట కెంపుల ప్రోవై/రాముని దోసిట నీలపు రాసై/ఆణిముత్యములు తలంబ్రాలుగా సీతారాముల శిరముల మీద మెరిశాయట. చూచు వారలకు చూడముచ్చటట/పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట/భక్తి యుక్తులకు ముక్ తిప్రదమట/సురులను మునులను చూడవచ్చునట ... ఈ మాటలు వింటుంటే ఆ కల్యాణం జరిగే చోటికి వెళ్లిపోవాలని, స్వయంగా దర్శించాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది.
భోజనం చేశాక తాంబూలం వేయకపోతే ఎంత వెలితిగా ఉంటుందో... ఎంత ఖర్చుపెట్టి ఘనంగా పెళ్లి చేసినా, ఈ పాట వేయకపోతే ఆ లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
LIKE US TO FOLLOW: ---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565