సీతారామ కల్యాణం ఘట్టంలో మూడు సూత్రాల ప్రాముఖ్యత
Three Important Things In SitaRamula Kalyanam
సీతారామ కల్యాణం ఘట్టంలో మూడు సూత్రాల ప్రాముఖ్యత
చైత్ర మాసమున శుక్ల పక్షమినాడు సచ్చిదానంద స్వరూపియైన రామచంద్రుడు అవతరించెను. కావున ఆ రోజున ఉపవాసము ఉండి ఆ రాత్రి శ్రీరాముని షోడశో పచారములచే ఆరాధించి పురాణమును పటించి (చదివి) జాగారణముచేసి (నిద్ర మేల్కొని) మరునాడు ఉదయముననే కాలకృత్యములు, నెరవేర్చుకొని తన శక్తికి తగిన భక్తి యుక్తులతో శ్రీరామచంద్రుని పూజించి పాయసముతో అన్నము చేసి పెద్ద వారిని, బంధువులను తృప్తి పరిచి కౌసల్యా పుత్రుడైన (కొడుకైన) శ్రీరామచంద్రుని ఆనందింపజేయవలెను.
సీతారామ కల్యాణం ఘట్టంలో ముందుగా రామునికి దేవాలయంలో ద్రువమూర్తుల కల్యాణం చేస్తారు. తరువాత మంగళ వాయిద్యాలు మారు జయజయధ్వానాల మధ్య పల్లకీలో కల్యాణ మండపానికి స్వామివారు తరలివస్తారు. ముందుగా తిరుకల్యాణానికి సంకల్పం చేసి సర్వవిజ్ఞాన శాంతికై విశ్వక్సేణ పూజ నిర్వహిస్తారు. విష్ణుసంబంధమైన అన్ని పూజా శుభ కార్యక్రమాలకు విశ్వక్సేణుని పూజ చేయడం ఆనవాయితీ. తరువాత పుణ్యఃవచనం చేస్తారు. మంత్ర పూజలలో కల్యాణానికి వినియోగించే సకల సామగ్రినీ సంప్రోక్షణ చేస్తారు. ఆ తరువాత రక్షాబంధనం, మోక్షబంధనం నిర్వహిస్తారు. 24 అంగుళాల పొడవుగల 12దర్భలతో అల్లిన ఒక దర్భతాడును సీతమ్మవారి నడుముకు బిగిస్తారు. మాత్రావాహితమైన ఈ మోక్రమును ధరించినట్లయితే ఉదర సంబంధమైన అన్ని రోగాలు నశించి స్త్రీలు సంతానవతులవుతారని ప్రతీతి.
రామయ్య కుడిచేతికి, సీతమ్మకు ఎడమ చేతికి రక్షాసూత్రాలు కడతారు. స్వామి గృహస్థాశ్రమసిద్ధి కోసం సువర్ణయజ్ఞోపవితాన్ని ధరింపచేస్తారు. 8మంది వైష్ణవులకు తాంబూలాది సత్కారాలను చేసి కన్యావరణం చేస్తారు. అంటే జగన్నాథుడు దయామయుడు అయిన శ్రీరామచంద్రునికి దయాస్వరూపిని సీతమ్మే తగు వధువు అంటూ పెద్దలు నిర్ణయిస్తారు. తరువాత వధూవరుల ఇరు వంశాల పెద్దల గోత్రాలను ముమ్మారు పటిస్తారు. పాదప్రక్షాళన అనంతరం పరిమల భరిత తీర్థంతో మంత్రోక్తంగా పుష్పోదక స్నానం చేయిస్తారు. గోదానం చేసి మహాసంకల్పం పఠిస్తారు.
కల్యాణంలో పఠించే ఈ మహాసంకల్పం భారతీయ భౌగోళిక పరిజ్ఞానానికి అద్దం పడుతూ... జాతీయ భావన సామ్యాన్ని మనలో పటిష్టపరుస్తుంది. ఈ మహాసంకల్పానికి అనుగుణంగా కన్యాదానం జరుగుతుంది. సాక్షాత్ విష్ణుస్వరూపుడైన శ్రీరామునికి శ్రీ మహాలక్ష్మీ స్వరూపమైన సీతను జగత్కల్యాణార్థ్ధం మంత్రధార పూర్వకంగా ఈ కన్యాదానం జరుగుతుంది. మంగళాష్టకాలు పఠిస్తారు. అందరు ఈ వధూవరులకు మంగళం చేకూర్చాలనే భావనతో చదివే ఈ ఆశీస్సులు ఒక్క సీతారాములకే కాక వారి కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులందరికీ వర్తించే విధంగా ఉంటాయి.
మంగళవాయిద్యాలు మారుమోగుతుండగా.. మంత్రాల మధ్య అభిజిత్‌లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచుతారు. ఇది శుభలగ్నం. జగత్కల్యాణ శుభసన్నివేషం. ఈ జీలకర్ర, బెల్లం శిరస్సుపై ఉంచితే మనలో సత్యం, సద్భావనము పెంచుతుందని శాస్త్రం చెబుతోంది. ఆ తరువాత జరిగే మాంగళ్య పూజలో మంగళసూత్రంతో ముగ్గురు అమ్మవార్లను ఆవాహనం చేస్తారు. మనుషులకైతే రెండు సూత్రాలు, దేవతలకైతే మూడు సూత్రాలు ఉండాలని శాస్త్రం చెబుతుంది. తొమ్మిది పోగులతో మూడు సూత్రాలతో తయారయ్యే మంగళసూత్రం ఎన్నో వేదాంత రహస్యాలను చాటి చెబుతుంది. తొమ్మిది పోగులు వివిధ సంబంధాలకు ప్రతీకలు.
మూడు సూత్రాలు కర్మ, జ్ఞాన, భక్తిమార్గాలకు సంకేతాలు. సూత్రమూలములో గౌరీదేవిని, సూత్రమధ్యములో సరస్వతిని, సూత్రాగ్రంలో మహాలక్ష్మిని ఆవాహనం చేస్తారు. ఈ ముగ్గురమ్మల అనుగ్రహంతోనే లోకంలో సౌశీల్యం, సౌందర్యం, సౌకుమార్యం వంటి గుణాలు వర్థిల్లుతున్నాయని ప్రతీతి. ఈ ముగ్గురమ్మలను ఆవాహనం చేసిన మంగళసూత్రాలలో భక్తరామదాసు చేయించిన మంగళపతకాన్ని కలిపి ధరింపచేయడం ఆచారం. రామదాసు చేయించిన ఆభరణాలను నేటికీ మనం స్వామివారికి అలంకరించి ఆనందిస్తున్నాం. భక్త రామదాసు సీతామ్మవారికి చేయించిన చింతాకు పతకం, పచ్చల హారం, పూసలహారం, అమ్మవారి మంగళసూత్రాలు, రామటంకాలు, చంద్రపతకం, బంగారు మొలత్రాడు, తదితర ఆభరణాలు కల్యాణ మహోత్సవంనాడు శ్రీ సీతారామచంద్ర స్వామికి అలంకరిస్తారు.
ప్రభుత్వ సొమ్మును ఖజానాకు జమచేయకుండా ఆలయం నిర్మించడం అప్పటి నిజాంప్రభువు తానీషాకు ఆగ్రహం తెప్పించింది. రామదాసును గోల్కొండ కోటలో బందీగా వుంచి, చిత్రహింసలకు గురిచేశాడు. ఆ సమయంలో తనను కాపాడమని రామదాసు శ్రీ రామచంద్రుని వేడుకున్నాడు. శ్రీరామ చంద్రునికి చెప్పి తనను రక్షించమని సీతాదేవినీ వేడుకున్నాడు. ఎంతకీ శ్రీరాముడు కరుణించక పరోవడంతో తాను నిత్యం కొలిచే శ్రీరామ చంద్రునే నిందించడం ప్రారంభించాడు. సీతమ్మకు చేయిస్తీ చింతాకు పతకంబు రామచంద్రా… అంటూ , ఎవరబ్బాసొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా ..అని నిందాపూర్వకంగా వేడుకుంటాడు. చివరకు శ్రీరామచంద్రులు తన సోదరుడు లక్ష్మణునితోసహా రామోజీ, లక్ష్మోజీల పేర్లతో తానీషాకు ప్రత్యక్షమై రామదాసు చెల్లించవలసిన ఆరులక్షల వరహాలను చెల్లించి కారాగారవాసం నుంచి రామదాసును విముక్తిన్ని చేశారు.
అలనాడు తానీషా కాలం నుంచి ఆచారంగా వస్తున్న ముత్యాల తలంబ్రాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతీఏటా సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తరువాత బ్రహ్మాబంధనం వేస్తారు. దానినే బ్రహ్మముడి అని కూడా అంటారు. అనురాగ పూర్వకమైన దాంపత్య బంధానికి ఇది సంకేతం. ఆ తరువాత శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి గోదాదేవి శ్రీరంగనాథునితో కల్యాణం జరిగినట్లు కలగన్న వైవాహిక స్వప్నం వారణమాయురం అన్న పది తమిళ పద్యాలు పాడుతూ...అర్చక స్వాములు బంతులాట ఆడుతారు. అనంతరం సీతారాములకు కర్పుర నీరాజనం సమర్పిస్తారు. చతుర్వేదాలలో సీతారాములకు ఆశీర్వచనం ఇవ్వడంతో ఈ కల్యాణ క్రతువు పూర్తవుతుంది.
"అందరికీ ఉపయోగపడేవిధంగా ఈ పోస్ట్ ని అందరూ షేర్ చేయగలరు
LIKE US TO FOLLOW: ---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565