వసంతోత్సవం
Vasanthosvam
వసంతోత్సవం
మన సంప్రదాయంలో ఉన్న అనేకానేక పండుగలలో హోలీ కూడా ఒకటి. ఇది ఆనందకేళీ రవళుల నడుమ జరుపుకొనే సంతోష తరంగహేల. పూర్వకాలం నుంచి దేశమంతటా ఈ పండుగను జరుపుకోవడం కనిపిస్తుంది. ఈ పండుగనే వసంతోత్సవమని, ఫాల్గుణోత్సవమని కూడా పిలుస్తారు.
ఈ పండుగ పలు పురాణాల్లో తారకాసుర సంహారానికి సంబంధించినదిగా పేర్కొన్నారు. రుషులు, మునులు, సత్పురుషులు, దేవతలు అందరిని ఆనాడు తారకాసురుడు వేధిస్తూ ఉండేవాడు. ఆ అసురుడి పీడ తొలగాలంటే పార్వతీపరమేశ్వరులకు జన్మించే కుమారుడే సమర్ధుడని దేవగురువు బృహస్పతి దేవతలకు చెప్పాడు. అప్పుడు దేవేంద్రుడు మన్మధుడిని పిలిచి దేవకార్యాన్ని చక్కబెట్టమన్నాడు. మన్మధుడు విషయం పూర్తిగా అర్ధం చేసుకోకుండా దేవతలందరికి రాజైన ఇంద్రుడే వచ్చి స్వయంగా అడిగాడు కదా అని రంగంలోకి దిగాడు. అప్పటికి శివుడు యోగనిష్ఠలో ఉన్నాడు. పార్వతీదేవి అక్కడికి సమీపంలో ఉండి శివుడికి పరిచర్యలు చేస్తూ ఉంది. మన్మధుడు శివుడున్న చోటుకు వెళ్ళి తన ప్రతాపాన్ని చూపాడు. యోగనిష్ఠలో శివుడికి మనోవికారం కలిగింది. ఎదురుగా ఉన్న పార్వతీదేవిని చూశాడు. అయితే అంతలోనే జరిగినదేమిటో తెలుసుకున్నాడు శివుడు. వెంటనే తన యోగనిష్ఠను చెడగొట్టినందుకు మూడో కంటితో మన్మధుడిని చూశాడు. క్షణాల్లో మన్మధుడు భస్మమయ్యాడు. మన్మధుడి భార్య రతీదేవి బోరున విలపించింది.
దేవతల మేలు కోరి తన భర్త అలా చేశాడే తప్ప మరే విధమైన తప్పు ఆయన చేయలేదని, తనకు మళ్ళీ పతి భిక్ష పెట్టమని వేడుకుంది. శివుడు కరుణించాడు. రతీదేవికి మాత్రమే మన్మధుడు ఆనాటి నుంచి కనిపిస్తాడని, ఇతరులెవరికీ మన్మధుడు కనిపించడని శివుడు చెప్పాడు. రతీదేవి అంతటి భాగ్యమే తనకు చాలునని శివపార్వతులకు నమస్కరించింది. ఆ తర్వాత మన్మధుడిని పూజించింది. మన్మధుడినే కాముడు అని అంటారు. ఆ కాముడు దహనమైంది పూర్ణిమనాడు. ఆ పూర్ణిమే ఫాల్గుణశుద్ధ పూర్ణిమ. అందుకే ప్రతి ఫాల్గుణ మాసంలో వచ్చే శుద్ధపూర్ణిమను ఇలా కామ దహన పూర్ణిమగా పిలుచుకోవడం ఆచారంగా వస్తోంది. కామదహనోత్సవం అని కూడా దీన్ని పిలుస్తారు. కాముడు దహనమైనప్పుడు రతీ దేవి విలపించింది. అలాంటి విలాపాన్ని పురస్కరించుకుని ఉత్సవం జరుపుకోవడం ఏమిటని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ రతీదేవి విలాపాన్ని దయతో అర్ధం చేసుకున్న శివుడు మళ్ళీ ఆమెకు తన భర్త కనిపించేలా వరాన్ని ఇచ్చాడు. ఆమె పూజలు కూడా చేసింది. అందుకే దీన్ని ఉత్సవంలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
ఫాల్గుణశుద్ధ పూర్ణిమను మహాఫాల్గుణి అని, హోలికా, హోలికాదాహో అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే హుతాశనీ పూర్ణిమా, వహ్ని ఉత్సవం అని కూడా అంటారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజున లక్ష్మీనారాయణ వ్రతం, అశోక పూర్ణిమా వ్రతం, శశాంక పూజ, చంద్రపూజ లాంటివి జరుపుతూ ఉంటారు. తెలుగునాట మాత్రం కామునిపున్నమగా ఇది బాగా ప్రసిద్ధం. తమిళనాడు ప్రాంతంలో ఈ రోజున పంగుని ఉత్తిరం అనే పండుగ జరుపుతారు. ఫాల్గుణశుద్ధ పూర్ణిమనాడు చంద్రుడు ఉత్తరఫల్గుణీ నక్షత్రంలో ఉంటాడంటారు. ఫల్గుణి అనే పదం పంగుని గాను, ఉత్తర అనే పదం ఉత్తిరంగాను, తమిళ భాషలో పలకడం వల్ల పంగుని ఉత్తిరంగా దీన్ని వ్యవహరిస్తారు.
హోలికా పూర్ణిమా, హోలి అనే పేర్లు రావటానికి మళ్ళీ పురాణకథలు కొన్ని ప్రచారంలో ఉన్నాయి. పూర్వం హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి హరిభక్తిని సహించలేక అతడిని చంపడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. అవేవీ ఫలించలేదు. హిరణ్యకశిపుడికి హోలికా అనే ఒక సోదరి ఉండేది. ఆమెకు అగ్ని బాధ లేకుండా ఓ వరం ఉండేది. హిరణ్యకశిపుడు హోలికను పిలిచి ప్రహ్లాదుని ఆమె చేతికిచ్చి మంటల్లోకి ప్రవేశించమన్నాడు. మంటల వల్ల హోలికకు ప్రమాదం ఉండదని ప్రహ్లాదుడే మరణిస్తాడనేది ఆ రాక్షసుడి భావన. అయితే దైవచిత్రంగా మంటల్లోకి ప్రవేశించిన హోలికా దగ్ధమైంది. ప్రహ్లాదుడు మాత్రం చిరునవ్వులు చిందిస్తూ బయటకు వచ్చాడు. హోలికా దహన సందర్భాన్ని పురస్కరించుకుని హోలీ పండుగ వచ్చిందని పెద్దలు చెబుతారు. ఇలాంటిదే రఘు మహారాజు కాలంలోను ఓ కథ జరిగిందంటారు. ఆ రోజుల్లో దుంధ అనే ఓ రాక్షసి ఉండేది. ఆమె ఆ రాజ్యంలోని పసి పిల్లలందరిని చంపి తింటూ ఉండేది. ఇతర పీడలేవీ ఆ రాజ్యంలో లేకపోయినా ఈ భయంకర పీడ మాత్రం నాటి ప్రజలందరిని బాధిస్తూ ఉండేది. ఈ బాధకు విరుగుడుగా ఫాల్గుణశుద్ధ పూర్ణిమ నాడు కల్యాణ వ్రతం చేస్తే ఆ రాక్షసి బాధ తొలగిపోతుందని నారదుడు రఘుమహారాజుకు చెప్పాడు. రఘువు అలానే చేసి ఆ రాక్షసి బాధను తొలగించాడు. అందుకే పూర్వకాలం నుంచి ఈ పూర్ణిమ రోజున కల్యాణ వ్రతం కొంతమంది జరుపుతుంటారు.
హోలీ పండుగ నాడు ఒక్కో ప్రాంతంలో రాత్రివేళ, అర్ధరాత్రి వేళ, తెల్లవారుజామున పాత వస్తువులను మంటల్లో వేసి ఆ మంటల చుట్టూ తిరుగుతూ ఆనందంగా పాటలు పాడుతూ ఉండడం కనిపిస్తుంది. ఈ మంటలు వేయడం, మంటల్లో మన్మధుడు, రతీదేవి బొమ్మల్ని కూడా వేయడం కొన్ని ప్రాంతాల్లో ఉంది. అయితే ఏ ప్రాంతంలోని వారైనా సరసంగా వరసైన వారి మీద రంగు నీళ్ళు చల్లుకోవడం, పెద్ద హోలీ మంట వేయడం అనే రెండింటిని మాత్రం సర్వసాధారణంగా చేస్తూ ఉంటారు. హోలీ నాడు రంగులను వరసైన వారి మీద చల్లుతూ ఉత్సాహంతో, సంతోషంతో ప్రజలంతా కాలం గడుపుతూ ఉంటారు. ఇలాంటి వేడుకంతా రాబోయే ఆనందకర వసంత రుతువుకు స్వాగత సన్నాహమేనని, ఈ సన్నాహమే సంప్రదాయంగా పరిణమించిందని పెద్దలు చెబుతున్నారు.
హోలీ పండుగ నాడు రాత్రి కొన్ని ప్రాంతాల్లో రాజ వీధుల్లో, నాలుగు వీధులు కలిసే చోట పెద్ద పెద్ద భాండాలలో రంగునీళ్లను నింపి ఉంచుతారు. ఆ నీళ్ళను ఒకరిమీద ఒకరు చల్లుకుంటూ సంతోషంగా కాలం గడుపుతారు. ఆ తర్వాత యువకులంతా హోలీ పాటలు పాడుతూ ఇంటింటికి తిరిగి పాత వస్తువులను సేకరించి హోలీ మంటల్లో వేస్తూ ఉంటారు. హోలీ పండుగ వ్రతం చేసుకొనే పెద్దవాళ్ళకు భక్తిని పంచుతూ, చిన్నారులకు పీడలను పోగొడుతుందనే నమ్మకాన్ని కలిగిస్తూ, యువతకు ఆనందాన్ని చేకూర్చుతూ వినోదాల సంబర హేలగా తరతరాలుగా దేశమంతటా జరుగుతూ వస్తోంది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565