MohanPublications Print Books Online store clik Here Devullu.com

బీమా పత్రాలకు భరోసా Bhima Patralaku Barosa

బీమా పత్రాలకు భరోసా
Bhima Patralaku Barosa

----------;బీమా పత్రాలకు భరోసా!;--------
డబ్బును ఎలక్ట్రానిక్ రూపంలో బ్యాంకులో ఎలా భద్రపరుస్తామో; షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు, బాండ్స్ తదితర పెట్టుబడులను డీ-మ్యాట్ ఖాతాలో ఎలాగైతే ఎలక్ట్రానిక్, డిజిటల్ రూపేణా పొందుపరుస్తారో.. అదే విధంగా ఇన్సూరెన్స్ పాలసీలను ఎలక్ట్రానిక్ పద్దతిలో నమోదు చేయడానికి వీలుపడేలా ఏర్పాటైనదే ఇ-ఇన్సూరెన్స్ ఖాతా. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో, ఈ.. ఇ-ఇన్సూరెన్స్ ఖాతాను ఎలా తెరవాలో తెలుసుకుందాం.
* సంస్థలు ఏవైతే కంపెనీస్ యాక్టు 1956 కింద రిజిస్టర్ అయి, ఐ.ఆర్.డి.ఎ. (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ) వారి చేత ఇన్సూరెన్స్ పాలసీలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్వహించడానికి అనుమతి పొందుతాయో వాటి ద్వారా ఇ-ఇన్సూరెన్స్ ఖాతాను ప్రారంభించవచ్చు.
* ఇలాంటి సంస్థలను ఇన్సూరెన్స్ రెపాజిటరీ అంటారు. ఇవి ఏ విధమైనటువంటి పాలసీలనూ అమ్మడానికి వీలు లేదు. కేవలం పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో పొందుపరచడానికి మాత్రమే ఇవి ఉద్దేశించినవి.
* ఈ ఇన్సూరెన్స్ రెపాజిటరీలు కొంతమందిని తమ కంపెనీ ప్రతినిధులుగా నియమించుకుని తమ విధులను నిర్వర్తిస్తాయి.
* ఇ-ఇన్సూరెన్స్ ఖాతా ఒక ఇన్సూరెన్స్ రెపాజిటరీ వద్ద మాత్రమే కలిగి ఉండాలి. ఒకటి కన్నా ఎక్కువ ఖాతాలను అనుమతించరు.
* ఈ ఖాతాను ప్రారంభించడానికి గానీ, నిర్వహించడానికి గానీ ఖాతాదారులు ఎటువంటి చార్జీలు చెల్లించనవసరం లేదు.
* ఈ ఖాతా అప్లికేషన్‌ను ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి గానీ, ఇన్సూరెన్స్ రెపాజిటరీ /ఇన్సూరెన్స్ రెపాజిటరీ అధికారిక ప్రతినిధి నుంచి గానీ పొందవచ్చు. అప్లికేషన్‌ను పొందుపరిచిన వారం లోగా ఖాతా ప్రారంభం అవుతుంది.
* ఈ ఖాతాను ఏ పాలసీలు లేకపోయినా ప్రారంభించవచ్చు. భవిష్యత్తులో ఎప్పుడైతే పాలసీలు తీసుకుంటారో అప్పుడు ఆ పాలసీని ఎలక్ట్రానిక్ రూపంలో పొందవచ్చు. పాలసీలు ఉన్నట్లయితే వాటిని ఈ ఖాతాలో నమోదు చేయవచ్చు.
* ఈ ఖాతాను ఒక ఇన్సూరెన్స్ రెపాజిటరీ నుండి మరొక ఇన్సూరెన్స్ రెపాజిటరీకి బదలీ చేసుకునే వెసులుబాటు ఉంది.
* ఒకవేళ ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న పాలసీని పాలసీ బాండ్ రూపేణా పేపర్ రూపంలో తీసుకోవాలంటే మళ్లీ మార్చుకునే సౌకర్యం ఉంది.
* ప్రతి ఇన్సూరెన్స్ రెపాజిటరీలో తప్పనిసరిగా ఖాతాదారుల ఫిర్యాదుల విభాగం ఉంటుంది. ఏమైనా సమస్యలు ఉంటే ఈ విభాగం ద్వారా పరిష్కారం పొందవచ్చు.
ఇ-ఇన్సూరెన్స్ ఖాతా ఉపయోగాలు
సురక్షితం : ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటాయి కాబట్టి పాలసీ బాండ్ పోతుందనీ, డామేజీ జరుగుతుందనీ భయపడనవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలసీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సులభతరం: అడ్రస్, ఫోన్ నెంబరు తదితరాలు మార్చాలి అనుకున్నప్పుడు ప్రతి పాలసీకి మార్పులు చేయకుండా ఈ ఖాతాకు మాత్రమే చేస్తే సరిపోతుంది.
* ఒకేచోట ఆన్‌లైన్‌లో పాలసీలు అన్నింటినీ సమీక్షించుకోవచ్చు.
* పాలసీ బెనిఫిట్స్ అన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలో బ్యాంకు ఖాతాకు బదలీ అవుతాయి కనుక త్వరగా చేతికి అందుతాయి.
* ఈ ఖాతాకు ‘ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్’ను పెట్టుకునే సౌకర్యం ఉంది. ఈ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఖాతాదారుని మరణానంతరం లేదా ఖాతాదారుడు ఖాతాను నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఖాతాను నిర్వహించడానికి అర్హుడు. అయితే ఆ రిప్రజెంటేటివ్‌కు పాలసీ బెనిఫిట్స్ పొందడానికి ఎటువంటి అధికారమూ ఉండదు. అవి నామినీకి మాత్రమే చెందుతాయి. నామినీ, ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ కూడా ఒకే వ్యక్తి అయి ఉండవచ్చు.
మనం ఎన్నో రకాలుగా మన కుటుంబ సభ్యుల భద్రత కోసం పెట్టుబడులు పెడుతుంటాం, ఇన్సూరెన్స్‌లు తీసుకుంటూ ఉంటాం. ఈ వివరాలన్నీ కుటుంబలోని వారికి తెలియకపోతే, అనుకోని సంఘటన జరిగినప్పుడు మనం కష్టపడి పొదుపు చేసినదంతా వృథాగా మరుగున పడిపోతుంది. కనుక పాలసీలకు ఇ-ఇన్సూరెన్స్ తీసుకుని, అన్నిటినీ ఒకేచోట భద్రపరిస్తే సులభంగా ఉంటుంది.
- రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list