MohanPublications Print Books Online store clik Here Devullu.com

కుక్కకాటుకు గురైనపుడు ఎలా భౌభౌ భయం వద్దు

కుక్కకాటుకు గురైనపుడు ఎలా  భౌభౌ భయం వద్దు

---------; కుక్కకాటుకు గురైనపుడు ఎలా
భౌభౌ భయం వద్దు;---------
‘కుక్క జోలికి పోరాదు.. కుక్క కరిచినపుడు గాయాన్ని సబ్బుతో బాగా కడగాలి.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి..’ పాఠ్యపుస్తకాల వెనుక ఉండే ఈ హెచ్చరిక చిత్రాల గురించి అందరికీ తెలుసు. కాని, కుక్కకాటుకు గురైన వారిలో చాలామంది నేటికీ సరైన వైద్యం తీసుకోవడం లేదు. రేబిస్‌ కారణంగా మన దేశంలో ఏటా పదిహేనువేల మందికిపైగా మరణిస్తున్నారు. రేబి్‌సను పూర్తిగా అరికట్టే వైద్యం అందుబాటులో ఉన్నా.. నిర్లక్ష్యం కారణంగా ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని చెబుతున్నారు డాక్టర్‌ సంపత్. కుక్కకాటుకు గురైనపుడు ఎలా స్పందించాలో ఇలా
వివరించారు.
కుక్క కరవగానే బెంబేలెత్తిపోతుంటారు. కానీ, చాలా మంది కుక్క కాటుకు విరుగుడైన రేబిస్‌ ఇంజెక్షన్‌ చేయించుకునే విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉండిపోతున్నారు. ఫలితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.
నాటు వైద్యం మానుకో
కుక్క కాటు విషయమై ఇప్పటికీ చాలా మందిలో ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో అనేకమైన అపోహలు ఉన్నాయి. అవగాహనా రాహిత్యమూ ఉంది. కుక్క కరవగానే డాక్టర్‌ను సంప్రదించాలనే ఆలోచన ఇప్పటికీ చాలా మందికి కలగడం లేదు. కొంత మంది నేటికీ నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. గాయం మీద పసుపు, ఆవు పేడ, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, నెయ్యి, గోధుమ పిండి, కారప్పొడి చల్లడం.. ఇలా ఇంటి చిట్కాలను పాటిస్తూ వ్యాధి ముదిరేదాకా తెచ్చుకుంటున్నారు.
టీకాలకు బయపడి
కుక్క కాటుకు గురైన వారు డాక్టర్‌ని సంప్రదించినా.. సింగిల్‌ డోస్‌ టీకాతో సరిపెట్టుకుంటున్నారు. రెబీస్‌ నిరోధ కంగా ఒకప్పుడు బొడ్డు చుట్టూ నర్వ్‌ టిష్యూ టీకాలు ఇచ్చేవారు. ఈ ఇంజెక్షన్లకు బయపడి టీకాలు సగమే తీసుకునేవారు. పదేళ్లుగా కుక్కకాటుకు అందించే వైద్యంలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం సెల్‌ కల్చర్‌ టీకాలు ఇస్తున్నారు. భుజాలకు ఇచ్చే ఈ టీకాల వల్ల నొప్పి ఉండదు.
ప్రథమ చికిత్స
కుక్క కరిచిన వెంటనే పదిహేను నిమిషాల పాటు సాదా నీళ్లతో గాయాన్ని కడగాలి. అ తర్వాత సబ్బు నీళ్లతో కడగాలి. కుక్క దంతాలు దిగిన ప్రతి గాటునూ విడివిడిగా, శుభ్రంగా కడ గాలి. ఆ తర్వాత పావిడాన్‌ అనే అయోడిన్‌ను గాయాల మీద రాయాలి. ఆ తర్వాత తప్పనిసరిగా టి.టి ఇంజెక్షన్‌ చేయించాలి. దీని వల్ల కరిచింది రేబిస్‌ ఉన్న కుక్కే అయినా ఆ విష ప్రభావం 50 శాతం వరకు తగ్గుతుంది.
పూర్తి కోర్సు తప్పనిసరి
కుక్కకాటుతో శరీరంలోకి ప్రవేశించే రేబిస్‌ వైరస్‌ ఒక దశలో నాడీ వ్యవస్థలోకి అంటే వెన్నుపాములోకి ప్రవేశిస్తుంది. ఒక సారి వెన్నుపాములోకి ప్రవేశించిందంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. అందుకే కుక్క కాటుకు గురైన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. రేబిస్‌ ప్రభావం నుంచి పూర్తిగా తప్పించుకోవడానికి నాలుగైదు టీకాలు ఇచ్చే పూర్తి కోర్సును తీసుకోవాల్సిందే. 1-7-14-28 రోజుల వ్యవధితో నాలుగు రేబిస్‌ టీకాలు వేయించుకోవాలి. బాగా గాటుపడేలా, రక్తం వచ్చేలా కరిస్తే ఇమ్యునోగ్లోబలిన్‌ ఇంజెక్షన్‌ కూడా చేయించుకోవాలి. ఇంజెక్షన్‌ వేయించుకోవడానికి ముందు తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలి. ఖాళీ కడుపుతో ఉండకూడదు. ఆల్కహాల్‌ తీసుకోకూడదు. అంతకుమించి ఎలాంటి పత్యమూ అవసరం లేదు. ప్రభుత్వ సంస్థలు చర్మంలోకి ఇచ్చే ఇంట్రా డెర్మా టీకాలు నాలుగు తీసుకుంటే సరిపోతుంది. ప్రైవేట్‌ సంస్థల్లో దొరికే ఇంట్రా మస్కులర్‌ టీకాలైతే ఐదు తీసుకోవాలి. ఈ టీకాలు 1-3-7-14-28 రోజుల వ్యవధితో వేయించుకోవాలి. ఈ మొత్తం టీకాలు సకాలంలో, సంపూర్ణంగా తీసుకుంటే రేబిస్‌ వ్యాధి నుంచి నూటికి నూరు శాతం బయటపడొచ్చు. ఎవరైనా రేబిస్‌ వల్ల చనిపోయారంటే అందుకు కారణం పూర్తి టీకాలు తీసుకోకపోవడమే.
పెంపుడు కుక్కా? వీధి కుక్కా?
వీధి కుక్క కరిస్తేనే ప్రమాదం తప్ప పెంపుడు కుక్కతో ఏ ప్రమాదమూ లేదని చాలా మంది అనుకుంటారు. అయితే రేబిస్‌ వ్యాధి వీధి కుక్కల్లో మాత్రమే ఉంటుందని, పెంపుడు కుక్కల్లో అసలే ఉండదని ఏమీ చెప్పలేం. వీధి కుక్కలతో ఎప్పుడూ కలవని పెంపుడు కుక్కల పరిస్థితి వేరు. అలా కాకుండా వీధి కుక్కలతో తరచూ కలిసి తిరిగే పెంపుడు కుక్కలకు ఇలాంటి జబ్బులు సోకే అవకాశం ఉంది. చిట్టచివరి దశలో తప్ప ఏ కుక్కల్లో రేబిస్‌ గుర్తించడం సాధ్యం కాదు. అందుకే పెంపుడు కుక్కలు కరిస్తే.. ఏమీ కాదనే భావనతో టీకాలు తీసుకోకుండా ఉండిపోకూడదు. పెంపుడు కుక్కలకు వీధి కుక్కలతో కలిసే అవకాశం ఇవ్వకూడదు. అలాగే ఏటా వీటికి ఇతర టీకాలతో పాటు రేబిస్‌ టీకాలు కూడా వేయించాలి.
ఆలస్యమైనా..
కుక్కకాటుకు గురైన వ్యక్తులు చిన్నపిల్లలైనా, వృద్ధులైనా, గర్భిణులైనా అందరూ తప్పనిసరిగా టీకాలు తీసుకోవాలి. రేబిస్‌ ఉన్న కుక్క పది రోజుల్లో చనిపోతుంది. దాంతో ఆ కుక్కకు రేబిస్‌ ఉందన్న విషయం తెలుస్తుంది. పెంపుడు కుక్క అయినపుడే మనం దాన్ని గమనించగలుగుతాం. ఒకవేళ కరిచింది వీధికుక్క అయితే, మనం తెలుసుకోలేం. అందుకే ఏ కుక్క కరిచినా టీకాలు తప్పనిసరి. టీకాలు తీసుకోవడం కాస్త ఆలస్యమైతే.. ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది కదా! టీకాలు ఎందుకులే అని నిర్లక్ష్యం చేయకూడదు. ఆలస్యమైనా టీకాలు తీసుకోవాలి. పెంపుడు కుక్కయినా, వీధికుక్కయినా.. మీరు కనిపించగానే ప్రేమగా తోక ఊపొచ్చు. వాటిపట్ల మీరూ ప్రేమగా వ్యహరిస్తుండవచ్చు. కానీ, అవి ఎప్పుడైనా కరిస్తే మాత్రం రేబిస్‌ టీకాలు వేయించుకోవడం తప్పనిసరే సుమా!
లక్షణాలు రెండు రకాలు
ఎన్‌సెఫాలిటిక్‌ రేబిస్‌ అనే వ్యాధి సోకిన రోగి గాలి శబ్దాన్ని విన్నా (ఎయిరో ఫోబియా), వెలుతురును చూసినా (ఫోటో ఫోబియా), నీళ్లను చూసినా (హైడ్రోఫోబియా) భయపడతాడు. నీటి భయం వల్ల వీళ్లు నీళ్లు తాగలేరు. ఇలాంటి వారు చాలా తొందరగా ప్రాణాలు కోల్పోతారు. పెరాలెటిక్‌ రేబిస్‌ అనే మరో రకం వ్యాఽధి సోకిన వాళ్లల్లో ఈ లక్షణాలేమీ ఉండవు. వాటిని డాక్టర్‌ గుర్తించాల్సిందే తప్ప మామూలుగా కనిపించవు. కాకపోతే వీళ్లు ఎన్‌సెఫాలిటిక్‌ రేబిస్‌ వ్యాధిగ్రస్తుడికన్నా పదిహేను రోజులు ఎక్కువ బతుకగలరు అంతే. ఏమైనా ఒకసారి రేబిస్‌ లక్షణాలు బయటపడ్డాయంటే వారిని కాపాడటం కష్టం. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే సకాలంలో టీకాలు తీసుకోవడం ఒక్కటే మార్గం.
అంతకు ముందు.. ఆ తర్వాత..
‘‘కుక్క కరవగానే రేబిస్‌ టీకాలన్నీ సకాలంలో క్రమం తప్పకుండానే వేయించుకున్నాం. దీనికి ముందు నాలుగైదేళ్ల క్రితం కూడా ఒకసారి కుక్క కరిచింది. అప్పుడు ఇంజెక్షన్లేవీ తీసుకోలేదు.. ఈ టీకాలు మొదటిసారి కుక్కకాటు తాలూకు విషాన్ని కూడా విరిచేస్తాయా? అలాగే మొదటిసారి టీకాలన్నీ తీసుకున్నాక.. కొద్ది రోజులకే మళ్లీ కుక్క కరిస్తే.. మళ్లీ టీకాలు తీసుకోవాలా?..’’ చాలా మందికి ఇలాంటి సందేహాలు వస్తాయి. రేబిస్‌ వ్యాధి ఉన్న కుక్క కరిస్తే.. మనిషిలో ఆ వ్యాధి లక్షణాలు మూడు నుంచి ఆరు నెలల్లో యబటపడతాయి. గరిష్టంగా రెండేళ్లలోపే రేబిస్‌కు గురవుతారు. అప్పటికీ ఆ వ్యక్తిలో ఆ వ్యాధి లక్షణాలు కనిపించలేదూ అంటే ఆ కుక్కకు రెబీస్‌ లేదని అర్థం. రేబిస్‌ వైరస్‌ శరీరంలో ఉండిపోవడం అంటూ ఉండదు. అయితే, మొదటిసారి కుక్క కరిచినప్పుడు టీకాలన్నీ తీసుకున్నా, రెండోసారి మళ్లీ కుక్క కరిచినప్పుడు అంతకు ముందు తీసుకున్న టీకాలే ఇప్పుడు పూర్తి స్థాయిలో కాపాడలేవు. రెండోసారి కుక్క కరిచినప్పుడు నాలుగు కాకుండా రెండు టీకాలు తీసుకుంటే సరిపోతుంది.
డాక్టర్‌ జి. సంపత్
డిప్యూటీ సివిల్‌ సర్జన్‌
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌
హైదరాబాద్‌ 


1 comment:

  1. సార్ కుక్క చేతి వేళ్లకి కరిచింది చేతులు వాపు వచ్చింది చీము కూడా పట్టింది చాలా ఇబ్బందిగా ఉంది దీనికి పరిష్కారం చెప్పండి

    ReplyDelete

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list