MohanPublications Print Books Online store clik Here Devullu.com

బుద్ధిపూర్వకంగా BhuddhiPurvamga

బుద్ధిపూర్వకంగా
BhuddhiPurvamga

బుద్ధిపూర్వకంగా...
‘నీ మనసుకు ఎలా అనిపిస్తే అలా చేయి’ అనే మాటను మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, ఒక పనిని చేయడమా మానడమా అని సందిగ్ధంలో పడి పెద్దల్ని సలహా అడిగితే- తరచూ మనకు అలాంటి సమాధానమే వస్తూ ఉంటుంది. నిజానికి అటువంటి సందర్భాల్లో గురువు సలహా విశేషంగా ఉపయుక్తమని శాస్త్రం చెబుతోంది. వివేకానందుడి విషయంలో అది రుజువైంది కూడా!
వివేకానందస్వామిగా ఆవిర్భవించే ముందు నరేంద్రుడి మనసు నిర్వికల్ప సమాధి స్థితిని కోరుకుంది. ఒక సందర్భంలో తనకా స్థితిని అనుగ్రహించవలసిందిగా రామకృష్ణులను నరేంద్రుడు అర్థించాడు. పరమహంస ఆ కోరికను పరిహసిస్తూ ‘ఇలా అడగడానికి నీకు సిగ్గుగా అనిపించలేదా?’ అని మందలించారు. ‘నీ మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నాను. ఒక ఆధ్యాత్మిక మహావృక్షంగా ఎదిగి- పీడితులకు, ఆశ్రితులకు చల్లని నీడ ఇస్తావని ఎంతో ఆశించాను. కానీ, ఇలా స్వీయ స్వాతంత్య్రం కోరుకుంటావని, ఒక్కడివే తరించాలనుకుంటావని ఎన్నడూ వూహించలేదు’ అన్నారు.
ఆ క్షణంలో నరేంద్రుడికి తన జన్మరహస్యం బోధపడినట్లయింది. తన పుట్టుకకు పరమార్థం తెలిసొచ్చింది. ఈ జాతికి ఒక అద్భుత ఆధ్యాత్మిక తత్వవేత్త లభ్యమయ్యాడు! అందరికీ అలాంటి సద్గురువు లభించడం వీలుకాదు. అలాంటి సందర్భాల్లో ఆత్మ ప్రబోధాన్ని వినమని, ఆత్మబుద్ధిని అనుసరించమని శాస్త్రం చెబుతోంది. ఈ మాటను మహాకవి కాళిదాసు ‘శాకున్తలమ్‌’లో గట్టిగా సమర్థించాడు. కణ్వమహర్షి ఆశ్రమంలో శకుంతలను చూసి సమ్మోహితుడైన సందర్భంలో దుష్యంతుడి నోట ‘అంతఃకరణమే ప్రమాణం’ అని పలికించాడు. ‘ఈమె రుషి ఆశ్రమవాసిని అయితే కావచ్చు... ఒక క్షత్రియుడు వరించదగిన కన్య అని నా మనసు చెబుతోంది. నేను నా మనసు చెప్పిన ప్రకారం నడుస్తాను’ అని దుష్యంతుడు నిర్ణయానికి వచ్చాడు. శకుంతలను గాంధర్వ విధిన మనువాడాడు.
జీవన గమనంలో ఇలాంటి వూగిసలాటలు ఎదురైనప్పుడు- మనలో చాలామంది తమ మనసుకు ఎలా తోస్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. కనుక పెద్దలు చెప్పిన మాటలో గాని, కాళిదాసు సమర్థనలో గాని పెద్ద విశేషం ఏముందని అనిపిస్తుంది! ‘నీ మనసుకు ఎలా తోస్తే అలా...’ అనడంలో పెద్దల ఆంతర్యం ఏమంటే- బుద్ధిని అనుసరిస్తున్న మనసు ఎలా చెబితే అలా చెయ్యమని! బుద్ధిని పక్కకునెట్టి మనసు సలహా ఇస్తే- దాన్ని గుడ్డిగా ఆచరించమని కాదు. కనుకనే ఆ శ్లోకంలో ‘ఆత్మబుద్ధి సుఖంచైవ’ అంటూ, మనసు స్థానంలో బుద్ధి అనే పదాన్ని ప్రయోగించారు.
కాళిదాసు సమర్థన వెనకా ఆంతర్యం ఇదే. శకుంతలను వరించే ముందు దుష్యంతుడు ‘నా మనసు ఆర్యం’ అని స్పష్టంగా ప్రకటించాడు. ‘అంతఃకరణమే నాకు ప్రమాణం’ అని ప్రకటించాలనుకుంటే- ముందు మనసు ఆర్యం అవునో కాదో తేల్చుకోవాలి. మనసు చెప్పిన దారిలో వెళ్లిపోయేవాడు వ్యక్తిగతంగా ఆర్యుడై ఉండాలి. ఆర్యుడు అనేది, చాలామంది చరిత్రకారులు పొరబడినట్లుగా- జాతికి సంబంధించిన పదం కానే కాదు. గుణగణాలకు సంబంధించిన పదమది. ఆర్యగుణాలను మనుస్మృతి వివరంగా చెప్పింది. సజ్జన గుణగణాలతో, పూజనీయమైన బుద్ధితో వ్యవహరించేవారినే ఆర్యులుగా పేర్కొంది.
ఆర్యుడైన మనిషిని బుద్ధి నడిపిస్తుంది. మనసు దాన్ని అనుసరిస్తుంది. ఫలితం అద్భుతంగా ఉంటుంది. సజ్జన సమ్మతంగా ఉంటుంది. ‘నా మనసు ఆర్యం’ అన్న దుష్యంతుడి ప్రకటన వెనక ఇలాంటి నమ్మకమే ఉంది. ‘మనసుకు ఏది ధర్మం అనిపిస్తే అది చేస్తూండు’ అని గాని, ‘మనసు పెట్టి పని చేస్తూండు’ అని గాని పెద్దలు చెప్పారంటే- ఆ మాటల వెనక ఇంతటి కథాకమామిషు ఉన్నాయని అర్థం. ఏదో యథాలాపంగా అనే మాటలు కావవి. కనుక మనం వాటిని జాగ్రత్తగా ఆకళించుకోవాలి- మనసుతో కాదు, బుద్ధితో!
- ఎర్రాప్రగడ రామకృష్ణ



LIKE US TO FOLLOW: ---


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list