MohanPublications Print Books Online store clik Here Devullu.com

హలో... ‘యోలో’! భద్రంగా చలో Hello Yolo

హలో... ‘యోలో’! భద్రంగా చలో
Hello Yolo 


హలో... ‘యోలో’! భద్రంగా చలో!!
స్కైడైవ్‌ చేస్తూ సెల్ఫీలు దిగుతారు... తరగతులకు ఎగనామం పెట్టి పార్టీలకు చలో అంటారు... రోజంతా సరదాల్లో తేలిపోవడం... చాక్లెట్‌ తినేలోపే ప్రేమలో పడిపోవడం... చాటింగ్‌ ముగిసేలోపే బ్రేకప్‌ చెప్పేయడం... అయినా వాళ్లేం దేవదాసులైపోరు.. రేపటి గురించి బెంగ పడరు... ప్రతి నిమిషం ఆస్వాదించాలి.. అనుక్షణం ఆనందాన్ని జుర్రుకోవాలి... ఇదీ నినాదం.. ఇదే కొందరి యూత్‌ నైజం.. వీరినే యోలో (యూ ఓన్లీ లివ్‌ వన్స్‌) జనరేషన్‌ అంటున్నారు... 16-30 ఏళ్లలోపు వారిలో 12శాతం ఇదే తరహా అంటున్నాయి సర్వేలు.
అనుభవించు రాజా.. పుట్టిందీ.. పెరిగిందీ.. అందుకే.. అనుభవించురాజా.. అన్నది యోలోల సిద్ధాంతం. చదువు గురించి చింత లేదు.. కెరీర్‌ తపన ఉండదు. ఈరోజు నచ్చినట్టుగా గడిపేయాలి. ఎవరేం అనుకున్నా డోన్ట్‌కేర్‌. మా భావాలు వేరు.. మా భాష వేరు.. మా జనరేషనే వేరు అన్నది కొత్తతరం తీరు. ఎవర్నీ లెక్కచేయని మనస్తత్వం, కెరీర్‌పై మోజులేని వ్యక్తిత్వం రాన్రాను చిక్కుల్లో పడేస్తుంది అంటున్నారు మానసిక నిపుణులు. ఈ ప్రమాదాన్ని ఆపడానికి ఏం చేయాలో చెబుతూనే ఈ సరికొత్త జనరేషన్‌ మనస్తత్వాన్ని విశ్లేషిస్తున్నారు.
‘యోలో’... ఈ నయా ధోరణి ఒక ప్రాంతానికో, దేశానికో పరిమితం కాదంటోంది అమెరికన్‌ సైకలాజికల్‌ అసోసియేషన్‌. అమెరికా, బ్రిటన్‌లాంటి అభివృద్ధి చెందిన దేశాలతోపాటూ భారత్‌, బ్రెజిల్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఈ అతివాదుల సంఖ్య ఎక్కువన్నది అధ్యయన సారాంశం. ఈ తరహా జీవనశైలి ఉన్న కుర్రకారు ప్రపంచవ్యాప్తంగా పది నుంచి పన్నెండుశాతం ఉంటారంటోంది సర్వే.
సూటిగా విషయానికొస్తే యోలో అనే పదం 2011లో వెలుగులోకొచ్చింది. ర్యాపర్‌ డ్రేక్‌ మరో పాటగాడు రిక్‌ రాస్‌తో కలిసి తాను పాడిన సింగిల్‌లో ఈ జనరేషన్‌కి అర్థం వివరించాడు. ఆపై బ్రిటీష్‌ బ్యాండ్‌ ‘వన్‌ డైరెక్షన్‌’ ‘లివ్‌ వైల్‌ వి వర్‌ యంగ్‌..’ అనే లిరిక్‌తో ఆ పదానికి వూపు తెచ్చింది. ‘రేపటి బెంగ వదిలెయ్‌... ఈరోజే ఎంజాయ్‌ చెయ్‌’ అని పాటగాళ్లు చెప్పిన పరమార్థాన్ని కొంతమంది నరనరాన ఎక్కించుకున్నారు. భిన్నమైన జీవనశైలి అనుసరిస్తూ తాము యోలోలమని గర్వంగా చెప్పుకోవడం షురూ చేశారు.
మితిమీరితే చిక్కే
భావాల్ని గొప్పగా చెప్పుకోవడం... సరదాలకు ఓటేయడం, నచ్చినట్టుగా గడపడం తప్పేంకాదు. కానీ గంటలకొద్దీ సోషల్‌మీడియాకే అతుక్కుపోవడం... ఒళ్లంతా టాట్టూలు పొడిపించుకోవడం... ఆధునికం పేరుతో మత్తుపదార్థాల దరిచేరడం... భిన్నంగా ఉండాలంటూ విలాసాల బాట పట్టడం... చదువు, కెరీర్‌పై ఏమాత్రం శ్రద్ధ లేకపోవడం కచ్చితంగా భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టడమే అంటారు ముంబయికి చెందిన సైకాలజిస్టు సీమా గైక్వాడ్‌. విలాసాలు, పార్టీల కోసం చైన్‌స్నాచింగ్‌లు చేస్తూ, చిన్నచిన్న నేరాలు చేసినవారిని చూశానంటారామె. విస్తుగొలిపే విషయం ఏమిటంటే ఆధునిక ఫ్యాషన్లు, ఖరీదైన గ్యాడ్జెట్ల కోసం కొంతమంది అమ్మాయిలు తాము ఏం కోల్పోవడానికైనా సిద్ధపడటం ఆమె దృష్టికొచ్చిందని వివరిస్తారు. సదరు యోలోలు ఈ విషయాలను తప్పులుగా భావించకుండా తేలికగా తీసుకోవడం ఈ నయా తరానికి నైతిక విలువల పట్ల నమ్మకం లేదనే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
సాకులెన్నో...
కొత్త పోకడ పేరుతో భవిష్యత్తును చేజేతులా అగాధంలోకి నెట్టివేసుకోవడం ఎలా మొదలైంది అంటే చాలా కారణాలే ఉన్నాయి. ‘సామాజిక మాధ్యమాలకు అతుక్కుపోవడం, పబ్‌కెళ్లడం, రొమాన్స్‌ చేయడం... ఇవన్నీ తాత్కాలిక ఆనందాలు. చేతిలో డబ్బులుంటే ఆ సంతోషాల్ని సొంతం చేసుకోవచ్చు. ఓ మంచి ఉద్యోగం దీర్ఘకాలిక ఆనందాన్ని ఇస్తుంది. కానీ అది దక్కాలంటే కష్టపడి చదవాలి. అది చేతకాని వారే తాత్కాలిక సంతోషాల బాటలో పడతారు. తామేదో కొత్తదారిలో వెళ్తున్నాం అనే భ్రమలోపడిపోతారు’ అని ఈ జనరేషన్‌ పుట్టుకను వివరించే ప్రయత్నం చేస్తారు సైకాలజిస్టు గీతా చల్లా. సాహసాలు, ప్రేమలు, పార్టీలు, అప్పుడప్పుడు చెడు చేష్టల ద్వారా కూడా గుర్తింపు పొందాలనుకునే వారు కూడా ఈ బాట పడుతున్నారు అని మరో కోణం వివరిస్తారు ప్రొఫెసర్‌ డా.రాజశేఖర్‌. తల్లిదండ్రుల అతి గారాబం, సహచరుల ప్రభావం, అందుబాటులో విలాసాలు... మరిన్ని కారణాలు.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list