MohanPublications Print Books Online store clik Here Devullu.com

మనం వేరు... మన మెదడు వేరు. మెదడు గ్రేటే... కానీ మనిషి గ్రేటెస్ట్‌



మనం వేరు... మన మెదడు వేరు. మెదడు గ్రేటే... కానీ మనిషి గ్రేటెస్ట్‌



మనం వేరు...
మన మెదడు వేరు.
మెదడు గ్రేటే...
కానీ మనిషి గ్రేటెస్ట్‌!
మన శరీర వ్యవస్థలో మెదడు ఒక భాగం. అంతేకానీ, మెదడు నిర్మాణ వ్యవస్థలో మనం భాగం కాదు. మనం చెప్పినట్టు మెదడు ఆలోచించాలి కానీ, మెదడు చెప్పినట్టు మనం తలాడించకూడదు. ‘మైండ్‌ హ్యాకింగ్‌’కు ఈ సూత్రమే పునాది. ‘హ్యాకింగ్‌’ అంటే నియంత్రణలోకి తీసుకోవడం. ‘హ్యాకర్‌’... ఆ పగ్గాల్ని అందుకునేవాడు. అనగనగా కథలో సప్తసముద్రాలకు అవతల ఒంటిస్తంభపు మేడమీదున్న బంగారు చిలకలో మాంత్రికుడి ప్రాణాలున్నట్టు...హ్యాకర్‌ చేతిలోకి ఆ వ్యవస్థ అంతా వెళ్లిపోతుంది. అతడు ఆడమన్నట్టు ఆడుతుంది, పాడమన్నట్టు పాడుతుంది.
కంప్యూటర్‌ను ఏ నైజీరియా ముఠాలో హ్యాక్‌ చేసినట్టు...మన మెదడును మనమే ఎందుకు నియంత్రణలోకి తీసుకోవాలి, అదేమైనా శత్రువా? అంటే - చాలా సందర్భాల్లో కాకపోవచ్చు, కొన్నిసార్లు కానూవచ్చు. సేవకుడిలా చెప్పినట్టు వింటున్నంత కాలం ఫర్వాలేదు. యజమానిలా నెత్తినెక్కి కూర్చుంటే మాత్రం...చెక్‌ పెట్టాల్సిందే, హ్యాక్‌ చేయాల్సిందే, చెప్పుచేతల్లోకి తెచ్చుకోవాల్సిందే.
జీవితంలో ఎదురైన అనుభవాలూ, తారసపడిన వ్యక్తులూ, చుట్టూ ఉన్న వాతావరణం, పెంపకం, వివిధ పరిస్థితుల ద్వారా పుట్టిన భయాలూ, ఏర్పడిన అపోహలూ...ఇలా అనేకానేక అంశాలు మన ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తాయి. వాటిలోంచే మన అలవాట్లూ అభిరుచులూ లక్ష్యాలూ ప్రాణం పోసుకుంటాయి. ఇవన్నీ కొన్నిసార్లు మంచి చేస్తాయి, కొన్నిసార్లు చెడూ చేస్తాయి. మైండ్‌ హ్యాకింగ్‌తో ఆ మంచిని పెంచుకోవచ్చు, చెడును వదిలించుకోవచ్చు.
ఎందుకంటే...
మన ఆలోచనలే, మన ఆచరణలు. మన ఆచరణలే.. మన గెలుపోటములు!
హ్యాకింగ్‌ అనేది కంప్యూటర్‌ పదజాలం, పక్కా సాఫ్ట్‌వేర్‌ వ్యవహారం. మెదడేమో జీవశాస్త్ర అధ్యాయం, న్యూరాలజీ పాఠ్యాంశం. కంప్యూటర్‌, మెదడు - దాదాపుగా ఒకే సూత్రం మీద పనిచేస్తాయి. రెండూ, సందేశాల్ని చేరవేయడానికి ఎలక్ట్రికల్‌ సిగ్నల్స్‌ను ఉపయోగించుకుంటాయి. రెండింటికీ తగినంత ‘మెమరీ’ ఉంటుంది. కంప్యూటర్‌లో ఒక ప్రోగ్రామ్‌ స్థానంలో, మరొకటి ఇన్‌స్టాల్‌ చేస్తే ...దాని పనితీరే మారిపోతుంది. ఆ ‘రీప్రోగ్రామింగ్‌’ వెసులుబాటు మెదడుకూ ఉంది.
రీప్రోగ్రామింగ్‌ జరగాలంటే, ముందు ప్రోగ్రామింగ్‌లో ఎలాంటి లోపాలున్నాయో గుర్తించాలి. మెదడులో తిష్టవేసిన ‘వైరస్‌’లనూ పట్టుకోవాలి. అందుకో చిన్న చిట్కా...ఓ వారం రోజుల పాటూ రోజుకు కనీసం పదిసార్లు...హఠాత్తుగా మెదడు సాఫ్ట్‌వేర్‌లోకి లాగిన్‌ అయిపోవాలి. ‘ఈ క్షణానికి ఏం ఆలోచిస్తున్నాం?’ అన్నది గుర్తించాలి. దాన్ని ఓ కాగితం మీద రాసుకోవాలి. ఏడు రోజుల తర్వాత లెక్కతీస్తే...మన ప్రోగ్రామింగ్‌లోని లోపాలేమిటో తెలిసిపోతుంది. వాటిని ‘డిలీట్‌’ చేసి ఆశావాద సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవడమే!
మన పాత సోర్స్‌కోడ్‌ నిండా...
భయాలూ, అనుమానాలూ, ఆత్మన్యూనతలూ, ప్రేమరాహిత్యాలూ, ద్వేషాలే.
మన కొత్తకోడ్‌లో...
వాటన్నిటినీ తీసేసి ప్రేమతో, ఆత్మవిశ్వాసంతో, అభయాలతో, ఆనందంతో నింపేసుకుంటాం.
జాన్‌ న్యాష్‌ గణితశాస్త్ర దిగ్గజం. స్ట్రాటజిక్‌ డెసిషన్‌ మేకింగ్‌..వ్యూహాత్మక నిర్ణయ విధానంలో నోబెల్‌ బహుమతి విజేత. ఆయన రూపొందించిన సూత్రాల్నే ఇప్పటికీ కృత్రిమ మేధస్సు మొదలు మిలిటరీ విధానాల రూపకల్పన వరకూ చాలా రంగాల్లో ఉపయోగిస్తున్నారు. పారనాయిడ్‌ స్కిజోఫ్రేనియా - అనే మానసిక వ్యాధి ఆయన్ని చుట్టుముట్టింది. మెదడులో ఏర్పడే లోపం కారణంగా...ఆ రుగ్మత ఉన్నవారికి వూహలకూ వాస్తవాలకూ తేడా తెలియదు. ఆలోచనల్నే నిజాలని భ్రమిస్తారు. ఓ ప్రతిష్ఠాత్మక పరిశోధన సంస్థవాళ్లు నాయకత్వ బాధ్యత అప్పగిస్తామంటూ ముందుకొస్తే....‘నాకొద్దు. నేను త్వరలోనే అంటార్కిటికా సార్వభౌముడిని కాబోతున్నా’ అని తిరస్కరించాడు. గ్రహాంతరవాసులు తనతో కబుర్లు చెప్పుకుంటారని మీడియా ముందు చెప్పాడు. తానో దేవదూతనని కూడా ప్రచారం చేసుకున్నాడు. దీంతో, పేరుప్రఖ్యాతులన్నీ మంటగలసిపోయాయి. విశ్వసనీయత దెబ్బతింది. తన మానసిక స్థితి తనకు అర్థమైపోయింది. ‘ఆలోచనా వైద్యం’తోనే ఆ రుగ్మతను గెలవాలనుకున్నాడు జాన్‌. మెదడులో ఎన్ని చెత్తచెత్త ఆలోచనలైనా రానీగాక, అందులోంచి సరైన వాటినే ఎంచుకోవాలని బలంగా నిర్ణయించుకున్నాడు. సాధనతో ఆ ప్రక్రియ మీద పట్టు సాధించాడు. ఆతర్వాత మరో నోబెల్‌నూ సొంతం చేసుకున్నాడు. అదీ ‘మైండ్‌ హ్యాకింగ్‌’ సత్తా!
ఆలోచన వెనుక ఆలోచనల్నీ...
చెస్‌లో ఒక పావును కదిపే ముందు బాగా ఆలోచిస్తాం. అలా ఆలోచిస్తున్నప్పుడు ఎదుటి ఆటగాడు ఏం ఆలోచిస్తాడన్నదీ తీవ్రంగా ఆలోచిస్తాం. చేయి తిరిగిన నిపుణులైతే పదీపదిహేను ఎత్తుల్ని ముందే వూహిస్తారు. అలా అయితే ఇలా, ఇలా అయితే ఇంకోలా, ఇంకోలా అయితే మరోలా...ఇలా పరిపరి విధాలుగా బేరీజు వేసుకుంటారు. అంటే ఆలోచన గురించి ఆలోచించడం, వీలైతే ఆలోచన గురించిన ఆలోచన వెనకున్న ఆలోచననీ ఆలోచించడం.
- ఇదే మెటా థింకింగ్‌.
మెటా అంటే..తదుపరి. మెటా థింకింగ్‌...తదుపరి ఆలోచన, ఆలోచన తర్వాతి ఆలోచన! ప్రతిక్షణం మనం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం. వేలవేల ఆలోచనలు వస్తుంటాయీ పోతుంటాయీ. కొన్ని మాత్రం పదేపదే మెదడు తలుపు తడుతుంటాయి. అది మద్యం తాగాలన్న వ్యసనం కావచ్చు, ధూమపానం చేయాలన్న కోరికా కావచ్చు. బుర్రలో ఓ ఆలోచన ఎలా పుట్టింది, దానికి మూలం ఏమిటి, ఆ పరిణామాలు ఎలా ఉంటాయి, వాటివల్ల ఏర్పడే భావోద్వేగాలు ఏమిటి, మొత్తంగా మన జీవితాన్ని అవి ఏమేర ప్రభావితం చేయబోతున్నాయి - ఇలా సాగాలి ‘మెటా థింకింగ్‌’. ఆలోచనల్ని వడపోయడం మొదలుపెడితే...మెదడులోని చెత్తంతా ‘రిసైకిల్‌బిన్‌’లోకి వెళ్లిపోతుంది. చివరికి పనికొచ్చే సరుకే మిగుల్తుంది.
సినిమా చూపిస్త...
థియేటర్‌కు వెళ్తాం. సినిమా మొదలవుతుంది. అద్భుతమైన కథ. గొప్ప నటులు. వినసొంపైన సంగీతం. రెండుకళ్లూ చాలవనిపించే దృశ్యాలు. అనూహ్యమైన మలుపులు. కాసేపటికే సినిమాలో లీనమైపోతాం. ఆ పాత్రలతో పాటూ నవ్వుతాం, ఆ పాత్రలతో పాటూ బాధపడిపోతాం.
అంటే- మనమే సినిమా, సినిమాయే మనం!
అదే, బొమ్మ నచ్చలేదనుకోండి. అసహనంగా కదుల్తాం. ఈ పాత్ర ఇలా ఎందుకు ప్రవర్తిస్తోందా అని గొణుక్కుంటాం. ఆ మలుపు ఇంకోలా ఉంటే బావుండేదని దర్శకుడిని తిట్టుకుంటాం. లేదంటే, తెరమీద కనిపిస్తున్న దృశ్యాల్ని పట్టించుకోకుండా మన మానాన మనం, ఏ ఆఫీసు విషయాల్నో కుటుంబ వ్యవహారాల్నో ఆలోచిస్తూ కూర్చుంటాం.
అంటే - మనం వేరూ, సినిమా వేరూ!
ఇదే టెక్నిక్‌ను మెదడు మీదా ప్రయోగించాలి. ప్రతి నిమిషం, ప్రతి నిత్యం ‘మెదడు సినిమా’ చూస్తున్నాం అన్న ఎరుకతో వ్యవహరించాలి. ఎవరి మీదో అమాంతంగా కోపం వచ్చేస్తుంది. అలాంటి సమయాల్లో ‘మెదడు సినిమా’లోని పాత్రలా మారిపోయి ఆవేశంతో వూగిపోకూడదు. ప్రేక్షకుడిలా ఆ కోపానికి కారణాన్నీ కోపం వెనకున్న పరిస్థితుల్నీ విశ్లేషించుకోవాలి. ఆతర్వాత, దర్శకుడి అవతారం ఎత్తి...ఆ సీన్లో అంత కోపం అవసరమా అన్నది నిర్ణయించాలి. అవసరం లేదనిపిస్తే...వెంటనే తగ్గిపోవాలి. కాదూ కూడదూ, కాస్తంత కళ్లెర్రజేయడమే మంచిదని అనుకుంటే...ధర్మాగ్రహాన్ని ప్రకటించాలి! ఆ ఆవేశమంతా ఆ ఫ్రేమ్‌ దాకే! మరో ఫ్రేమ్‌లో ప్రేమగా!
చెత్త సినిమా చూస్తున్నప్పుడు ఎందుకిలా జరుగుతోంది, ఎందుకిలా ప్రవర్తిస్తున్నాయీ పాత్రలు, ఎందుకిలా తగలెట్టాడు దర్శకుడు?...అని అసహనంతో గొణుక్కుంటాం గుర్తుందా, ఆ ఫార్ములానే ఇక్కడా అమలు చేయాలి. ప్రతి ఆలోచననూ ‘ఎందుకు?’ అని ప్రశ్నించుకుంటూ పోవాలి. ఒకసారి కాదు, ఐదు సార్లు!
ఉద్యోగం మానేయాలి - ఎందుకు?
ప్రమోషన్‌ రాలేదు - ఎందుకు?
బాస్‌ ఇవ్వలేదు - ఎందుకు?
పనితీరు బాగాలేదన్న ఆరోపణ - ఎందుకు?
ప్రాజెక్టు ఆలస్యమైందన్న కోపం - ఎందుకు?
...సాధారణంగా ఐదు వడపోతలతో విషయం దారికి వచ్చేస్తుంది. సమస్య మూలాలు తెలిసిపోతాయి. ఇక అకారణ ద్వేషాలుండవు, అర్థంలేని శత్రుత్వాలుండవు. ఏ సమస్య విషయంలో అయినా, ఆలోచన అన్నది మూలాల దాకా వెళ్లాలి. అప్పుడే పరిష్కారం దొరుకుతుంది. భ్రమలు బద్దలైపోతాయి.
అవరోధం ఎదురైతే...
మెదడుకు మనం ‘గెలవబోతున్నాం’ అన్న సంకేతం పంపితే...విజయానికి అవసరమైన సాధన సంపత్తినంతా అందిస్తుంది. వ్యూహాల్ని సిద్ధం చేస్తుంది, సృజనాత్మక ఆలోచనలిచ్చి సాయపడుతుంది. బలాన్ని పెంపొందించుకునే మార్గాల్ని బోధిస్తుంది. ‘ఓడిపోతున్నాం..’ అని చెప్పామంటే మాత్రం, రోజూ చచ్చే చావుకు ఏడుపెందుకు...అన్నట్టుగా మిన్నకుండిపోతుంది. ఇక, ఏమాత్రం సహకరించదు. కాబట్టి, మరో నిమిషంలో దాదాపుగా ఓడిపోయే ఆస్కారం ఉన్నప్పుడు కూడా...‘మనం బలంగా పోరాడుతున్నాం’ అన్న సూచనల్నే మెదడుకు అందించాలి. ఆ సంక్షోభం కన్నా మనం చాలా చాలా శక్తిమంతులమన్న మనోచిత్రాన్ని చేరవేయాలి. ఆ మాత్రం ధైర్యంగా ఉన్నామంటే, సమస్య మీద మానసికంగా విజయం సాధించినట్టే. భౌతిక విజయమే మిగిలిందిక. ఏ ఆవిష్కరణ అయినా ముందు మెదడులో జరుగుతుంది, ఆతర్వాత ల్యాబొరేటరీలో ప్రాణం పోసుకుంటుంది. జయాపజయాలూ అంతే. ముందు మెదడులో గెలిస్తే, ఆతర్వాత కార్యక్షేత్రంలోనూ గెలుస్తాం. ముందే మెదడులో ఓడిపోతే...ఎన్ని ఆయుధాలున్నా, ఎంత సాధన సంపత్తి ఉన్నా - ఏవీ మనల్ని ఒడ్డునపడేయలేవు.
సంక్షోభ సమయాల్లో...సమస్య తీవ్రతను తగ్గించుకోడానికి కొన్ని చిట్కాలు చెబుతారు మైండ్‌ హ్యాకింగ్‌ నిపుణులు. ముందుగా, నేను - నా సమస్య...అన్న పరిధిలోంచి బయటికి వచ్చేయాలి. మూడో వ్యక్తి స్థానంలో నిలబడి ఆలోచించాలి. నా స్నేహితుడికో, బంధువుకో ఇదే సమస్య వస్తే, అతడే నన్ను సలహా అడిగితే... నేనేం చెబుతాను? - అన్న కోణంలో ఆలోచించడం ఓ మార్గం. సమస్య నాది కాదు - అనుకుంటే భుజం మీది నుంచి సగం బరువు దిగిపోతుంది. ఒత్తిడిలేని వాతావరణంలోనే చక్కని పరిష్కారాలు దొరుకుతాయి.
ఇలాంటి సందర్భాల్లో ‘ఇన్విజిబుల్‌ కౌన్సెలర్స్‌’ చిట్కానూ సూచిస్తారు. మనం ఏ రంగానికి సంబంధించిన సమస్య గురించి ఆలోచిస్తున్నామో, ఆ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులైతే ఎలా స్పందిస్తారు - అన్నది వూహించుకోవాలి. సినిమా అవకాశాల కోసం దర్శకుల ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేసీచేసీ విసిగిపోయిన ఓ యువకుడు ...‘ఇక చాలు! ఇదంతా నావల్ల కాదు. ఇంటికెళ్లిపోయి ఏ వ్యాపారమో చేసుకుంటా. లేదంటే ట్రంకుపెట్టెలోని పట్టా కాగితాలు బయటికి తీసి, ఏ గుమస్తా కొలువులోనో చేరిపోతా’ అంటూ అస్త్ర సన్యాసం చేసేముందు...ఆ పరిస్థితుల్లో ఏ రజనీకాంతో, చిరంజీవో ఉంటే ఎలా స్పందిస్తారన్నది వూహించుకోవాలి. నిఖార్సయిన నాయకుడెప్పుడూ కష్టాలకు భయపడడు. అవరోధాలకు తలవంచడు. అభిమాన నాయకుడి ‘వర్చువల్‌’ బోధన మన ఆలోచనా ధోరణినే మార్చేస్తుంది.
వూహే గొప్ప...
మనం వూహల్ని చిన్నచూపు చూస్తాం. పగటి కలలని తీసిపడేస్తాం. వాస్తవిక వాది ఎప్పుడూ నేల మీదే ఉంటాడు. వూహలపల్లకిలో వూరేగేవాడే ఏదో ఒకరోజు ఆకాశాన్ని అందుకుంటాడు. ఆమాటకొస్తే, విషయ పరిజ్ఞానం కంటే వూహే గొప్పది. ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ జీవితమే దీనికో ఉదాహరణ. స్విస్‌ ఫెడరల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఓ మోస్తరు మార్కులతో పాసైన ఆ కుర్రాడికి మహాకష్టంగా పేటెంట్లు నమోదు చేసే కార్యాలయంలో మూడో శ్రేణి గుమస్తా ఉద్యోగం వచ్చింది. తగినంత మెకానికల్‌ ఇంజినీరింగ్‌ నైపుణ్యం లేని కారణంగా అతడి పదోన్నతి ఫైలును పక్కనపెట్టారు. జీతభత్యాల సంగతి ఎలా ఉన్నా, ఐన్‌స్టీన్‌కు బోలెడంత తీరిక ఉండేది. తనకొచ్చిన వూహలకు అక్షరరూపం ఇచ్చి సొరుగులో దాచేవాడు. ఆ అరకు ఐన్‌స్టీన్‌ పెట్టుకున్నపేరు ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ థియరిటికల్‌ ఫిజిక్స్‌’. మెదడునే ప్రయోగశాలగా మార్చుకుని ఆవిష్కరించిన సిద్ధాంతాలే అవన్నీ. ఏ గొప్ప ఆవిష్కరణకైనా మెదడే తొలి ల్యాబొరేటరీ! సెల్‌ఫోన్‌, కంప్యూటర్‌, విమానం... ఇవేవీ పుస్తక పరిజ్ఞానంలోంచి పుట్టలేదు. అచ్చంగా మెదడులోనే తళుక్కుమన్నాయి. లేనిదాన్ని వూహించుకుంటేనే, అప్పటిదాకా లేని వస్తువు పుడుతుంది. ఉన్నదాన్నే వూహించుకుంటే, మహా అయితే కార్బన్‌ కాపీ తయారవుతుంది.
అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ కంపెనీని ప్రారంభించిన కొత్తలో మెదడులో ఓ వూహను ప్రతిష్ఠించుకున్నాడు. ఖాతాదారులు ఒక్క క్లిక్‌తో అమెజాన్‌లో ఏ వస్తువునైనా ఆర్డరు చేయగలగాలి - అన్నది అతడి ఆలోచన. అప్పటిదాకా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం అది అసాధ్యం. ఆ సమయానికి ఎనిమిది క్లిక్కులు అవసరం అయ్యేవి. మెల్లగా ఏడు, ఆరు, ఐదు...క్లిక్కుల సంఖ్య తగ్గించగలిగాడు. అవరోధాల్ని అధిగమించి ‘వన్‌ క్లిక్‌’కు రావడానికి కూడా ఎంతో సమయం పట్టలేదు. టెక్నాలజీ కంటే, వూహే శక్తిమంతమైంది. టెక్నాలజీ ఆ వూహను నిజం చేసుకోడానికి సహకరిస్తుంది, అంతే!
అటెన్షన్‌ ఎకానమీ..
డబ్బు విలువైందే. కాలం అంతకంటే విలువైందే. కానీ, ఏకాగ్రత డబ్బు కంటే కూడా, కాలం కంటే కూడా విలువైంది. విశ్వామిత్రుడిని ఆకట్టుకోడానికి ప్రయత్నించే వూర్వశిలా...మనల్ని తమవైపు లాగేసుకోడానికి చాలా మాధ్యమాలు నానా విన్యాసాలూ చేస్తుంటాయి. ప్రకటనలు, టీవీ సీరియళ్లు, ఇ-కామర్స్‌ యాప్స్‌, వెబ్‌సైట్లు- ఆ ప్రయత్నంలో ఎవరు ముందుంటే వాళ్లకే...రేటింగులూ, సర్క్యులేషన్లూ, డౌన్‌లోడ్లూ. దానిచుట్టే కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తోంది. ఇదంతా ‘అటెన్షన్‌ ఎకానమీ’లో భాగమేనంటారు మేనేజ్‌మెంట్‌ దిగ్గజం డేవెన్‌పోర్ట్‌. ఫేస్‌బుక్‌నే తీసుకోండి. ఆ సంస్థ మార్కెట్‌ మదింపు వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది. కానీ, లాభాలు ఆ స్థాయిలో ఉండవు. అయినా ఎందుకంత విలువ అంటే...కోట్ల మందిని తనవైపు మళ్లించుకుంది. అంటే, అంతమంది ఏకాగ్రతను అటువైపు తిప్పుకుంది. మనిషి బలహీనతే, వ్యాపార సంస్థ బలం!
ఎస్సెమ్మెస్‌ కోసమో, మెయిల్‌ కోసమో...సెల్‌ఫోన్‌ వైపు చూసిన ప్రతిసారీ - మన ఏకాగ్రతకు భంగం కలుగుతుంది. పనిలో ప్రవాహం ఆగిపోతుంది, అంతర్మథనాల తీగలు హఠాత్తుగా తెగిపోతాయి. ఎవరికి తెలుసు, అప్పుడప్పుడే వూపిరిపోసుకుంటున్న ఐడియా మధ్యలోనే మాయమైపోవచ్చు! పావుగంట పట్టాల్సిన పని గంటకూ తెమలకపోవచ్చు. ఫలితంగా, సకాలంలో లక్ష్యాల్ని చేరుకోలేకపోతాం, పరుగులో వెనుకబడిపోతాం. వైఫల్యాల్ని అనుభవిస్తాం. ఒత్తిడికి గురవుతాం. అనారోగ్యాన్ని తెచ్చుకుంటాం. ఇదే, ‘డిజిటల్‌ డిస్ట్రాక్షన్‌’! అర్థంలేని మెసేజీ కోసమో, చెత్త మెయిల్‌ కోసమో సిస్టమ్‌ వైపు చూసిన ప్రతిసారీ మనం ఆర్థికంగా నష్టపోయినట్టే, మానసికంగా బలహీనపడినట్టే. మెదడులో మన ప్రాధమ్యాల్ని నమోదు చేయడం ద్వారా... ఆ అవరోధాలకు అడ్డుకట్ట వేయవచ్చు.
ఉదాహరణకు:
లక్ష్యం ఒకటి - ప్రాజెక్టును పూర్తిచేయడం.
లక్ష్యం రెండు - ఆఫీసు మెయిల్స్‌కు జవాబు ఇవ్వడం.
లక్ష్యం మూడు - ఆన్‌లైన్‌లో గృహరుణం వాయిదా చెల్లించడం.
లక్ష్యం నాలుగు - ఆతర్వాతా ఖాళీ ఉంటే, ఫేస్‌బుక్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోవడం.
మెదడు ఆ ప్రకారంగా ముందుకెళ్తుంది. ఎక్కడా కప్పగంతులు ఉండవు.
* * *
అతడో మద్యం బానిస. మాదకద్రవ్యాల ఉచ్చులోనూ పడ్డాడు. హాస్యానికి సంబంధించిన వెబ్‌సైట్‌ ఏదో నడుపుతున్నాడు. అక్కడా ఏదో తేడా వచ్చింది. కార్యాలయం మీద పోలీసులు దాడి చేశారు. అతడి కెరీర్‌ అంతటితో ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. మనోశక్తితో ఆ వ్యసనాల్లోంచి బయటికొచ్చి మళ్లీ అంతర్జాతీయ స్థాయి రచయితగా పేరు తెచ్చుకున్నాడు ....సర్‌ జాన్‌ హర్‌గ్రేవ్‌.
ఆ సంక్షోభ సమయంలో, సర్‌ జాన్‌ ఆవిష్కరణే ‘మైండ్‌ హ్యాకింగ్‌’!
నీ మనసుకేమైందీ...
ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు నీ మనసు ఎక్కడెక్కడో పచార్లు చేస్తోందంటే...నువ్వు మనస్ఫూర్తిగా పనిచేయడం లేదన్నమాటే! లేదంటే, నీలోని సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (సీపీయూ)లో ఉన్న అపార శక్తిని నువ్వు పూర్తిగా ఉపయోగించడం లేదని అర్థం. దీంతో మెదడు మిగతా ఎనర్జీని ఇంకెందుకో వాడుకుంటుంది. డ్రైవింగ్‌ చేస్తూ బాల్యస్మృతుల్లోకి వెళ్లడం, వంటచేస్తూ పుట్టింటివాళ్ల గురించి ఆలోచించడం అలాంటివే. చాలా సందర్భాల్లో, మనం పని కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తాం. ఆలోచనల్ని బొత్తిగా విస్మరించేస్తాం. వీలైనంత ఎక్కువ సమయాన్ని ఆలోచనకు కేటాయించాలి. ఆలోచన అంటే...మన బుర్రలో గింగిం¹్లుకొట్టే తలాతోకాలేని విషయాలు కాదు. మనం ముందే ఖరారు చేసుకునే ప్రీ-ప్రోగ్రామ్డ్‌ ఆలోచనలు.
‘మల్టీటాస్కింగ్‌’ భ్రమే!
ఒకేసారి బోలెడన్ని పనుల్ని నెత్తినేసుకోవడమే మల్టీటాస్కింగ్‌. దీనివల్ల వాయిదాలు ఉండవనీ, చకచకా లక్ష్యాల్ని పూర్తిచేసుకోవచ్చనీ చాలామంది భావిస్తారు. అదంతా భ్రమే. ఉదాహరణకు ఓ సమావేశానికి హాజరైన అతిథులంతా... తమ ఏకాగ్రతలో పదోవంతు సమయాన్నే ఉపన్యాసం వినడానికి కేటాయించి, మిగతా ఏకాగ్రతను మెయిల్స్‌ చెక్‌చేసుకోడానికీ, వాట్సాప్‌లో అప్‌డేట్స్‌ పెట్టడానికీ, ఏదో ప్రెజెంటేషన్‌ తయారు చేసుకోడానికీ కేటాయించారని అనుకుందాం. అంటే, నూటికి పదిశాతం మందే పరిపూర్ణంగా హాజరైనట్టు. సెమినార్‌కు పెట్టిన ఖర్చులో తొంభైశాతం చెత్తపాలు అయిపోయినట్టే. మెదడు ఒక పని నుంచి మరో పనికి మళ్లడానికి కాస్త సమయం తీసుకుంటుంది. నాలుగైదు పనుల్ని ఇట్నుంచి అటూ అట్నుంచి ఇటూ మార్చుకుంటూ ఉన్నప్పుడు...మెదడు తీసుకునే ‘సన్నద్ధ సమయం’ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఆమేరకు కాలం వృథా అవుతున్నట్టే. ఇదంతా, ఏకాగ్రతను ముక్కలు చేయడమే తప్పించి మరొకటి కాదంటారు స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నిపుణుడు ప్రొఫెసర్‌ క్లిఫర్డ్‌. ‘అయినా మనం మల్టీటాస్కింగ్‌ను ఎందుకు వదిలిపెట్టడం లేదు?’ అనడిగితే, ‘అదో వ్యసనం’ అని జవాబిస్తారు ప్రొఫెసరుగారు.
పాజిటివ్‌ వూహలు!
ఫైవ్‌స్టార్‌ హోటలుకు వెళ్లాలంటే చాలా ఖర్చు చేయాలి. అదే ఫైవ్‌స్టార్‌ హోటలుకు వెళ్లినట్టు వూహించుకోడానికి...నయాపైసా కూడా అక్కర్లేదు. ఖరీదైన వూహలుంటే చాలు. అచ్చంగా వూహే అయినప్పుడు, మళ్లీ కాకా హోటలే ఎందుకు? ప్రఖ్యాత సైకాలజిస్టు లారా కింగ్‌, కొంతమంది విద్యార్థుల్ని ‘మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో వూహించుకోండి’ అని పురమాయించాడు. ఆ వూహల్ని కాగితం మీద పెట్టమన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత పరిశీలిస్తే....తమ భవిష్యత్తును ఎంత ఉన్నతంగా వూహించుకున్నవారు, అంత గొప్ప స్థానాల్లో ఉన్నారు. పాజిటివ్‌ వూహలున్నవారి ఆరోగ్య పరిస్థితి కూడా, మిగతావారితో పోలిస్తే చాలా మెరుగ్గా ఉన్నట్టు కింగ్‌ అధ్యయనంలో వెల్లడైంది. అందుకే మనవాళ్లు, గర్భదారిద్య్రంలోనూ భావదారిద్య్రం వద్దంటారు.
ధ్యానంతోనూ...
మైండ్‌ హ్యాకింగ్‌లో విజయం సాధించాలంటే, మనసు మీద నియంత్రణ ఉండాలి. మనసును దార్లో పెట్టడానికి ధ్యానాన్ని మించిన మార్గం లేదు. ధ్యానం కూడా ఓ మైండ్‌ హ్యాకింగ్‌ అభ్యాసమే. మెడిటేషన్‌కు కూర్చున్నప్పుడు...పాత ఆలోచనల్ని కొనసాగించం, కొత్త ఆలోచనల్ని స్వాగతించం, ఉన్న ఆలోచనల్ని బలవంతంగా తరిమేయం. వాటిని గమనిస్తూ ఉంటామంతే - పూలకొమ్మ మీదున్న సీతాకోక చిలకను ఆరాధనగా పరిశీలిస్తున్న ప్రకృతి ప్రేమికుడిలా. ఆ సాధనే మన ఆలోచనల్ని మనం ఎంపిక చేసుకునే మనోబలాన్నిస్తుంది.
‘జ్ఞాపక’ క్రీడ!
అంతర్జాతీయ వేదికల మీద తరచూ జ్ఞాపక క్రీడలు జరుగుతుంటాయి. ఆ ఆటతీరు వైవిధ్యంగా ఉంటుంది. ఎదురుగా, కంప్యూటర్‌ తెర కనిపిస్తూ ఉంటుంది. తెర మీద అంకెలూ, బొమ్మలూ, దృశ్యాలూ, మనుషుల మొహాలూ మెరుపువేగంతో కదిలిపోతూ ఉంటాయి. ఆటగాళ్లు వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఏ వరుసలో అడిగితే ఆ వరుసలో టకటకా చెప్పేయాలి. అదో అసాధారణ ధారణ. ఎంత ఏకాగ్రతతో ఉంటారంటే...చెవుల్లో ఏ శబ్దమూ జొరబడకుండా శక్తిమంతమైన యంత్రాల్ని ధరిస్తారు. కంటిచూపు పక్కకి వెళ్లకుండా గుర్రాలకు కడతారే, అలాంటి గంతలేవో కట్టుకుంటారు. ఇదంతా, నిరంతరాయమైన ఏకాగ్రత కోసమే. పోటీలో పాల్గొనే ముందు కఠోర సాధన ఉంటుంది. మెదడులోకి ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు...అన్న విషయంలో పట్టు సాధిస్తారు. ఇదే చిట్కాని మనమూ అనుసరించవచ్చు.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list