MohanPublications Print Books Online store clik Here Devullu.com

కను‘పాప’లా రక్షణ



కను‘పాప’లా రక్షణ



++++++++++కను‘పాప’లా రక్షణ! +++++++++
అబ్బాయి అయితే ‘ప్లస్‌’ అమ్మాయి అయితే ‘మైనస్‌’ అనుకునే సమాజం మనది. నేటితరం విద్యావంతులదీ ఇదే ఆలోచనా ధోరణి కావడం బాధాకరం. పితృస్వామిక భావజాల ప్రభావమిది. ఫలితమే నేటికీ స్త్రీపట్ల చిన్నచూపు, హింస, వేధింపులు, ఆధిపత్యధోరణి వగైరా. స్త్రీపురుషుల జనాభా నిష్పత్తిలో తేడాలు పెరగడానికీ ఈ ధోరణులే కారణమంటారు సామాజికులు. పురుషులు తామే అధికులమనుకుంటూ భార్యలను దిగువ స్థాయిలో ఉంచిన ఏ సమాజాలు అభివృద్ధి సాధించవనేది చరిత్ర చెప్పిన పాఠం. జీవిత సహచరిని విస్మరించి భర్త ఒక్కడే అభివృద్ధి సాధించడం కల్ల. ఈ సత్యం అందరూ గుర్తించాలి.
2001 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో ప్రతి వెయ్యిమంది పురుషులకు 933 మంది స్త్రీలు ఉన్నారు. 2011 లెక్కల ప్రకారం అది స్వల్పంగా పెరిగి 1000 : 943 అయింది. పదేళ్లకాలానికి మనం సాధించిన పెరుగుదల ఇది మాత్రమే! రాష్ట్రాలవారీగా కేరళ, పుదుచ్చేరిలలో తప్ప దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ నిష్పత్తులు ఆశాజనకంగా లేవు. కారణం గర్భంలోనే ఆడపిల్లని తెల్సుకుని భ్రూణహత్యలకో లేదా పుట్టాక శిశుహత్యకో పూనుకోవడం! ఇలాంటివి నిలువరించాలి. ఆడపిల్లయినా మగపిల్లాడైనా ఒకటే అన్న దృక్పథాన్ని తల్లిదండ్రులు అలవర్చుకోవాలి.
నిజం చెప్పాలంటే ఇప్పటికే కొన్ని వర్ణాలలో ఆడపిల్లలు దొరక్క చాలామంది బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు.. దీనివల్ల ఆయా కుటుంబాలకు భవిష్యత్తులో ‘వారసులు’ ఉండని పరిస్థితి! ఇదెంత బాధాకరం!!
ఆడ, మగా ఉంటేనే పెళ్లి, సంసారం..!
ఆడపిల్లలే కరవవుతుంటే అబ్బాయిలు ఎవర్ని పెళ్లాడాలి? ఈ విచక్షణ కరువైన సమాజాన్ని సమస్యలు ఎంతలా ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. నైతికంగా ఎంతటి పతనావస్థకు చేర్చుతాయి..
ఇంత చిన్న విషయం తెలియని పరిస్థితులలో మనం ఉన్నామా? తొల్చూలు అమ్మాయి పుడితే అబ్బాయికోసం మరో ప్రయత్నం చేసే జంటలు- అబ్బాయి పుట్టిన వెంటనే ఆపేస్తున్నారు.. దీన్నిబట్టి మన ఆలోచనా తీరేమిటో అర్థం అవుతుంది. అందరూ ఇలాగే అనుకుంటే ఆ పుట్టిన అబ్బాయిలకు పెళ్లికూతుళ్లను ఎక్కడినుంచి తెస్తారు? ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మన ప్రధాని మోదీ ‘బేటీ బచావో’ ‘బేటీ పడావో’ అంటూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలూ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాయి.
సమాజానికి గానీ, సంసారానికి గానీ స్త్రీపురుషులిద్దరూ కావాల్సిందే! వీరిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన అవసరం లేదు. స్త్రీపురుష సంబంధాలు సమాజంలో ఆరోగ్యకరంగా ఉండడమనేది ఇంటి నుంచే మొదలు కావాలి. దీనికి చేయాల్సిందల్లా..
* నవదంపతులు తమకు పుట్టే ఆడపిల్లనైనా పిల్లాడినైనా ఒకేలా స్వీకరించాలి, పెంచాలి, చదివించాలి.
* ఆడపిల్లలనెలా చూసుకోవాలో వారి ఔన్నత్యాన్ని ఎలా గుర్తించి గౌరవించాలో మగపిల్లలకు బాల్యం నుంచే ఇంట్లోవాళ్లు నేర్పాలి. ఆ వాతావరణం కుటుంబంలో ప్రతిఫలించాలి.
* భ్రూణహత్యలు, ఆడశిశువుల హత్యల వంటి ఆలోచనలే రానివ్వకూడదు.
* నీటికోసం యుద్ధాలు చేసుకునే రోజులు రాబోతున్నట్లే, ఆడపిల్లల కోసం భావితరాలు పోట్లాడుకునే పరిస్థితులు రాకుండా ఉండాలంటే గర్భస్థదశ నుంచే ఆడశిశువును అపురూపంగా కాపాడుకోవాలి.
* సృష్టికి ఆధారం స్త్రీ. ఆమె నవమాసాలు మోసి, కని.. పెంచకపోతే మానవజాతే ఉనికిలో ఉండదని గ్రహించాలి.
* ఉత్తమ సంతానాన్ని సమాజానికి అందించాల్సిన నవ దంపతులీ విషయం మరచిపోరాదు.
- చంద్రప్రతాప్‌


LIKE US TO FOLLOW:--------

www.mohanpublications.com


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list